
ఆటో పైకప్పు నిండా పచ్చని పూల మొక్కలు, గడ్డి మొక్కలను పెంచాడు. మొక్కలు ఎండిపోకుండా ఎప్పటికప్పుడు నీరు పోస్తున్నాడు. ఆటో ప్రయాణికులకు ఆహ్లాదాన్ని పంచుతున్నాడు. ప్రయాణికులకు చల్లదనాన్ని పంచేందుకు.. మహబూబాబాద్ మండలం దర్గా తండాకు చెందిన భూక్యా హ్యాంజ్యా అలియాస్ ఆటో అంజి వినూత్న ఆలోచనకు దృశ్య రూపమిది.
– సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, మహబూబాబాద్

చెరువు ఎండింది.. చేప చిక్కింది
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని నిజాం చెరువు నీరు అడుగంటిపోయింది. దీంతో కొద్దిపాటి నీటిలోని చేపలను మాధవాపురం గ్రామానికి వలస వచ్చిన సైబీరియన్ కొంగలు (Siberian Cranes) సునాయాసంగా వేటాడుతున్నాయి. కోరుకున్న చేపను కొంగలు పట్టేసుకుని గుటుక్కుమనిపిస్తున్నాయి.
– సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, మహబూబాబాద్

కళ తప్పిన ప్రకృతి
ఆకురాలే సమయం వచ్చేసింది. వానాకాలం, చలికాలంలో పచ్చదనంతో ప్రకృతి ప్రేమికులను మురిపించిన గుట్టలు.. ఇప్పుడు ఎండ తీవ్రతతో మాడిపోతున్నాయి. తీవ్రమైన ఎండలతో చెట్లు ఆకురాల్చి మోడువారి కనిపిస్తున్నాయి. రాత్రివేళ కార్చిచ్చుతో మంటల్లో కాలిపోతున్నాయి. పెద్దపల్లి జిల్లా (Peddapalli District) పాలకుర్తి మండలం జయ్యారం శివారు, అంతర్గాం మార్గంలోని బుగ్గరామలింగేశ్వరస్వామి ఆలయ సమీపంలో ఎండిన చెట్లతో గుట్టలు బోసిపోయి కనిపించాయి.
– సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి

పైరు ఎండి.. పశువులకు తిండి
హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంతోపాటు పలు గ్రామాల్లో ఎండల తీవ్రతకు భూగర్బ జలాలు అడుగంటిపోయాయి. బావులలో నీళ్లు తగ్గి పంటలకు సరిపడా సాగునీరు అందక పంటలు (Crops) ఎండిపోతున్నాయి. దిక్కుతోచని రైతులు కొంత పంటనైనా కాపాడుకుందామని నీరున్నంత వరకు పారించుకుని.. మిగతా పంటను మూగజీవాలకు వదిలేశారు.
– ధర్మసాగర్

ఎడ్లకు మేత.. గుండె కోత..
ఎస్సారెస్పీ కాలువ నీరు రాలేదు.. వ్యవసాయ బావిలో నీరు అడుగంటింది. పొట్టదశకు వచ్చిన వరి పైరు ఎండిపోతోంది. పంట చేతికొస్తే పెట్టుబడి కోసం తెచ్చిన అప్పు తీర్చుతామనే రైతు గంపెడాశ ఆవిరైపోయింది. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం మద్దిర్యాలకు చెందిన ఎండీ షరీఫ్.. తనకున్న నాలుగెకరాల్లో యాసంగి వరి వేశాడు. నీళ్లు అందక రెండెకరాల్లో పంట ఎండిపోయింది. దీంతో రైతు కుటుంబ సభ్యులు.. ఎండిన పైరును ఎద్దులకు మేతగా వినియోగిస్తూ ఇలా కనిపించారు.
– సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి

భగీరథ ప్రయత్నం
ఆదిలాబాద్ జిల్లాలో భానుడి భగభగలకు చేతిపంపులు, చేద బావుల్లో భూగర్భ జలమట్టం అడుగంటుతోంది. బిందెడు నీటి కోసం ఏజెన్సీ ప్రాంతాల్లోని ఆదివాసీలు భగీరథ ప్రయత్నమే చేయాల్సి వస్తోంది. దీంతో ఎప్పుడు వస్తుందో తెలియని మిషన్ భగీరథ నీరే దిక్కవుతోంది. ఆదిలాబాద్ (Adilabad) రూరల్ మండలంలోని పోతగూడ–2 గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన ఇంటి అవసరాల కోసం మిషన్ భగీరథ పైపులైన్ ద్వారా సరఫరా అయ్యే పైపువాల్ వద్ద చుక్కనీటిని ఒడిసిపట్టేలా ప్రత్యేకంగా ఓ రేకును అమర్చి బొట్టుబొట్టు నీరు డ్రమ్ముల్లో పడేలా ఏర్పాట్లు చేసుకోవడం నీటి సమస్యకు నిదర్శనంగా నిలుస్తోంది.
– సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్
చదవండి: బిందెడు నీటికి బావిలోకి.. భగవంతుడా!
Comments
Please login to add a commentAdd a comment