
వేసవి వచ్చిందంటే గ్రామాల్లోని చెరువుల్లో నీరు తగ్గుముఖం పడుతుంది. దీంతో స్థానికులు చేపల వేటకు ఉపక్రమిస్తారు. ఈ క్రమంలోనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం కుర్నవల్లి గ్రామంలోని పెద్ద చెరువుకు మంగళవారం ఉదయమే చేరిన జనం జలపుష్పాలు వేటాడటంలో నిమగ్నమయ్యారు.
ఊతలు, వలల సాయంతో చేపలు పట్టగా అందరికీ సరిపడా చేపలు (Fishes) దొరకడంతో ఉత్సాహంగా ఇళ్లకు బయల్దేరారు. దీంతో కుర్నవల్లి గ్రామమే కాక చుట్టుపక్కల గ్రామాల్లోని దాదాపు అందరి ఇళ్ల నుంచి మంగళవారం సాయంత్రానికి చేపల కూర (Fish Curry) వాసన ఘుమఘుమలాడింది.
– కరకగూడెం
అడుగంటిన మత్తడివాగు
మార్చి మొదటివారం నుంచే భానుడు ప్రతాపం చూపడంతో ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు (Summer) దంచికొడుతున్నాయి. దీంతో భూగర్భ జలమట్టం గతంలో ఎన్నడూలేని విధంగా పది మీటర్ల లోతుకు పడిపోయింది. తాంసి, తలమడుగు మండలాల్లోని పలు గ్రామాలకు తాగునీటిని అందించే తాంసి మండలంలోని మత్తడివాగు ప్రాజెక్టు డెడ్‌స్టోరేజీకి చేరింది.

ప్రాజెక్టు నీటిమట్టం (Water Level) 0.571 టీఎంసీలు కాగా ప్రస్తుతం 0.111లకు పడిపోయింది. నీరంతా అడుగంటడంతో ప్రాజెక్టు పూర్తిగా నెర్రెలు వారింది. ఏటా ఏప్రిల్ నెలాఖరు, మే మొదటివారంలో అడుగంటాల్సిన ఈ ప్రాజెక్టు ఏప్రిల్ మొదటి వారానికే ఎండిపోవడం జిల్లాలోని భూగర్భజలాలు పడిపోతున్న తీరుకు నిదర్శనంగా నిలుస్తోంది.
– సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్
చదవండి: సైకిల్ చక్రం.. బతుకు చిత్రం