
గాంధారి (ఎల్లారెడ్డి): వేసవి కాలం ప్రారంభంలోనే ఎండలు మండుతుండటంతో తాగునీటి కష్టాలు తీవ్రమయ్యాయి. పంచాయతీ బోరుబావులు ఎత్తిపోతుండడం, మిషన్ భగీరథ (Mission Bhagiratha) నీరు సక్రమంగా సరఫరా కాకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. పలుచోట్ల వ్యవసాయ బావుల వద్దకు వెళ్లి నీటిని తెచ్చుకోవలసిన పరిస్థితి నెలకొంది.
కామారెడ్డి జిల్లా గాంధారి మండలం సోమ్లానాయక్ తండాలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉండడంతో.. తండావాసులు గ్రామ శివారులోని బావి వద్దకు వెళ్లి నీటిని తెచ్చుకుంటున్నారు. మహిళలే బావిలోకి దిగి, బిందెలలో నీటిని నింపుకొని తీసుకువెళ్తున్నారు. ట్యాంకరుతో నీటిని సరఫరా చేయాలని కోరితే. ట్రాక్టర్‌లో డీజిల్ నింపేందుకు పంచాయతీలో డబ్బులు లేవని కార్యదర్శి చెబుతున్నారని తండావాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి, తాగునీటిని అందించాలని కోరుతున్నారు.

మండుటెండ... చెట్టు నీడే అండ
ఆదిలాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఉదయం 11 గంటలైతే చాలు జనాలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. మనుషులే కాదు మూగజీవాలు సైతం ఎండకు అల్లాడిపోతున్నాయి. జైనథ్ మండలం పెండల్వాడ గ్రామ సమీపంలోని ఓ చింతచెట్టు కింద గొర్రెలు (Sheeps) సేదతీరుతుండటమే జిల్లాలోని ఎండల తీవ్రతకు అద్దం పడుతోంది.

మోదీ రక్షిం‘చేను’!
కొందరు రైతులు పంటలకు దిష్టి తగలకుండా ఇటీవల హీరోయిన్ల ఫొటోలు పెడుతున్నారు. ఇక కోతుల బెడద నివారణకు ఇంకొందరు పులి బొమ్మలు ఏర్పాటు చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం రాంపూర్‌కు చెందిన ఓ రైతు.. జొన్న పంట రక్షణకు ఏకంగా ప్రధాని నరేద్రమోదీ ఫొటో పెట్టుకున్నాడు. ప్రధాని ఫొటో ఏర్పాటు చేసిన తర్వాత.. తన చేను వద్దకు వన్యప్రాణులు, పక్షులు రావడం లేదని సదరు రైతు చెప్పడం విశేషం.

కోకల పిచ్.. కేక
ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం రాయిగూడ గ్రామంలలో చిన్నారులు తమ సృజనతో ఆకట్టుకున్నారు. పొడి దుక్కిలో క్రికెట్ ఆడడం ఇబ్బందిగా ఉండడంతో.. తమ ఇళ్లలోని పాత చీరలను తీసుకువచ్చి ఇలా మ్యాట్‌లా మార్చారు. ఆదివారం సెలవు కావడంతో చీరలను ఇలా పిచ్‌పై పరిచి క్రికెట్ ఆడారు.

హెచ్చరికలు బేఖాతరు
హెల్మెట్ లేని ప్రయాణం ప్రమాదకరమని పోలీసులు హెచ్చరిస్తున్నా వాహనచోదకులు బేఖాతరు చేస్తున్నారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ సిటీ సెంటర్ వద్ద సాక్షాత్తు ట్రాఫిక్ పోలీసు ముందునుంచే హెల్మెట్ (Helmet) లేకుండా వాహనచోదకులు యథేచ్ఛగా రాకపోకలు సాగించారు.
చదవండి: వామ్మో.. అప్పుడే భానుడి భగభగలు
Comments
Please login to add a commentAdd a comment