hot summer
-
జూన్ రెండో వారంలో తెలంగాణకు రుతుపవనాలు !
సాక్షి,హైదరాబాద్: తెలంగాణకు వాతావరణ శాఖ(ఐఎండీ) చల్లని కబురు చెప్పింది. ఈనెల చివరి వరకు కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు జూన్ 8 నుంచి 11 మధ్య తెలంగాణలోకి ప్రవేశించనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇప్పటికే అండమాన్ నికోబార్ దీవులను రుతుపవనాలు తాకిన విషయం తెలిసిందే. కాగా, బంగాళాఖాతంలో రుతుపవనాల కదలిక చురుగ్గా ఉన్నట్లు ఐఎండీ వెల్లడించింది. సోమవారం(మే20) నుంచి మరో నాలుగు రోజుల పాటు తెలంగాణలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉంది. హైదరాబాద్ నగరంలోనూ తేలికపాటి జల్లులు పడనున్నాయి. ఈ 22న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్ప పీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. -
ఎండల ఎఫెక్ట్.. నీటి కోసం వచ్చి గుంటలో పడ్డ ఏనుగు
చెన్నై: దేశవ్యాప్తంగా ఎండలు మండుతున్నాయి. మనుషులతో పాటు మూగజీవాల గొంతులు కూడా ఎండిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. ముఖ్యంగా ఎండల దెబ్బకు అడవుల్లో ఉండే సహజ నీటి వనరులన్నీ ఎండిపోయి అక్కడ నివసించే వన్యప్రాణులు దాహంతో అల్లాడిపోతున్నాయి. తమిళనాడులోని సత్యమంగళం అడవులపై కూడా ఎండల ఎఫెక్ట్ పడింది. అడవిలో దాహం తీర్చుకునేందుకు నీళ్లు లేకపోవడంతో ఓ ఆడ ఏనుగు అక్కడికి సమీపంలో ఉన్న పళనిచామి గుడి వద్దకు వచ్చింది. నీటి కోసం వెతుక్కుంటుండగా ప్రమాదవశాత్తూ అక్కడే ఉన్న గుంటలో పడిపోయింది. విషయం తెలుసుకున్న అటవీ శాఖ సిబ్బంది వెంటనే స్పందించారు. ఏనుగు వద్దకు ఒక వెటర్నరీ డాక్టర్ నేతృత్వంలో మెడికల్ టీమ్‌ను పంపించారు. ఏనుగును గుంటలో నుంచి బయటికి తీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇదీ చదవండి.. దోమలు బాబోయ్ దోమలు -
వెదర్ అప్డేట్: కొనసాగనున్న హీట్‌వేవ్
న్యూఢిల్లీ: దేశంలో ఎండల తీవ్రతపై వాతావరణ శాఖ తాజా అప్డేట్ ఇచ్చింది. రానున్న రోజుల్లో దక్షిణ, ఉత్తర భారతాల్లోని పలు ప్రాంతాల్లో ఎండల తీవ్రత కొనసాగుతుందని తెలిపింది. అయితే ఈశాన్య భారతంలోని కొన్ని చోట్ల మాత్రం వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. రాజధాని ఢిల్లీలో వేసవి ప్రారంభం అయినప్పటి నుంచి గరిష్ట ఉష్ణోగ్రతలు 36.4డిగ్రీలుగా నమోదయ్యాయి. ఇది సాధారణం కంటే 2 డిగ్రీలు ఎక్కువ కావడం గమనార్హం. రానున్న ఐదు రోజుల్లో విదర్భ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. కాగా, అధిక ఉష్ణోగ్రతలకు కారణమయ్యే ఎల్‌నినో పరిస్థితులు జూన్ వరకు కొనసాగుతాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఇదీ చదవండి.. మండే ఎండల్లో వర్ష సూచన -
భానుడి భగభగ.. తెలుగు రాష్ట్రాల్లో పెరగనున్న ఎండలు
సాక్షి,హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండుతున్నాయి. ఏప్రిల్ వచ్చీ రాగానే భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఇప్పటికే 40 డిగ్రీల దాకా నమోదవుతున్నాయి. రేపటి నుంచి ఉష్ణోగ్రతలు మరింత పెరగనున్నాయని వాతావరణ శాఖ చెబుతోంది. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమలో తీవ్ర వడగాలులు వీయడంతో పాటు సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవనున్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. ఎల్‌నినో పరిస్థితులు జూన్ చివరి వరకు కొనసాగనున్న నేపథ్యంలో ఈ వేసవిలో ఎండలు ఎక్కువగానే ఉంటాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదీ చదవండి.. ఎన్నికల వేడి.. కరువు దాడి -
ఇక నుంచి ఎండలే ఎండలు
-
నీటి నిల్వలు తగ్గుతున్నాయ్..!
సాక్షి, న్యూఢిల్లీ: ఎండలు మండిపోతున్న వేళ...ప్రధాన జలాశయాల్లో నీటి నిల్వలు క్రమంగా అడుగంటుతున్నాయి. ఇప్పటికే ఖరీఫ్ పంటలకు పెరిగిన వినియోగం, లోటు వర్షపాతం, ఎల్‌నినో ప్రభావం కారణంగా రిజర్వాయర్లలో నీటి మట్టాలు పడిపోతున్నాయి. దేశ వ్యాప్తంగా కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) పర్యవేక్షణలో 146 ప్రధాన జలాశయాలున్నాయి. వీటిల్లో నీటి నిల్వలు గత ఏడాది కన్నా 5శాతం తక్కువగా ఉన్నట్లు సీడబ్ల్యూసీ తాజా నివేదిక వెల్లడించింది. ఈ రిజర్వాయర్ల వాస్తవ నిల్వ సామర్ధ్యం 178 బిలియన్ క్యూబిక్ మీటర్లు (బీసీఎం) కాగా ప్రస్తుతం 70 బీసీఎంల నిల్వలు ఉన్నాయని, ఇవి గత ఏడాది నిల్వ 74 బీసీఎంలతో పోలిస్తే 5 శాతం తక్కువని సీడబ్ల్యూసీ వెల్లడించింది. దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడుల్లో సీడబ్ల్యూసీ పర్యవేక్షణలో మొత్తం 53 బీసీఎంల నిల్వ సామర్థ్యం కలిగిన 40 రిజర్వాయర్లుండగా, ప్రస్తుతం అందుబాటులో ఉన్న మొత్తం ప్రత్యక్ష నిల్వ కేవలం 16.737 బీసీఎంలని వివరించింది. రిజర్వాయర్ల మొత్తం ప్రత్యక్ష నిల్వ సామర్థ్యంలో ఇది 32 శాతం కాగా, గత ఏడాది కన్నా 7% తక్కువని తెలిపింది. ఇక ఏపీ, తెలంగాణలలోని 11 ప్రధాన రిజర్వాయర్లలో 20 బీసీఎంల నీటి నిల్వలకు గాను కేవలం 5.5 బీసీఎంల నిల్వలు మాత్రమే ఉన్నాయని, ఇవి గత ఏడాది నిల్వ 8 బీసీఎంలతో పోలిస్తే 11శాతం తక్కువని వెల్లడించింది. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల పరిధిలో ఉన్న శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల్లో 11.12 బీసీఎంల నిల్వలకు గానూ కేవలం 1.65 బీసీఎంల నిల్వలు మాత్రమే ఉన్నాయని, ఇవి గత ఏడాదితో పోలిస్తే 9% తక్కువని తెలిపింది. -
మండు వేసవిలోనూ మంచినీరు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చెరువుల నిండా సమృద్ధిగా నీరు ఉండటం, భూగర్భ జలాల అందుబాటుతో తాగునీటి ఇబ్బందులు తగ్గుముఖం పట్టాయి. భూగర్భ జలాలు పైపైకి ఉబికి రావడంతో రెండేళ్ల క్రితం వరకు పనిచేయని బోర్లు సైతం నిండు వేసవిలోనూ నీటి ధారలు కురిపిస్తున్నాయి. 2019 ఏప్రిల్ మొదటి వారంలో 3,422 గ్రామాల్లో తాగునీటి ఇబ్బందులు తలెత్తగా ప్రస్తుత వేసవిలో 285 గ్రామాల్లోనే సమస్య కనిపిస్తోందని అధికార వర్గాలు వెల్లడించాయి. ఇందుకు సంబంధించి గ్రామీణ మంచినీటి సరఫరా విభాగం (ఆర్డబ్ల్యూఎస్) అధికారులు ఎప్పటికప్పుడు రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో నివేదికలు తెప్పించుకుంటున్నారు. తాగునీటి సమస్య ఉన్న గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2.08 లక్షల మంచి నీటి బోర్లు.. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే రక్షిత మంచినీటి పథకాలకు తోడు రాష్ట్రవ్యాప్తంగా 2,08,094 మంచినీటి బోర్లు ఉన్నాయి. రెండేళ్ల క్రితం వరకు వేసవి వస్తే 60–70 వేల వరకు బోర్లు పనిచేసేవే కాదు. ఇప్పుడు 5–6 వేలు మినహా మిగిలిన అన్ని బోర్లు పనిచేస్తున్నాయని అధికారులు తెలిపారు. ఉదాహరణకు ప్రకాశం జిల్లాలో 26,007 బోర్లు ఉంటే.. రెండేళ్ల క్రితం వరకు వేసవి సీజన్లో 10 వేల బోర్లు పనిచేసేవి కావు. 8 మీటర్ల లోతులోనే భూగర్భ జలాలు ప్రకాశం జిల్లాలో గతంలో 16.09 మీటర్ల లోతున అందుబాటులో ఉన్న భూగర్భ జలాలు ఈ ఏడాది ఏప్రిల్ 10 నాటికి 8 మీటర్ల లోతులోనే ఉన్నాయని అధికారులు గ్రామీణ నీటి సరఫరా శాఖకు నివేదించారు. అలాగే రాయలసీమ జిల్లాల్లో 17.22 మీటర్ల లోతున ఉండే భూగర్భ జలాలు ఇప్పుడు సరాసరిన 7 మీటర్ల లోతుకే అందుబాటులోకి వచ్చాయి. మరోవైపు ప్రభుత్వం వేసవిలో ముందు జాగ్రత్తగా మార్చి నెలాఖరులోనే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న అన్ని తాగునీటి చెరువులను నీటితో నింపింది. నీటి ఇబ్బందులు తప్పాయి రెండేళ్ల క్రితం వరకు మా గ్రామంలో నీళ్ల కోసం ఇబ్బంది పడేవాళ్లం. ట్యాంకర్ నీళ్ల కోసం పనులన్నీ మానుకొని ఇళ్లకాడ వేచి చూసేవాళ్లం. ట్యాంకర్ రాకుంటే పొలాలకు పోయి నీళ్లు తెచ్చుకునేవాళ్లం. మా ఊరిలో చెక్‌డ్యామ్ కట్టడంతో ఇప్పుడు చెరువు నిండా నీళ్లున్నాయి. రక్షిత మంచినీటి పథకం ద్వారా ప్రతి ఇంటికీ కొళాయిల ద్వారా నీళ్లు అందిస్తున్నారు. వేసవిలోనూ బోర్లలో సమృద్ధిగా నీరు లభిస్తోంది. – కుమారుల చెన్నక్రిష్ణమ్మ, బాదినేనిపల్లె, కొమరోలు మండలం, ప్రకాశం జిల్లా -
నిప్పుల కుంపటి
-
మంటల్లో రాజధాని గ్రామాలు
-
నిప్పుల కుంపటి
రాష్ట్రవ్యాప్తంగా మండుతున్న ఎండలు ► చాలా ప్రాంతాల్లో 45 – 46 డిగ్రీల మేర గరిష్ట ఉష్ణోగ్రతలు ► రాష్ట్రంలో పెరుగుతున్న వడదెబ్బ మృతుల సంఖ్య ► ఇప్పటివరకు 171 మంది మృతిచెందినట్లు విపత్తు నిర్వహణ శాఖ ప్రకటన.. మరో 4 రోజులు వడగాడ్పుల హెచ్చరిక ► ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టని అధికార యంత్రాంగం ► వేసవి కార్యాచరణ ప్రణాళిక అమలు శూన్యం సాక్షి హైదరాబాద్, నెట్వర్క్ భారీగా పెరిగిన ఉష్ణోగ్రతలతో రాష్ట్రం నిప్పుల కుంపటిగా మారింది. ఎండల తీవ్రత, వడగాడ్పులతో జనం విలవిల్లాడుతున్నారు. వడదెబ్బకు గురై పిట్టల్లా రాలిపోతున్నారు. రాష్ట్రంలో వేసవి ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 171 మంది వడదెబ్బ కారణంగా మృతి చెందారని విపత్తు నిర్వహణ శాఖ శనివారం ప్రకటించింది. ఇక శనివారం నల్లగొండలో అత్యధికంగా 46 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్, భద్రాచలం, రామగుండంలలో 45 డిగ్రీల చొప్పున.. హన్మకొండ, మహబూబ్‌నగర్, నిజామాబాద్‌లలో 44, ఖమ్మంలో 43, హైదరాబాద్‌లో 42, హకీంపేటలో 41 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండ తీవ్రత కారణంగా జనం పగటిపూట ఇళ్లలోంచి బయటకు వెళ్లాలంటే భయపడుతున్నారు. ఖమ్మం జిల్లాలో అత్యధికంగా.. రాష్ట్రంలో అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 56 మంది వడదెబ్బతో చనిపోయారు. కరీంనగర్లో 27 మంది, నల్లగొండలో 25 మంది, మంచిర్యాలలో 12 మంది మరణించారు. రైతు సమగ్ర సర్వే చేస్తున్న వ్యవసాయ విస్తరణాధికారి ఒకరు విధుల్లోనే మరణించడం గమనార్హం. ఇక వందల సంఖ్యలో జనం ఎండదెబ్బ కారణంగా అస్వస్థతకు గురయ్యారు. పాత ఆదిలాబాద్ జిల్లా పరిధిలో ఎండల తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. ముఖ్యంగా సింగరేణి గనులున్న ప్రాంతాల్లో ఎండ నిప్పులు కక్కుతోంది. చాలా మండలాల్లో 45 డిగ్రీలకుపైగానే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వడగాడ్పుల కారణంగా వందల సంఖ్యలో అస్వస్థతకు గురై ఆస్పత్రుల పాలయ్యారు. మరిన్ని రోజులు వడగాడ్పులు.. ఆంధ్రప్రదేశ్ సముద్ర తీరం వెంబడి అల్పపీడన ద్రోణి ఉండటంతో ఉత్తర భారతదేశం నుంచి వేడి గాలులు వీస్తున్నాయని... ఫలితంగా ఏపీ, తెలంగాణలపై వడగాడ్పులు పంజా విసురుతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ వై.కె.రెడ్డి చెప్పారు. మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో తీవ్రస్థాయిలో వడగాల్పులు ఉంటాయని హెచ్చరించారు. నైరుతి రుతు పవనాలు ప్రవేశించే వరకు కూడా వడగాడ్పులు కొనసాగినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని పేర్కొన్నారు. వేసవి ప్రణాళిక అమలు ఏదీ? భారీ స్థాయిలో ఎండలు మండుతున్నా, జనం పిట్టల్లా రాలిపోతున్నా తగిన చర్యలు చేపట్టడంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలమైందనే ఆరోపణలు వస్తున్నాయి. ఎండ తీవ్రత నుంచి ప్రజలను కాపాడేందుకు రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ వేసవి కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. దాని ప్రకారం ఆయా శాఖలు రాష్ట్రవ్యాప్తంగా నగరాలు, పట్టణాలు, పల్లెల్లో చర్యలు తీసుకోవాలి. కానీ ఆ దిశగా చర్యలేమీ కనిపించడం లేదు. కొన్ని శాఖలైతే అసలు పట్టించుకోవడం లేదు. వడగాడ్పులుంటే ఆర్టీసీ బస్సులను మధ్యాహ్నం 12 నుంచి 4 గంటల మధ్య నడపకూడదన్న నిబంధన ఉంది. కానీ అది అమలుకావడం లేదు. ఆరు బయట శారీరక శ్రమ చేసే వారికి నీడ కల్పించాలని, ఫ్యాక్టరీల్లో చల్లదనం వసతి కల్పించాలనే నిబంధనలున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇక తాగునీరు, వైద్య వసతి, నీడ కల్పించడం వంటి చర్యలూ లేవు. అమలు చేయాల్సిన వేసవి ప్రణాళిక ఇదీ సాధారణ ఉష్ణోగ్రత 40 డిగ్రీలుగా ఉండి, దానికి అదనంగా నాలుగైదు డిగ్రీలు పెరిగితే (45 డిగ్రీలకు చేరుకుంటే) అధిక ఉష్ణోగ్రత, వడగాడ్పుల పరిస్థితిగా పరిగణిస్తారు. అదే ఏడు డిగ్రీలు అధికంగా 46–47 డిగ్రీల వరకు ఉంటే దాన్ని తీవ్రమైన వడగాడ్పుల పరిస్థితిగా పరిగణిస్తారు. ఈ ప్రకారం అత్యంత తీవ్రమైన ఎండలు, వడగాడ్పుల పరిస్థితి ఉన్నప్పుడు రెడ్ అలర్ట్, తీవ్రమైన ఎండలు ఉన్నప్పుడు ఆరెంజ్ అలర్ట్, ఎండలు కాస్త ఎక్కువగా ఉన్నప్పుడు ఎల్లో అలర్ట్‌లను జారీచేయాల్సి ఉంటుంది. కానీ అవేమీ జరగడం లేదు. → రాష్ట్రవ్యాప్తంగా నగరాలు, పట్టణాల్లో ఎల్ఈడీ స్క్రీన్స్ పెట్టి ఉష్ణోగ్రతల వివరాలు ప్రదర్శించడం → రేడియో ద్వారా ప్రజలను అప్రమత్తం చేయడం →ఐస్ ప్యాక్స్, ఐవీ ఫ్లూయిడ్స్‌ను అందుబాటులో ఉంచడం →108 సర్వీసును, ఆరోగ్య కార్యకర్తలను, ఆశ వర్కర్లను అందుబాటులో ఉంచడం. ఆరోగ్య కేంద్రాల వేళలను పెంచడం. వడదెబ్బకు గురైనవారి కోసం ఆస్పత్రుల్లో ప్రత్యేకంగా వార్డులను నెలకొల్పడం → ఆరు బయట శారీరక శ్రమ చేసే వారికి తగు నీడ కల్పించడం. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ఐదింటి వరకు పనివేళలు లేకుండా చూడడం. ఫ్యాక్టరీల్లో ఏసీ వసతి కల్పించడం → ఎండలు, వడగాడ్పుల పరిస్థితిపై ట్వీటర్, ఫేస్బుక్, వాట్సప్ వంటి సామాజిక మాధ్యమాలను ఉపయోగించి ప్రజలను అప్రమత్తం చేయడం. మొబైల్ ఫోన్లకు ఎస్సెమ్మెస్‌లు పంపడం → అత్యంత తీవ్రత ఉన్న ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక ఏర్పాట్లు చేయడం వడదెబ్బ తగలకుండా ఏంచేయాలి? → వీలైనంత వరకు ఎండలో వెళ్లకపోవడం మంచిది. వెళ్లాల్సి వస్తే గొడుగు తప్పనిసరిగా వాడాలి. తలపై టోపీ లేదా రుమాలు చుట్టుకోవడం వంటివి చేయాలి. → తెలుపు లేదా లేత రంగుల పలుచటి వస్త్రాలను ధరించాలి → ఉప్పు కలిపిన మజ్జిగ లేదా చిటికెడు ఉప్పు కలిపిన గ్లూకోజ్ నీరు లేదా ఓరల్ రీహైడ్రేషన్ ద్రవం తాగాలి. → ఎవరైనా వడదెబ్బకు గురైతే వెంటనే చల్లటి ప్రదేశానికి తరలించాలి. గాలి తగిలేలా ఏర్పాట్లు చేయాలి. శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థాయికి వచ్చేదాకా చల్లని నీటిలో ముంచిన తడి వస్త్రంతో శరీరమంతా తుడుస్తూ ఉండాలి. వీలైనంత త్వరగా సమీపంలోని ఆస్పత్రికి తరలించాలి. తండ్రి, కొడుకును బలిగొన్న వడదెబ్బ రాష్ట్రవ్యాప్తంగా ఎండల తీవ్రత కారణంగా పెద్ద సంఖ్యలో జనం వడదెబ్బకు గురవుతున్నారు. ఆరుబయట పనిచేసేవారు, అత్యవసర పనుల మీద వెళుతున్నవారు ఎండ తీవ్రత కారణంగా అస్వస్థతకు గురవుతున్నారు. శనివారం వడదెబ్బ కారణంగా నల్లగొండ జిల్లా చిట్యాలలో కొద్దిగంటల వ్యవధిలోనే తండ్రి, కుమారుడు మృతి చెందారు. చిట్యాలకు చెందిన కొండె దశరథరావు(60), ఆయన రెండో కుమారుడు శివ (32) గ్రామాల్లో తిరుగుతూ జాతకాలు చెప్పి పొట్టపోసుకుంటారు. ఇలా వరంగల్ వెళ్లిన దశరథరావు వడదెబ్బకు గురై ఆస్పత్రి పాలయ్యాడు. ఆయన కోసం వెళ్లిన కుమారుడు శివ కూడా ఎండదెబ్బకు గురయ్యాడు. కొద్ది గంటల వ్యవధిలోనే ఇద్దరూ మృతిచెందడంతో వారి కుటుంబం విషాదంలో మునిగిపోయింది. ఇక మేడ్చల్ జిల్లాలో ఒకరు, యాదాద్రి జిల్లా ఘట్కేసర్లో ఒక పశువుల కాపరి, కరీంనగర్ జిల్లాలో ఇద్దరు, హైదరాబాద్‌లో ఒకరు, ఆదిలాబాద్ జిల్లాలో ఒక రైతు, సూర్యాపేట జిల్లాలో ఇద్దరు మరణించారు. నల్లమల.. విలవిల ఎండల తీవ్రతకారణంగా వన్యప్రాణులూ విలవిల్లాడుతున్నాయి. అడవుల్లోని నీటి వనరులన్నీ ఎండిపోవడంతో మృత్యువాతపడుతున్నాయి. అడవుల నుంచి సమీపంలోని గ్రామాల్లోకి వచ్చి వేటగాళ్ల ఉచ్చులో చిక్కుకుంటున్నాయి. ముఖ్యంగా నల్లమల అటవీ ప్రాంతంలో పరిస్థితి తీవ్రంగా ఉంది. గత కొద్దిరోజుల్లోనే వందకుపైగా జింకలు మృత్యువాతపడినట్లు అంచనా. ఇటీవలే నాగర్‌కర్నూల్ జిల్లా బక్కాలింగాయపల్లిలో ఓ చిరుతపిల్ల నీటి కోసం వచ్చి వ్యవసాయ బావిలో పడింది. పాత మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలోని ఉప్పునుంతల, లింగాల, కొల్లాపూర్, బల్మూర్, అమ్రాబాద్, పదర మండలాల పరిధిలో పెద్ద సంఖ్యలో మృతిచెందిన దుప్పులను అటవీ అధికారులు గుర్తించారు. అయితే ఈ అటవీ ప్రాంతంలో జంతువులకు తాగునీటి కోసం 109 నీటి నిల్వ సాసర్లను అటవీ శాఖ ఏర్పాటు చేసింది. కానీ వాటిలో నీటిని నింపే పరిస్థితి లేదు. ఇక అడవిలోని 120 చెంచు నివాస ప్రాంతాల్లోనూ నీటికి కటకట ఏర్పడింది. నీటి వనరులు ఎండిపోవడంతో చెలిమలు తవ్వుకుని.. కిలోమీటర్ల దూరం నుంచి తాగునీటిని తెచ్చుకుంటున్నారు. పాత ఆదిలాబాద్ జిల్లాలోని కవ్వాల్ అటవీ ప్రాంతంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. మరోవైపు జనగామ జిల్లా దేవరుప్పుల మండలం చిన్నమడూరుకు వలసవచ్చే సైబీరియన్ కొంగలు భానుడి ప్రతాపానికి బలవుతున్నాయి. వారం రోజులుగా ఎండ తీవ్రత పెరగడంతో రోజూ పెద్ద సంఖ్యలో మృత్యువాత పడుతున్నాయి. -
రాజధానిలో ఎండ మంటలు!
దేశ రాజధాని న్యూఢిల్లీలో ఉష్ణోగ్రతలు దారుణంగా పెరిగిపోతున్నాయి. సోమవారం నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రత ఏకంగా 44 డిగ్రీలుగా నమోదైంది. ఈ సీజన్లో ఇంతవరకు ఇదే అత్యధికం. కనిష్ఠ ఉష్ణోగ్రత 23.8 డిగ్రీలుగా నమోదైంది. ఉదయం 8.30 గంటల సమయంలో గాలిలో తేమ 21 శాతం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సాయంత్రం తర్వాత వాతావరణం చల్లబడిందని, రాత్రికి గాలి దుమ్ము రావడం లేదా చిరు జల్లులు కురిసే అవకాశం ఉందని, నగరం పలుచోట్ల మేఘావృతమై ఉంటుందని కూడా చెప్పారు. అయితే వాతావరణాన్ని చల్లబరిచేంత వర్షం మాత్రం కురవకపోవచ్చంటున్నారు. ఆదివారం నాడు ఢిల్లీలో గరిష్ఠ ఉష్ణోగ్రత 42 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 22 డిగ్రీలుగా నమోదైంది. -
ఈ మాస్క్‌లు..ఎండ నుంచి.. క్యాప్‌డతాయ్!
హాట్ సమ్మర్‌కి... కూల్ థింక్స్ కోటగుమ్మం (రాజమహేంద్రవరం) : రోజురోజుకీ ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఎండ వేడి నుంచి తమను తాము కాపాడుకోవాల్సిన రోజులివీ.. మహిళలు ముఖాలకు స్కార్‌ఫలు ధరిస్తుండగా.. మగవారు కర్చీఫ్‌లు, మాస్క్‌లను ఆశ్రయిస్తున్నారు. మరోవైపు ఎండవేడి నుంచి రక్షణ కల్పించే టోపీలు, ఫేస్‌మాస్క్‌లు.. క్లాత్ మాస్క్‌లు ఆన్లైన్ మార్కెట్లో హల్చల్ చేస్తున్నాయి. ఫ్యాన్ క్యాప్ ‘గ్రీన్ హారిజన్స్ సాలిడ్ హెడ్ క్యాప్’ పేరిట ఆన్లైన్ మార్కెట్లో ఫ్యాన్‌తో కూడిన క్యాప్‌లు లభ్యమవుతున్నాయి. ద్విచక్ర వాహనం, నడుచుకుంటూ వెళ్లే వారికి ఇవి ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి. దీని ధర రూ.500 వరకూ ఉంది. ఫేస్ మాస్క్ ‘ఫేస్, నోస్, ఇయర్, నెక్ పేరిట ద్విచక్ర వాహన చోదకుల కోసం ప్రత్యేకంగా మాస్క్‌లు రూపొందించారు. చెవి, ముక్కు, చెవ్వులకు వేడి గాలులు తగలకుండా ఇది రక్షణ కవచంగా పని చేస్తుంది. లోపల చిన్నపాటి ఫ్యాన్లు ఉండడంతో చల్లగా గాలి వీస్తుంది. ముఖానికి ఎంత నుంచి రక్షణ కల్పించే దీని ధర రూ.1500. క్లాత్ మాస్క్ : కాటన్‌తో తయారు చేయబడిన క్లాత్ మాస్క్ ఎండ ముక్కుకు, చెవులకు తగల కుండా కాపాడుతుంది. దీని ధర రూ.130వీటితో పాటు ఎండ నుంచి రక్షణ పొందేందుకు చేతిలో, జేబుల్లో ఇమిడిపోయే బోలెడు పరికరాలు అందుబాటులో ఉన్నాయి. లిటిల్ ఫ్యాన్ అందుబాటులో ఉంది. దీనిని మన సెల్ చార్జింగ్ పిన్‌కు అనుసంధానం చేసి వినియోగించుకోవచ్చు. దీని ధర రూ.300. ఇది ఆన్లైన్ మార్కెట్లో అందుబాటులో ఉంది. -
ఎండలకు గుండెపోటుతో చిన్నారి మృతి!
సాధారణంగా ఎవరికైనా హార్ట్ ఎటాక్ వచ్చిందంటే వాళ్ల వయసు కనీసం 40 ఏళ్లు దాటి ఉంటుందని అనుకుంటాం కదూ.. కానీ, మహారాష్ట్రలో 12 ఏళ్ల అమ్మాయి హార్ట్ ఎటాక్‌తో చనిపోయింది! అది కూడా ఎండ కారణంగానే. తన స్వగ్రామంలో ఇంటి నుంచి అర కిలోమీటరు దూరంలో ఉన్న నీటి పంపు వద్దకు నీళ్లు వస్తాయేమో, పట్టుకుందామని యోగితా దేశాయ్ (12) ఐదుసార్లు అటూ ఇటూ తిరిగింది. గత కొన్ని రోజులుగా ఆమె డిసెంట్రీతో బాధపడుతోంది. అయినా, ఆమెనే నీళ్లు పట్టుకుని రమ్మని పంపారు. చివరకు ఐదోసారి వెళ్లినప్పుడు.. పంపు దగ్గరే ఆమె కుప్పకూలిపోయింది. వెంటనే వైద్యుల వద్దకు తీసుకెళ్తే.. ఆమె గుండెపోటు, డీహైడ్రేషన్ కారణంగా మరణించినట్లు చెప్పారు. మహారాష్ట్రలోని బీద్ జిల్లాలో గత మూడేళ్లుగా కరువు కరాళ నృత్యం చేస్తోంది. అక్కడ గరిష్ఠ ఉష్ణోగ్రత 42 డిగ్రీలుగా నమోదైంది. -
మార్కెట్లో ఏసీలు, ఫ్రిజ్‌లకు కొరత!
రోజురోజుకి పెరుగుతున్న భానుడి ఉగ్రరూపం, చాలా ప్రాంతాల్లో డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఈ వేడిమి నుంచి ఉపశమనం పొందడానికి ప్రజలు ఏసీలు, ఫ్రిజ్‌లతో పాటు.. కూల్డ్రింకులు, ఐస్ క్రీమ్‌లను ఆశ్రయిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా వీటి అమ్మకాలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. దీపావళి వరకూ తక్కువ స్థాయిలో నమోదైన ఈ అమ్మకాలు, ప్రస్తుతం ఊపందుకున్నాయి. ఏసీల అమ్మకాలు గత ఏడాది కంటే 50 శాతం పెరిగాయి. ఫ్రిజ్‌ల అమ్మకాలు కూడా 18శాతం మేర ఎక్కువ నమోదవుతున్నాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. కూల్‌డ్రింక్స్ 15 నుంచి 20 శాతం, ఐస్ క్రీమ్ లు 30 నుంచి 40 శాతం మేర పుంజుకున్నాయని పేర్కొన్నాయి. కానీ పెరిగిన డిమాండ్ మేర ఏసీలు, ఫ్రిజ్‌లు మార్కెట్లో కనిపించడం లేదు. వీటికి కొరత ఏర్పడింది. కావాలనుకునేవారు ముందుగా బుక్ చేసుకుంటే తప్ప వెంటనే దొరికే పరిస్థితి లేదు. చివరి ఏడాది ఏప్రిల్ లో అమ్మిన ఏసీల కంటే ఈ ఏడాది ఏప్రిల్ లో రెండింతలు అమ్మినట్లు వోల్టాస్ కంపెనీ తెలిపింది. ఎలక్ట్రానిక్ ఉత్పత్తులో ముందంజలో ఉన్న ఎల్జీ కంపెనీ, ఈ ఏడాది ఏసీల అమ్మకాలో 50 శాతం వృద్ధి కనబరిచింది. పటియాలా, ఆనంద్, విజయవాడలలో వీటికి డిమాండ్ అధికంగా ఉందని పేర్కొంది. ఎప్పుడూ ఆహ్లాదకరమైన వాతావరణం ఉండే బెంగళూరులో కూడా ఈసారి ఏసీల అమ్మకాలు పెరిగినట్లు ఎల్జీ తెలిపింది. ఏసీలు, ఫ్రిజ్‌ల డిమాండ్ పెరుగుతుండటంతో వాటి కంపెనీల షేర్లు కూడా మార్కెట్లో పాజిటివ్ ట్రెండ్ నే కొనసాగిస్తున్నాయి. -
హఠాత్తుగా గాలివాన
పలు జిల్లాల్లో పంటలకు నష్టం తడిసిన ధాన్యం.. రైతుల దైన్యం పిడుగులు, ఈదురు గాలుల బీభత్సం వర్షంతో స్తంభించిన జనజీవనం సాక్షి నెట్వర్క్: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆదివారం సాయంత్రం హఠాత్తుగా గాలివాన కురిసింది. వాతావరణం ఒక్కసారిగా చల్లబడి ఎండలతో అల్లాడుతున్న జనం సేదతీరినప్పటికీ.. వివిధ చోట్ల పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. కొనుగోలు కేంద్రాల్లో కుప్పలుగా పోసిన ధాన్యం అకాల వర్షానికి తడిసిపోయింది. కొన్ని చోట్ల ఇళ్లు కూలిపోగా, మరికొన్ని చోట్ల పైకప్పులు ఎగిరిపోయాయి. వరంగల్ జిల్లా చేర్యాల మండలంలో కురిసిన వర్షానికి ఆరు గ్రామాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. ఐనాపూర్‌లో మామిడికాయలు నేలరాలాయి. ఐకేపీ కొనుగొలు కేంద్రంలోని ధాన్యం తడిసి ముద్దయింది. అంగడిబజారులో ఓ పెద్ద చెట్టు, హోటల్ కోసం వేసిన ఇల్లు కూలి, ఒకరికి గాయాలయ్యాయి. వేణుగోపాలస్వామి ఆలయం ముందున్న వేపచెట్టు కూలడంతో ధ్వజస్తంభం విరిగిపోయింది. ఒక్క ఐనాపూర్ గ్రామంలోనే సుమారు 500 ఎకరాల్లో వరిపంట దెబ్బతిన్నది. తపాస్‌పల్లి, పోసానిపల్లి, గురువన్నపేట, నాగపూరి గ్రామాల్లోనూ వరి, మామిడి పంటలు దెబ్బతిన్నాయి. బచ్చన్నపేట మండలంలోనూ పంటలకు నష్టం వాటిల్లింది. - కరీంనగర్ జిల్లాలో గాలివానతో పలుచోట్ల వడగళ్లు, పిడుగులు పడ్డాయి. మామిడి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. ధర్మపురి మార్కెట్‌యార్డు, రాయపట్నం సిరిసిల్ల మండలం జిల్లెల్ల తదితర చోట్ల వందల క్వింటాళ్ల ధాన్యం తడిసింది. రాయికల్, బెజ్జంకి, కోహెడ, సారంగాపూర్, ఇల్లంతకుంట మండలాల్లో గాలివానకు రేకులషెడ్లు ఎగిరిపోయాయి. కరెంటు స్తంభాలు నేలకూలి, విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. బెజ్జంకి మండలం కల్లెపల్లిలో కోళ్లఫారం రేకులు ఎగిరిపోయి 3 వేల కోడిపిల్లలు మృత్యువాత పడ్డాయి. గొల్లపల్లి మండలం యశ్వంతరావుపేటలో పిడుగుపడి రైతు చిర్ర రాజయ్య(40) మరణించాడు. అరికిల్ల శంకరవ్వ, ఉరిమిట్ల లచ్చయ్య తీవ్రంగా గాయపడ్డారు. - రంగారెడ్డి జిల్లాలో ఆదివారం సాయంత్రం ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది. పలుచోట్ల ఇళ్లు, పశువుల పాకలు దెబ్బతినగా.. చేతికొచ్చే దశలో ఉన్న మామిడికాయలు రాలిపడ్డాయి. వేగంగా వీచిన గాలులతో మేడ్చల్‌లో పిడుగుపాటుతో చెట్టుకొమ్మలు విరిగి పడ్డాయి. శామీర్‌పేటలో ఈదురుగాలుల బీభత్సంతో ప్రధాన రహదారుల్లో చెట్లు నేలకూలడంతో ట్రాఫిక్ సమస్య నెలకొంది. పశువుల పాక ధ్వంసం కావడంతో మూగ జీవాలతోపాటు యజమానికి గాయాలయ్యాయి. యాచారం మండలం నక్కర్తమేడిపల్లిలో పిడుగుపాటుకు సెంట్రింగ్ పనిచేసే శ్యామ్ (25) మృతి చెందాడు. -మెదక్ జిల్లాలో అకాల వర్షం బీభత్సం సృష్టించింది. వర్షానికి ఈదురుగాలులు తోడై పలుచోట్ల ఆస్తి నష్టం వాటిల్లింది. తూఫ్రాన్‌లో కోళ్లఫారం ధ్వంసమై ఫారం మొత్తం నాశనమైంది. 8 వేల కోళ్లు మృత్యువాత పడగా రూ.25 లక్షల వరకు ఆస్తినష్టం వాటిల్లింది. గాలి ధాటికి రేకులు అర కిలోమీటరు దూరం మేర ఎగిరిపడ్డాయి. అక్కడ వాతావరణం భీతావహంగా మారింది. కాస యాదగిరి పదేళ్లుగా ఇక్కడ పది వేల సామర్థ్యం కలిగిన కోళ్లఫారం నడుపుతూ జీవనోపాధి పొందుతున్నాడు. వర్షం దెబ్బకు 8 వేల కోళ్లకు కోల్పోయి రోడ్డున పడ్డాడు. బలంగా వీచిన గాలులకు పలుచోట్ల పిందె దశలో ఉన్న మామిడికాయలు నేలరాలాయి. దౌల్తాబాద్, తొగుట ప్రాంతాల్లో వడగళ్లు పడ్డాయి. కొన్ని ప్రాంతాల్లో చెట్లు వేళ్లతో సహా నేలకూలాయి. జగదేవ్‌పూర్ మండలం మాందాపూర్‌లో పిడుగు పడి ఎద్దు, మేక మృతి చెందాయి. పశువుల కొట్టంలో పడుకున్న ఎద్దు పడుకున్నట్టే కాలిపోయింది. దౌల్తాబాద్ మండలం రాంసాగర్‌లో పిడుగు పడి పశువుల కాపరి గాయపడ్డాడు. - ఆదిలాబాద్ జిల్లాలోని కెరమెరి, లక్సెట్టిపేట మండలాల్లో ఆదివారం వర్షం కురిసింది. ఈదురుగాలతో రహదారులపై చెట్లు విరిగి పడ్డారుు. రాకపోకలకు అంతరాయం కలిగింది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు ఇబ్బందులు పడ్డారు. కొన్నిచోట్ల ఇళ్లలోకి వరదనీరు చేరి, జనజీవనం అస్తవ్యస్తమైంది. - మహబూబ్‌నగర్ జిల్లా లింగాల మండల కేంద్రంలో జరుగుతున్న జాతరలో ఈదురుగాలులకు గుడారాలు కూలి పోయాయి. కల్వకుర్తి మండలంలోని లింగసానిపల్లి గ్రామానికి చెందిన పుట్టోజు మాధవాచారి వ్యవసాయ పొలంలో ఏర్పాటు చేసిన పాలీహౌస్ కూలిపోయి రూ.70 లక్షల ఆస్తినష్టం సంభవించింది. కేశంపేట మండలలోని వేముల చింతకింది రామయ్యకు చెందిన 16 మేకలు పిడుగుపాటు చనిపోయాయి. లక్షల్లో ఆస్తినష్టం వాటిల్లిందని బాధితుడు వాపోయాడు. కొందుర్గు మండలం అయోధ్యపూర్ తండాల్లో ఓ లేగదూడ చనిపోయింది. కొత్తూరు మండల కేంద్రంలోని వినాయకస్టీల్ పరిశ్రమలో మెకానికల్ ఆపరేటర్ నబీ (45) (ఏపీలోని కర్నూలు వాసి) విధులు ముగించుకుని బైకుపై వెళుతుండగా పిడుగుపడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. రాజధానిలో తేలికపాటి జల్లులు మండుటెండలతో సతమతమైన రాజధాని హైదరాబాద్ వాసులకు ఆదివారం చల్లటి జల్లులు పలకరించడంతో స్వల్పంగా ఉపశమనం పొందారు. ఆదివారం మధ్యాహ్నం వరకు 42.2 డిగ్రీల మేర గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవడంతో మండుటెండ చుర్రు మనిపించగా.. సాయంత్రం ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన చిరుజల్లులు కురిశాయి. క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో అక్కడక్కడా జల్లులు కురిసినట్లు బేగంపేటలోని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న 24 గంటల్లో అక్కడక్కడా జల్లులు కురిసే అవకాశాలున్నాయని, ఉష్ణోగ్రతల్లో స్వల్ప హెచ్చు తగ్గులుంటాయని ప్రకటించింది. ఈదురుగాలుల ప్రభావంతో పలు ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయి. చెట్టుకొమ్మలు విరిగిపడడంతో వాహనాలు ధ్వంసం అయ్యాయి. విద్యుత్ స్తంభాలు కూలిపోవడం, వైర్లు తెగడంతో వంద ఫీడర్ల పరిధిలో దాదాపు గంటసేపు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. -
కొట్టకుండానే పగులుతున్న కొబ్బరికాయలు
నల్గొండ: ఎండలు భగ్గుమంటున్నాయనడానికి ప్రత్యేక్ష నిదర్శనమే ఇది. నల్గొండ జిల్లా నడిగూడెం మండలం సిరిపురం గ్రామంలో విక్రయించడానికి సిద్ధంగా ఉంచిన కొబ్బరికాయలు ఎండ వేడికి కొట్టకుండానే పగలిపోతున్నాయి. వివరాలు.. సిరిపురం గ్రామంలోని కుక్కడపు నాగేశ్వరరావు కిరాణా షాపు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆ షాపులో విక్రయ నిమిత్తం ఉంచిన కొబ్బరికాయలు బుధవారం మధ్యాహ్నం పగిలిపోయాయి. ఎండ వేడిమికి "మనుషులే తట్టుకోలేకుంటే.. కొబ్బరికాయలెంత" అని స్థానికులు వాపోతున్నారు. -
ట్రెండీ.. థండీ..
మండేవేసవిలో వడదెబ్బ నుంచి తట్టుకోవాలంటే.. మజ్జిగో.. పళ్లరసాలో.. కొబ్బరి నీళ్లో తాగుతాం. అదే సూరీడి సురసుర చూపుల నుంచి ఒంటిని కాపాడుకోవాలంటే అందుకు తగ్గట్టుగా డ్రెస్సింగ్ చేసుకోవడం కంపల్సరీ. మగువల విషయానికి వస్తే ఆ వస్త్రాలు ట్రెడిషనల్ వేర్‌గా ఉంటూనే.. నయా ఫ్యాషన్‌ను ప్రతిబింబించేలా ఉండాలి. ట్రెండ్‌ను ఫాలో అవుతున్న వనితల కోసం.. వేసవితాపాన్ని తట్టుకునే స్పెషల్ కాస్ట్యూమ్స్ తెస్తున్నారు ఫ్యాషన్ డిజైనర్లు. మార్కెట్లో హల్చల్ చేస్తున్న ఈ సమ్మర్ స్పెషల్స్‌ను వనితాలోకం సాదరంగా ఆహ్వానిస్తోంది. వేసవిలో రాసిల్క్, పట్టు, జార్జెట్ వంటి కాస్ట్యూమ్స్ చికాకు తెప్పిస్తాయి. మేనును హత్తుకుని చెమట చిందిస్తాయి. అందుకే సమ్మర్ రాగానే నారీమణులంతా కాటన్ కాస్ట్యూమ్స్‌లోకి షిఫ్ట్ అయిపోతారు. కాటన్‌తో పాటు సాఫ్ట్ స్పన్, జ్యూట్, ఖాది, లినెన్ మెటీరియల్స్ మోస్ట్ కంఫర్ట్‌గా సెట్ అవుతాయి. ఫ్యాషన్ మంత్రం పఠిస్తున్న ప్రజెంట్ జెనరేషన్ కాటన్ దుస్తుల్లోనే.. కంఫర్ట్‌తో పాటు కలర్ఫుల్గా కనిపించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తోందని చెబుతున్నారు పీఆర్ ప్రీత్ డిజైనర్ స్టూడియో డిజైనర్లు ప్రియ, రూప. కూల్.. కూల్.. కోట, తస్సేర్ కాటన్, క లంకారి, ఇకత్ ఇలా అనేక రకాల కంఫర్ట్ కాటన్ ప్యాబ్రిక్స్ని ఎక్కువ శాతం వాడుతూ న్యూ డిజైన్స్ క్రియేట్ చేస్తున్నారు ఫ్యాషన్ డిజైనర్లు. పైగా ఈ డ్రెస్లపైకి పచ్చని చెట్లను, అందాల సీతకోకచిలుకలను, రకరకాల పక్షులను, జంతువుల బొమ్మలను డిజైన్లుగా చేర్చి అదనపు సొబగులు అద్దుతున్నారు. కాటన్ ఫ్యామిలీకి చెందిన ఈ ట్రెడిషనల్ వేర్ ఫుల్లెన్త్గా ఉండటం వల్ల స్పెషల్ లుక్ వస్తుందని చెబుతున్నారు ఫ్యాషన్ డిజైనర్లు. ఈ డ్రెస్సింగ్‌లో హైహీల్స్ వేసుకుని, హెయిర్ ఓపెన్‌గా ఉండేలా చూసుకుంటే.. కూల్‌గా కనిపించడమే కాదు.. మీరు కూడా కూల్‌గా ఉంటారు. కాజ్యువల్ వేర్‌గానే కాదు.. ఫంక్షన్స్ వేర్‌గా కూడా ఇవి మీకు రిచ్ లుక్ ఇస్తాయి. సిరి -
బడుగులపై ‘అగ్గి’ పిడుగు
మండు వేసవి.. మిట్టమధ్యాహ్నం 12 గంటల సమయం.. భానుడు నిప్పుడు చెరుగుతున్నాడు. అంతకు మించి వడగాడ్పులు ఉద్ధృతంగా వీస్తున్నాయి. ఆ ధాటికి బయటకు రావడానికి భయపడిన కాలనీ వాసులు గుడిసెల్లోనే సేద దీరుతున్నారు. ఇంతలో ఒక్కసారిగా పెద్దగా అరుపులు, కేకలు.. ఏం జరిగిందోనని ఒకరి వెంట ఒకరు గుడిసెల నుంచి బయటకు పరుగుతీశారు. ఓ ఇంటి నుంచి పొగతో కూడిన మంటలు ఎగసి పడుతున్నాయి. చూస్తూ ఉండగానే అగ్ని కీలలు కాలనీ మొత్తాన్ని చుట్టేశాయి. 68 ఇళ్లు కాలి బూడిదయ్యాయి. దాదాపు 150 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఈ ఘోర అగ్నిప్రమాదం శుక్రవారం తెనాలి పట్టణంలోని పాండురంగపేటలో జరిగింది. తెనాలిఅర్బన్ పట్టణంలోని పాండురంగపేట శుక్రవారం మధ్యాహ్నం సంభవించిన అగ్ని ప్రమాదం నిరుపేదలను నిరాశ్రయులను చేసింది. లక్షల రూపాయల ఆస్తిని బుగ్గిపాలు చేసింది. స్థానిక లంబాడీ కాలనీలోని 27వ వార్డులో వందకు పైగా నిరుపేదల ఇళ్లున్నాయి. అంతా ఇరుకు సందులు, ఇంటికి ఇంటికీ మధ్య నడిచే కాళీ కూడా లేదు. మధ్యాహ్న సమయంలో ఓ పూరిగుడిసె నుంచి మంటలు రాగా స్థానికులు వెంటనే ఫైర్‌స్టేషన్‌కు సమాచారం అందించారు. ఇళ్లలోంచి సామాన్లు బయట పడేసే పనిలో నిమగ్నమయ్యారు. చూస్తూ ఉండగానే మంటలు కాలనీని చుట్టుముట్టాయి. ఇంతలో ఓ ఇంటిలోంచి గ్యాస్ సిలిండర్ పెద్దశబ్దంతో పేలి, పైకి లేచింది. ఈ హటాత్పరిణామంతో స్థానికులు భయాందోళనలకు లోనయ్యారు. ప్రతి ఇంటిలోనూ వంటగ్యాస్ సిలిండర్లు ఉండటంతో మంటలను అదుపు చేసేందుకు ఎవరూ సాహసించలేదు. కట్టుబట్టలతో బయటపడిన మహిళలు మంటలను చూస్తూ రోదిస్తూ నిస్సహాయంగా ఉండిపోయారు. ఈ ప్రమాదంలో మొత్తం 68 పూడి గుడిసెలు దగ్దమయ్యాయి. ఇందులో 43 ఇళ్లు పూర్తిగాను 25 పాక్షికంగాను కాలిపోయాయి. స్పందించిన అగ్నిమాపకశాఖ.: ప్రమాద వార్త అందిన వెంటనే అగ్నిమాపక శాఖాధికారి కె.కృష్ణారెడ్డి సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రెండు వాహనాల ద్వారా మంటలను అదుపుచేశారు. సమీపంలో చెరువులు, కాలువలు లేకపోవటం, రెండు వాహనాల్లో నీరు ఏకకాలంలో అయిపోవటంతో మరలా మంటలు చెలరేగకుండా స్థానికులు అప్రమత్తంగా వ్యవహరించారు. ఈ ప్రమాదంలో రూ.21 లక్షలు నష్టం జరిగి ఉంటుందని అధికారులు అంచనా వేశారు. స్థానికులు మాత్రం 40 లక్షలపైగా నష్టం ఉండొచ్చని, వంట చేస్తుండగా మంటలు పెకైగసి గుడిసెకు అంటుకున్నాయని చెబుతున్నారు. సహాయక చర్యల్లో రెవెన్యూ సిబ్బంది.. రెవెన్యూ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఆర్డీవో ఎస్.శ్రీనివాసమూర్తి నేతృత్వంతో మునిసిపల్ కమిషర్ బి.గోపినాథ్, డీఎస్పీ టి.పి.విఠలేశ్వర్ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని, పరిస్థితిని సమీక్షించారు. సమీసంలోని షాదీఖానాలో బాధితులకు భోజన ఏర్పాట్లు చేశారు. వారిని తాత్కాలికంగా అక్కడికి తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. తాగునీరు, భోజన వసతికి ఇబ్బంది లేకుండా సిబ్బందిని అప్రమత్తం చేశారు. బాధితులను ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని, విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి ఐఏవై కింద గృహ నిర్మాణానికి ప్రతిపాదిస్తామని ఆర్టీవో తెలిపారు. త్రీటౌన్ సీఐ షేక్ అబ్దుల్అజీజ్, ఎస్ఐలు రవీంద్రబాబు, జోగి శ్రీనివాస్, ఇన్చార్జి తహశీల్దార్ వెంకటరత్నం, ఏసీపీ ధర్మారావు, టీపీవో అనురాధ, ఆర్ఐ సూర్యనారాయణమూర్తి, పలువురు వీఆర్వోలు, వీఆర్ఏలు సహయక చర్యల్లో నిమగ్నమయ్యారు.