
పగటి ఉష్ణోగ్రతలు 35.7 డిగ్రీలు
ఉక్కపోతతో ప్రజలు విలవిల
ఆన్ అయిన ఏసీలు, కూలర్లు
పెరిగిన విద్యుత్ వినియోగం
సగటున 60 మిలియన్ యూనిట్లు
భానుడు భగ్గుమంటున్నాడు. తాజాగా పగటి గరిష్ట ఉష్ణోగ్రతలు (High Temperature) 35.7 డిగ్రీలు నమోదు కాగా.. ఎండ తీవ్రతకు ప్రజలు విలవిలలాడుతున్నారు. ఉక్కపోత నుంచి ఉపషమనం పొందేందుకు ఏసీలు, కూలర్లకు పనిచెప్పారు. దీంతో విద్యుత్ డిమాండ్ (Electricity Demand) అమాంతం పెరిగింది. సగటున విద్యుత్ డిమాండ్ 60 మిలియన్ యూనిట్లు నమోదు కాగా.. అది తాజాగా 70ఎంయూకి దాటింది.
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఎండలు మండిపోతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్‌లో బుధవారం పగటి గరిష్ట ఉష్ణోగ్రతలు 35.7 డిగ్రీలు, కనిష్టంగా 21.3 డిగ్రీలు నమోద య్యాయి. ఈ ఉష్ణోగ్రతలకు ఉక్కపోత తోడవడంతో ఉపశమనం కోసం ప్రజలు ఏసీలను ఆన్ చేస్తున్నారు. మొన్నటి వరకు మూలన పడిన కూలర్లు (Air Coolers) మళ్లీ వినియోగంలోకి వస్తున్నాయి. ఇంట్లోనే కాదు వ్యాపార, వాణిజ్య సముదాయాల్లో రోజంతా ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు ఆన్‌లో ఉండటంతో విద్యుత్ డిమాండ్ అనూహ్యంగా పెరుగుతోంది. ఫిబ్రవరి (February) మొదటి రెండో వారం వరకు గ్రేటర్‌లో రోజు సగటున డిమాండ్ 60 మిలియన్ యూనిట్లు నమోదు కాగా, తాజాగా 70 ఎంయూ దాటింది.
అత్యవసరమైతేనే.. ఎల్సీలకు అనుమతి
విద్యుత్ వాడకం పెరుగుతున్న నేపథ్యంలో దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ఇంజినీర్లలో ఆందోళన మొదలైంది. వేసవిలో నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం డిస్కం ముందస్తు లైన్ల పునరుద్ధరణ చర్యలు చేపట్టింది. లైన్లకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మల తొలగింపు, డీటీఆర్‌లలో ఆయిల్ లీకేజీల నియంత్రణ చర్యలు, పవర్ ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్యం పెంపు, లూజు లైన్లను సరి చేయడం, దెబ్బతిన్న ఇన్సులేటర్లను మార్చడం, ఎర్తింగ్ సిస్టం పక్కగా ఉండేలా చర్యలు చేపట్టింది.
ప్రస్తుతం సబ్‌స్టేషన్ల మధ్య ఇంటర్ లింకింగ్ వర్క్స్ నిర్వహిస్తుంది. వారం పది రోజుల్లో వీటిని కూడా పూర్తి చేయనుంది. మార్చి మొదటి వారంలో ఇంటర్మీడియట్, రెండో మూడో వారంలో టెన్త్ వార్షిక పరీక్షలు మొదలు కానున్నాయి. విద్యార్థుల చదువుకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా లైన్ క్లియరెన్స్ (ఎల్సీ)లకు స్వస్తి చెప్పింది. అత్యవసరమైతే తప్ప.. ఎల్సీలకు అనుమతి ఇవ్వడం లేదు.
ఫిబ్రవరిలోనే.. ఏప్రిల్ డిమాండ్
మార్చి, ఏప్రిల్, మే, జూన్ మాసాల్లో విద్యుత్ డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. కానీ 2022 ఏప్రిల్ నెలలో నమోదైన సగటు గరిష్ట (3435 మెగావాట్లు)డిమాండ్.. ప్రస్తుతం ఫిబ్రవరిలోనే (3455 మెగావాట్లు) నమోదవుతోంది. ఇక మార్చి, ఏప్రిల్ నెలలో డిమాండ్ ఎంత పెరుగుతుందో అనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. మే చివరి నాటికి రోజు సగటు డిమాండ్ 100 ఎంయూలు దాటే అవకాశం ఉన్నట్లు డిస్కం అంచనా వేస్తోంది.
ప్రత్యామ్నాయ మార్గాలకు ప్రణాళికలు
60 శాతానికి మించి లోడు ఉన్న 33కేవీ, 11 కేవీ ఫీడర్లు, డి్రస్టిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లను గుర్తించి, ప్రత్యమ్నాయ మార్గాలకు విద్యుత్ పంపిణీ సంస్థ ప్రణాళికలు రూపొందించింది. ప్రస్తుతం 571 (33కేవీ) సబ్‌స్టేషన్లు ఉండగా, వీటి సామర్థ్యం 9,675 ఎంవీఏగా ఉంది. కొత్తగా మరో 213(33/11 కేవీ) సబ్‌స్టేషన్ల ఏర్పాటుకు గ్లోబల్ టెండర్లు పిలిచింది. పనులు చేసేందుకు ముందుకు వచ్చే కాంట్రాక్టర్లకు ఆయా సబ్‌స్టేషన్ల నిర్మాణ పనులు అప్పగించి, నిర్ధేశిత లక్ష్యం లోగా వాటిని పూర్తి చేయించాలని డిస్కం నిర్ణయించింది. అంతేకాదు కొత్తగా నాలుగు వేల కిలో మీటర్ల 33 కేవీ లైన్లు, ఏడు వేల కిలో మీటర్ల 11 కేవీ లైన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది.
చదవండి: హైదరాబాద్ ఓఆర్‌ఆర్ చుట్టూ హౌసింగ్ కాలనీలు
సీఎండీ ముషారఫ్ ఫరూఖీ రోజూ క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఎస్‌ఈలు, సీజీఎంలు, డీఈలతో సమావేశాలు ఏర్పాటు చేసి, లైన్ల పునరుద్ధరణ, కొత్త లైన్ల ఏర్పాటు వంటి పనులను సమీక్షిస్తున్నారు. ముఖ్యంగా నిజాంపేట, బాచుపల్లి, కూకట్‌పల్లి, గండి మైసమ్మ, అమీన్‌పూర్‌లలో నమోదవుతున్న విద్యుత్ డిమాండ్, గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని రూ.212.20 కోట్లతో బౌరంపేటలో కొత్తగా నిర్మించిన 220/132 కేవీ సబ్‌స్టేషన్‌ను ఈ నెలాఖరు లోగా ఛార్జ్ చేయనున్నారు.
ఫైళ్ల పెండింగ్‌పై సీఎండీ సీరియస్
సైబర్‌సిటీ, రాజేంద్రనగర్, సరూర్‌నగర్, మేడ్చల్ సర్కిళ్ల పరిధిలో కొత్త కనెక్షన్ల జారీకి సంబంధించిన ఫైళ్లు నెలల తరబడి పెండింగ్‌లో ఉండటాన్ని సీఎండీ ఫారూఖీ సీరియస్‌గా తీసుకున్నారు. బుధవారం ఉదయం నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో ఆయా సర్కిళ్ల అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఆయా కనెక్షన్లను ఎందుకు పెండింగ్‌లో పెట్టాల్సి వచి్చందని నిలదీసినట్లు తెలిసింది. నిర్దేశించిన గడువులోగా కనెక్షన్లు జారీ చేయాలని ఆదేశించారు. ఎన్నిసార్లు హెచ్చరించినా సైబర్‌సిటీ, రాజేంద్రనగర్ సర్కిళ్ల పరిధిలోని కొంత మంది ఇంజినీర్లు తీరు మార్చుకోవడం లేదని, పరిస్థితిలో మార్పు రాకపోతే ఉపేక్షించబోమని హెచ్చరించినట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment