
ప్రస్తుతం ఈపీఎఫ్‌ఓ కనీస పింఛన్ రూ.1000
ఈ మొత్తాన్ని పెంచాలంటూ కేంద్రంపై కార్మిక సంఘాల ఒత్తిడి
ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా పెంపు కోసం డిమాండ్
ఈపీఎఫ్‌ఓ పెన్షన్ కంటే రాష్ట్రాల్లో ఇచ్చే సామాజిక పింఛన్ ఎక్కువ
పెంపుపై వచ్చే వారం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ తీర్మానం చేసే అవకాశం
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగి భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ) ద్వారా అమలవుతున్న ఉద్యోగుల పెన్షన్ పథకం (ఈపీఎస్) కింద ఇచ్చే కనీస పెన్షన్ పరిమితి పెంచాలనే డిమాండ్ తీవ్రమవుతోంది. ఈ పథకం కింద అర్హత సాధించిన కార్మికులకు పదవీ విరమణ తర్వాత ఇచ్చే కనీస పెన్షన్ కింద రూ.1000గా ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈపీఎస్ ద్వారా అందే కనీస పెన్షన్ కార్మికుడి కుటుంబానికి ఏమాత్రం సరిపోవడం లేదు.
దేశంలోని వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే సామాజిక పెన్షన్ పథకం కింద కూడా ఇంతకు రెట్టింపు స్థాయిలో ఇస్తుండటంతో... కనీసం ఆ మేరకైనా పెంచాలనే డిమాండ్‌ను కార్మిక సంఘాలు బలంగా వినిపిస్తున్నాయి. దీనిపై ఇప్పటికే ఈపీఎఫ్‌ఓ, కేంద్ర కార్మిక శాఖకు పెద్ద ఎత్తున వినతులు సైతం సమర్పించాయి. పెన్షన్ పెంపు కోసం కార్మికులు పదేళ్లుగా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.
రూ.2 వేలతో ప్రతిపాదనలు
దేశవ్యాప్తంగా ఈపీఎఫ్‌ఓలో నమోదైన ఎస్టాబ్లిష్‌మెంట్ (వాణిజ్య, వ్యాపార సంస్థ)లు 7.66 లక్షలు. ఈ సంస్థల పరిధిలో ప్రస్తుతం ఈపీఎఫ్‌ఓ చందాదారులుగా ఉన్న వారు 7.37 కోట్లు. వీరంతా ఈపీఎస్ కింద వాటా చెల్లిస్తున్న వారే. మరో 78.49 లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు. ఒక్కో పెన్షనర్ కనీస పెన్షన్ కింద రూ.వెయ్యి చొప్పున అందుకుంటున్నారు. అయితే ఈ పెన్షన్ కింద వచ్చే డబ్బులు కనీసం నెలవారీ బీపీ, మధుమేహంలాంటి దీర్ఘకాలిక వ్యాధుల మందుల ఖర్చులకూ చాలడం లేదంటూ వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో కనీస పింఛన్ పెంపు కోసం కార్మిక సంఘాలు కేంద్రంపై తీవ్రంగానే ఒత్తిడి చేస్తున్నాయి.
మరోవైపు కనీస పెన్షన్ పెంపుకోసం ఏర్పాటైన కమిటీలు సైతం పెంపును సమర్థిస్తూ కేంద్రానికి నివేదికలు సమర్పించాయి. కనీస పెన్షన్‌ను రూ.2 వేలకు పెంచాలంటూ ప్రతిపాదనలు సైతం పంపాయి. పెన్షన్ పెంపుతో తలెత్తే ఆర్థిక భారాన్ని అధిగమించేందుకు ఆర్థిక శాఖ ద్వారా కొంత సాయం అందించాలన్న అంశాన్ని కూడా ప్రస్తావించాయి. కానీ ఈ ప్రతిపాదనలకు ఆమోదం తెలపని ఆర్థిక శాఖ... కనీస పెన్షన్ పెంపు ప్రతిపాదనలను తిరస్కరించింది.
చందాల రూపంలో రూ.65 వేల కోట్లు
ప్రస్తుతం ఈపీఎఫ్‌ఓకు నెలవారీ చందాల రూపంలో ఏడాదికి రూ.65 వేల కోట్లు సమకూరుతోంది. అదేవిధంగా పెన్షన్ నిధి నిల్వలతో వచ్చే వడ్డీ సైతం భారీగా జమ అవుతోంది. అంతేకాకుండా ఈపీఎఫ్‌ఓ ద్వారా సెక్యూరిటీస్‌లో పెట్టుబడులతోనూ భారీగా ఆదాయం వస్తోంది. ఈ పరిస్థితుల్లో కనీస పెన్షన్ రెట్టింపు చేసినా ఆర్థిక భారం ఉండదనేది కార్మిక సంఘాల వాదన. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్థిక శాఖ సాయం లేకున్నా కనీస పింఛన్ పెంపుతో ఇబ్బందులు ఉండవని సంఘాల నేతలు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో మరోమారు కనీస పెన్షన్ పెంచుతూ కేంద్రానికి ప్రతిపాదనలు సమర్పించాలని ఈపీఎఫ్‌ఓ ట్రస్టీలు సైతం సూచిస్తున్నారు. వచ్చే వారంలో ఈపీఎఫ్‌ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) సమావేశం జరగనుంది. అందులోనైనా కనీస పెన్షన్‌పై తీర్మానం చేసి కేంద్ర కార్మిక శాఖకు సమర్పించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment