Employees pension scheme
-
ఏ బ్యాంకు నుంచైనా ఈపీఎస్ పింఛను
న్యూఢిల్లీ: ఈపీఎఫ్‌వో నిర్వహణలోని ‘ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్’ (ఈపీఎస్) 1995 కింద దేశవ్యాప్తంగా ఏ బ్యాంకు శాఖ నుంచి అయినా పింఛను పొందొచ్చని కేంద్ర కారి్మక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. వచ్చే జనవరి నుంచి ఇది అమల్లోకి వస్తుందన్నారు. ఈపీఎఫ్‌వో అత్యున్నత నిర్ణయాల మండలి అయిన ‘సెంట్రల్ బోర్డు ఆఫ్ ట్రస్టీస్’కు కారి్మక శాఖ మంత్రి చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తుంటారు. ఈపీఎస్ 1995 పరిధిలోని ఉద్యోగులకు కేంద్రీకృత పింఛను చెల్లింపుల వ్యవస్థ(సీపీపీఎస్)కు ఆమోదం తెలిపినట్టు మాండవీయ ప్రకటించారు. దీని ద్వారా ఏ బ్యాంక్ శాఖ నుంచి అయినా పింఛను చెల్లింపులకు వీలుంటుంద న్నారు. ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) ఆధునికీకరణలో సీపీపీఎస్ ఓ మైలురాయిగా అభివరి్ణంచారు. -
అధిక పెన్షన్ దరఖాస్తులకు రేపే ఆఖరు.. గడువు పెంచేది లేదు: ఈపీఎఫ్ఓ
సాక్షి, హైదరాబాద్: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌వో) చందాదారులకు అధిక పెన్షన్ దరఖాస్తు గడువు ఈ నెల 11వ తేదీతో ముగుస్తోంది. క్షేత్రస్థాయి నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఇప్పటికే మూడుసార్లు దరఖాస్తుల గడువు పెంచిన నేపథ్యంలో.. ఇకపై పొడిగింపు ఉండదని ఈపీఎఫ్‌వో వర్గాలు చెప్తున్నాయి. నిబంధనల సడలింపుతో దర ఖాస్తులు బాగా పెరిగాయని.. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 17.54 లక్షల మంది అధిక పెన్షన్ కోసం ఆన్లైన్లో ఆప్షన్ ఇచ్చుకు న్నారని తెలిపాయి. 26(6) పత్రాన్ని సమర్పించే విషయంలో వెసులుబాటు ఉద్యోగులకు ఊరట ఇచ్చిందని వివరించాయి. సోమ, మంగళవారాలు కూడా ఆప్షన్ ఇచ్చుకునే అవకాశం ఉందని, దీన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించాయి. రెండు నెలల్లో పరిశీలన పూర్తి.. ఈపీఎఫ్‌వో అధిక పెన్షన్ పథకం కింద ఎంప్లాయీస్ పెన్షన్ స్కీం (ఈపీఎస్)కు అర్హత ఉన్న వారి నుంచి ఆప్షన్ స్వీకరిస్తోంది. దరఖాస్తుల ప్రక్రియ ముగిశాక వాటిని పరిశీలించేందుకు ఈపీఎఫ్‌వో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు. ఇందుకు సంబంధించి పరిశీలన అధికారులను ఈపీఎఫ్‌వో సన్నద్ధం చేస్తోందని వివరించారు. వారు ఆన్లైన్లో వచ్చిన దరఖాస్తులను నిశితంగా పరిశీలిస్తారు. ఇందులో భాగంగా ఈపీఎఫ్‌వో అధికారులు ఉద్యోగికి, వారు పనిచేస్తున్న సంస్థ యాజమాన్యానికి నోటీసులు జారీ చేస్తారు. రికార్డులను పరిశీలిస్తారు. తర్వాత అధిక పెన్షన్ కింద చందా, బకాయిలకు సంబంధించిన అంశాలను వెల్లడిస్తూ.. చెల్లించేందుకు కొంత గడువు ఇస్తారు. ఈ ప్రక్రియకు కనీసం రెండు నెలలు పడుతుందని అధికారులు చెప్తున్నారు. -
ఈపీఎఫ్‌వో అధిక పెన్షన్.. అంత ఈజీ కాదు!?
సుదీర్ఘ పోరాటం తర్వాత వేతన జీవుల ఆకాంక్ష అయిన అధిక పెన్షన్ కల సాకారమైంది. ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) పరిధిలోని ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ (ఈపీఎస్ 95) కింద అధిక పెన్షన్‌కు అర్హత లభించింది. 2014 సెప్టెంబర్ 1 నాటికి ఈపీఎస్ సభ్యులుగా ఉన్నవారు, అంతకుముందు రిటైర్మెంట్ తీసుకున్న వారు, తమకు అధిక పెన్షన్ కావాలంటూ ఆప్షన్ ఇచ్చుకోవచ్చు. ఇందుకు సుప్రీంకోర్టు అనుమతించింది. దరఖాస్తు చేసుకోవచ్చంటూ ఈఎపీఎఫ్‌వో ప్రకటన విడుదల చేసింది. ఉద్యోగి తన సంస్థ తరఫున ఉమ్మడి దరఖాస్తు పత్రాన్ని ఆన్లైన్లో సమర్పించాలి. అధిక పెన్షన్ కావాలంటూ ఆప్షన్ ఇవ్వాలా? వద్దా..? ఎవరు అర్హులు? తదితర అంశాలపై వేతన జీవుల్లో ఎన్నో సందేహాలు నెలకొనగా.. దీన్ని ఎలా అమలు చేయాలి? అనే విషయమై ఈపీఎఫ్‌వోలోనూ స్పష్టత కొరవడింది. ఈ నేపథ్యంలో దీనిపై ఇప్పటిదాకా అందుబాటులో ఉన్న వివరాలతో ప్రత్యేక కథనమిది... అంత పింఛను ఎవరు చెల్లించాలి? ఉదాహరణకు కిరణ్ అనే వ్యక్తి 1996 ఏప్రిల్ 1న ఉద్యోగంలో చేరాడని అనుకుందాం. నాడు అతడి బేసిక్ వేతనం రూ.5,000. నాటి నుంచి ఏటా 7.5 శాతం చొప్పున పెరుగుతూ వచ్చిందని భావిస్తే.. అతడు అధిక పెన్షన్ ఆప్షన్ ఎంపిక చేసుకోకపోతే, 2031 నాటికి 35 ఏళ్ల సర్వీస్ ముగిసిన అనంతరం, అతడికి ప్రతి నెలా రూ.7,929 పెన్షన్ వస్తుంది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో కిరణ్ ఒకవేళ అధిక పెన్షన్ ఆప్షన్ ఇస్తే అతడికి 2031 తర్వాత నుంచి ప్రతి నెలా వచ్చే పింఛను రూ.26,879కి పెరుగుతుంది. దీనికోసం ఇప్పుడు రూ.9.74 లక్షలు జమ చేయాల్సి ఉంటుంది. ఈ మొత్తంపై వచ్చే రాబడి రేటు 23.4 శాతం. ఇంత రాబడి అంటే అది కచ్చితంగా ఉద్యోగులకు లాభించేదే. కానీ, అది ఈపీఎఫ్ నిధిపై ఇది గణనీయమైన ప్రభావం చూపిస్తుంది. అందుకుని ఈపీఎఫ్‌వో ప్రత్యామ్నాయ ఫార్ములా కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు కనిపిస్తోంది. సర్వీస్ కాలం.. అదనపు పెన్షన్ కోరుకునే వారు ఎంత అదనపు మొత్తం ఇప్పుడు జమ చేయాలన్నది ఆసక్తికరంగా మారింది. నిబంధనల ప్రకారం రిటైర్మెంట్ నాటికి ఈపీఎస్ పథకం కింద పదేళ్ల సర్వీస్ పూర్తి చేసుకుంటే పెన్షన్‌కు అర్హత లభిస్తుంది. ఈపీఎస్ కింద సర్వీస్ ఎంత ఎక్కువ కాలం ఉంటే అంత అధికంగా పెన్షన్ అందుకోగలరు. అధిక పెన్షన్ ఆప్షన్ ఇవ్వాలా? వద్దా? అనేదానికి కూడా ఇదే ప్రామాణికం అవుతుంది. ఈపీఎస్ 95 కింద 20 ఏళ్లకు పైగా సర్వీస్ ఉన్న వారు అధిక పెన్షన్ ఆప్షన్‌తో ఎక్కువగా ప్రయోజనం పొందుతారన్నది ప్రాథమిక అంచనా. పెట్టుబడి వారసులకు రాదు.. ఈపీఎస్ సభ్యుడు, అతని జీవిత భాగస్వామి, వారి మరణానంతరం వైకల్యంతో ఉన్న 25 ఏళ్లకు మించని పిల్లల వరకు పెన్షన్ వస్తుంది. వీరి తదనంతరం పింఛను నిధి వారసులకు చెల్లించరు. దీంతో దీన్ని మంచి సాధనం కాదని చాలా మంది అనుకుంటారు. ప్రైవేటు లైఫ్ ఇన్సూరెన్స్ యాన్యుటీ ప్లాన్‌లో చివర్లో పెట్టుబడి తిరిగిచ్చే ప్లాన్‌లో గరిష్ట రాబడి 6.87 శాతంగా ఉంటే.. పెట్టుబడి తిరిగి ఇవ్వని (ఈపీఎస్ మాదిరి) ఆప్షన్లో రాబడి 8.6 శాతంగా ఉంది. ఇంతకంటే అధిక రాబడిని, ప్రభుత్వ హామీతో ఇచ్చే ఏదైనా సాధనం ఉందంటే.. నిస్సందేహంగా దానికి వెళ్లొచ్చు. ఈపీఎస్‌లో కనీసం 15 ఏళ్ల సర్వీస్ ఉన్న వారికి సైతం ఇంతకంటే అధిక రాబడే వస్తుంది. రిటైర్మెంట్ తర్వాత ఎక్కువ కాలం జీవించి లేని సందర్భాల్లో పెన్షన్ ఫండ్‌ను తిరిగిచ్చే ప్లాన్ మెరుగైనది అవుతుంది. కానీ, రిటైర్మెంట్ తర్వాత ఎంత కాలం జీవించి ఉంటామన్నది ఎవరికీ తెలియదు. దేనికైనా కట్టుబడి ఉండాలి? ఈపీఎస్ 95 కింద పెన్షన్ లెక్కింపు అనేది పెన్షన్ సర్వీస్, బేసిక్ వేతనంపై ఆధారపడి ఉంటుంది. ఈపీఎస్ 95 పథకం 1995 నవంబర్ నుంచి అమల్లోకి వచ్చింది. ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం హామీగా ఉంటుంది. ఆరంభంలో రూ.5,000 బేసిక్ శాలరీ పరిమితి విధించారు. 2001 జూన్ నుంచి రూ.6,500 చేశారు. ఆ తర్వాత 2014 సెప్టెంబర్ నుంచి రూ.15,000కు పెంచారు. ఇంతకంటే అధిక వేతం తీసుకుంటున్నా.. ఈపీఎస్‌కు అధికంగా జమ చేసే అవకాశం లేక రిటైర్మెంట్ తర్వాత తక్కువ పెన్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఇప్పటి వరకు ఉంది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో రూ.15,000 పరిమితి తొలగిపోయింది. రిటైర్మెంట్కు ముందు చివరి ఐదేళ్ల కాలంలో ఉన్న సగటు బేసిక్ వేతనం ఆధారంగా పెన్షన్ అందుకోవడానికి అర్హులు అవుతారు. సుప్రీంకోర్టు ఆదేశాలను యథాతథంగా అమలు చేస్తే ఎక్కువ సర్వీస్ ఉండి.. అధిక మూలవేతనం, డీఏ కలిగిన వారికి ఎక్కువ పెన్షన్ రిటైర్మెంట్ తర్వాత వస్తుంది. కానీ, ఈపీఎఫ్‌వో వైపు నుంచి పారదర్శకత లోపించింది. ఎంత పెన్షన్ ఇస్తారో చెప్పకుండా, ఈపీఎఫ్‌వో నిర్ణయించిన సూత్రం మేరకు పెన్షన్ తీసుకునేందుకు సమ్మతమేనంటూ అంగీకారం తెలియజేయాలని ఆన్లైన్ దరఖాస్తులో షరతు విధించినట్టు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం పెన్షన్ పథకంలో చేసే మార్పులకు అంగీకారం తెలపాలని కూడా కోరుతోంది. అధిక పెన్షన్ ఆప్షన్ ఇచ్చినా, తనపై చెల్లింపుల భారం పడకుండా ఈపీఎఫ్‌వో చూస్తున్నట్టు అర్థమవుతోంది. పైగా 2014 నాటి నిబంధనల సవరణ తర్వాత వాస్తవ వేతనంపై జమలు చేస్తున్న వారు సైతం ఇప్పుడు అధిక పెన్షన్ పొందాలంటే.. నాడు ఈపీఎఫ్‌వో నుంచి ఉద్యోగి, సంస్థ ఉమ్మడిగా తీసుకున్న అనుమతి పత్రాన్ని సమర్పించాలని ఈపీఎఫ్‌వో నిబంధన విధించింది. ఇంతకాలం అధిక చందాలను అనుమతిస్తూ, ఇప్పుడు అనుమతి ఉండాలని కోరడమే విడ్డూరంగా ఉంది. ప్రత్యామ్నాయం ఎన్పీఎస్ అధిక పింఛను ఆప్షన్‌కు ఈపీఎఫ్‌వో దరఖాస్తు తీసుకుంటున్నప్పటికీ.. అందులో పారదర్శకత లేదు. అధిక పింఛను అంటే ఎంత చెల్లిస్తామనే స్పష్టత లేదు. అన్నింటికీ కట్టుబడి ఉంటాము, షరతులకు అంగీకరిస్తాము? అన్న అంగీకారాన్ని తీసుకుంటోంది. కనుక రిటైర్మెంట్ తర్వాత మెరుగైన పింఛను కోరుకునే వారు ఈపీఎస్‌నే నమ్ముకోవాలనేమీ లేదు. దీనికి ప్రత్యామ్నాయంగా నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్), ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌ను పరిశీలించొచ్చు. పన్ను ప్రయోజనంతో కూడిన రాబడి కోరుకునే వారికి ఎన్పీఎస్ మెరుగైనది. రిటైర్మెంట్ తర్వాత ఎన్పీఎస్ కింద సమకూరిన మొత్తం నిధిలో 60 శాతాన్ని వెనక్కి తీసుకోవచ్చు. దీనిపై ఎలాంటి పన్ను ఉండదు. మిగిలిన 40 శాతంతో యాన్యుటీ ప్లాన్ తీసుకోవాలి. యాన్యుటీ అనేది పెన్షన్ ప్లాన్. ఇక్కడి నుంచి కనీసం మరో 20 ఏళ్ల సర్వీసు ఉన్న వారు ఎన్పీఎస్ను ఎంపిక చేసుకోవచ్చు. కొన్ని ఉదాహరణలు చూద్దాం. ► 1980 జనవరి 1న జన్మించిన వారు ఎన్పీఎస్ను ఎంపిక చేసుకుని ప్రతి నెలా రూ.2,000 చొప్పున, ఇక్కడి నుంచి మరో 17 ఏళ్లపాటు అంటే 60 ఏళ్ల వరకు ఇన్వెస్ట్ చేస్తే.. 10 శాతం రాబడి ప్రకారం రూ.10.7 లక్షలు సమకూరుతాయి. 40 శాతంతో యాన్యుటీ ప్లాన్ తీసుకుంటే 6 శాతం రాబడి రేటు ప్రకారం 2147 పెన్షన్‌గా వస్తుంది. లేదు 100% నిధితో యాన్యుటీ ప్లాన్ తీసుకుంటే రూ.5,367 పెన్షన్‌గా లభిస్తుంది. ► 1990 జనవరి 1న జన్మించిన వారు ప్రతి నెలా రూ. 2,000ను ఎన్‌పీఎస్‌లో జమ చేసుకుంటే, 60 ఏళ్ల నాటికి 10 శాతం రాబడి రేటు ఆధారంగా రూ.33 లక్షలు సమకూరుతాయి. 40% నిధితో యాన్యుటీ ప్లాన్ తీసుకుంటే రూ. 16,594గా లభిస్తుంది. ఇవి గమనించండి ► ఈపీఎస్ కింద కనీసం పదేళ్ల సర్వీస్ ఉన్న వారికే 58 ఏళ్ల తర్వాత నుంచి పెన్షన్ లభిస్తుంది. ► ఉద్యోగి మరణిస్తే పీఎఫ్ ఖాతాలో ఉన్న మొత్తాన్ని వారసులకు ఇస్తారు. కానీ, ఈపీఎస్ సభ్యుడు మరణిస్తే, వారి జీవిత భాగస్వామికి పెన్షన్‌లో సగమే చెల్లిస్తారు. ► అధిక పెన్షన్ ఆప్షన్ ఎంపిక చేసుకుంటే, గత కాలానికి సంబంధించి అదనపు చందాలను ఇప్పుడు చెల్లించాలి. ఈపీఎఫ్ బ్యాలన్స్ నుంచి దీన్ని మిననహాయించేట్టు అయితే.. భవిష్యత్తులో పిల్లల విద్య, సొంతిల్లు వంటి లక్ష్యాల అవసరాలకు నిధి అందుబాటులో ఉండదు. ఇంతకాలం పోగు చేసుకున్న మొత్తంపై కాంపౌండింగ్ ప్రయోజనం కోల్పోతారు కనుక దీన్ని ఆలోచించి నిర్ణయించుకోవాలి. -
పెన్షన్ (సవరణ) పథకం సబబే
న్యూఢిల్లీ: ఉద్యోగుల పెన్షన్ (సవరణ) పథకం–2014 చెల్లుబాటును సుప్రీంకోర్టు సమర్థించింది. అయితే, పెన్షన్ నిధిలో చేరేందుకు రూ.15,000 నెలవారీ కనీస వేతనం పరిమితిని కొట్టేసింది. 2014 నాటి సవరణ ప్రకారం ఉద్యోగులు పెన్షన్ పొందడానికి గరిష్ట వేతనం (బేసిక్ పే ప్లస్ డియర్నెస్ అలవెన్స్) నెలకు రూ.15,000 ఉండాలి. సవరణకు ముందు ఇది రూ.6,500గా ఉండేది. ఈ పథకాన్ని కేరళ, రాజస్తాన్, ఢిల్లీ హైకోర్టులు గతంలోనే కొట్టేశాయి. వీటిని సవాలు చేస్తూ ఈపీఎఫ్ఓ, కేంద్రం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యు.యు.లలిత్, న్యాయమూర్తులు జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ సుధాంశూ ధూలియాతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. పెన్షన్ పథకంలో చేరలేకపోయిన ఉద్యోగులు 6 నెలల్లోగా చేరొచ్చంది. రూ.15,000 వేతనం దాటినవారు 1.16 శాతాన్ని పెన్షన్ పథకంలో జమ చేయాలన్న నిబంధన చెల్లదని స్పష్టం చేసింది. -
జీపీఎస్‌తోనే ఉద్యోగులకు మెరుగైన పెన్షన్
సాక్షి, అమరావతి: సీపీఎస్ (కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్) ఉద్యోగుల న్యాయబద్ధమైన ఆందోళనను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడమే కాకుండా.. వారి ఆర్థిక అభ్యున్నతికి స్థిరమైన ప్రతిపాదనలను సిద్ధం చేసింది. తద్వారా ఓవైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుంటూ మరోవైపు సీపీఎస్ ఉద్యోగులు పదవీ విరమణ అనంతరం మరింత మెరుగైన పెన్షన్ పొందేలా గ్యారెంటీ పెన్షన్ స్కీమ్ (జీపీఎస్)ను ప్రతిపాదించింది. ఇప్పటికే ఉద్యోగుల వేతనాలు, పెన్షన్ల వ్యయం రాష్ట్ర సొంత ఆదాయంలో భారీగా ఉంది. సీపీఎస్ స్కీమ్‌ను రద్దు చేసి పాత పెన్షన్ పథకాన్ని వర్తింపచేస్తే.. రాష్ట్ర సొంత ఆదాయాన్ని మించి వేతనాలు, పెన్షన్లకు వ్యయమవుతుందని ఆర్థిక శాఖ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. దీన్ని రాష్ట్ర ప్రజలతోపాటు ఆర్థిక వ్యవస్థ భరించలేవని పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో సీపీఎస్ ఉద్యోగుల ఆర్థిక అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం జీపీఎస్‌ను ప్రతిపాదించింది. జీపీఎస్‌తోనే అధిక పెన్షన్ ప్రస్తుతం సీపీఎస్ ఉద్యోగులకు పదవీ విరమణ అనంతరం మూల వేతనం (బేసిక్)లో 20 శాతం పెన్షన్ వస్తోంది. సీపీఎస్ వల్ల ఎంత పెన్షన్ వస్తుందనేది పూర్తిగా వడ్డీ రేట్లమీద ఆధారపడి ఉంటుంది. వడ్డీ రేట్లను తగ్గిస్తే వచ్చే పెన్షన్ మొత్తం కూడా తగ్గే ప్రమాదం ఉంది. ఉదాహరణకు ఒకప్పుడు బ్యాంకుల్లో నగదు డిపాజిట్ చేస్తే 8 శాతం వరకు వడ్డీ ఇచ్చేవారు. ఈ 8 శాతం వడ్డీ ప్రస్తుతం 4 శాతానికి తగ్గిపోయింది. ఇదే ధోరణి కొనసాగితే ఇంకా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం ఉంది. అదే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన జీపీఎస్‌లో అయితే మూల వేతనంలో 33% పెన్షన్ రానుంది. దీనివల్ల పెన్షన్ 65 శాతం మేర పెరుగుతుందని ఆర్థిక శాఖ అంచనా వేసింది. ఉదాహరణకు ప్రస్తుతం సీపీఎస్‌లో ఉన్న సెకండరీ గ్రేడ్ టీచర్‌కు పదవీ విరమణ అనంతరం పెన్షన్ రూ.15,647 వస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదిత జీపీఎస్‌లో అయితే సెకండరీ గ్రేడ్ టీచర్‌కు పదవీ విరమణ అనంతరం రూ.25,856 పెన్షన్ రానుంది. అదే ఆఫీసర్ సబార్డినేట్ ఉద్యోగికి ప్రస్తుత సీపీఎస్‌లో పదవీ విరమణ అనంతరం రూ.9,579 పెన్షన్ వస్తుండగా, అదే ఉద్యోగికి ప్రతిపాదిత జీపీఎస్‌లో రూ.15,829 పెన్షన్ రానుంది. రాష్ట్ర జనాభా, భవిష్యత్ తరాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని జీపీఎస్‌ను ప్రతిపాదించినట్లు ఆర్థిక శాఖ పేర్కొంది. ఆచరణ సాధ్యం కాకే.. సీపీఎస్‌తో ఉద్యోగులతోపాటు వివిధ ఉద్యోగ సంఘాలు కోరుతున్న మేరకు పాత పెన్షన్ పథకాన్ని వర్తింప చేయడం రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఆచరణ సాధ్యం కాదని ఆర్థిక శాఖ గణాంకాలతో సహా వివరించింది. ఇప్పటికే ఉద్యోగుల వేతనాలు, పెన్షన్ల వ్యయం రాష్ట్ర సొంత ఆదాయంలో చాలా ఎక్కువగా ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో పాత పెన్షన్ పథకాన్ని సీపీఎస్ ఉద్యోగులకు వర్తింపచేయడం అసాధ్యమని వెల్లడించింది. ఆర్థిక పరిస్థితులే ఇందుకు కారణమని తెలిపింది. ప్రస్తుతం సీపీఎస్ ఉద్యోగుల 20 శాతం కంట్రిబ్యూషన్ కొనసాగిస్తూ పాత పెన్షన్ పథకం వర్తింపచేస్తే 2100 నాటికి ఉద్యోగుల వేతనాలు, పెన్షన్ల వ్యయం రూ.21,88,047 కోట్లు అవుతుందని వివరించింది. ఇది రాష్ట్ర సొంత ఆదాయంలో 119 శాతంగా ఉంటుందని పేర్కొంది. అంతేకాకుండా రాష్ట్ర రాబడిలో తప్పనిసరి వ్యయం ఏకంగా 395 శాతం పెరుగుతుందని అంచనా వేసింది. ప్రస్తుతం 20 శాతం కంట్రిబ్యూషన్ లేకుండా సీపీఎస్ ఉద్యోగులకు పాత పెన్షన్ స్కీమ్ వర్తింపచేస్తే 2100 నాటికి వేతనాలు, పెన్షన్ల వ్యయం రూ.22,81,207 కోట్లు అవుతుందని తెలిపింది. ఇది రాష్ట్ర సొంత ఆదాయంలో 124 శాతమని వెల్లడించింది. కాగా, రాష్ట్ర రాబడిలో తప్పనిసరి వ్యయం 446 శాతం మేర పెరుగుతుందని ఆర్థిక శాఖ అంచనా వేసింది. జీపీఎస్ వల్ల మేలు ఉద్యోగులకు ఇబ్బందులు లేకుండా చేయాలని ప్రభుత్వం చూస్తోంది. కరోనా, రాష్ట్ర ఆదాయం తగ్గడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితుల్లో ఉద్యోగులుగా మనం ప్రభుత్వం గురించి కూడా కొంత ఆలోచించాలి. ప్రతిదానిపై వ్యతిరేకంగా ఆలోచించడం సరికాదు. ప్రభుత్వానికి ఉద్యోగులపై కక్ష ఉండదు. జీపీఎస్ వల్ల ఉద్యోగులకు మేలు జరుగుతుంది. మన గురించి ఆలోచించే ప్రభుత్వానికి సహకరించడం మంచిది. – కళ్లేపల్లి మధుసూదనరాజు, అధ్యక్షుడు, రాష్ట్ర గ్రంథాలయ సంస్థల ఉద్యోగుల సంఘం జీపీఎస్‌ను ఆహ్వానిస్తున్నాం.. మెజారిటీ రాష్ట్రాల్లో సీపీఎస్ అమలవుతోంది. అయితే తన పాదయాత్రలో ఇచ్చిన హామీ ప్రకారం సీఎం వైఎస్ జగన్ జీపీఎస్‌ను ప్రతిపాదించారు. పాత పెన్షన్ విధానంలో బేసిక్‌పై 50 శాతం పెన్షన్ ఇచ్చేవారు. జీపీఎస్ కింద ఇప్పుడు 33.5 శాతం పెన్షన్ ఇస్తామనే ప్రతిపాదన చాలా బాగుంది. ఉద్యోగులు రిటైర్ అయ్యాక మంచిగా ఉండాలని తాను ఆలోచిస్తున్నట్లు పీఆర్సీ ప్రకటించే సమయంలోనే సీఎం ఉద్యోగ సంఘాలతో చెప్పారు. సీపీఎస్ విషయంలో బాధపడుతున్న ఉద్యోగులకు 33.5 శాతం పెన్షన్ గ్యారంటీ ఆహ్వానించదగ్గ విషయం. – కె.జాలిరెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు, వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ -
ఈపీఎఫ్‌వో సభ్యులకు శుభవార్త..! భారీగా పెరగనున్న పెన్షన్..! ఎంతంటే..?
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఉద్యోగులకు భారీ ప్రయోజనాలను కల్పించే ప్రణాళికతో ముందుకు వస్తోంది. రానున్న రోజుల్లో ఉద్యోగుల కనీస నెలవారీ పెన్షన్ మొత్తాన్ని పెంచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరిలో జరిగే సమావేశంలో కార్మిక , ఉపాధి మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకోనుంది. రూ. 9000 వరకు పెంపు..! ఉద్యోగుల పెన్షన్ స్కీమ్‌లో భాగంగా అసంఘటిత రంగ ఉద్యోగుల నెలవారీ పెన్షన్‌ను రూ.1,000 నుంచి రూ.9,000 పెంచేందుకు కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ సమాయాత్తం అవుతున్నట్లు తెలుస్తోంది. పెన్షన్ పెంపుపై ఇప్పటికే పలు సార్లు చర్చలు జరిగాయి. పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సిఫార్సులను దృష్టిలో ఉంచుకుని పెన్షన్‌పై నిర్ణయం తీసుకొనుంది. అంతకుముందు ఈ కమిటీ మినిమం పెన్షన్‌ను రూ.1000 నుండి రూ.3000కు పెంచాలని మార్చి 2021లో పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ రికమండ్ చేసింది. అయితే కనీస పెన్షన్ రూ.9000కు పెంచితేనే ఈపీఎస్-95 పెన్షనర్లకు నిజమైన బెనిఫిట్ లభిస్తుందని భావిస్తున్నారు. ఫిబ్రవరిలో జరిగే సమవేశంలో కొత్త వేతన నియమావళి అమలు, (ఈపీఎస్) ఉద్యోగుల పెన్షన్ పథకం కింద కనీస పెన్షన్ వంటి రెండు ముఖ్యమైన అంశాలపై సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఉద్యోగి చివరి నెల జీతంపై..! ఉద్యోగి లేదా కార్మికుడి చివరి నెల వేతనం ఆధారంగా పెన్షన్‌ను ఖరారు చేయాలనే సూచన కూడా వచ్చింది. ఈ సూచనతో పాటు ఎంప్లాయీస్ పెన్షన్ స్కీం కింద కొత్త వేతన కోడ్ అమలు తదితర ముఖ్య అంశాలపై కార్మిక శాఖ ఆధ్వర్యంలో జరిగే ఈపీఎఫ్ఓ బోర్డు భేటీలో చర్చకు రావొచ్చునని తెలుస్తోంది. చదవండి: ఆదాయ పన్ను చెల్లింపుదారులకు కేంద్రం తీపికబురు..! -
లైఫ్ సర్టిఫికెట్ సమర్పణకు గడువు పెంపు
సాక్షి, న్యూఢిల్లీ: పింఛనుదారులు తమ లైఫ్ సర్టిఫికెట్(జీవన్ ప్రమాణ్ పత్ర–జేపీపీ) సమర్పించే తుది గడువును వచ్చే ఫిబ్రవరి 28వ తేదీ వరకు పొడిగించినట్లు ఈపీఎఫ్‌వో తెలిపింది. ఆలోగా ఎప్పుడైనా ఇవ్వవచ్చని పేర్కొంది. కోవిడ్–19 కారణంగా జేపీపీ అందజేయలేకపోయిన సుమారు 35 లక్షల పింఛనుదారులకు ఇది ఉపకరిస్తుందని పేర్కొంది. నవంబర్ 30వ తేదీలోగా జేపీపీ సమర్పించని వారికి ఫిబ్రవరి వరకు పింఛను యథా ప్రకారం అందుతుందని స్పష్టం చేసింది. ఎంప్లాయీస్ పెన్షన్ స్కీం–1995 ప్రకారం పింఛను పొందుతున్న వారికి ఈ వెసులుబాటు వర్తిస్తుందని వివరించింది. జేపీపీ ఏడాదిపాటు అమల్లో ఉంటుందని తెలిపింది. -
రూ.వెయ్యి పింఛన్‌కు త్వరలో శ్రీకారం
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్‌వో) చందాదారులకు శుభవార్త. ఉద్యోగుల పింఛన్ పథకం(ఈపీఎస్-95) కింద... పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు కనీస పింఛన్ రూ. వెయ్యి అందించాలన్న పథకం త్వరలో అమలు కానుంది. ఐదు లక్షల మంది వితంతువులు సహా.. 28 లక్షల మంది పెన్షనర్లకు ఇది ప్రయోజనం చేకూర్చనుంది. ఈ పథకం ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రావాల్సి ఉన్నా ఎన్నికల నియమావళి వల్ల అది సాధ్యంకాలేదు. ఎన్నికలు పూర్తయినందున ఇప్పుడీ ఈ పథకాన్ని (ఈపీఎస్-95) అమలు చేయనున్నట్టు ఈపీఎఫ్ఓ అధికారి ఒకరు ఆదివారం తెలిపారు. ఇందుకోసం సన్నాహాలు చేస్తున్నట్టు వివరించారు.కనీస పింఛన్ కింద రూ.వెయ్యిని అందజేసేందుకోసం కేంద్రం ఈపీఎఫ్‌వోకు రూ.1,217 కోట్లను చెల్లించాల్సి ఉంటుంది. -
పింఛను స్కీం రిటైర్మెంట్ వయసు పెంపు!
ప్రతిపాదనను పరిశీలించనున్న ఈపీఎఫ్ఓ ట్రస్టీల బోర్డు న్యూఢిల్లీ: ఉద్యోగుల పింఛను పథకం పరిధిలోకి వచ్చే సంఘటిత రంగ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 58 నుంచి 60 ఏళ్లకు పెంచాలన్న ప్రతిపాదనను ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్ఓ) అత్యున్నత నిర్ణాయక మండలి అయిన ట్రస్టీల కేంద్ర మండలి(సీబీటీ) నెల 5న జరిగే సమావేశంలో పరిశీలించనుంది. కేంద్ర కార్మిక మంత్రి ఆస్కార్ ఫెర్నాండెజ్ నేతృత్వంలో జరిగే ఈ భేటీలో.. 20 ఏళ్ల సర్వీసు ఉన్న వారికి రెండేళ్ల బోనస్‌ను విత్‌డ్రా చేసుకోవడానికి అనుమతించాలన్న ప్రతిపాదనపైనా చర్చించనున్నారు. ప్రస్తుతం ఉద్యోగుల పింఛను పథకం(ఈపీఎస్-95) కింద చందాదారులు సభ్యత్వాన్ని వదులుకుని పింఛన్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. అంటే వారు 58 ఏళ్ల తర్వాత పథకంలో కొనసాగలేరు. అయితే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్, ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పథకాలకు చందాలు జమచేయడానికి ఎలాంటి వయోపరిమితి లేదని ఈపీఎఫ్ అధికారి ఒకరు తెలిపారు. ఈపీఎస్ వయోపరిమితిని 60 ఏళ్లకు పెంచితే 27 లక్షల మంది పింఛనుదారులకు లబ్ధి కలుగుతుంది. కార్మిక శాఖకు అందజేసిన మెమొరాండంలో ఆర్థిక శాఖ ఈ ప్రతిపాదనలను పొందుపరచింది. ఈపీఎస్ పథకం కింద కనీస పింఛనును రూ.1,000కి పెంచేందుకు ఆర్థిక శాఖ ఆమోదించడం తెలిసిందే.