అమల్లోకి సెంట్రలైజ్డ్ పెన్షన్ చెల్లింపుల వ్యవస్థ
న్యూఢిల్లీ: ‘ఉద్యోగుల పింఛను పథకం (ఈపీఎస్), 1995’ సభ్యులకు శుభవార్త. 68 లక్షల పెన్షనర్లు ఇక మీదట ఏ బ్యాంక్‌లో అయినా పెన్షన్ పొందే అవకాశం అందుబాటులోకి వచ్చింది. అన్ని ఈపీఎఫ్‌వో ప్రాంతీయ కార్యాలయాల పరిధిలో కేంద్రీకృత పింఛను చెల్లింపుల వ్యవస్థ (సీపీపీఎస్)ను అమల్లోకి తీసుకువచ్చినట్టు కేంద్ర కార్మిక శాఖ ప్రకటించింది.
ఇప్పటి వరకు అమల్లో ఉన్న పింఛను పంపిణీ వ్యవస్థ కేంద్రీకృతమై లేదు. ప్రతి జోనల్/ప్రాంతీయ కార్యాలయ పరిధిలో సభ్యులకు పింఛను పంపిణీకి వీలుగా 3–4 బ్యాంకులతో ఒప్పందం చేసుకోవాల్సి వచ్చేది. సీపీపీఎస్ కింద లబ్ధిదారు ఏ బ్యాంకు నుంచి అయినా పెన్షన్ తీసుకోవచ్చని, పెన్షన్ ప్రారంభంలో ధ్రువీకరణ కోసం బ్యాంక్‌ను సందర్శించాల్సిన అవసరం ఉండదని కార్మిక శాఖ తెలిపింది. పెన్షన్‌ను మంజూరు చేసిన వెంటనే బ్యాంక్ ఖాతాలో జమ అవుతుందని పేర్కొంది.
పెన్షనర్ ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలివెళ్లినప్పటికీ, పెన్షన్ పేమెంట్ ఆర్డర్ (పీపీవో)ను ఒక ఆఫీస్ నుంచి మరో ఆఫీస్‌కు బదిలీ చేసుకోవాల్సిన అవసరం తప్పుతుందని వివరించింది. రిటైర్మెంట్ అనంతరం తమ స్వస్థలాలకు వెళ్లి స్థిరపడే పింఛనుదారులకు నూతన వ్యవస్థతో ఇబ్బందులు తొలగిపోనున్నాయి. సీపీపీఎస్‌ను అన్ని ఈపీఎఫ్‌వో ప్రాంతీయ కార్యాలయ పరిధిలో పూర్తి స్థాయిలో అమలు చేయడాన్ని చారిత్రక మైలురాయిగా కేంద్ర మంత్రి మన్‌సుఖ్ మాండవీయ వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment