
సాక్షి, హైదరాబాద్: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌వో) చందాదారులకు అధిక పెన్షన్ దరఖాస్తు గడువు ఈ నెల 11వ తేదీతో ముగుస్తోంది. క్షేత్రస్థాయి నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఇప్పటికే మూడుసార్లు దరఖాస్తుల గడువు పెంచిన నేపథ్యంలో.. ఇకపై పొడిగింపు ఉండదని ఈపీఎఫ్‌వో వర్గాలు చెప్తున్నాయి.
నిబంధనల సడలింపుతో దర ఖాస్తులు బాగా పెరిగాయని.. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 17.54 లక్షల మంది అధిక పెన్షన్ కోసం ఆన్‌లైన్‌లో ఆప్షన్ ఇచ్చుకు న్నారని తెలిపాయి. 26(6) పత్రాన్ని సమర్పించే విషయంలో వెసులుబాటు ఉద్యోగులకు ఊరట ఇచ్చిందని వివరించాయి. సోమ, మంగళవారాలు కూడా ఆప్షన్ ఇచ్చుకునే అవకాశం ఉందని, దీన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించాయి.
రెండు నెలల్లో పరిశీలన పూర్తి..
ఈపీఎఫ్‌వో అధిక పెన్షన్ పథకం కింద ఎంప్లాయీస్ పెన్షన్ స్కీం (ఈపీఎస్)కు అర్హత ఉన్న వారి నుంచి ఆప్షన్ స్వీకరిస్తోంది. దరఖాస్తుల ప్రక్రియ ముగిశాక వాటిని పరిశీలించేందుకు ఈపీఎఫ్‌వో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు. ఇందుకు సంబంధించి పరిశీలన అధికారులను ఈపీఎఫ్‌వో సన్నద్ధం చేస్తోందని వివరించారు. వారు ఆన్‌లైన్‌లో వచ్చిన దరఖాస్తులను నిశితంగా పరిశీలిస్తారు.
ఇందులో భాగంగా ఈపీఎఫ్‌వో అధికారులు ఉద్యోగికి, వారు పనిచేస్తున్న సంస్థ యాజమాన్యానికి నోటీసులు జారీ చేస్తారు. రికార్డులను పరిశీలిస్తారు. తర్వాత అధిక పెన్షన్ కింద చందా, బకాయిలకు సంబంధించిన అంశాలను వెల్లడిస్తూ.. చెల్లించేందుకు కొంత గడువు ఇస్తారు. ఈ ప్రక్రియకు కనీసం రెండు నెలలు పడుతుందని అధికారులు చెప్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment