అధిక వేతనాలపై పెన్షన్ కోసం ఆప్షన్‌ల ధ్రువీకరణ కోసం ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) గడువును మరోసారి పొడిగించింది. పెన్షన్ కోసం ఉద్యోగులు సమర్పించిన లక్షలాది దరఖాస్తులు యాజమాన్యాల దగ్గర పెండింగ్ ఉండటంతో గడువు పొడిగించే ప్రతిపాదనను ఈపీఎఫ్‌వో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఆమోదించింది.
అధిక వేతనాలపై పెన్షన్ కోసం ఆప్షన్ లేదా జాయింట్ ఆప్షన్‌ల ధ్రువీకరణ కోసం దరఖాస్తులను సమర్పించడానికి ఈపీఎఫ్‌వో గతంలో ఆన్‌లైన్ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. 2022 నవంబర్ 4 నాటి సుప్రీం కోర్ట్ ఆర్డర్‌కు అనుగుణంగా అర్హులైన పెన్షనర్లు/సభ్యుల కోసం 2023 ఫిబ్రవరి 26న ఈ సదుపాయాన్ని ప్రారంభించింది. 2023 మే 3 వరకు మాత్రమే ఇది అందుబాటులో ఉండగా ఉద్యోగుల అభ్యర్థన మేరకు గడువును మరో నాలుగు నెలలు అంటే 2023 జూన్ 26 వరకు పొడిగించింది.
ఆ తర్వాత 2023 జూలై 11 వరకు 15 రోజుల అవకాశం ఇచ్చింది. 2023 జూలై 11 నాటికి ఆప్షన్/జాయింట్ ఆప్షన్‌ల ధ్రువీకరణ కోసం పెన్షనర్లు/సభ్యుల నుంచి 17.49 లక్షల దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుదారు పెన్షనర్లు/సభ్యుల వేతన వివరాలను అప్‌లోడ్ చేయడానికి వ్యవధిని పొడిగించాలని ఎంప్లాయర్స్ & ఎంప్లాయర్స్ అసోసియేషన్‌ల నుంచి అభ్యర్థనలు రావడంతో యజమానులకు వేతన వివరాలను ఆన్‌లైన్‌లో సమర్పించడానికి 2023 సెప్టెంబరు 30 వరకు సమయం ఇచ్చింది. ఇది మళ్లీ 2023 డిసెంబర్ 31కి జరిగింది. ఆ తర్వాత కూడా ఆప్షన్/జాయింట్ ఆప్షన్‌ల ధ్రువీకరణ కోసం 3.6 లక్షల కంటే ఎక్కువ దరఖాస్తులు ప్రాసెసింగ్ కోసం యజమాన్యాల వద్ద ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి.
దీంతో ఈ మిగిలిన దరఖాస్తులను ప్రాసెస్ చేయడం కోసం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ మరో సారి సమయాన్ని పొడిగించే ప్రతిపాదనను ఆమోదించింది. 2024 మే 31 లోపు యాజమాన్యాలు తమ ఉద్యోగుల వేతన వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment