సాక్షి, హైదరాబాద్: అధిక పెన్షన్‌కు సంబంధించి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్‌ఓ) తలపెట్టిన జాయింట్ ఆప్షన్ నమోదు ప్రక్రియ గడువు ముగిసింది. ఇప్పటికే పలుమార్లు గడువును పొడిగిస్తూ... దాదాపు నాలుగున్నర నెలల పాటు కొనసాగిన అధిక పెన్షన్ ఆప్షన్ ప్రక్రియకు ఈనెల 11వ తేదీ అర్ధరాత్రితో తెరపడింది.
దేశవ్యాప్తంగా దాదాపు 19 లక్షల మంది అధిక పెన్షన్ కోసం ఆన్‌లైన్‌లో ఆప్షన్ ఇచ్చినట్లు ఈపీఎఫ్‌ఓ అధికారుల అంచనా. వీటికి సంబంధించిన పూర్తి గణాంకాలను ఈపీఎఫ్‌ఓ ఇంకా వెల్లడించలేదు. కాగా, గడువు ఇంకా పొడిగించాలంటూ చందాదారులు, యాజమాన్యాలు ఈపీఎఫ్‌ఓను కోరినప్పటికీ.. పొడిగింపుపై ఈపీఎఫ్‌ఓ ఎలాంటి ప్రకటన చేయలేదు.
అంతా గందరగోళం..: ఈపీఎఫ్‌ఓ తలపెట్టిన అధిక పెన్షన్ విధానంపై గందరగోళం చందాదారులను వీడలేదు. ఎంప్లాయీ పెన్షన్ పథకంలో భాగంగా అమలు చేయనున్న అధిక పెన్షన్ ఆప్షన్ చందాదారులందరికీ ఆసక్తి కలిగించింది. 2014 కంటే ముందు సర్వీసులో చేరి ఈపీఎస్ పథకం పరిధిలో ఉన్నవారికి మాత్రమే ఈ అధిక పెన్షన్ వర్తిస్తుంది. అయితే.. అధిక పెన్షన్‌కు దరఖాస్తు చేసుకునే క్రమంలో నిబంధనలన్నీ ఈపీఎఫ్‌ఓ కోడ్ భాషలో పేర్కొంటూ ఇచ్చిన సర్క్యులర్లు చందాదారుల దిమ్మతిరిగేలా చేశాయి.
ఈ నిబంధనలపై అవగాహన కలిగించడంలో ఈపీఎఫ్‌ఓ అధికారులు విఫలమయ్యారనే వాదనలొచ్చాయి. ఈపీఎఫ్‌ఓ కార్యాలయానికి ఎన్నిసార్లు వెళ్లినా దీనిపై సరైన సమాచారం ఇవ్వలేదంటూ చందాదారులు మండిపడ్డ దాఖలాలు అనేకం. దీంతో చాలామంది ఆప్షన్ ఇవ్వడానికి వేచిచూశారు. మరికొందరు ఆప్షన్ ఇవ్వడానికి వెబ్ లింకు తెరిస్తే.. అప్‌లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్లు, వివరాలను చూసి జడుసుకునే పరిస్థితి వచ్చింది.
యాజమాన్యాలు సైతం ఉద్యోగులకు ఎలాంటి సూచనలు చేయలేదనే విమర్శలున్నాయి. ఈ విషయమై ఈపీఎఫ్‌ఓ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకున్న దాఖల్లాలేవు. దీంతో గడువు తేదీ పొడిగింపు కోసం ఈపీఎఫ్‌ఓకు వినతులు వెల్లువెత్తాయి. కానీ ఇప్పటికే పలుమార్లు అవకాశం కల్పించామంటున్న అధికారులు... ఇక గడువును పొడిగించే అవకాశం లేదని సంకేతాలిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment