
సాక్షి, న్యూఢిల్లీ: పింఛనుదారులు తమ లైఫ్ సర్టిఫికెట్(జీవన్ ప్రమాణ్ పత్ర–జేపీపీ) సమర్పించే తుది గడువును వచ్చే ఫిబ్రవరి 28వ తేదీ వరకు పొడిగించినట్లు ఈపీఎఫ్‌వో తెలిపింది. ఆలోగా ఎప్పుడైనా ఇవ్వవచ్చని పేర్కొంది. కోవిడ్–19 కారణంగా జేపీపీ అందజేయలేకపోయిన సుమారు 35 లక్షల పింఛనుదారులకు ఇది ఉపకరిస్తుందని పేర్కొంది. నవంబర్ 30వ తేదీలోగా జేపీపీ సమర్పించని వారికి ఫిబ్రవరి వరకు పింఛను యథా ప్రకారం అందుతుందని స్పష్టం చేసింది. ఎంప్లాయీస్ పెన్షన్ స్కీం–1995 ప్రకారం పింఛను పొందుతున్న వారికి ఈ వెసులుబాటు వర్తిస్తుందని వివరించింది. జేపీపీ ఏడాదిపాటు అమల్లో ఉంటుందని తెలిపింది.