
సాక్షి, హైదరాబాద్: అధిక పెన్షన్(హయ్యర్ పెన్షన్) పథకం దరఖాస్తులకు సాంకేతిక చిక్కులు వీడడం లేదు. ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్‌ఓ) షరతులకు అనుగుణంగా అన్నిరకాల వివరాలను తీసుకుని ఆన్‌లైన్‌లో అధిక పెన్షన్ దరఖాస్తు సమర్పించినప్పటికీ మెజార్టీ అర్జీదారులకు సంబంధిత దరఖాస్తు స్థితి ప్రశ్నార్థకంగా మారింది.
ఆన్‌లైన్‌లో అన్ని వివరాలతో సమర్పించిన దరఖాస్తు ఎవరికి చేరిందో అర్థంకాని పరిస్థితి నెలకొంది. దీంతో అర్జీదారులు అటు కంపెనీ యాజమాన్యం వద్దకు, ఇటు రీజినల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్(ఆర్‌పీఎఫ్‌సీ) కార్యాలయాల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. అయినాసరే ఈ సమస్యకు యాజమాన్యం వద్ద, ఆర్‌పీఎఫ్‌సీ వద్ద సమాధానం దొరకడం లేదని అంటున్నారు.
నాలుగు స్థాయిల్లో ఫైలు...
భవిష్యనిధి చందాదారుల్లో అధిక పెన్షన్‌కు అర్హత ఉన్న వారంతా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి. పూర్తి వివరాలతో ఆన్‌లైన్ దరఖాస్తును పూరించి సరైన ఆధారాలను జతచేసి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన దరఖాస్తు వెంటనే కంపెనీ యూజర్ ఐడీ ఖాతాకు చేరుతుంది. అలా చేరిన దరఖాస్తును యాజమాన్యం పరిశీలించి అర్హతలను నిర్ధారించుకున్న తర్వాత ఆమోదిస్తుంది.
ఇలా ఉద్యోగి, కంపెనీ ఉమ్మడి ఆప్షన్ తర్వాత ఆ దరఖాస్తు సంబంధిత రీజినల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ లాగిన్‌కు చేరుతుంది. అక్కడ మరోమారు పరిశీలించిన అధికారులు ఈ దరఖాస్తును ఆమోదించిన తర్వాత సెంట్రల్ సర్వర్‌కు ఫార్వర్డ్ చేస్తారు.
ఇలా నాలుగు దశల్లో దరఖాస్తు ముందుకు కదులుతుంది. అయితే ఈపీఎఫ్‌ఓ వెబ్‌సైట్‌లో నెలకొన్న సాంకేతిక సమస్యలతో దరఖాస్తు దశ పూర్తిగా మారింది. ఆ దరఖాస్తు నేరుగా సెంట్రల్ సర్వర్‌కు చేరుతోంది. దీంతో కంపెనీ యాజమాన్యం, ఆర్‌పీఎఫ్‌సీ పరిధిలోకి రాకపోవడంతో వాటి పరిశీలన సందిగ్ధంలో పడుతోంది.
గడువు దాటితే అనర్హతే...
పీఎఫ్ చందాదారులు, పెన్షనర్లకు అధికపెన్షన్ అవకాశం ఇదే చివరిసారి. వచ్చే నెల 3వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో ఉమ్మడి ఆప్షన్ ఇవ్వడం తప్పనిసరి. ఆ తర్వాత ఉమ్మడి ఆప్షన్ ఇవ్వడానికి అవకాశం ఉండదు. భవిష్యత్తులో ఇక ఇలాంటి వెసులుబాటు ఉండదని ఇప్పటికే ఈపీఎఫ్‌ఓ తేల్చిచెప్పింది.
ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ఇప్పటికే 1.62లక్షల మంది అధిక పెన్షన్‌కు దరఖాస్తులు సమర్పించారు. మరో నెలరోజుల పాటు గడువు ఉండడంతో ఈ దరఖాస్తుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. అయితే ఈ దరఖాస్తులు సమర్పించిన వారిని ఇప్పుడు సాంకేతిక సమస్య తీవ్ర గందరగోళానికి గురిచేస్తోంది.
ఇప్పటికే సమర్పించిన దరఖాస్తులు నేరుగా సెంట్రల్ సర్వర్‌కు చేరడంతో అవి తిరిగి యాజమాన్యం, ఆర్‌పీఎఫ్‌సీకి చేరేదెలా అనే సందేహం నెలకొంది. మరోవైపు వచ్చే నెల 3వ తేదీలోగా ఉమ్మడి ఆప్షన్ పూర్తవుతుందా? లేదా? అనే ఆందోళన నెలకొంది.