
ఉద్యోగ భవిష్య నిధి(ఈపీఎఫ్) భారతదేశంలోని కోట్ల మంది వేతన జీవులకు కీలకమైన పొదుపు సాధనంగా ఉంది. ఇది ఆర్థిక భద్రతను, పదవీ విరమణ అనంతర ప్రయోజనాలను అందిస్తుంది. అయితే ఈపీఎఫ్‌లోని యువ చందాదారులు తమ మొత్తం ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) కార్పస్‌ను ముందస్తుగానే ఉపసంహరించుకుంటున్నట్లు అధికారులు గుర్తించారు. ఇటీవల ఈ ధోరణి మరింత పెరుగుతోందని తెలిపారు. ఇందుకుగల కారణాలను నిపుణులు విశ్లేషిస్తున్నారు.
అనిశ్చిత సమయాల్లో ఆర్థిక ఒత్తిడి
ఆర్థిక అనిశ్చితులు, కొవిడ్-19 మహమ్మారి వంటి సమయాల్లో చాలామందికి ఈపీఎఫ్ పొదుపు ఆసరాగా మారింది. ప్రస్తుతం పరిస్థితులు మెరుగుపడినా గతంలోని వైఖరినే చందాదారులు పాటిస్తున్నారు. చిన్నచిన్న అవసరాలకు కూడా పీఎఫ్ డబ్బును ఉపసంహరిస్తున్నారు. దాంతోపాటు ఇటీవల ఉద్యోగుల తొలగింపులు, జీతాల్లో కోతలు, పెరుగుతున్న ఖర్చుల కారణంగా తక్షణ ఆర్థిక అవసరాలను తీర్చడానికి ఈ పొదుపును వాడుతున్నారు.
జాబ్ మార్కెట్ అస్థిరత
యువ నిపుణులు తరచుగా ఉద్యోగాలు మారుతుంటారు. దాంతో ఖర్చుల కోసం పీఎఫ్ ఉపసంహరణలు చేస్తున్నారు. కొత్త ఉద్యోగంలో చేరినప్పుడు ఈపీఎఫ్ఓ ప్రవేశపెట్టిన ఆన్‌లైన్ అకౌంట్ బదిలీ విధానాలు అందుబాటులో ఉన్నప్పటికీ పాత కంపెనీకి అనుగణంగా ఉన్న పీఎఫ్‌ను ఉపసంహరించుకోవడం సులభమని భావిస్తున్నారు.
దీర్ఘకాలిక ప్రయోజనాలపై అవగాహన లేమి
దీర్ఘకాలిక పెట్టుబడి సాధనంగా ఈపీఎఫ్ ప్రాముఖ్యతను యువ చందాదారులు తక్కువగా అంచనా వేస్తున్నారు. వారిలో ఈపీఎఫ్ అందించే కాంపౌండెడ్ వడ్డీ, పన్ను ప్రయోజనాల గురించి పరిమిత అవగాహన ఉంది. ముందస్తు ఉపసంహరణలు స్వల్పకాలిక లక్ష్యాలకు ఆకర్షణీయంగా కనిపిస్తున్నప్పటికీ దీర్ఘకాలంలో సమకూరే రాబడులపై తీవ్ర ప్రభావం చూపుతాయి.
కొత్త పెట్టుబడుల అన్వేషణ
యువ చందాదారులు ఈపీఎఫ్ కార్పస్‌ను వ్యాపారాలు ప్రారంభించడానికి, ఉన్నత విద్యను అభ్యసించడానికి లేదా మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీలు వంటి ఇతర ఆర్థిక సాధనాల్లో పెట్టుబడి పెట్టడానికి అందుబాటులో ఉన్న డబ్బుగా చూస్తున్నారు. ఇవి స్వల్ప కాలంలో అధిక రాబడిని ఇచ్చే అవకాశం ఉంది.
అత్యవసర నిధి లేకపోవడం
కొంతమందికి అత్యవసర నిధి లేకపోవడం, తరచుగా వైద్య ఖర్చులు, వివాహ ఖర్చులు లేదా కుటుంబ బాధ్యతలను పూర్తి చేయడానికి సరిపడా డబ్బు కొరత ఏర్పడుతుంది. దాంతో పీఎఫ్ కార్పస్‌ను విత్‌డ్రా చేస్తున్నారు. ఎమర్జెన్సీ కార్పస్ అవసరంపై యువకులు సరైన అవగాహన పెంపొందించుకోవాలి.
ఉపసంహరణల కట్టడికి ఏమి చేయవచ్చు?
అవగాహన కార్యక్రమాలు: ఈపీఎఫ్ఓ, కంపెనీల యాజమాన్యాలు పీఎఫ్ పొదుపును నిలుపుకోవడం వల్ల కలిగే దీర్ఘకాలిక ప్రయోజనాల గురించి యువ చందాదారులకు అవగాహన కల్పించాలి.
ప్రోత్సాహకాలు అందించడం: పీఎఫ్ నిధులను ఎక్కువ కాలం కొనసాగించే చందాదారులకు ఆర్థిక ప్రోత్సాహకాలను ప్రవేశపెట్టేలా ప్రణాళికలు సిద్ధం చేయాలి.
సరళీకృత బదిలీ ప్రక్రియలు: ఆన్‌లైన్ వ్యవస్థలు ఉన్నప్పటికీ ఉద్యోగ మార్పుల సమయంలో పీఎఫ్ బదిలీ ప్రక్రియను మరింత సరళీకరించేలా చర్యలు తీసుకోవాలి.
ఎమర్జెన్సీ ఫండ్స్‌పై అవగాహన: అత్యవసర నిధి ప్రాముఖ్యతపై స్పష్టతనిచ్చే ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమాలు యువ చందాదారులు తమ పీఎఫ్ పొదుపును విత్‌డ్రా చేయకుండా కట్టడి చేయడంలో తోడ్పడుతాయి.
ఇదీ చదవండి: స్టార్‌లింక్ సర్వీసులపై స్పెక్ట్రమ్ ఫీజు?
పీఎఫ్ కార్పస్ ఉపసంహరించుకోవడం స్వల్పకాలిక ఉపశమనం కలిగించినప్పటికీ దీర్ఘకాలిక పరిణామాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఆర్థిక స్థిరత్వం, భవిష్యత్తు భద్రతకు ఈపీఎఫ్‌ను తాత్కాలిక వెసులుబాటుగా కాకుండా సంపద సృష్టించే సాధనంగా చూసేలా యువ చందాదారులను ప్రోత్సహించడం చాలా ముఖ్యం. అవగాహనను పెంపొందించడం, మెరుగైన మార్గాలు అన్వేషించడం ద్వారా ఈ ఉపసంహరణలను కట్టడి చేయవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment