![EPFO set to introduce ATM cards for its subscribers as part of EPFO 3.0 system expected to launch by June 2025](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/01/4/EPFO01.jpg.webp?itok=D0iIf-XM)
కోట్లాది మంది ఈపీఎఫ్‌ఓ(EPFO) చందాదారులు తమ పీఫ్ డబ్బును ఏటీఎం(ATM) ద్వారా విత్‌డ్రా చేసుకునేందుకు తేదీ ఖరారైంది. ఇందుకోసం ప్రభుత్వం కొత్తగా సాఫ్ట్‌వేర్ వ్యవస్థను ప్రారంభిస్తుందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ తెలిపారు. ఈ ఏడాదే ఈపీఎఫ్ఓ 3.0ను ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. ఈ కొత్త విధానం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) సభ్యుల సమస్యలను పరిష్కరించి, వారికి మెరుగైన సర్వీస్‌ను అందిస్తుందన్నారు. ఈపీఎఫ్‌ఓ ఏటీఎం కార్డులను జూన్ 2025 వరకు అందుబాటులోకి తీసుకొచ్చేలా కార్యాచరణ రూపొందించినట్లు మంత్రి పేర్కొన్నారు.
ఈపీఎఫ్ఓ ఏటీఎం కార్డు
ఈపీఎఫ్ఓ 3.0 వెర్షన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పీఎఫ్ చందాదారులకు ఏటీఎం కార్డులను జారీ చేస్తామని కేంద్ర మంత్రి మాండవీయ ధ్రువీకరించారు. ఉద్యోగులు ఈ ఏటీఎం కార్డు ద్వారా తమ ఈపీఎఫ్ పొదుపును సులభంగా పొందవచ్చన్నారు. తద్వారా అత్యవసర పరిస్థితుల్లో డబ్బు వెంటనే అందుకునేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. అందుకు సంబంధించి వెబ్‌సైట్, సిస్టమ్ అప్‌డేట్ల(Updates) ప్రారంభ దశను ఈ నెలాఖరులోగా ఖరారు చేస్తామని మాండవీయ పేర్కొన్నారు.
ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్
ఈపీఎఫ్‌వో సభ్యులను ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్స్ (ETF) పరిధికి మించి ఈక్విటీలలో పెట్టుబడి పెట్టడానికి అనుమతించే అవకాశాన్ని పరిశీలిస్తోంది. ఈ ప్రతిపాదిత మార్పు పీఎఫ్ ఖాతాదారులకు వారి ఫండ్‌లను మెరుగ్గా నిర్వహించడానికి, అధిక రాబడిని అందుకునేందుకు, పోర్ట్‌ఫోలియో డైవర్సిఫికేషన్‌కు వీలు కల్పిస్తుంది. ఇది ఆమోదం పొందితే డైరెక్ట్ ఈక్విటీ పెట్టుబడి సభ్యులకు తమ పెట్టుబడి వ్యూహాలను, ఆర్థిక వృద్ధిని పెంచుకోవడానికి కొత్త మార్గాన్ని అందిస్తుంది.
ఇదీ చదవండి: ప్రపంచంలో అధిక వేతనం ఈయనకే..!
ఏ బ్యాంకు నుంచైనా పెన్షన్
ఈపీఎఫ్‌వో పెన్షనర్ల కోసం గణనీయమైన మార్పులను అమలు చేస్తోంది. ఇటీవలి ఆదేశాల ప్రకారం.. పింఛనుదారులు అదనపు ధ్రువీకరణ లేకుండా తమ పెన్షన్‌ను దేశవ్యాప్తంగా ఏ బ్యాంకు నుంచి అయినా ఉపసంహరించుకునే వెసులుబాటు రానుంది.
Comments
Please login to add a commentAdd a comment