Atm Card
-
యాక్సిస్ బ్యాంక్ ఖాతాదారులకు శుభవార్త!
ఖాతాదారులకు యాక్సిస్ బ్యాంక్ శుభవార్త చెప్పింది. దేశంలోనే తొలిసారి ఫిన్‌టెక్ సంస్థ ఫైబ్(Fibe)తో కలిసి నెంబర్‌లెస్ క్రెడిట్ కార్డును లాంఛ్ చేసింది. చూడటానికి ఎలా ఉంటుందంటే? ప్రస్తుతం కస్టమర్లు వినియోగిస్తున్న అన్ని క్రెడిట్ కార్డ్లలలో 16 అంకెల నెంబర్, సీఈవో, కార్డుదారు పేరుతో పాటు ఇతర వివరాలు ఉంటాయి. కానీ యాక్సిస్ బ్యాంక్ - ఫైబ్ క్రెడిట్ కార్డ్‌పై పైన పేర్కొన్నట్లు కస్టమర్లకు సంబంధించిన ఎలాంటి సమాచారం ఉండదు. నెంబర్‌లెస్ క్రెడిట్ కార్డ్‌లో కేవలం ఒక చిప్ మాత్రమే ఉంటుంది. కార్డ్ వివరాలు కావాలంటే ఫైబ్ మొబైల్ యాప్‌లో లభ్యమవుతాయి. నెంబర్‌లెస్ క్రెడిట్ కార్డ్ ఎలా పనిచేస్తుందంటే? సైబర్ నేరాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. టెక్నాలజీని వాడుకుని నేరగాళ్లు, ప్రజలకు తెలియకుండానే వారి బ్యాంక్ అకౌంట్లలోని డబ్బులను దోచుకుంటున్నారు. దీంతో కస్టమర్ల శ్రేయస్సు కోసం ఈ నెంబర్‌లెస్ క్రిడెట్ కార్డ్‌ను వినియోగంలోకి తెస్తున్నట్లు యాక్సిస్ బ్యాంక్ కార్డ్ అండ్ పేమెంట్ అధినేత సంజీవ్ మోఘే తెలిపారు. ఈ కొత్త క్రెడిట్ కార్డ్‌తో వినియోగదారుల కార్డ్‌ల సమాచారం, వారి డేటా అగంతకులు సేకరించలేరని అన్నారు. బోలెడన్ని లాభాలు యాక్సిస్ బ్యాంక్ లాంచ్ చేసిన నెంబర్‌లెస్ క్రెడిట్ కార్డ్ వినియోగదారులు ఫుడ్ డెలివరీ, క్యాబ్ సర్వీస్, ఆన్లైన్ టికెటింగ్ వంటి సర్వీసుల వినియోగంలో 3 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ అందిస్తుంది. ఆన్లైన్,ఆఫ్‌లైన్ ట్రాన్సాక్షన్లలో 1 శాతం క్యాష్‌బ్యాక్ అందిస్తున్న యాక్సిస్ బ్యాంక్ తెలిపింది. ఈ రూపే క్రెడిట్ కార్డ్ సాయంతో యూపీఐ పేమెంట్స్ చేసుకోవచ్చు. దీంతో పాటు త్రైమాసికానికి నాలుగు డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంజ్‌లకు యాక్సెస్ చేయొచ్చు. రూ.400 నుంచి రూ.5000 వరకు పెట్రోల్, డీజిల్‌పై విధించే సర్‌ఛార్జీల నుంచి మినహాయింపు ఉంటుంది. అలాగే యాక్సిస్ డిన్నింగ్ డిలైట్ పేరుతో అదనపు ప్రయోజనాల్ని అందిస్తుంది. మీరు నంబర్‌లెస్ కార్డ్‌ని ఎక్కడ పొందవచ్చు? ఫైబ్ యాప్‌లో కస్టమర్లకు ఈ కార్డ్ అందుబాటులో ఉంటుందని ఆ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. కొత్త యాక్సిస్ బ్యాంక్-ఫైబ్ కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్‌లో జీరో జాయినింగ్ ఫీజు, జీవితకాలం జీరో వార్షిక రుసుము ఉంటుందని యాక్సిస్ బ్యాంక్ తన కస్టమర్లకు తెలిపింది. -
ఎస్బీఐ కస్టమర్లకు అలర్ట్! ఏటీఎం కార్డు వాడట్లేదా? అయితే...
ప్రస్తుతం యూపీఐ వినియోగం ఎక్కువైంది. ఎక్కడ డబ్బు చెల్లించాలన్న ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం వంటి యూపీఐ యాప్‌ల ద్వారానే అన్ని చెల్లింపులు చేస్తున్నారు. ఈ క్రమంలో ఏటీఎం వాడకం బాగా తగ్గిపోయింది. ఇక రెండు మూడు కార్డులున్న వారి సంగతి చెప్పనక్కర్లేదు. అయితే ఎప్పుడోకానీ ఏటీఎం కార్డులు వాడని వారికి ఇబ్బందులు తప్పడం లేదు. సాధారణంగా డెబిట్ కార్డు గడువు ముగిసిన తర్వాత బ్యాంకులు ఆటోమేటిక్‌గా కొత్త ఏటీఎం కార్డును పోస్ట్ ద్వారా కస్టమర్ల చిరునామాకు పంపుతాయి. కానీ ఓ ఎస్బీఐ కస్టమర్‌కు విభిన్న అనుభవం ఎదురైంది. దీనిపై ఆ కస్టమర్ ఇటీవల సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. (ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం యూజర్లకు గుడ్‌న్యూస్! ఇకపై మరింత..) ఆ కస్టమర్‌కు ఎస్బీఐలో 10 సంవత్సరాలుగా అకౌంట్ ఉంది. అతని డెబిట్ కార్డ్ గడువు ఇటీవలే ముగిసింది. కొత్త ఏటీఎం కార్డు ఆటో మేటిక్‌గా పోస్టులో ఇంటికి రావాల్సిఉండగా అతనికి బ్యాంక్ కొత్త ఏటీఎం కార్డును పంపలేదు. దీంతో బ్యాంక్ బ్రాంచికి వెళ్లిన అతనికి కొత్త కార్డు కావాలంటే మరోసారి దరఖాస్తు చేసుకోవాలని బ్యాంకులు అధికారులు చెప్పారు. ఇదీ చదవండి: బాస్మతి బియ్యంపై కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు.. దీంతో ఎక్స్ (ట్విటర్)లో ఎస్బీఐ యాజమాన్యాన్ని ట్యాగ్ చేస్తూ ఫిర్యాదు చేయగా ఎస్బీఐ స్పందించింది. కొత్త ఏటీఎం కార్డు ఎందుకు రాలేదో కారణాలను వివరించింది. కార్డు గడువు ముగిసేందుకు మూడు నెలల ముందే అప్రమత్తం కావాలని సూచించింది. కొత్త కార్డు ఆటోమేటిక్‌గా రావాలంటే.. ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ అకౌంట్ అయి ఉండకూడదు. డెబిట్ కార్డును ఏడాదిలో కనీసం ఒక్కసారైనా వాడి ఉండాలి. అకౌంట్‌కు కస్టమర్ పాన్ నంబర్ తప్పనిసరిగా లింక్ అయి ఉండాలి. -
ఎస్బీఐ కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త.. చేతిలో ఫోనుంటే చాలు
దేశీయ ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. వినియోగదారుల కార్యకలాపాల్ని మరింత సులభతరం చేసేందుకు యోనో యాప్‌లో ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూనే ఉంది. తాజాగా యోనో యాప్‌లో యూపీఐ కార్యకలాపాలు నిర్వహించే సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. దీంతో కస్టమర్లు స్కాన్ అండ్ పే, పే బై కాంటాక్ట్స్, రిక్వెస్ట్ మనీ వంటి సర్వీసుల్ని వినియోగించుకోవచ్చు. అంతేకాదు చేతిలో ఏటీఎం కార్డ్ లేకుండా యోనో యాప్‌లో క్యూఆర్‌కోడ్‌ను స్కాన్ చేసి ఏటీఎం నుంచి డబ్బుల్ని డ్రా చేసుకోవచ్చు. ఎస్బీఐ 68వ వార్షికోత్సవం సందర్భంగా తాజాగా ఈ అప్డేట్లు చేసింది. ఇతర బ్యాంకుల కస్టమర్లు కూడా యోనో యాప్ ద్వారా సేవలు పొందొచ్చు. ఎస్బీఐ ఇంటర్ ఆపరేబుల్ కార్డ్ లెస్ క్యాష్ విత్ డ్రాయల్ చేసుకోవచ్చు. ఈ కొత్త క్యాష్ విత్ డ్రాయల్ సర్వీసుల ద్వారా ఇతర బ్యాంకుల కస్టమర్లు సైతం బెనిఫిట్ పొందవచ్చు. వీటితో పాటు ట్రాన్సాక్షన్లు, షాపింగ్‌లు ఇతర చెల్లింపులు సైతం ఈ యోనో యాప్‌లో చేసుకునే వెసలు బాటు కల్పిస్తున్నట్లు ఎస్బీఐ అధికారికంగా ప్రకటించింది. మరి యూపీఐ వినియోగంతో ఎంత సర్వీస్ ఛార్జీలు వసూలు చేస్తుందనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. చదవండి : ‘జీవితాంతం రుణ పడి ఉంటా’.. ఆనంద్ మహీంద్రా భావోద్వేగం! -
ఏటీఎం కార్డు లేకున్నా డిజిటల్ చెల్లింపులు బిగ్ బజార్ కోసం అంబానీ, అదానీ పోటీ
-
ఏటీఎం కార్డు పోతే ఇలా చేయండి..!
ప్రస్తుతం చాలా మంది వారి జీవితంలో ఏటీఎం కార్డులను ఎక్కువగా ఉపయోగిస్తారు. ఏటీఎం ద్వారా డబ్బు విత్ డ్రా చేయడంతో పాటు డిపాజిట్ చేయడం వంటి పనులు చాలా తేలిక అవుతున్నాయి. లావాదేవీల కోసం ఎక్కువగా వాడే ఏటీఎం కార్డు పోతే మాత్రం ఇక అంతే సంగతులు. ఎందుకంటే ఏటీఎం నుంచి డబ్బులు ఇతరులు తీసుకునే ఆస్కారం ఎక్కువ. అందుకే ఒకవేల మీ డెబిట్ కార్డు ఎక్కడైన పోతే వెంటనే ఈ క్రింద చెప్పిన విదంగా చేయండి. 1. ఇంటర్నెట్ బ్యాంకింగ్ మీ ఖాతాకు కనుక ఇంటర్నెట్ సదుపాయం ఉంటే చాలా మంచింది. దీని ద్వారా మీ కార్డును క్షణాలలో బ్లాక్ చేయవచ్చు. కార్డును బ్లాక్ చేయడానికి మొదట ఇంటర్నెట్ బ్యాంకింగ్‌కు వెళ్లి లాగిన్ అవ్వండి. ఆ తర్వాత డెబిట్ కార్డ్ ఆప్షన్ ఎంపిక చేసుకోండి. ఇక్కడ మీరు పోయిన డెబిట్ కార్డ్ నంబర్‌ను వివరాలు సమర్పించండి. ఇప్పుడు బ్లాక్ యువర్ డెబిట్ కార్డ్ ఎంపికపై క్లిక్ చేయడం ద్వారా మీ కార్డును బ్లాక్ చేయవచ్చు. కార్డు బ్లాక్ చేయడం వల్ల ఎవరూ మీ డబ్బును తీసుకోలేరు. 2. మొబైల్ బ్యాంకింగ్ యాప్ మీరు మొబైల్ బ్యాంకింగ్ యాప్ సహాయంతో మీ కార్డును బ్లాక్ చేయవచ్చు. ఇందుకోసం మీ బ్యాంక్ యాప్‌ను మొబైల్లో ఓపెన్ చేయండి. ఇప్పుడు మీకు కార్డ్ ఆప్షన్‌కు వెళ్లి మీ డెబిట్ కార్డును బ్లాక్ చేసే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. అప్పుడు మీ డెబిట్ కార్డు బ్లాక్ అవుతుంది. 3. హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేయండి మీరు బ్యాంక్ హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేయడం ద్వారా కూడా మీ ఏటీఎం కార్డును బ్లాక్ చేయవచ్చు. హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేసిన తర్వాత మీ ఏటీఎం, బ్యాంక్ ఖాతా నంబర్ వివరాలు పేర్కొనాలి. మీరు చివరిగా డబ్బులు ఎప్పుడు తీశారో తెలియజేయాల్సి ఉంటుంది. ధృవీకరణ తర్వాత మీ కార్డ్ బ్లాక్ చేయబడుతుంది. 4. ఎఫ్ఐఆర్ దాఖలు చేయండి మీ ఏటీఎం కార్డు ఎవరైనా దొంగలించినట్లు మీకు అనిపిస్తే వెంటనే ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలి. దీనికోసం మీరు కార్డు దొంగతనం జరిగిన సమీప పోలీసు స్టేషన్‌కు వెళ్లి నివేదించాలి. ఎఫ్ఐఆర్ కాపీ రిజిస్టర్ చేసిన తర్వాత మీకు ఇస్తారు. ఈ కాపీని భవిష్యత్ ఉపయోగం కోసం ఉంచాలి. చదవండి: 2020లో భారీగా పెరిగిన డిజిటల్ మోసాలు -
వామ్మో..ఏటీయమ్‌లో కేటుగాడు!
వైరా: ఆంధ్రా(యూనియన్) బ్యాంక్ ఏటీఎంకు నగదు కోసం వెళ్లిన ఓ వ్యక్తి మోసానికి గురైన సంఘటన వైరాలో చోటుచేసుకుంది. స్థానిక పాతబస్టాండ్ సెంటర్లోని ఓ ఫొటో స్టూడియో యజమాని జనార్దన్ బుధవారం ఆంధ్రాబ్యాంక్ ఏటీఎంలో నగదు డ్రా చేసేందుకు వెళ్లాడు. ఏటీఎంలో కార్డు ఉంచి పిన్ నంబర్ కొట్టడంతో ఎర్రర్ అని చూపింది. దీంతో పిన్ నంబర్ కోసం తన భార్యకు ఫోన్ చేసి మాట్లాడుతున్నాడు. అప్పటికే ఏటీఎంలో మాటు వేసి ఉన్న ఓ ఆగంతకుడు తన చేతిలోని కార్డును మిషన్‌లో ఉంచి, జనార్దన్ కార్డు తీసుకున్నాడు. ఇది గమనించని జనార్దన్.. మిషన్‌లో ఉన్న కార్డు తీసుకుని వెళ్లిపోయాడు. అదే రోజు సాయంత్రం 6.30 సమయంలో అగంతకుడు మరో ఏటీఎం నుంచి రూ. 20 వేలు డ్రా చేశాడు. నగదు డ్రా చేసినట్లు సెల్‌ఫోన్‌కు మెసేజ్ రావడంతో ఆందోళన చెందిన జనార్దన్ తక్షణమే పోలీసులకు ఫిర్యాదు చే«శాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: మహిళకు మధ్య వేలు చూపించి అసభ్యంగా.. -
ఏటీఎం కార్డుల క్లోనింగ్ ముఠా అరెస్ట్
నెల్లూరు (క్రైమ్): ఏటీఎం కార్డులు క్లోనింగ్ చేసి నగదు కాజేస్తున్న అంతర్ రాష్ట్ర ముఠాను నెల్లూరు పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి స్కిమ్మింగ్ మెషిన్, కార్డ్ రీడర్, ల్యాప్‌టాప్, కారుతోపాటు రూ.7.04 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి ఎస్పీ ఐశ్వర్య రస్తోగి శుక్రవారం వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. హర్యానా రాష్ట్రంలోని భివానీ జిల్లా భవానీకేడ తాలూకా బార్శి గ్రామానికి చెందిన సందీప్‌కుమార్ 8వ తరగతి వరకు చదువుకున్నాడు. అతనికి సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు ఉంది. ఏటీఎం కేంద్రాల వద్ద వృద్ధులు, నిరక్షరాస్యులతో మాటలు కలిపి వారి డెబిట్ కార్డులను తీసుకుని స్కిమ్మింగ్ మెషిన్ ద్వారా స్కాన్ చేసి కార్డులో ఉండే డేటాను బ్లూటూత్ ద్వారా తన ఫోన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకునేవాడు. అనంతరం కార్డ్ రీడర్ ద్వారా నకిలీ కార్డులోకి ఆ డేటాను ట్రాన్స్ఫర్ చేసి దాని సాయంతో ఏటీఎం కేంద్రాల్లో నగదును డ్రా చేసేవాడు. తన సోదరుడు మంజీత్, బంధువైన జగ్జీత్ కలిసి ఏడాదిన్నర కాలంగా తమిళనాడు, కర్ణాటక, గోవా, ఒడిశా, పశ్చిమ బెంగాల్, బీహార్, రాజస్థాన్, హిమాచల్‌ప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సుమారు వెయ్యికి పైగా నేరాలకు పాల్పడ్డాడు. నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖపట్నం, అనంతపురం, గుంటూరు, కర్నూలు, ప్రకాశం, వనపర్తి, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో 49 చోట్ల ఇతరుల కార్డుల్ని క్లోన్ చేసి ఏటీఎంల నుంచి నగదు డ్రా చేశాడు. ఈ ముఠా ఒక్క నెల్లూరులోనే 16 నేరాలు చేయడంతో టాస్క్‌ఫోర్స్ బృందం, దర్గామిట్ట పోలీసులు నిఘా పెట్టారు. నిందితులు నెల్లూరు ప్రధాన రైల్వేస్టేషన్ పడమర వైపున గల ఏటీఎం కేంద్రం వద్ద ఉన్నారనే సమాచారం అందుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. -
కార్డు ఇక్కడ.. డబ్బు డ్రా చేసింది వైజాగ్‌లో..
ఆత్మకూరు: ఏటీఎం కార్డు తన వద్ద ఉండగా ఖాతాలోని నగదు రూ.40 వేలు డ్రా చేసినట్లుగా ఫోన్‌కు సమాచారం అందడంతో బాధితుడు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన బుధవారం మున్సిపల్ పరిధిలో చోటుచేసుకుంది. బాధితుడి వివరాల మేరకు.. మున్సిపల్ పరిధిలోని వెంకట్రావుపల్లి గ్రామానికి చెందిన బేల్దారి పనులు చేసే బడే వీరరాఘవులురెడ్డికి స్టేట్ బ్యాంకులో ఖాతా ఉంది. ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం అతని బ్యాంకు ఖాతా నుంచి తొలుత రూ.20 వేలు ఏటీఎంలో డ్రా చేసినట్లు, అనంతరం కొద్దిసేపటికే మరో రూ.20 వేలు వేరొకరి ఖాతాలోకి బదిలీ అయినట్లు ఫోన్ ద్వారా సమాచారం అందింది. ఆలస్యంగా చూసుకున్న వీరరాఘవులురెడ్డి బ్యాంక్ అధికారులను సంప్రదించగా అతని ఖాతా నుంచి రెండు విడతలుగా రూ.40 వేలు (ఏటీఎం ద్వారా, బదిలీ రూపంలో) వైజాగ్‌లో డ్రా చేసినట్లు అధికారులు ధ్రువీకరించారు. నగదు ఆ ఖాతా నుంచి కొద్దినిమిషాలకే ఛత్తీస్‌ఘడ్‌లోని మరొకరి బ్యాంక్ ఖాతాలోకి బదిలీ అయినట్లు బ్యాంక్ అధికారులు గుర్తించి బాధితుడికి సమాచారం చెప్పారు. ఏటీఎం కార్డు తన వద్ద ఉండగానే తన ప్రమేయం లేకుండా ఖాతా నుంచి నగదు ఎలా మాయమవుతుందని బాధితుడు ప్రశ్నించారు. ఈ విషయమై ఉన్నతాధికారులకు తెలియజేస్తామని, పోలీసులకు ఫిర్యాదు చేయాలని బ్యాంకు అధికారులు వారికి తెలిపారు. దీంతో బుధవారం ఎస్సై పి.నరేష్‌కు బాధితుడు ఫిర్యాదు చేశాడు. సైబర్ నేరం కింద కేసు నమోదు చేసి విచారిస్తామని ఎస్సై వెల్లడించారు. -
చిప్‌లేని కార్డులకు ఇక చెల్లు
కడెం(ఖానాపూర్): ‘ఈఎంవీ’ చిప్ లేని ఏటీఎం డెబిట్, క్రెడిట్ కార్డులు డిసెంబర్ 31 తర్వాత పనిచేయవని రిజర్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. గతంలో జారీచేసిన మాగ్నటిక్ పూత(స్రి ్టఫ్)కల్గిన ఏటీఎం కార్డులతో ఆన్లైన్ మోసాలు జరుగుతున్న నేపథ్యంలో కార్డులను పూర్తిగా బ్యా న్ చేసి చిప్ కలిగిన నూతన ఏటీఎం కార్డులను వినియోగాదారులకు అందివ్వనుంది. ఆన్లైన్ మోసాలను అరికట్టేందుకే.. 2016 వరకు దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు చిప్ లేని డెబిట్, క్రెడిట్ కార్డులను అం దజేశాయి. ప్రస్తుత కాలంలో ఎక్కడ చూసినా ఏటీ ఎం కార్డుల క్లోనింగ్ ద్వార మోసాలు పెరిగిపోతున్నాయి. సైబర్ నేరగాళ్ల నుంచి ఖాతాదారుల డ బ్బును కాపాడేందుకు మాగ్నటిక్ స్ట్రిఫ్తో పాటు, అదనంగా ఈవీఎం చిప్ కలిగిన కార్డులు అవసర మని బ్యాంకింగ్ సంస్థలు భావించాయి. దీంతో ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల ఖాతాదారులకు హా ్యక్ కాకుండా ఉండేందుకు ఈచర్యలు తీసుకుంటున్న ట్లు ఆర్బీఐ స్పష్టం చేసింది. ఈఎంవీతో సేఫ్.. యూరో, మాస్ట్రో, విసా (ఈ.ఎం.వీ) చిప్ కల్గిన ఏటీఎం కార్డుల ద్వారా సమాచా రం హ్యక్ కాకుండా సురక్షితంగా ఉంటుంది. గతంలో బ్యాంకులు జా రీ చేసిన మాగ్నటిక్ స్ట్రిఫ్ కార్డుల ద్వారా క్లోనింగ్ చేసి సైబర్ నేరగాళ్లు ఈజీగా ఖాతాల నుంచి నగదు దోపిడీకి పాల్పడుతున్నారు. కొత్తగా వచ్చిన ఈవీ ఎం కార్డులను ఈ విధంగా చేసేందుకు వీ లుండదు. ఎందుకంటే ప్రతి లావాదేవీకి ఒక వ ర్చువల్ కీ జనరేట్ కావడం వల్ల క్లోనింగ్ చేసేం దుకు ఆస్కారం ఉండదు. కొత్త కార్డులు జారీ మాగ్నటిక్ స్ట్రిఫ్ గల పాత ఏటీఎం కార్డులున్న ఖాతాదారులకు ఆయా బ్యాంకులు వాటి స్థానం లో చిప్ ఉన్న నూతన ఏటీఎం కార్డులను జారీచేస్తున్నాయి. దీనికి ఎలాంటి దరాఖాస్తులు అవస రం లేదని, ఆటోమెటిక్‌గా కార్డులు పోసు ్టద్వారా ఖాతాదారులకు అందిస్తున్నట్లు అధికారులు పే ర్కొన్నారు. అడ్రస్‌లలో తప్పులు, ఇతర కారణాల వల్ల కొత్త కార్డులు అందనివారు బ్యాంకు అధికారులను సంప్రదించాలని అధికారులు కోరుతున్నారు. కార్డులు జారీ చేస్తున్నాం పాత మాగ్నటిక్ కార్డులు కలిగిన ఖాతాదారులకు వాటిస్థానంలో కొత్తగా చిప్ కలిగిన ఏటీఎం కార్డులు అందుతాయి. ఖాతాదారుల చిరునామాల్లో తప్పులు, తదితర కారణాలతో కార్డులు అందనివారు బ్యాంక్ అధికారులను సంప్రదించాలి. – నర్సయ్య, మేనేజర్, ఎస్బీఐ, లింగాపూర్ -
క్యూఆర్ కార్డులంటే ఏమిటి ?
గ్రామీణ ప్రాంత ప్రజలకి కూడా ఇంటి ముంగిట్లో బ్యాంకింగ్ సేవలను అందించే ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించిన తపాలా బ్యాంకులు (ఐపీపీబీ) పనితీరుని సులభం చేసే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూనే సులభతరంగా అన్ని పనులు పూర్తి అయ్యే చర్యలు చేపడుతున్నాయి. ఇందులో బాగంగానే తపాలా బ్యాంకు ఖాతాదారులకు ఏటీఎం, డెబిట్ కార్డులకి బదులుగా క్యూఆర్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించాయి. అసలు క్యూఆర్ కార్డులంటే ఏమిటి ? అవెలా పని చేస్తాయి ? క్యూఆర్ కార్డులంటే ... క్విక్ రెస్సాన్స్‌కు సంక్షిప్త నామమే క్యూఆర్.. ఈ కార్డులకి సాధారణ ఏటీఎంల మాదిరిగా పిన్ నెంబర్లు, పాస్వర్డ్లు ఉండవు. బయోమెట్రిక్ నిర్ధారణ ద్వారా ఈ కార్డులు పనిచేస్తాయి. తపాలా బ్యాంకులు మంజూరు చేసిన ఈ కార్డుల్లో క్యూఆర్ కోడ్ లేదా బార్ కోడ్ ప్రింట్ చేసి ఉంటుంది. ఈ కోడ్ ద్వారా ఐపీపీబీ ఖాతాదారుల్ని గుర్తించవచ్చు. స్మార్ట్ఫోన్లు, మైక్రో ఏటీఎం, పోస్ట్మ్యాన్లు ఇంటికి తీసుకువచ్చే పరికరాల ద్వారా కూడా క్యూఆర్ కోడ్‌ని వినియోగించి ఖాతాదారుల్ని గుర్తించవచ్చు. క్యూఆర్ కోడ్ ద్వారా ఒకసారి ఖాతాదారుడిని గుర్తించే పని పూర్తవగానే బయోమెట్రిక్ డేటా ద్వారా పోస్టుమ్యాన్లు మిగిలిన తనిఖీ పూర్తి చేస్తారు. రెండు అంచెల తనిఖీ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత ఈ క్యూఆర్ కార్డుల్ని వినియోగించుకోవచ్చు. బయోమెట్రిక్ విధానం ద్వారా తనిఖీ పూర్తయితే ఖాతాదారులు తమ లావాదేవీలను సులభంగా పూర్తి చేసుకోవచ్చు. వినియోగం సులభం.. క్యూఆర్ కార్డులని వినియోగించుకోవడం అత్యంత సులభం మీ అకౌంట్ నెంబర్ తెలీకపోయినా ఈ కార్డుని వాడుకునే సౌలభ్యం ఉంది. ఈ కార్డుల్ని దేశవ్యాప్తంగా ఉన్న తపాలా బ్యాంకు కేంద్రాల్లోనూ, ఇతర వాణిజ్య కేంద్రాల్లోనూ వాడుకోవచ్చు. ఐపీపీబీ మొబైల్ యాప్స్‌ద్వారా కూడా వీటిని వినియోగించుకోవచ్చు. అంతేకాదు వీటిని వాడడానికి ఏమంత ఖరీదైన మౌలిక సదుపాయాలు ఉండాల్సిన పనిలేదు. చిన్న చిన్న దుకాణాల్లో కూడా ఈ క్యూఆర్ కార్డులు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. విద్యుత్, టెలిఫోన్ బిల్లులు కూడా క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేసి చెల్లించుకోవచ్చు. ఆన్లైన్ బిల్లు చెల్లింపులకి రూ.15, నగదు డిపాజిట్, ఉపసంహరణ వంటి లావాదేవీలు ప్రతీ ఒక్కదానికి రూ.25 చార్జీలు వసూలు చేస్తారు. భద్రత ఎక్కువ ఏటీఎం కార్డు ఉండి, పిన్ నెంబర్ తెలిస్తే ఒకరి కార్డుని మరొకరైనా వినియోగించుకోవచ్చు. కానీ క్యూఆర్ కార్డు విషయానికి వచ్చేసరికి అలా కుదరదు. బయోమెట్రిక్ తనిఖీ ఉంటుంది కాబట్టి భద్రత ఎక్కువ. మీ పిన్ నెంబర్ని ఎవరైనా గుర్తిస్తారేమో, పాస్వర్డ్ ఎవరికైనా తెలిసిపోతుందేమోనన్న ఆందోళన అక్కర్లేదు. కార్డు పోగొట్టుకున్నా మీ నగదుకు భద్రత ఉంటుంది. -
భర్తకు డెబిట్ కార్టు ఇస్తున్నారా? ఇది చదవండి..
బెంగళూరు : ఎవరి డెబిట్ కార్డులు వారు మాత్రమే వినియోగించాలన్న నిబంధన ఉన్నప్పటికీ ఆ నిబంధనను చాలా మంది పట్టించుకోవడం లేదు. కర్ణాటకలోని వినియోగదారుల ఫోరమ్ తీర్పు చూశాక మీ డెబిట్ కార్డు ఇతరులకు ఇవ్వాలంటే కచ్చితంగా ఆలోచిస్తారు. ఓ కేసుపై దీర్ఘకాల విచారణ చేపట్టిన ఫోరమ్ భార్య డెబిట్ కార్డు వినియోగించే హక్కు భర్తకు కూడా లేదని తేల్చిచెప్పింది. వివరాల్లోకి వెళ్లే మరతహళ్లికి చెందిన వందన... 2013 నవంబర్ 14వ తేదీన, తన ఎస్బీఐ డెబిట్ కార్డు భర్త రాజేశ్‌కు ఇచ్చి 25,000 డ్రా చేసుకు రమ్మన్నారు. దీంతో రాజేశ్ ఏటీఎంకు వెళ్లాడు. అక్కడ డబ్బులు రాకపోగా.. అకౌంట్లో నుంచి డబ్బులు మాత్రం కట్ అయ్యాయి. వెంటనే ఆ దంపతులు ఎస్బీఐ ఫిర్యాదు చేసినప్పటికీ లాభం లేకపోయింది. దీంతో ఆమె అక్టోబర్‌లో జిల్లా వినియోగదారుల ఫోరమ్‌ను సంప్రదించారు. ఫోరమ్ ఆదేశాలతో మళ్లీ ఆమె అభ్యర్థనను పరిగణలోకి తీసుకున్న ఎస్బీఐ సీసీటీవీ పరిశీలించి అందులో ఆమె భర్త డెబిట్ కార్డును వాడినట్టు తేలడంతో ఈ కేసును మూసివేస్తున్నట్టు తెలిపింది. బ్యాకింగ్ చట్టాల ప్రకారం ఎవరి డెబిట్ కార్డును వారే వినియోగించాలని పేర్కొంది. ఈ కేసులో ఇతరులకు పిన్ షేర్ చేయడాన్ని సాకుగా చూపింది ఎస్బీఐ. మూడున్నరేళ్లపాటు కొనసాగిన ఈ కేసులో వినియోగదారుల ఫోరం మే 29న కేసును తోసిపుచ్చుతూ తుది తీర్పు వెలువరించింది. తీర్పులో వందన తన ఏటీఎం పిన్ నంబర్ తన భర్తకు చెప్పి ఉండాల్సింది కాదని పేర్కొంది. తనకు అంతగా కావాలంటే చెక్ ద్వారానో మరేదైనా మార్గంలో డబ్బులు తీసుకుంటే బాగుండేదని అభిప్రాయపడింది. -
ఏటీఎంలలో జరభద్రం!
సాక్షి, సిటీబ్యూరో: ‘డబ్బులు డ్రా చేసుకునేందుకు నగరంలోని ఏటీఎం కేంద్రాలకు వెళుతున్నారా...యథాలాపంగా ఏటీఎం యంత్రంలో కార్డు పెట్టి కీబోర్డు మీద పాస్వర్డ్ కొట్టి చకచకా డబ్బులు తీసుకొని వెళ్లిపోదామని అనుకుంటే మీ ఖాతాల్లోని డబ్బులకు గ్యారంటీ ఉండకపోవచ్చు. నగరంలోని ఏటీఎం కేంద్రాల్లో డేటా కార్డ్ రీడర్ అమర్చి ఉన్న స్కిమ్మర్ కార్డును బిగించి ఏటీఎం కార్డు వివరాలన్నీ సేకరించడంతో పాటు అక్కడే బిగించిన రహస్య సీసీటీవీ కెమెరా ద్వారా పిన్ నంబర్ తెలుసుకొని ముంబైలో క్లోనింగ్ చేసి భారీ మొత్తంలో అక్కడి ఏటీఎంల నుంచి డబ్బులను కాజేస్తున్న ఇద్దరు రుమేనియా దేశస్తులను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఈ నగదును తమ దేశ కరెన్సీలోకి మార్చుకునేందుకు నగరానికి వచ్చిన ప్రధాన నిందితులు వసిలె గాబ్రియల్ రజ్వాన్, బురిసియా అలెగ్జాండ్రు మిహయ్లను పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. వీరి నుంచి రూ.35 లక్షల నగదుతో పాటు 196 స్కిమ్మర్ కార్డులు, ఆరు కెమెరా ప్యానెల్స్, ఒక ఎంఎస్ఆర్ మెషిన్, ఆరు ఏటీఎం కార్డు స్కిమ్మర్లు, రెండు పాస్‌పోర్టులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 4న తన బ్యాంక్ ఖాతా నుంచి ముంబై, గోరేగావ్‌లోని ఓ ఏటీఎం సెంటర్ నుంచి లక్ష రూపాయలు డ్రా అయ్యాయని మెసేజ్ వచ్చిందంటూ కూకట్పల్లివాసి అనిల్ భార్గవ ఫిర్యాదుతో ఈ భారీ క్లోనింగ్ మోసం వెలుగులోకి వచ్చింది. ఈ కేసు వివరాలను గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ మంగళవారం మీడియాకు తెలిపారు. మెకానిక్ నుంచి చోరీలవైపు... రొమానియాలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వసిలె గాబ్రియల్ రజ్వాన్ అక్కడే కారు మెకానిక్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇతని స్నేహితుడైన బురిసియా అలెగ్జాండ్రు మిహయ్ హోటల్లో పనిచేస్తుండేవాడు. అయితే వీరి అవసరాలకు తగ్గట్టుగా డబ్బులు సంపాదించకపోవడంతో నేరాలబాట పట్టారు. వీరికి రజ్వాన్ స్నేహితులైన టికూ బొగ్దాన్ కాస్టినెల్, పుయికా ఇగ్ను మరియన్లు కూడా తోడయ్యారు. ఇలా యూకే, యూరోపియన్లలోనూ ఏటీఎం కార్డులు క్లోనింగ్ చేసి వివిధ బ్యాంక్ ఏటీఎంలలో డబ్బులు డ్రా చేసుకునేవారు. అక్కడ నిఘా పెరగడంతో వీరి చూపు భారతదేశంలోని హైదరాబాద్, ముంబై, ఢిల్లీపై పడింది. ఇలా వీరు బిజినెస్, టూరిస్ట్ వీసాలపై గతేడాది డిసెంబర్లో హైదరాబాద్‌కు వచ్చారు. నగరంలోని హోటల్స్‌లో ఉండి సెక్యూరిటీ గార్డులు లేని ఏటీఎంలను గుర్తించారు. అదే నెలలోనే ఢిల్లీకి విమానంలో వెళ్లి అక్కడ ఏటీఎంలో ఈ ఏడాది జనవరిలో స్కిమ్మర్లను అమర్చి సేకరించిన డేటా కార్డు వివరాలతో రూ.9 లక్షల 50 వేలు డ్రా చేశారు. అదే నెలలోనే వెస్టర్న్ యూనియన్ అవుట్‌లెట్‌లో డబ్బులను రొమానియా కరెన్సీలోకి మార్చుకున్నారు. ఆ తర్వాత గాబ్రియల్ సూచనల మేరకు అతని స్నేహితులైన టికూ బొగ్దాన్ కాస్టినెల్, పుయికా ఇగ్ను మరియన్లు ఫిబ్రవరి, మార్చి నెలల్లో హైదరాబాద్‌కు వచ్చి నగరంలోని కూకట్పల్లి, జగద్గిరిగుట్ట, విజయ్‌నగర్‌కాలనీ, జూబ్లీహిల్స్‌లోని నాలుగు ఏటీఎం సెంటర్లలో ఏటీఎం కార్డులు ఇన్సర్ట్ (కార్డును పెట్టే ప్రాంతం) చేసే దగ్గర అనుమానం రాకుండా చిప్‌తో కూడిన స్కిమ్మర్లను అమర్చారు. మెషీన్ కీ బోర్డుకుపైన రహస్య కెమెరాలను ఏర్పాటుచేశారు. ఈ స్కిమ్మర్ ద్వారా కార్డు పెట్టగానే ఖాతాదారుడి వివరాలను తీసుకొని చిప్‌లో భద్రపరుస్తుంది. రహస్య కెమెరా కీబోర్డు మీద నమోదయ్యే పిన్ నంబర్ల వివరాలను రికార్డు చేసుకుంటుంది. మరుసటిరోజూ వచ్చి ఈ స్కీమర్, సీసీకెమెరాలను తీసుకెళ్లారు. వాటిలో వచ్చిన డేటా, దృశ్యాలతో మరో కార్డులోకి గాబ్రియల్ టెక్నికల్ టూల్స్‌తో క్లోనింగ్ చేసి యాంటీ గిఫ్ట్‌కార్డు(ఏటీఎం డూప్లికేట్) వెనకాల పిన్ నంబర్ రాసుకునేవాడు. ఆ తర్వాత డ్రా చేసేవాడు. ఇలా కూకట్‌పల్లికి చెందిన అనిల్ భార్గవ బ్యాంక్ ఖాతా నుంచి లక్ష రూపాయలు ముంబైలోని గోరేగావ్‌లోని ఓ బ్యాంక్ నుంచి డ్రా అయినట్టుగా సెల్‌కు ఎస్ఎంఎస్ వచ్చింది. వెంటనే సంబంధించి బ్యాంక్ కాల్‌సెంటర్‌కు కాల్ చేయగా మీ బ్యాంక్ ఖాతాను ఎవరో హ్యాక్ చేశారంటూ సమాధానం చెప్పడంతో సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. ఈ కేసు నమోదు చేసిన పోలీసులు టెక్నికల్ డేటా సహకారంతో ముంబైలోని నాలుగు ఏటీఎం కేంద్రాల నుంచి డబ్బు విత్‌డ్రా అవుతున్నట్టు గుర్తించారు. మార్చుకుందామని వచ్చిదొరికిపోయారు... అయితే అప్పటికే ఆయా ఏటీఎంల నుంచి దాదాపు రూ.35 లక్షలు డ్రా చేసిన గాబ్రియల్, అలెగ్జాండ్రులు అక్కడ డబ్బు తమ కరెన్సీలోకి మార్చడం అంత సేఫ్ కాదని భావించి హైదరాబాద్‌లోని కరెన్సీ మార్పిడి కేంద్రానికి చేరుకునే సమయంలో సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు. వీరు సైబరాబాద్‌లోని కూకట్పల్లి ఐసీఐసీఐ బ్యాంక్, జగద్గిరిగుట్టలోని కెనరా బ్యాంక్‌లతో పాటు హైదరాబాద్‌లోని మరో రెండు ఏటీఎం కేంద్రాల్లో స్కిమ్మర్లు అమర్చినట్టుగా విచారణలో ఒప్పుకున్నారు. అయితే గాబ్రియల్ స్నేహితులైన టికూ, పుయికాలు ఫిబ్రవరి, మార్చి నెలల్లో హైదరాబాద్‌లో ఈ పనిచేశారని చెప్పారు. ఏటీఎం కేంద్రాల్లో టికూ స్కిమ్మర్ అమర్చితే, పుయికా మరుసటిరోజు తొలగించేవాడని విచారణలో వెల్లడించారు. వారి పని పూర్తవడంతో రుమేనియా వెళ్లిపోయారని పోలీసులకు తెలిపారు. ఆయా ఏటీఎం కేంద్రాల్లోని సీసీటీవీ ఫుటేజీల్లో టికూ, పుయికాల ముఖాలు కనబడతాయనే ధైర్యంతో హైదరాబాద్‌కు వచ్చామని, ఇలా దొరికిపోతామని ఊహించలేదని పోలీసుల విచారణలో అన్నట్టు తెలిసింది. అయితే వీరు ఇప్పటివరకు 2040 కార్డులను క్లోనింగ్ చేసి 560 కార్డుల నుంచి డబ్బులు డ్రా చేశారని సజ్జనార్ వివరించారు. ఆలీబాబా ఆన్లైన్ వెబ్సైట్ నుంచి తెప్పించిన స్కిమ్మింగ్ కార్డులు, మాగ్నటిక్ రీడర్లు కొనుగోలు చేశాడని తెలిపారు. ఈ నిందితులను పట్టుకున్న డీసీపీ క్రైమ్స్ జానకి షర్మిలా, ఏసీపీ వై.శ్రీనివాస్కుమార్లను అభినందించారు. వచ్చే వారంలో బ్యాంకర్లతో సమావేశం హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలో సుమారు ఐదువేలకుపైగా ఏటీఎం కేంద్రాలున్నాయి. వీటిలో చాలావరకు సెక్యూరిటీ గార్డులు లేని ఏటీఎంలు ఉన్నట్టుగా పోలీసులకు తరచూ ఫిర్యాదులు వస్తున్నాయి. గతంలోనూ భద్రత సిబ్బందిని నియమించుకోవాలని పోలీసులు గట్టిగా హెచ్చరించినా పెద్దగా పట్టించుకోలేదు. ఏటీఎంలలో సీసీటీవీ కెమెరాలున్నా పర్యవేక్షణ కొరవడింది. ఈ నేపథ్యంలో డెబిట్ కార్డు క్లోనింగ్ మోసాలు జరగడంతో వచ్చే వారంలో అన్ని బ్యాంక్‌ల మేనేజర్లతో సమావేశం నిర్వహించాలని సైబరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ నిర్ణయించారు. ఖాతాదారుల భద్రతే లక్ష్యంగా ఉండాలని సూచించడంతో పాటు మోసాలకు చెక్‌పెట్టేలా అవగాహన కలిగించాలని నిర్ణయించారు. -
ఏటీఎం కార్డు బ్లాక్ అయిందని..
కొలిమిగుండ్ల: బెలుం గ్రామానికి చెందిన బాచం వెంకటశివారెడ్డి సైబర్ నేరస్తుల చేతిలో మోసపోయాడు. ఇతను ఈనెల 19న కొలిమిగుండ్ల స్టేట్ బ్యాంక్‌లో డీడీ తీసేందుకువచ్చాడు. ఈక్రమంలో స్టేట్ బ్యాంక్ మేనేజర్‌ను మాట్లాడుతున్నానని శివారెడ్డి సెల్‌కు గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేశాడు. మీ ఏటీఎం కార్డు బ్లాక్ అయిందని, ఆధార్ అనుసంధానం చేయించుకోవాలని సూచించాడు. కార్డు బాగానే ఉందని చెప్పినా వరుసగా ఫోన్ చేస్తూ వచ్చాడు. చివరకు బెలుంకు వెళ్లాక మరోసారి ఫోన్ వచ్చింది. దీంతో నిజమే అనుకొని ఏటీఎం కార్డుపై ఉన్న 16 అంకెలు, ఆతర్వాత ఓటీపీ నంబర్ కూడా చెప్పాడు. దీంతో శివారెడ్డి అకౌంట్ నుంచి రెండు విడతల్లో రూ.15,500 డ్రా అయింది. తాను మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు శుక్రవారం బ్యాంకు అధికారులను సంప్రదించాడు. వారి సూచన మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
మిత్రద్రోహం
పెద్దవడుగూరు: కలిసి మెలిసి తిరిగే యువకుడే తన స్నేహితుడి వద్ద ఏటీఎం కార్డు తస్కరించి రూ.40వేల నగదు డ్రా చేసిన ఘటన బుధవారం వెలుగు చూసింది. మండల కేంద్రం పెద్దవడుగూరుకు చెందిన సాయిచంద్, కాయల నారాయణస్వామి అనే యువకులు స్నేహితులు. సాయిచంద్ మంగళవారం తన తల్లి జయమ్మకు చెందిన ఏటీఎం కార్డు తీసుకుని రూ.1000 నగదు కోసం ఏటీఎం కేంద్రానికి వెళ్లాడు. ఆ సమయంలో స్నేహితుడు కూడా వెంట ఉన్నాడు. అనంతరం ఇద్దరూ బయటకు వెళ్లి మద్యం తాగారు. మత్తులో పడి ఉన్న సాయిచంద్ జేబులోంచి ఏటీఎం కార్డును తస్కరించి.. గుర్తు పెట్టుకున్న పిన్ నంబర్ ద్వారా రూ.40వేలు డ్రా చేసేశాడు. ఆ తర్వాత తనకేమీ తెలియనట్టు కార్డు తీసుకొచ్చి స్నేహితుడి జేబులో పెట్టేశాడు. బుధవారం జయమ్మ డబ్బు డ్రా చేయడానికని కుమారుడితో కలిసి ఆంధ్రాబ్యాంకుకు వెళ్లింది. అయితే ఖాతాలో డబ్బు లేదని బ్యాంకు సిబ్బంది చెప్పారు. ఖాతాలోని డబ్బు ఎక్కడికెళ్లిందని ఆరా తీయగా.. ఏటీఎం ద్వారా రూ.40వేలు డ్రా చేసినట్లు చెప్పడంతో అవాక్కయ్యింది. వెంటనే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్ఐ రమణారెడ్డి అనుమానితుడిగా భావిస్తున్న కాయల నారాయణస్వామిని అదుపులోకి తీసుకుని విచారించగా తానే డబ్బు డ్రా చేసినట్లు ఒప్పుకున్నాడు. దీంతో అతని వద్ద నుంచి ఆ డబ్బును తిరిగి బాధితురాలికి ఇప్పించారు. -
ఆర్టీసీ డ్రైవర్ల నిజాయితీ
డాబాగార్డెన్స్(విశాఖ దక్షిణం): సాధారణంగా రోడ్డుపై వెళ్తున్నప్పుడు డబ్బులు... వస్తువులు ఏమైనా దొరికితే మెల్లగా జేబులో పడేసేవారు కొందరు. దొరికిన సొమ్ము పోలీసులకు అందజేస్తే నొక్కేస్తారేమోనన్న భయంతో వారికి అందజేయకుండా ఉండిపోయిన వారు మరికొందరు. దొరికిన సొమ్ము/వస్తువులు పోగొట్టుకున్న వ్యక్తులకు అందజేయాలన్న తపన ఇంకొందరిది. ఈ కోవకే చెందుతారు విజయవాడ గవర్నర్పేట్ ఆర్టీసీ డిపో డ్రైవర్లు. డబ్బులు, బ్యాంకు ఏటీఎం కార్డులు పోగొట్టుకున్న ఆర్టీసీ ప్రయాణికుడికి అందజేసి వారి నిజాయితీ నిరూపించుకోవడమే గాక ఆర్టీసీకి పేరు తెచ్చిపెట్టారు. వివరాల్లోకి వెళ్తే... విశాఖపట్నం కోటపాడు మండలం కె.గుల్లేపల్లికి చెందిన షేక్ రసూల్ ఈ నెల 2న సాయంత్రం విశాఖ వచ్చేందుకు విజయవాడ – విశాఖపట్నం బస్సు (సర్వీస్ నంబరు 95449, ఏపీ16జెడ్0227))లో ప్రయాణం చేశారు. సీటు నంబరు 30లో కూర్చున్నారు. విశాఖపట్నం ఎన్ఏడీ జంక్షన్ వద్ద ఆ ప్రయాణికుడు బస్సు దిగిపోయారు. ఆతృతగా దిగిన ఆ వ్యక్తి తను కూర్చున్న సీటులో మనీపర్స్, ఏటీఎం కార్డులు మరచిపోయారు. విశాఖపట్నం ద్వారకా బస్సు స్టేషన్‌కు ఆ బస్సు చేరింది. బస్సు దిగినప్పుడు డ్రైవర్లు ఎం.వి.కాసులు(ఎంప్లాయి నంబరు 370550), ఎం.దానయ్య (ఎంప్లాయి నంబరు 371520) బస్సును పరిశీలించారు. సీటు నంబరు 30లో ప్రయాణికుడు మరచిపోయిన మనీపర్సును గుర్తించారు. ఆ మనీపర్సులో రూ.8,500 నగదు, ఏటీఎం కార్డులు, పాన్‌కార్డు, ఆధార్‌కార్డు ఉన్నాయి. వాటిని ఆ డ్రైవర్లు ఇద్దరూ భద్రపరచి మనీపర్సు పోగొట్టుకున్న రసూల్‌కు ఫోన్‌చేసి ద్వారకా బస్టేషన్‌కు పిలిపించి వాటిని స్టేషన్ మేనేజర్ ద్వారా మంగళవారం అందజేసి నిజాయితీ చాటుకున్నారు. డ్రైవర్ల నిజాయితీని ఇటు ప్రయాణికుడు, అటు ఆర్టీసీ మేనేజర్ అభినందించారు. -
ఏటీఎం కార్డు మారి.. రూ.57వేలు గల్లంతు!
చిలమత్తూరు (హిందూపురం) : ఒకరికి రావాల్సిన ఏటీఎం మరొకరికి వెళ్లింది. సదరు ఖాతాదారు ఏటీఎం కార్డుతో రూ.57వేలు డ్రాచేసేశారు. తమ ప్రమేయం లేకుండా నగదు గల్లంతవడంపై బాధితులు కంగుతిన్నారు. వివరాల్లోకెళితే.. చిలమత్తూరులోని బీసీ కాలనీకి చెందిన బి.ప్రభావతమ్మకు సిండికేట్ బ్యాంకులో ఖాతా (నంబర్ 31312250037750) ఉంది. ఇందులో రూ.57,700 నగదు ఉంది. వీరికి ఏటీఎం కార్డు ఇంకా రాలేదు. డబ్బు అవసరం కావడంతో భర్త రామాంజనేయులుతో కలిసి ఆమె సోమవారం బ్యాంకుకు వెళ్లారు. ఖాతాలో రూ.50 మాత్రమే ఉందని క్యాషియర్ చెప్పడంతో వారికి గుండె ఆగినంత పనైంది. వెంటనే బ్యాంకు మేనేజర్ శ్రీనాథ్‌ను కలిశారు. ఆయన స్టేట్మెంట్ తీసి చూడగా.. ఏటీఎం కార్డు ద్వారా రూ.57వేలు డ్రా చేసినట్లు గుర్తించారు. అసలు తమకు ఏటీఎం కార్డే లేదు.. అలాంటపుడు ఎవరు, ఎలా డ్రా చేసి ఉంటారంటూ బాధితురాలు ప్రశ్నించింది. దీంతో అప్రమత్తమైన బ్యాంకు సిబ్బంది, మహిళా సంఘాల సభ్యులతో కలిసి బీసీ కాలనీకి వెళ్లి ఆరా తీశారు. ఇదే కాలనీలో మొరంపల్లి గ్రామం నుంచి వచ్చి నివాసముంటున్న ప్రభావతమ్మ, రామాంజి అనే పేర్లు కలిగిన దంపతులు ఉన్నారని ప్రాథమికంగా నిర్దారణకు వచ్చారు. వారికి వీరి ఏటీఎం కార్డు వెళ్లడంతో పొరబాటు జరిగి ఉంటుందని భావించారు. సదరు మహిళతో మాట్లాడగా.. ఏటీఎం కార్డు తన కుమారుడి వద్ద ఉందని తెలిపింది. పూర్తిస్థాయిలో విచారణ జరిపి న్యాయం చేస్తామని బాధితురాలికి మేనేజర్ హామీ ఇచ్చారు. -
డబ్బు డ్రా చేశారు.. దొరికిపోయారు
కరీంనగర్ టౌన్: నిండా పాతికేళ్లు లేని ముగ్గురు దొంగలు పోలీసులకు కంటిమీద కునుకులేకుండా చేశారు. దొంగతనాల్లో ఆ ముగ్గురు యువకులు రాటుదేలిపోయారు. కరీంనగర్‌లోని పలుప్రాంతాల్లో ఇప్పటికే 17 చోట్ల చోరీలకు పాల్పడ్డారు. యధావిధిగా ఓ ఇంట్లో దొంగతనానికి వెళ్లి ఏమీ లేకపోవడంతో ఏటీఎం కార్డు దోచుకెళ్లారు. చోరీ చేసిన ఏటీఎం కార్డునుపయోగించి డబ్బు డ్రా చేయడంతో పోలీసులకు దొరికిపోయారు. వివరాలు..కరీంనగర్ పట్టణంలోని రాంనగర్ ప్రాంతానికి చెందిన ఇస్లావత్ శ్రీకాంత్(22), లోకిని శ్రీకాంత్(20) లు మరో మిత్రుడితో కలిసి, తమ జల్సాలు తీర్చుకోవడానికి పట్టణంలో చోరీలు చేసేవారు. ఇలా దొంగతనాలకు అలవాటు పడ్డ మిత్రులు ముగ్గురూ తమ అలవాటులో భాగంగా శ్రీనగర్ కాలనీలోని ఓ తాళం వేసి ఇంట్లో దొంగతనానికి వెళ్లారు. అక్కడ ఇంటిలో ఏమీ లభించకపోవడంతో ఏటీఎం కార్డు దొంగిలించి పక్కనే ఉన్న యాక్సిస్ బ్యాంక్‌లో డబ్బు డ్రా చేశారు. ఏటీఎం కార్డు ఎవరో దొంగిలించి డబ్బులు డ్రా చేశారని బాధితులు ఫిర్యాదు ఇవ్వడంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు ప్రారంభించారు. డబ్బులు డ్రా చేసిన ఏటీఎం సెంటర్ వద్ద నున్న సీసీ కెమెరా పుటేజీ ద్వారా నిందితులను గుర్తించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ. 8లక్షల విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలు, రెండు బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆన్లైన్ మోసం
బొబ్బిలి రూరల్ : బ్యాంకు హెడ్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాం.... మీ ఏటీఎం కార్డు 16 అంకెల నంబర్, పిన్ నంబర్ తెలియజేయండంటూ ఓ వ్యక్తి నుంచి వివరాలు తీసుకుని ఏటీఎం నుంచి మూడు లావాదేవీలతో రూ.49,997లు డ్రా చేసిన వైనమిది. బాధితుడు శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలో ఎం.బూర్జవలస పంచాయతీ గున్నతోటవలసకు చెందిన పప్పల శ్రీనివాసరావు గ్రోత్ సెంటర్లో కార్మికుడిగా పని చేçస్తున్నాడు. అతని ఖాతాలో కొంత మొత్తం ఉండగా, ఈ నెల 28న శ్రీనివాసరావుకు 8877425622 నంబర్ నుంచి ఫోన్ వచ్చింది. ‘మేం స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా హెడ్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాం.. మీ ఏటీఎం బ్లాక్ అయ్యింది... మీ ఏటీఎం కార్డుపై ఉన్న 16 అంకెలు తెలియజేసి, పిన్ నంబర్ తెలియజేయండి‘ అని ఫోన్ చేశారు. దీన్ని నమ్మిన శ్రీనివాసరావు తానుబయట ఉన్నాను. నా ఏటీఎం కార్డు ఇంట్లో ఉంది. వివరాలు తెలియజేస్తాను పావు గంట పోయాక చేయండి అని ఫోన్ పెట్టేయగా పావు గంట పోయాక తిరిగి ఆ వ్యక్తి అదే నంబర్‌తో ఫోన్ చేయగా వివరాలు తెలియజేయగా పది నిమిషాలలో వరుసగా ఒకసారి రూ.19,999, మరోసారి రూ.9,999, తిరిగి రూ.19,999లు మొత్తంగా రూ.49,997లు డ్రా చేశాడు. ఎప్పుడు డ్రా చేసినా తన సెల్‌కు మెసేజ్ వచ్చేదని, కానీ తనకు మెసేజ్ రాలేదని బాధితుడు శ్రీనివాసరావు వాపోయాడు. గురువారం డబ్బులు డ్రా చేయడానికి ప్రయత్నిస్తే ఖాతాలో డబ్బులు లేవని తెలియజేయడంతో గ్రోత్ సెంటర్ ఎస్బీఐ బ్రాంచ్‌కి వచ్చి వివరాలు తీసుకుంటే మోసపోయిన సంగతి తెలిసినట్లు శ్రీనివాసరావు తెలిపారు. బ్రాంచ్ మేనేజర్ సుధీర్‌ను కలిసి విషయం తెలియజేస్తే తామేమీ చేయలేమని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. చేసేదేంలేక శ్రీనివాసరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ఏటీఎం సెంటర్లో ఏ‘మార్చి’ టోకరా
తగరపువలస (భీమిలి) : పనిచేయని ఏటీఎం కార్డును బాధితుని చేతిలో పెట్టి అసలైన కార్డు ద్వారా రూ.65వేలు కాజేసిన సంఘటన సోమవారం తగరపువలసలో జరిగింది. మహరాజుపేటకు చెందిన మద్దిల అప్పలరాజు తగరపువలస ఎస్‌బీహెచ్‌ను ఆనుకుని ఉన్న ఏటీఎం సెంటర్లో కార్డు ద్వారా డబ్బులు విత్‌డ్రా చేయడానికి వచ్చాడు. ఎంత సేపటికి ప్రయత్నించినా డబ్బులు రాకపోవడంతో క్యూలో ఉన్నవారు పక్కకు తప్పుకోవాలని కోరారు. దీంతో బాధితుని వెనక ఉన్న అగంతకుడు ఆ కార్డును తీసుకుని దాని ద్వారా రూ.15వేలు విత్‌డ్రా చేసి అప్పలరాజుకు ఇచ్చాడు. తరువాత మరో ప్రయత్నం చేయగా ఏటీఎం పనిచేయలేదని చెప్పి బాధితునికి కార్డు ఇవ్వగా.. ఇంటికి వెళ్లిపోయాడు. ఇంట్లో ఉండగా మరో రూ.65వేలు తన ఖాతా నుంచి విత్‌డ్రా అయినట్టు సెల్‌ఫోన్‌కు మెసేజ్ వచ్చింది. దీంతో తన వద్ద ఉన్న కార్డు చూసుకోవడంతో ఏటీఎం సెంటర్ వద్ద అగంతకుడు తన కార్డును మార్చి ఇచ్చినట్టు గ్రహించాడు. వెంటనే బాధితుడు భీమిలి పోలీసులు, బ్యాంకు సిబ్బందిని ఆశ్రయించాడు. వారి సూచన మేరకు నగరంలోని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడానికి అప్పలరాజు వెళ్లాడు. -
కార్డు రెన్యువల్ అంటూ డబ్బు లాగేశారు.
మామిడికుదురు(తూర్పుగోదావరి): ఏటీఎం సమాచారం ఎవ్వరు అడిగినా చెప్పొద్దంటూ ఎంతగా మొత్తుకుంటున్నా పెడచెవిన పెట్టి మోస పోతున్న సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ కోవకు చెందినదే తాజా సంఘటన . ఖాతాదారుడికి మాయ మాటలు చెప్పి అతని బ్యాంకు ఖాతా నుంచి రూ.1, 99, 600 లక్షలు డ్రా చేశారు. రాజోలు ఎస్సై ఎస్.లక్ష్మణరావు తెలిపిన వివరాలమేరకు మామిడికుదురు మండలం గోగన్నమఠం గ్రామానికి చెందిన దాకే విశ్వనాధానికి జగ్గన్నపేట ఎస్బీఐ శాఖలో ఖాతా ఉంది. గత నెల 17వ తేదీన అతని సెల్‌కు జగ్గన్నపేట ఎస్బీఐ మేనేజర్ పేరుతో అపరిచిత వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. మీ ఏటీఎం కార్డు పాడైపోయింది. దాన్ని రెన్యువల్ చేయించుకోవల్సి ఉందని, అందుకు గాను మీ ఏటీఎం కార్డు నెంబర్ చెప్పాలని అపరిచిత వ్యక్తి విశ్వనాధంను అడిగాడు. అతని మాటలు నమ్మిన విశ్వనాధం ఏటీఎం కార్డు నంబర్ చెప్పాడు. తరువాత డబ్బులు అవసరమై బ్యాంకుకు వెళ్లి చూడగా అతని ఖాతాలో డబ్బులు పోయినట్టు తెలుసుకుని లబోదిబోమన్నాడు. గత నెల 17, 18, 19, 20 తేదీల్లో వరుసగా నాలుగు రోజులు రూ.49,900 వంతున మొత్తం రూ.1,99,600 తన ఖాతా నుంచి ఆగంతకులు డ్రా చేశారని విశ్వనాధం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన కుమార్తె పెళ్లి ఖర్చుల కోసం ఈ మొత్తాన్ని బ్యాంకు ఖాతాలో దాచుకున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బు చోరీతో పెళ్లి ఆగిపోయిందని వాపోయాడు. విశ్వనాధం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై లక్ష్మణరావు తెలిపారు. -
డబ్బులు డ్రా చేస్తానని చెప్పి.. బురిడీ!
హైదరాబాద్: ఏటీఎంలో డబ్బులు తీసేందుకు సాయం చేస్తానని చెప్పి మోసం చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసిన ఘటన ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... శాతవాహననగర్‌కు చెందిన మండ జయశంకర్ ఆర్టీసీలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. గతవారం ఓ రోజు రాత్రి 10 గంటల సమయంలో ఎల్బీనగర్ బీఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్ద ఉన్న ఎస్బీహెచ్ ఏటీఎంలోకి డబ్బులు తీసుకునేందుకు వెళ్లాడు. అక్కడ గుర్తు తెలియని వ్యక్తి ఏటీఎంలో నుంచి డబ్బులు తీసేందుకు సహాయ పడతానని చెప్పి ఏటీఎం కార్డు తీసుకుని రూ.20,800లను తన ఖాతాలోకి బదిలీ చేసుకున్నాడు. ఫోన్‌కు సమాచారం రావడంతో మోసపోయినట్లు గుర్తించిన జయశంకర్ ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఆ రైతు వద్ద 37ఖాతాలు, 44 ఏటీఎం కార్డులు
గుజరాత్ వ్యాపారి మహేశ్ షా తరహాలోనే అసోంలో ఓ రైతు వ్యవహారం వార్తలకు ఎక్కింది. స్వచ్ఛంద ఆదాయ వెల్లడి పథకం (ఐడీఎస్) కింద ఏకంగా రూ. 13,860 కోట్లు వెల్లడించి మహేశ్ షా కటకటాలు లెక్కిస్తుండగా.. అసోంకు చెందిన రైతు జింటూ బోరా వద్ద ఏకంగా 37 బ్యాంకు, పోస్టాఫీస్ పాస్‌బుక్కులు, 44 ఏటీఎం కార్డులు వెలుగుచూడటం కలకలం రేపుతోంది. మజులీ జిల్లాలోని మధుపూర్ గ్రామానికి చెందిన బోరా ఇంటిపై పోలీసులు శనివారం సాయంత్రం దాడులు నిర్వహించగా.. 44 బ్యాంకు, పోస్టాఫీస్ పాస్‌బుక్కులు, ఏటీఎం కార్డులు దొరికాయి. దీంతోపాటు 34 చెక్కుబుక్కులు, 200 బ్లాంక్ చెక్కులు, రూ. 22,380 నగదు, కొన్ని బ్లాంక్ స్టాంపు పేపర్లు దొరికాయి. తాను పలువురికి అప్పులు ఇచ్చానని, అందుకు తాకట్టుగా బ్యాంకుల పాస్‌బుక్కులు, ఏటీఎం కార్డులు పెట్టుకున్నట్టు బోరా చెబుతుండగా, బ్యాంకుల్లో నల్లధనాన్నివేసేందుకే వీటిని సేకరించి ఉండొచ్చునని తాము అనుమానిస్తున్నట్టు ముజులి ఎస్పీ వైభవ్‌చంద్రకాంత్ నింబల్కర్ తెలిపారు. అయితే, ఆయన వద్ద రద్దైన నోట్లు ఏమీ దొరలేదని, ఈ వ్యవహారంపై దర్యాప్తు జరుపుతున్నామని చెప్పారు. -
ఏటీఎం వ్యాల్యువేషన్ చేస్తామని మోసం..
వివరాలన్నీ తెలుసుకొని రూ.97 వేలు డ్రా లబోదిబోమంటున్న బాధితుడు మేడ్చల్‌రూరల్ : ఏటిఎం కార్డు వ్యాల్యువేషన్ గడువు ముగిసిందని ఫోన్లో వివరాలు తెలుసుకుని ఓ వ్యక్తిని మోసగించారు. అతడి ఖాతా నుంచి భారీగా నగదు డ్రా చేసుకున్న సంఘటన మేడ్చల్‌లో శనివారం చోటు చేసుకుంది. మేడ్చల్‌లోని సూర్యనగర్‌కాలనీవాసి శ్రీనివాస్ మునిరాబాద్ గ్రామంలో సాస్ తయారీ కంపెనీ నిర్వహిస్తున్నాడు. కంపెనీ లావాదేవీల కోసం మేడ్చల్‌లోని కెనరా బ్యాంక్‌లో ఖాతా తెరిచి తన లావాదేవీలు కూడా కొనసాగిస్తున్నాడు. కాగా ఈనెల 7వ తేదీన గుర్తుతెలియని వ్యక్తి అతడికి ఫోన్ చేసి మీ ఏటీఎం కార్డు వ్యాల్యువేషన్ గడువు ముగిసిందని కార్డు వెనుక ఉన్న నంబర్‌ను తెలపాలని చెప్పారు. వివరాలు తెలిపే ప్రాసస్ మొదలుపెడతామని నమ్మబలికాడు. దీంతో శ్రీనివాస్ అన్ని వివరాలు తెలిపాడు. అదే రోజునే బీహర్ రాష్ట్రంలో స్నాప్‌డీల్ కొనుగోలుకు రూ.71,369 ఖాతా నుంచి క్రెడిట్ అయినట్లు శ్రీనివాస్‌కు మెసేజ్ వచ్చింది. తర్వాత 9వ తేదీన ఊదుసార్లు ఏటీఎం నుంచి రూ.25,970 డ్రా అయ్యాయి. దీంతోతో బాధితుడు 9వ తేదీన బ్యాంక్‌కు వెళ్లి అధికారులతో మాట్లాడాడు. బ్యాంకు అధికారులు నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో శ్రీనివాస్ సైబర్ క్రైం పోసులకు ఫిర్యాదు చేశారు. తనను మోసం చేసిన వారిని పట్టుకుని న్యాయం చేయాలని, మరెవ్వరికి తనలా మోసపోకుండా జాగ్రత్త పడాలని బాధితుడు శ్రీనివాస్ తెలిపారు. -
ఏటీఎం కార్డు రెన్యువల్ పేరుతో మోసం
కుక్కునూరు : ఏటీఎం కార్డు రెన్యువల్ చేస్తామని చెప్పి ఖాతాలో డబ్బును దొంగిలించిన ఘటన శనివారం జరిగింది. బాధితుని కథనం ప్రకారం.. కుక్కునూరుకు చెందిన నక్కా కృష్ణ భద్రాచలం ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. శనివారం సాయంత్రం సమయంలో అతనికి ఒకరు ఫోన్ చేసి తాము బ్యాంకు నుంచి చేస్తున్నామని, మీ ఏటీఎం కార్డు రెన్యువల్ చేయాలని, ఆ కార్డు ఏ సంవత్సరంలోదో చేప్పాలని హిందీలో అడిగారు. దీంతో కృష్ణ ఆ వివరాలు చెప్పాడు. వెంటనే అతని సెల్‌కు ఖాతా నుంచి రూ.7,000 డ్రా చేసినట్లు మెసేజ్ రావడంతో అవాక్కయిన కృష్ణ స్థానిక ఆంధ్రా బ్యాంక్ మేనేజర్‌తో తనకు ఫోన్ చేసిన నంబర్‌కు మాట్లాడించాడు. అవతల వ్యక్తి ఇంకా ఏమైనా నంబర్లు ఉంటే ఇవ్వాలని మేనేజర్‌ను కోరాడు. మీ చేతనైంది చేసుకోవాలని సవాల్ విసిరాడు. దీంతో లబోదిబోమనడం కృష్ణ వంతైంది. -
ఏటీఎం కార్డు చాకచక్యంగా మార్చి..
ఏటీఎం కార్డు మార్చిన యువకుడు రూ. 40 వేలు డ్రా చేసుకున్న వైనం మోసం ఆలస్యంగా గ్రహించిన ఖాతాదారుడు అద్దంకి(ప్రకాశం): బ్యాంకు డిపాజిట్ మిషన్‌లో డబ్బును ఎలా డిపాజిట్ చేయాలో తెలియని ఖాతాదారుకు ఓ కుర్రాడు సహాయం చేశాడు. డిపాజిట్ చేసే సమయంలోనే, ఖాతాదారు కార్డును చాకచక్యంగా మార్చి తన కార్డును వారికిచ్చాడు. ఆ కార్డుతో దర్జాగా అదే బ్యాంకు ఏటీఎం నుంచి రూ. 40 వేల నగదును డ్రా చేసుకుని, అంకుల్ మీ కార్డు మారిందటూ వారి కార్డును వారికిచ్చి, తన కార్డును తీసుకుని ఏమీ ఎరగనట్టు వెళ్లిన కుర్రాడి ఘరానా మోసం పట్టణంలోని ఎస్బీఐ ఏటీఎం వద్ద మంగళవారం చోటుచేసుకుంది. వివరాలు.. స్థానిక నగర పంచాయతీలో కాంట్రాక్టు వర్కర్‌గా పనిచేస్తున్న వెంకటస్వామి తన వద్ద ఉన్న రూ. 1లక్ష నగదును ఎస్బీఐ ఏటీఎం ప్రక్కనే డిపాజిట్ మిషన్‌లో జమ చేసేందుకు భార్యతో కలిసి వెళ్లాడు. నగదును ఎలా డిపాజిట్టు చేయాలో తెలియక చూస్తున్న సమయంలో ఓ కుర్రాడు తాను సహాయం చేస్తానన్నాడు. నమ్మిన వెంకట స్వామి దపంతులు తమ వద్ద ఉన్న నగదును, ఏటీఎం కార్డును ఆ కుర్రాడికివ్వగా అతను రూ. 1లక్ష డబ్బును రెండు విడతలుగా రూ. 30 వేల చొప్పున, మరోసారి రూ. 40 వేలను డిపాజిట్టు మిషన్‌లో జమ చేశాడు. ఇదిగో మీ కార్డు అంటూ ఇచ్చాడు. మరలా కొంతసేపటికి వచ్చి అయ్యా మీ కార్డు నా కార్డు మారిపోయిందంటూ వారి కార్డు వారికిచ్చి అంతకు ముందు వారికిచ్చిన తన కార్డును తీసుకుని వెళ్లిపోయాడు. అనుమానం వచ్చిన ఖాతాదారు బ్యాంకుకు వెళ్లి నగదును సరిచూసుకోగా ఖాతాలో రూ. 40 వేలు లేకపోవడాన్ని తెలుసుకుని లబో దిబోమన్నారు. సీసీ టీవీ పుటేజీల్లో చూడగా తమకు సహాయం చేసిన కుర్రాడు అంతకు ముందు బ్యాంకులో తచ్చాడినట్లు తెలుసుకున్నాడు. ఈ విషయమై నిందితుడ్ని గుర్తించేందుకు తాము పోలీసులను ఆశ్రయించనున్నట్లు బాధితుడు తెలిపారు.