కార్డు రెన్యువల్ అంటూ డబ్బు లాగేశారు.
Published Tue, Mar 14 2017 10:01 PM | Last Updated on Sat, Aug 25 2018 6:13 PM
మామిడికుదురు(తూర్పుగోదావరి): ఏటీఎం సమాచారం ఎవ్వరు అడిగినా చెప్పొద్దంటూ ఎంతగా మొత్తుకుంటున్నా పెడచెవిన పెట్టి మోస పోతున్న సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ కోవకు చెందినదే తాజా సంఘటన . ఖాతాదారుడికి మాయ మాటలు చెప్పి అతని బ్యాంకు ఖాతా నుంచి రూ.1, 99, 600 లక్షలు డ్రా చేశారు.
రాజోలు ఎస్సై ఎస్.లక్ష్మణరావు తెలిపిన వివరాలమేరకు మామిడికుదురు మండలం గోగన్నమఠం గ్రామానికి చెందిన దాకే విశ్వనాధానికి జగ్గన్నపేట ఎస్‌బీఐ శాఖలో ఖాతా ఉంది. గత నెల 17వ తేదీన అతని సెల్‌కు జగ్గన్నపేట ఎస్‌బీఐ మేనేజర్ పేరుతో అపరిచిత వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. మీ ఏటీఎం కార్డు పాడైపోయింది. దాన్ని రెన్యువల్ చేయించుకోవల్సి ఉందని, అందుకు గాను మీ ఏటీఎం కార్డు నెంబర్ చెప్పాలని అపరిచిత వ్యక్తి విశ్వనాధంను అడిగాడు.
అతని మాటలు నమ్మిన విశ్వనాధం ఏటీఎం కార్డు నంబర్ చెప్పాడు. తరువాత డబ్బులు అవసరమై బ్యాంకుకు వెళ్లి చూడగా అతని ఖాతాలో డబ్బులు పోయినట్టు తెలుసుకుని లబోదిబోమన్నాడు. గత నెల 17, 18, 19, 20 తేదీల్లో వరుసగా నాలుగు రోజులు రూ.49,900 వంతున మొత్తం రూ.1,99,600 తన ఖాతా నుంచి ఆగంతకులు డ్రా చేశారని విశ్వనాధం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన కుమార్తె పెళ్లి ఖర్చుల కోసం ఈ మొత్తాన్ని బ్యాంకు ఖాతాలో దాచుకున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బు చోరీతో పెళ్లి ఆగిపోయిందని వాపోయాడు. విశ్వనాధం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై లక్ష్మణరావు తెలిపారు.
Advertisement
Advertisement