
‘గుండె’ను పిండిన దగా!
- కొడుకు గుండె పరీక్షకు దాచుకున్న డబ్బు
- ఏటీఎం కార్డు రెన్యువల్ పేరుతో మాయం
గట్టు : ఏటీఎం కార్డు రెన్యువల్ అంటూ ఓ ఫోన్ కాల్‌కు స్పందించిన పాపానికి కొడుకు గుండె ఆపరేషన్ కోసం బ్యాంకులో దాచుకున్న డబ్బు పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లాలో శుక్రవారం జరిగింది. గట్టు మండలం చింతలకుంటకు చెందిన వీరన్నకు మాచర్ల ఆంధ్రా బ్యాంకులో ఖాతా ఉంది. వీరన్న పెద్ద కుమారుడు సంతోష్(9) గుండెలో రంధ్రం పడింది. వైద్యానికి రూ.30 వేలు ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పారు. దీంతో అతను డబ్బు పోగు చేసి రూ.15,200 ఖాతాలో వేశాడు. హైదరాబాద్‌కు వెళ్లే క్రమంలో డబ్బులు దగ్గర పెట్టుకుంటే ఎవరైనా దోచుకునే అవకాశం ఉంటుందని భావించి ముందు జాగ్రత్తగా ఖాతాలో వేసి ఏటీఏం కార్డును తీసుకున్నాడు.
ఇదే క్రమం లో శుక్రవారం ఉదయం 99340 41804 నంబర్ నుంచి వీరన్న సెల్‌కు కాల్ వచ్చింది. ఆంధ్రాబ్యాంక్ హెడ్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నామని, ఏటీఎం కార్డుపై ఉన్న నంబర్లు చెప్పాలని కోరడంతో వాటిని సదరు వ్యక్తికి తెలియజేశాడు. కొంతసేపటి తర్వాత అతని సెల్‌కు డబ్బులు డ్రా చేసినట్లు మెసేజ్ రావడంతో బిక్కమొహం వేయాల్సి వచ్చింది. వెంటనే మాచర్లలోని ఆంధ్రాబ్యాంక్ అధికారులకు విషయం చెప్పినా ఏమి చేయలేమని చేతులేత్తేసినట్లు బాధితుడు తెలిపాడు. జరిగిన మోసంపై గట్టు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.