పాలక్ ముచ్చల్ అనే పేరు వినిపించగానే తీయటి పాట ఒకటి గుర్తొస్తుంది సింగర్‌గా మంచి పేరు తెచ్చుకున్న పాలక్ సామాజిక సేవలోనూ తన వంతుగా కృషి చేస్తోంది. ఫండింగ్ ద్వారా ఇప్పటి వరకు మూడు వేల మంది పేద పిల్లలకు గుండె ఆపరేషన్‌లు చేయించింది. బాలీవుడ్ సినిమా ‘ఎంఎస్ దోని–ది ఆన్‌టోల్డ్ స్టోరీ’లోని ‘కౌన్ తుఝే’ పాటతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది పాలక్. ఇండోర్‌కు చెందిన పాలక్‌కు కాలేజీ రోజుల నుంచి పాటతో పాటు సేవా బాటలో పయనించడం అంటే కూడా ఇష్టం.
పాలక్ తొలి ఫండ్ రైజింగ్ ్రపాజెక్ట్ కార్గిల్ వీర సైనికుల కోసం చేసింది. ప్రతి షాప్ ముందుకు వెళ్లి దేశభక్తి గీతాలు పాడి ‘కార్గిల్ వీర సైనికులకు మీ వంతుగా సహాయం చేయండి’ అని అడిగేది. కళ, సామాజిక సేవను పాలక్ వేరు చేసి చూడదు. మూడు వేల మంది పేద పిల్లలకు గుండె ఆపరేషన్‌లు చేయించడానికి తనలోని కళ బలమైన మాధ్యమంగా ఉపయోగపడుతుందని చెబుతుంది పాలక్.
సినిమాల్లో అవకాశాలు దొరకని రోజుల్లో కూడా ఎన్నో ప్రోగ్రామ్స్ చేసి పేద పిల్లల కోసం విరాళాలు సేకరించేది. పాలక్ ఒక మ్యూజిక్‌ప్రోగ్రామ్ చేసిందంటే పది మంది పేద పిల్లల వైద్యానికి అవసరమైన డబ్బును సేకరించినట్లే. బాలీవుడ్‌లో సింగర్‌గా పాలక్‌కు మంచి పేరు రావడమే కాదు ఆ పేరు విరాళల సేకరణకు బాగా ఉపయోగపడింది.
‘మీ పాట అద్భుతం’ అనే ప్రశంస కంటే, పేదింటి తల్లిదండ్రుల గొంతు నుంచి వినిపించే... ‘మీ వల్ల మా బిడ్డ బతికింది’ అనే మాట పాలక్‌కు ఎక్కువ సంతృప్తి ఇస్తుంది. ఇప్పుడు పాలక్ వెయిటింగ్ లిస్ట్‌లో 413 మంది పిల్లలు ఉన్నారు. వారికి హార్ట్ సర్జరీలు చేయించాల్సిన బాధ్యతను భుజాలకెత్తుకుంది. ‘మనస్ఫూర్తిగా కోరుకుంటే అంతా మంచే జరుగుతుంది. పేదపిల్లలకు అండగా నిలవడానికి ఇది దేవుడు ఇచ్చిన అవకాశంగా భావిస్తాను’ అంటుంది పాలక్ ముచ్చల్.
Comments
Please login to add a commentAdd a comment