ఏకా లఖానీ.. డైరెక్టర్స్ కాస్ట్యూమ్ డిజైనర్. స్టార్ బాడీలాంగ్వేజ్‌ని కాదు.. పర్సనాలిటీని బట్టి స్టయిల్‌ని క్రియేట్ చేసే స్టయిలిస్ట్! అందుకే ఆమె ఇటు ఫ్యాషన్ అటు బాలీవుడ్ ఇండస్ట్రీస్‌లో మోస్ట్ వాంటెడ్!
ఫ్యాషన్ డిజైనర్ కావాలని, సినిమాల్లో పనిచేయాలని ఎప్పుడూ అనుకోలేదు ఏకా లఖానీ. ఇంటర్‌లో సైన్స్ స్టూడెంట్. మంచి మార్కులతోనే ఇంటర్ పాస్ అయింది. తర్వాత ఏం చేయాలో తెలీలేదు. తనేం చేయగలదో కూడా ఆమెకు ఐడియా లేదు. కానీ ఆ తండ్రికి తెలుసు.. తన కూతురికి మంచి ఈస్తెటిక్ సెన్స్ ఉందని, ఆర్ట్‌లో కానీ.. ఫ్యాషన్ రంగంలో కానీ చక్కగా రాణించగలదని! అందుకే ఆమెను ఆ దిశగా ప్రోత్సహించాడు.
ఆ ప్రోత్సాహం ఏకాను తన టాలెంట్‌ని గ్రహించేలా చేసింది. ముంబైలోని ఎస్‌ఎన్‌డీటీ (Sreemati Nethabai Damodar Thackersey) విమెన్స్ (women's) యూనివర్సిటీలో చేరింది. అక్కడ డిగ్రీ పూర్తయ్యాక న్యూయార్క్ ఫ్యాషన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మాస్టర్స్ కూడా చేసింది. ఆ టైమ్‌లోనే పిలుపు వచ్చింది ప్రముఖ ఫ్యాషన్ అండ్ కాస్ట్యూమ్ డిజైనర్ సబ్యసాచీ ముఖర్జీ మణిరత్నం సినిమాకు పని చేస్తున్నాడని.. అతను ఒక అసిస్టెంట్ కోసం చూస్తున్నాడు.. రమ్మని! వచ్చేసింది.. వర్క్ చేసి మణిరత్నంని ఇంప్రెస్ కూడా చేసింది.
అది ‘రావణ్’ సినిమా. అక్కడి నుంచి మణిరత్నంతో అసోసియేట్ అవుతూ వస్తోంది మొన్నటి పొన్నియన్ సెల్వన్ వరకు! ‘రావణ్’ చేస్తున్నప్పుడే ఆమె పనితీరు నచ్చి, మెచ్చి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ అండ్ డైరెక్టర్ సంతోష్ శివన్ ఆమెకు తను తీసిన ‘ఊర్మి’కి కాస్ట్యూమ్స్‌ని డిజైన్ చేసే చాన్స్ ఇచ్చి ఏకాను మలయాళ చిత్ర పరిశ్రమకు పరిచయం చేశాడు.
మరి బాలీవుడ్‌కి?
‘నేను చేసిన సౌత్ ఇండియన్ మూవీస్ వర్క్‌తోనే బాలీవుడ్ నన్ను గుర్తించి అక్కడ చాన్సెస్ ఇచ్చింది. అందుకే మణిరత్నం సర్‌కి సదా కృతజ్ఞురాలిని’ అంటుంది ఏకా లఖానీ. బాలీవుడ్‌లో ఆమె.. రాజ్‌కుమార్ హిరానీ, కరణ్ జోహర్ లాంటి దర్శకులకు ఆస్థాన కాస్ట్యూమ్ డిజైనర్‌గా మారింది. ఫ్యాషన్ అండ్ స్టయిల్ అంటే ఈస్తెటిక్స్, ట్రెండ్స్ మాత్రమే కాదు.. కల్చర్, క్లయిమేట్ అండ్ పర్సనాలిటీల పరిశీలన, అవగాహన అండ్ విశ్లేషణ అని ఆమె అభిప్రాయం.
అది ఆమె ఆచరణలోనూ కనిపిస్తుంటుంది తన వస్త్రధారణలో అయినా.. సినిమాలకు కాస్ట్యూమ్స్ డిజైన్ చేసినా.. సెలబ్రిటీలకు స్టయిల్‌ని సెట్ చేసినా! ఈ లక్షణమే ‘సంజు’ లాంటి బయోపిక్స్, ‘పొన్నియన్ సెల్వన్’ లాంటి పీరియాడికల్ డ్రామాస్, ‘షేర్‌షా’ లాంటి వార్ డ్రామాస్, ‘జుగ్ జుగ్ జియో’ లాంటి ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్స్, ‘క్వీన్’ లాంటి వెబ్‌సిరీస్‌కి పనిచేసి ఈరోజు ఆమెను వర్సటైల్ కాస్ట్యూమ్ డిజైనర్‌గా నిలబెట్టింది. ఆ నైజమే రణ్‌వీర్ సింగ్, కరణ్ జోహార్, రణ్‌బీర్ కపూర్ లాంటి సెలబ్రిటీలకు స్టయిలిస్ట్‌గా ఆపర్చునిటీని తెచ్చిపెట్టింది. ‘ఈ డీటేయిలింగ్ నేర్పింది కూడా మణి సరే’ అంటూ మళ్లీ మణిరత్నంకే క్రెడిట్ ఇస్తుంది ఏకా!
డ్రైవింగ్ ఫోర్స్..
భిన్న భాషల్లో.. విభిన్నమైన పాత్రలను ఆకళింపు చేసుకుంటూ డిజైన్ చేసే ఆమె కాస్ట్యూమ్స్ యాక్టర్స్‌కి ప్రత్యేక గుర్తింపునే కాదు ఫ్యాషన్ ప్రపంచంలో కొత్త ఒరవడినీ సృష్టిస్తున్నాయి. ఆమెనో డ్రైవింగ్ ఫోర్స్‌గా మలస్తున్నాయి. ఏకా లఖానీ అవసరాన్ని అనివార్యం చేస్తున్నాయి.
ట్రెండ్స్‌తో ఇన్‌ప్లుయెన్స్ కాక చేస్తున్న సినిమా స్పిరిట్‌ని గ్రహించి దానికి తగ్గట్టుగా కాస్ట్యూమ్స్‌ని తయారుచేయాలని మణి సర్ దగ్గర, ఫస్ట్ షాట్‌తోనే ఆడియెన్స్ కనెక్ట్ అయ్యేలా క్యారెక్టర్స్ కాస్ట్యూమ్స్ ఉండాలని రాజు (రాజ్‌కుమార్ హిరానీ) సర్ దగ్గర, కొత్తగా.. వావ్ అంటూ ఆడియెన్స్ అబ్బురపడే ఫ్యాషన్‌ని చూపించాలని కరణ్ దగ్గర నేర్చుకున్నాను. ఇలా నేను పనిచేసిన ప్రతి డైరెక్టర్, నేను స్టయిల్ చేస్తున్న ప్రతి సెలబ్రిటీ దగ్గర ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటూ నా పనికి మెరుగులు దిద్దుకుంటున్నాను. ఫ్యాషన్ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్ పాఠాలకన్నా వర్క్ ద్వారా నేర్చుకుంటున్నదే ఎక్కువ! – ఏకా లఖానీ
ఇవి చదవండి: Nidhi Bhist: మెయిన్ రోల్స్.. ప్చ్.. కష్టమే..! కానీ ఇప్పుడు నిధి ద బెస్ట్!!
Comments
Please login to add a commentAdd a comment