అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌ల జామ్‌నగర్ ప్రీవెడింగ్ సెలబ్రేషన్ గుర్తుండే ఉంటుంది! ఆ వేడుకలో కళ్లు తిప్పుకోనివ్వని ముస్తాబుతో మెరిసిపోయింది పెళ్లికూతురు. అంతేకాదు ఆ ఈవెంట్‌కి హాజరైన ఆలియా భట్, కరీనా కపూర్ ఖాన్, సోనమ్ కపూర్, నతాశా పూనావాలాలూ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. రాధికా మర్చంట్ సహా వాళ్లందరినీ అంత అందంగా తయారుచేసిన స్టయిలిస్ట్ రియా కపూర్! ఆమె నైపుణ్యానికి ఆ సంబరాన్ని మించిన ఉదాహరణ లేదేమో! ఆమె ప్రతిభకు విశేషణం జోడించాలంటే.. ‘గివ్ ఏ గర్ల్ ద రైట్ షూస్ అండ్ షి కెన్ కాంకర్ ద వరల్డ్!’ అని హాలీవుడ్ స్టార్ మార్లిన్ మాన్రో మాట. దాన్ని నిజం చేసి చూపించింది రియా కపూర్.. ప్రొడ్యూసర్, సెలబ్రిటీ స్టయిలిస్ట్ అండ్ ఆంట్రప్రెన్యూర్‌గా.. అని చెప్పాలి!
ఇండియాలో ఫ్యాషన్ ఇండస్ట్రీ.. కాలు మోపలేనంత మంది ఉద్దండులతో నిండిపోయుంది. అలాంటి రంగంలోకి ‘డ్రమాటిక్ లిటరేచర్’ ఎడ్యుకేషనల్ బ్యాక్‌గ్రౌండ్‌తో.. ఫ్యాషన్ మీద ఆసక్తి అనే ఒకే ఒక్క క్వాలిఫికేషన్‌తో తల దూర్చి.. తన స్టయిల్‌ను ప్రదర్శించగలిగేంత స్పేస్.. గుర్తింపు పొందగలిగేంత ప్రత్యేకతను సాధించింది రియా కపూర్! ఈ మొత్తం ప్రయాణంలో ఆమెక్కడా తన తండ్రి పరపతిని ఉపయోగించుకోలేదు. తన శక్తినే నమ్ముకుంది! ఇంతకీ వాళ్ల నాన్న ఎవరంటే బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్.
ఆయనకు రియా రెండో సంతానం. నటి సోనమ్ కపూర్‌కి చెల్లి. వాళ్లమ్మ సునీతా కపూర్ జ్యూలరీ డిజైనర్. ‘మా చిన్నప్పుడు మా అమ్మ, పిన్ని ఇద్దరూ పెయింటింగ్ వేస్తుంటే అదేంటో నాకు తెలిసేది కాదు.. గోడల మీద పెయింట్ వేసినట్టే అనిపించేది. నాకు ఊహ తెలిశాక ఒకసారి మా అమ్మ పెయింట్ చేసిన చిన్న ఫ్రేమ్‌లో ఒక ఇంటర్నేషనల్ జ్యూలరీ బ్రాండ్ లాకెట్‌ను చూశాను. అప్పుడు తెలిసింది మా అమ్మ పెయింటింగ్ వాల్యూ! అప్పటి నుంచి నాకు డిజైనింగ్.. ఫ్యాషన్ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది’ అని చెబుతుంది తన స్టయిలింగ్ పునాది ఎక్కడ పడిందో గుర్తుచేసుకుంటూ! అయినా అకడెమిక్‌గా ఆర్ట్స్‌ని ఎంచుకుంది. న్యూయార్క్‌లో ‘డ్రమటిక్ లిటరేచర్’ చదివింది.
దానికి తగ్గట్టే తొలుత నిర్మాతగా మారింది ‘ఆయశా’ చిత్రంతో! తర్వాత ఖూబ్‌సూరత్, వీరే ది వెడింగ్, థాంక్యూ ఫర్ కమింగ్, క్రూ సినిమాలనూ ప్రొడ్యూస్ చేసింది. ఖూబ్‌సూరత్, వీరే ది వెడింగ్ మూవీస్ ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఒకరకంగా ఆ సినిమాలతోనే ఆమె స్టయిలింగ్ కెరీర్ కూడా మొదలైందని చెప్పొచ్చు. ఎందుకంటే ‘ఆయశా’ స్టయిలిస్ట్ అయిన పర్నియా కురేశీకి రియా అసిస్టెంట్‌గా వ్యవహరించింది. ఆ లెక్కన ఆమె తొలి క్లయింట్ తన సోదరి సోనమ్ కపూరే! రియా పూర్తి స్టయిలిస్ట్‌గా మారింది మాత్రం కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్ వాక్‌కి సోనమ్‌ను తీర్చిదిద్ది! అప్పటి నుంచి అక్కకు పర్సనల్ స్టయిలిస్ట్‌గా అపాయింట్ అయింది.
తన బ్యానర్‌లోని సినిమాల కథానాయికలకూ తనే స్టయిలింగ్ చేస్తోంది. అలా కరీనా కపూర్, భూమి పెడ్నేకర్, టబు, కృతి సనన్ మొదలైన హీరోయిన్లకూ స్టయిలింగ్ చేసింది రియా! ప్రముఖ స్టయిలిస్ట్‌లు అభిలాషా దేవ్నానీ, తాన్యా ఘావ్రీలతోనూ పనిచేసింది. అక్కతో కలసి ‘రిసోన్’అనే ఫ్యాషన్ బ్రాండ్‌నూ స్టార్ట్ చేసింది. అంతేకాదు వీగన్ ఫుట్‌వేర్ బ్రాండ్ ‘ద సీఐఏ స్టోర్’తోనూ కలసి ప్లస్ సైజ్ మహిళల కోసం ‘ఆర్‌కే’ పేరుతో షూస్‌ని డిజైన్ చేసింది. ఇలా అన్ని రంగాల్లో తన మార్క్ చూపిస్తూ సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతోంది రియా కపూర్!
కొత్తగా ఆలోచించడం.. కొత్తగా చేయడం.. ఆ క్రమంలో సవాళ్లను ఎదుర్కోవడం నాకు చాలా ఇష్టం. నా జర్నీని మోటివేట్ చేసేది అదే! స్టయిల్ అంటే సెలబ్రేటింగ్ ద మూడ్. మన కట్టుబొట్టు ద్వారా మన మూడ్‌ని అవతలి వాళ్లకు కమ్యూనికేట్ చేయడం! ఆత్మను పట్టుకోవడం! ఇంకా చెప్పాలంటే కంఫర్ట్! ఫ్యూచర్ అంతా క్రూయల్టీ ఫ్రీ ఫ్యాషనే! అంటే వీగన్ ఫ్యాషన్! ఈ రంగంలోకి వచ్చే వాళ్లెవరైనా ఫలితాన్ని ఆశించి కాదు.. ఆ ప్రయాణాన్ని నమ్మి రావాలి! – రియా కపూర్
Comments
Please login to add a commentAdd a comment