బాలీవుడ్‌లో అనుష్కా శర్మకు మంచి నటిగానే కాదు స్టయిల్ ఐకాన్‌గానూ పేరుంది. ఎయిర్ పోర్ట్ లుక్ నుంచి రెడ్‌కార్పెట్ వాక్ దాకా సందర్భానికనుగుణంగా ఆమె «ధరించే కాస్ట్యూమ్స్‌కి వీర ఫ్యాన్ బేస్ ఉంది. ఆ ఫ్యాషనిస్టా వెనుక స్టయిలిస్ట్ అలియా అల్ రుఫై కృషి ఉంది. ఆమె ఎవరో తెలుసుకుందాం..
అలియా అల్ రుఫై.. వాళ్లమ్మ ఇండియన్. నాన్న అరబ్. అందుకే తనను తాను హాఫ్ ఇండియన్, హాఫ్ అరబ్‌గా అభివర్ణించుకుంటుంది అలియా. పన్నెండవ ఏట నుంచే ఆమెకు ఫ్యాషన్ మీద ఆసక్తి ఏర్పడింది. కారణం వాళ్లమ్మే. వింటేజ్ స్టయిల్‌కి కంటెంపరరీ టచ్‌నిచ్చి క్రియేట్ చేసుకునే ఆమె డ్రెస్‌లు, బ్లౌజెస్ అలియాను అమితంగా ఆకట్టుకునేవట. ఆ ఆకర్షణే తన చుట్టూన్న వాళ్ల డ్రెస్ సెన్స్‌ని, కల్చర్స్‌ని గమనించే గుణాన్ని పెంచిందట అలియాలో. ఆ తపనే ఆమెకు ఫ్యాషన్ మ్యాగజైన్స్‌నీ పరిచయం చేసింది. వాటి ప్రభావంతో తన డైలీ రొటీన్ డ్రెసెస్‌లోనే ఏదో ఒక కొత్తదనాన్ని తీసుకొచ్చేది.
తన ఫ్రెండ్ సర్కిల్లో కాంప్లిమెంట్స్ అందుకునేది. ఒకసారి బాల్యంలోనే.. ఇతిహాద్ ఎయిర్‌వేస్‌లో బిజినెస్ క్లాస్‌లో ప్రయాణిస్తున్నప్పుడు.. ఒక బ్లాంకెట్‌ని ఇంటికి పట్టుకొచ్చేసిందిట దొంగతనంగా! తర్వాత దాన్ని స్కర్ట్‌గా మలచుకుందట. అలా ఆమెకు ఫ్యాషన్ మీదున్న శ్రద్ధ తనతో పాటే పెరుగుతూ వచ్చింది. ముంబై యూనివర్సిటీలో ఏంబీఏ పూర్తి చేసింది. అయినా ఏదో వెలితి. తనకు జాబ్ శాటిస్‌ఫాక్షన్ దొరికేది ఫ్యాషన్ రంగంలోనే అని ఆమె ప్రగాఢ విశ్వాసం. అందుకే ‘హార్పర్స్ బజార్’లో జూనియర్ ఫ్యాషన్ ఎడిటర్‌గా ఆఫర్ వస్తే.. రెండో ఆలోచన లేకుండా అందులో చేరింది.
అక్కడ పనిచేస్తున్నప్పుడే అనుకోకుండా బాలీవుడ్ నుంచి కాల్ అందుకుంది.. ‘మధుర్ భండార్కర్ తీస్తున్న ‘ఫ్యాషన్’ సినిమాకి స్టయిలిస్ట్‌గా ఉన్న రీతా ధోడీకి అసిస్టెంట్ కావాలి. రాగలరా?’ అంటూ! ‘వై నాట్.. అఫ్‌కోర్స్’ అంటూ వెంటనే రీతా ధోడీ స్టయిల్ టీమ్‌లో మెంబర్ అయింది. ‘తొలి అవకాశమే కంగనా రనౌత్, ప్రియంకా చోప్రాలతో కలసి పనిచేయడం.. నా అదృష్టం! వాళ్ల దగ్గర చాలా నేర్చుకున్నాను. ఇంకా చెప్పాలంటే ‘ఫ్యాషన్’ సినిమా ఫ్యాషన్ ప్రపంచం గురించి నాకెన్నో విషయాలను తెలియజెప్పింది. ఎన్నో మెలకువలనూ నేర్పింది’ అని చెబుతుంది అలియా.
ఆ సినిమా ఆమె కెరీర్‌కి మైలు రాయి అనుకోవచ్చు. అక్కడి నుంచి ఆమె ప్రయాణం ముందుకే సాగింది. పలు ఫ్యాషన్ షోలకు పనిచేసింది. ఎన్నో ఫ్యాషన్ మ్యాగజైన్స్‌కి ఆర్టికల్స్ రాసింది. అలా ఆమె నైపుణ్యం చూసిన అనుష్కా శర్మ .. అలియాను తన పర్సనల్ స్టయిలిస్ట్‌గా నియమించుకుంది. ఆమె అనుష్కా దగ్గర చేరగానే అనుష్కా తీరుతెన్నులే మారిపోయాయి. ఏ డ్రెస్ అయినా అనుష్కా కోసమే డిజైన్ అయిందేమో అన్నంత ఆప్ట్‌గా.. ఏ యాక్ససరీకైనా ఆమె వల్లే అందం వస్తుందేమో అన్నంత గ్రేస్‌ఫుల్‌గా కనిపించసాగింది ఆ నటి.
దీన్ని బాలీవుడే కాదు యూరప్ ఫ్యాషన్ ప్రపంచమూ గమనించింది. అలియాకు చాన్స్‌ల వరద కురిపించింది. సెలబ్స్ ఎవరైనా రెడ్‌కార్పెట్ మీద కాలు పెట్టాలంటే అలియా స్టయిలింగ్ చేయాల్సిందే అన్నంత పాపులర్ అయిపోయింది. అలా దీపికా పదుకోణ్, ఆలియా భట్, కియారా ఆడ్వాణీ, యామీ గౌతమ్, నర్గిస్ ఫక్రీ, శ్రద్ధా కపూర్ వంటి వాళ్లందరికీ అలియా పర్సనల్ స్టయిలిస్ట్‌గా పనిచేసింది.
ఫ్యాషన్‌లో మరింత స్కిల్ సంపాదించుకునేందుకు 2018లో మసాచ్యుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఫ్యాషన్ రంగంలో పట్టభద్రురాలైంది.
"అంకితభావం, హార్డ్‌వర్కే నన్నీ రోజు ఇండస్ట్రీలో ఈ స్థాయికి చేర్చాయి. బ్యూటీ అంటే నా దృష్టిలో సింప్లిసిటీ! మీ స్కిన్‌తో మీరు ఎంత కంఫర్టబుల్‌గా ఉంటే అంత అందంగా కనపడతారు. నా వింటేజ్ ఫ్యాషన్‌కి ఇన్‌స్పిరేషన్ మా అమ్మే అని చెబుతాను. సందర్భానికి తగ్గట్టు ఆమె రెడీ అయ్యే తీరే నాలో ఫ్యాషన్ సెన్స్‌ని పెంచింది. సీజన్స్ మారుతుంటాయి. ఫ్యాషన్ మాత్రం ఇవాల్వ్ అవుతూంటుంది. ఈ సత్యాన్ని గమనిస్తే స్టయిలిస్ట్‌లకు తిరుగులేదు.
నేర్చుకోవడానికి బాలీవుడ్‌ని మించిన ఇండస్ట్రీ లేదు. మెంటర్ కన్నా రెండడుగులు ముందుండాలి ఎప్పుడూ! ఫలానా పని చేయండి అని మెంటర్ ఆర్డర్ వేయగానే ఆల్రెడీ డన్ అనే ఆన్సర్ ఉండాలి మన దగ్గర. నా ఫిలాసఫీకి వస్తే.. ఈ క్షణంలో బతకడాన్ని మించిన ఆనందంలేదు అంటాను. అదే అందం. చిన్న చిన్న విషయాల్లో ఆనందం వెదుక్కుంటాను!" – అలియా అల్ రుఫై
ఇవి చదవండి: తను.. గూంగీ గుడియా కాదు.. ఉక్కు మహిళ!
Comments
Please login to add a commentAdd a comment