క్లియోపాత్రా నుంచి ప్రేరణ పొందిన నెయిల్‌ రింగ్స్‌ ఇవి.. | Nail Passion Designing Inspired By Cleopatra | Sakshi
Sakshi News home page

క్లియోపాత్రా నుంచి ప్రేరణ పొందిన నెయిల్‌ రింగ్స్‌ ఇవి..

Published Fri, Apr 12 2024 7:38 AM | Last Updated on Fri, Apr 12 2024 7:38 AM

Nail Passion Designing Inspired By Cleopatra - Sakshi

ప్యాషన్‌ డిజైనింగ్‌

నెయిల్‌ ఆర్ట్‌ గురించి మనకు తెలిసిందే. ఎన్నో డిజైన్లు మన చూపు తిప్పుకోనివ్వవు. ఆర్టిఫిషియల్‌ నెయిల్స్‌ని అతికించి మరీ చూడచక్కని డిజైన్లతో చేసే ఆ అలంకారం వేలి కొసలలో మెరుపులుగా కనువిందు చేస్తుంది. ఇప్పుడు వాటి స్థానాన్ని నెయిల్‌ జువెలరీ ఆక్రమిస్తోంది. ఫింగర్‌ క్లారింగ్స్‌గా ఈ నెయిల్‌ జ్యువెలరీ ఆధునికమైన టచ్‌తో అందంగా రూపుకడుతుంది. ప్రాచీనకాలంలో రక్షణలో భాగంగా చేరిన ఈ ఆభరణం ఇప్పుడు సొగసైన అలంకార జాబితాలో చేరి ప్రత్యేకతను చాటుతోంది. 

  • బంగారు, వెండి, ఇతర లోహాలలోనూ ఈ నెయిల్‌ జ్యువెలరీ అందుబాటులో ఉంది. సంప్రదాయం, ఆధునికం ఏ వేడుకైనా కొత్తగా వెలిగిపోవాలని కోరుకునే వారికి ఈ నెయిల్‌ రింగ్స్‌ సరైన ఎంపిక అవుతాయి.
  • లోహపు డిజైన్లలో ముత్యాలు, రత్నాలు, ఎనామిల్‌.. వంటివి జతచేసిన డిజైన్ల ఎంపిక మనదైన ప్రత్యేకతను చాటుతుంటుంది. లోహాన్ని బట్టి, డిజైన్‌ను బట్టి ధరలు వందల రూపాయల నుంచి అందుబాటులో ఉన్నాయి.

చరిత్రలో నెయిల్‌ జువెలరీ..
ప్రాచీన చైనా, ఈజిప్ట్‌ రాజులు, రాణుల ఈ నెయిల్‌ క్లా జ్యువెలరీ విరివిగా ధరించేవారు. పొడవాటి గోర్లు సంపదకు చిహ్నంగా భావించేవారు. వాటి వల్ల శారీర శ్రమæ చేయవలసి అవసరం లేదు. అలా శ్రమ చేయాల్సిన అవసరం లేని వారు, స్థితిమంతులుగా జాబితాలో ఉండేవారు.

అంతేకాదు, నెయిల్‌ గార్డ్‌గా పిలిచే ఈ ఆభరణాన్ని ధరించడం ప్రాచీన చైనీస్‌ మహిళలు శక్తికి, అందానికి చిహ్నంగా భావించేవారు. నెయిల్‌ క్లా లేదా గార్డుల తయారీలో సాధారణంగా లోహాలు లేదా సముద్ర తీరాల్లో లభించే ఆల్చిప్పల పెంకులను కూడా ఉపయోగించేవారు.

అయితే, ఎక్కువగా బంగారం, వెండి, కాంస్య లేదా పోత పోసిన లోహంతో తయారు చేస్తారు. ముత్యాలు, విలువైన రాళ్లను వాటిలో పొదుగుతారు. వేలిగోళ్ల గార్డు ధరించిన వారి సామాజిక స్థితిని తెలియజేసేది. 3సెం.మీ నుండి దాదాపు 15 సెంటీ మీటర్ల వరకు ఉండేలా డిజైన్‌ చేయించేవారు. కొన్నిసార్లు చిటికెన వేలు, ఉంగరపు వేలికి సరిపోయేలా డిజైన్‌ చేయించుకునేవారు. కుడిచేతి, ఎడమ చేతి డిజైన్లు భిన్నంగా ఉండేవి. తమ దేశ సంప్రదాయ ఆభరణాలలో భాగంగా ఉన్నా, రక్షణ కోసం ఉపయోగించేవిగా పేరొందాయి. వారి వారి దేశాల్లోని నాణేలు, జంతువులు, పక్షులు, మొక్కల బొమ్మలను నెయిల్‌ గార్డ్స్‌పైన డిజైన్‌ చేయించేవారు.

మహారాణి కళ..
జువెలరీ డిజైన్‌ సృష్టి, ఎంపిక అనేవి మన భావ వ్యక్తీకరణ పట్ల నుండి పుట్టుకు వచ్చిన ఆలోచన. నా డిజైన్స్‌ ఎక్కువగా బంజారా సంస్కృతికి అద్దం పడతాయి. ఎన్నో ఏళ్లుగా చూసిన వివిధ జాతుల సంస్కృతి, కళలు నా డిజైన్స్‌లో కనిపిస్తాయి. క్లియోపాత్రా నుంచి ప్రేరణ పొందిన నెయిల్‌ రింగ్స్‌ అలంకరణ మహారాణి కళను తీసుకువస్తుంది.

– భవ్య రమేష్, జ్యువెలరీ డిజైనర్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement