Masaba Gupta: మసాబా.. మసాబా.. | Masaba Gupta Is A Vibrant Wave In The Indian Fashion Industry | Sakshi
Sakshi News home page

Masaba Gupta: మసాబా.. మసాబా..

Published Sun, Sep 29 2024 3:08 AM | Last Updated on Sun, Sep 29 2024 3:17 AM

Masaba Gupta Is A Vibrant Wave In The Indian Fashion Industry

మసాబా గుప్తా.. ఇండియన్‌ ఫ్యాషన్‌ ఇండస్ట్రీలో ఒక వైబ్రెంట్‌ వేవ్‌! ఆమె రాకముందు మన ఫ్యాషన్‌లో బిగ్‌ అండ్‌ బోల్డ్‌ ప్రింట్స్‌ అంతగాలేవు! ఇప్పుడవి చాలామంది సెలబ్రిటీస్‌కి మోస్ట్‌వాంటెడ్‌ క్యాజువల్స్‌గా మారి, వాళ్ల స్టయిలింగ్‌ వార్డ్‌రోబ్స్‌కి చేరిపోతున్నాయి. క్రెడిట్‌ గోస్‌ టు ‘హౌస్‌ ఆఫ్‌ మసాబా!’  కుడోస్‌ టు క్రియేటర్‌ మసాబా గుప్తా!

నా స్కిన్‌ కలర్, నా జుట్టు తీరుతో  చాలా అవమానాలు ఎదుర్కొన్నా! అమ్మ ఇచ్చిన ధైర్యమే నన్ను నిలబెట్టింది. ఏ రంగంలో అయినా ప్రతికూలతలు ఉంటాయి. వాటిని మనకు అనుకూలంగా మలచుకోగలగడమే సక్సెస్‌! అంటుంది మసాబా గుప్తా.

మసాబా గుప్తా ఎవరో సినీ,క్రికెట్‌ ప్రియులు చాలామందికి తెలిసే ఉంటుంది. నటి నీనా గుప్తా, క్రికెటర్‌ సర్‌ వివియన్‌ రిచర్డ్స్‌ కూతురు. చిన్నప్పుడెప్పుడూ ఫ్యాషన్‌ డిజైనర్‌ కావాలని కలకనలేదు ఆమె. తండ్రిలా ఆటల మీదే ఆసక్తి చూపింది. టెన్నిస్‌ ప్లేయర్‌ కావాలని కష్టపడింది. తనకు పదహారేళ్లు వచ్చేటప్పటికి ఆ ఆసక్తి, ప్రయత్నం మ్యూజిక్, డాన్స్‌ మీదకు మళ్లాయి. లండన్‌లో ఆ రెండిటిలో శిక్షణ తీసుకోవడం మొదలుపెట్టింది. కానీ అక్కడ ఒంటరిగా ఉండలేక వాటిని మధ్యలోనే వదిలేసి ముంబై చేరుకుంది.

వచ్చాక, యాక్టింగ్‌ ఫీల్డ్‌ పట్ల ఇంట్రెస్ట్‌ చూపించింది. అది గమనించిన నీనా గుప్తా, ‘ఇక్కడి ఫిల్మ్‌ ఇండస్ట్రీ ఎక్స్‌పెక్ట్‌ చేసే సంప్రదాయ సౌందర్య ప్రమాణాలు వేరు. నువ్వు అందులో సెట్‌ కావు. సో.. ఆ ఆలోచనకు ఫుల్‌స్టాప్‌ పెట్టేయ్‌’ అంటూ బిడ్డను వెనక్కి లాగింది. ఏమాత్రం నిరుత్సాహపడక, తన క్రియేటివిటీని తన కాలేజ్‌ ఈవెంట్స్‌లో ప్రదర్శించసాగింది మసాబా. ఆ సమయంలోనే ఆమెలోని ఈస్తటిక్‌ సెన్స్, ఫ్యాషన్‌ స్పృహను కనిపెట్టిన ఫ్యాషన్‌ డిజైనర్, ఆథర్‌.. వెండెల్‌ రోడ్రిక్స్‌ ఆమెను ఫ్యాషన్‌ డిజైనింగ్‌ వైపు ప్రోత్సహించాడు. దాంతో మసాబా.. ముంబై, ఎస్‌ఎన్‌డీటీ యూనివర్సిటీ(శ్రీమతి నాథీబాయీ దామోదర్‌ ఠాక్రసే మహిళా విశ్వవిద్యాలయ్‌)లో అపరెల్‌ మాన్యుఫాక్చర్‌ అండ్‌ డిజైన్‌ను అభ్యసించింది.

తను పూర్తిస్థాయిలో ఫ్యాషన్‌ ఇండస్ట్రీలో అడుగుపెట్టే టైమ్‌కి.. పెద్ద ప్రింట్లు, డార్క్‌ కలర్ల జాడ అంతగా కనపడలేదు ఆమెకు. దాంతో ఆ రెండిటినే తన యూఎస్‌పీగా మార్చుకుని ‘హౌస్‌ ఆఫ్‌ మసాబా’ లేబుల్‌ని ఆవిష్కరించింది. ఇండియన్‌ ఫ్యాషన్‌ ప్రపంచంలో అదొక సంచలనం. లేత రంగులు, ప్లెయిన్, చిన్న చిన్న డిజైన్స్‌నే ఎంచుకుంటున్న సెలబ్రిటీలకు మసాబా ప్రింట్స్‌æ వైబ్రెంట్‌గా తోచాయి. ఆ లేబుల్‌కి మారారు. ఆ అవుట్‌ఫిట్స్‌లో సెలబ్రిటీల అపియరెన్స్‌ రేడియెంట్‌గా కనిపించసాగింది.

ప్రత్యేక స్టయిల్‌గా గుర్తింపురాసాగింది. అంతే ‘హౌస్‌ ఆఫ్‌ మసాబా’ బాలీవుడ్‌ సెలబ్రిటీల ఫేవరెట్‌ బ్రాండ్‌ అయిపోయింది. ఇంట్లో వేసుకోవడానికి మొదలు బీచ్‌లో వ్యాహ్యాళి, ప్రయాణాలు, సినిమాలు, పార్టీలు, ఫంక్షన్లు, అవార్డ్‌ ఈవెంట్స్‌ దాకా దేనికైనా మసాబా డిజైనర్‌ వేర్‌ కావాల్సిందే అని కోరుకునే స్థాయికి చేరుకుంది ఆ డిమాండ్‌! ఆ లిస్ట్‌లో సోనమ్‌ కపూర్, ప్రియంకా చోప్రా, కరీనా కపూర్‌ ఖాన్, కరిశ్మా కపూర్, కత్రినా కైఫ్, రాణీ ముఖర్జీ, విద్యా బాలన్, సొనాక్షీ సిన్హా, మీరా రాజ్‌పుత్‌ కపూర్, మౌనీ రాయ్, కరణ్‌ జోహార్‌ లాంటి మహామహులంతా ఉన్నారు. 

‘హౌస్‌ ఆఫ్‌ మసాబా’ వెడ్డింగ్, రిసార్ట్‌ వేర్‌లోనూ సిగ్నేచర్‌ డిజైనింగ్‌ను మొదలుపెట్టింది. అంతేకాదు స్విమ్‌ వేర్, మెన్స్‌ వేర్, ఫ్యాషన్‌ జ్యూల్రీలోనూ తన నైపుణ్యాన్ని చూపిస్తోంది.

ఇవి చదవండి: Elnaaz Norouzi: పర్షయన్‌ ప్రజ్ఞ!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement