అన్నూ పటేల్.. ఫ్యాషన్ ఇండస్ట్రీలో స్పెషల్ స్టయిల్ ఆమెది! ఆ స్పెషాలిటీకి బాలీవుడ్ ఫిదా అయింది! అటు ఫ్యాషన్‌లో.. ఇటు స్టార్స్ స్టయిలింగ్‌లో సీనియర్స్‌తో ఇన్‌స్పైర్ అవుతూ, తన ప్రత్యేకతను చాటుకుంటూ సాగుతున్న ఆమె గురించి నాలుగు మాటలు ..
అన్నూ పటేల్ స్వస్థలం గుజరాత్‌లోని వడోదర. ఫ్యాషన్‌గా ఉండటం, రకరకాల కలర్ కాంబినేషన్స్‌లో బట్టలు కుట్టించుకోవడమంటే ఆమెకు చిన్నప్పటి నుంచి ఆసక్తి. కనుకే, ఫిజియోథెరపీలో చేరిన కొన్నాళ్లకే అది తన కప్ ఆఫ్ టీ కాదన్న విషయాన్ని గ్రహించింది. ఫ్యాషన్ మీదే మనసు పారేసుకుంది. ఆలస్యం చేయక, వడోదరలోని ఐఎన్‌ఐఎఫ్‌డీ (ఇంటర్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైన్)లో చేరింది. గ్రాడ్యుయేషన్ ఫస్టియర్‌లోనే ఆమె ఫ్యాషన్ ఐడియాస్‌కి ముచ్చటపడిన ఇన్‌స్టిట్యూట్ ఆమెకు ‘ద మోస్ట్ ఇన్నోవేటివ్ కలెక్షన్’ అవార్డ్‌నిచ్చింది. సెకండియర్‌లో ఉన్నప్పుడు ‘అన్నూస్ క్రియేషన్’ లేబుల్‌ను స్టార్ట్ చేసింది.
ఆ చిన్న పట్టణంలో ఫ్యాషన్ ఇన్‌స్టిట్యూట్ అయితే ఉంది కానీ.. డిజైనర్ వేర్‌కి డిమాండ్ ఎక్కడ? అందుకే మొదట్లో తను డిజైన్ చేసిన దుస్తులను ఇంటింటికీ వెళ్లి అమ్మి, డిజైనర్ వేర్ పట్ల మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వారికి మోజు కలిగేలా చేసింది. ఆ ప్రయత్నం.. ఆమె చదువైపోయేలోపు ఫ్యాషన్ మార్కెట్‌లో ‘అన్నూ క్రియేషన్’కి స్పేస్‌ని క్రియేట్ చేసింది. దాన్ని స్థిరపరచు కోవాలంటే తన లేబుల్‌కు ఒక స్పెషాలిటీ ఉండాలని ఆలోచించింది అన్నూ. ఈ దేశంలో పెళ్లికిచ్చే ప్రాధాన్యం స్ఫురణకు వచ్చింది.
బ్రైడల్ వేర్ డిజైన్‌లో తన ప్రత్యేకతను చాటుకుంటే తన మార్కెట్ ఎక్కడికీ పోదని తెలుసుకుంది. తన ఐడియాను అర్థం చేసుకునే టీమ్‌ని ఎంచుకుని డిజైనింగ్ మొదలుపెట్టింది. తొలుత సామాన్యులకే బ్రైడల్ వేర్ ఇచ్చింది. అవి అసామాన్యుల మనసునూ దోచాయి. దాంతో అన్నూ క్రియేషన్ సెలబ్రిటీల స్థాయికి చేరింది. బ్రైడల్ వేర్ చేస్తున్నప్పుడే అన్నూకి ఫ్యాషన్ మార్కెట్‌లో ఎత్నిక్ వేర్‌కీ స్పేస్ కనపడింది. ముందు తనకు, తన టీమ్‌కి క్యాజువల్ ఎత్నిక్ వేర్ డిజైన్ చేసి, వాటిని ధరించి.. ఫొటో షూట్ చేయించి, సోషల్ మీడియాలో పోస్ట్ చేయసాగింది. అవీ సెలబ్రిటీల దృష్టిలో పడి అన్నూ బ్రాండ్‌కి క్యూ కట్టసాగారు.
ఆ డిమాండ్‌ను చూసి ‘ఎఫ్ అండ్ ఎఫ్ (ఫ్రిల్ అండ్ ఫ్లేర్)’ పేరుతో క్యాజువల్ ఎత్నిక్ వేర్ డిజైన్‌ను స్టార్ట్ చేసింది. ‘ఎఫ్ అండ్ ఎఫ్’ అంటే కుర్తీలు, ఇండో– వెస్ట్రన్ అవుట్‌ఫిట్స్‌కి పర్‌ఫెక్ట్ బ్రాండ్ అనే ఫేమ్‌ని సంపాదించింది. తనే కొత్త అవుట్‌ఫిట్‌ని డిజైన్ చేసినా వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం అన్నూ అలవాటు. అలా ఆమె డిజైన్స్ అన్నిటినీ ఫాలో అయిన కొందరు బాలీవుడ్ సెలబ్స్.. తమకు స్టయిలింగ్ చేయమని ఆమెను కోరారు. తొలుత అప్రోచ్ అయింది మలైకా అరోరా! ఆ తర్వాత కృతి ఖర్బందా, సోఫీ చౌధరీ, తారా సుతారియా, మౌనీ రాయ్, జాన్వీ కపూర్, హెజల్ కీచ్ వంటి వాళ్లంతా అన్నూ పటేల్ స్టయిలింగ్ క్లయింట్ల లిస్ట్‌లో చేరిపోయారు.
‘సామాన్యులకు డిజైన్ చేస్తున్నా, సెలబ్రిటీలకు స్టయిలింగ్ చేస్తున్నా.. ఆయా స్థాయిల్లో అంతే ఎఫర్ట్స్ పెడతాను, అంతే కమిట్‌మెంట్‌తో ఉంటాను. నా డిజైనర్ వేర్‌ని.. నా స్టయిలింగ్‌ని కోరుకుంటున్న వాళ్ల సంతోషమే నాకు ముఖ్యం. అది నాకు కోటి అవార్డులతో సమానం!’ అంటుంది అన్నూ పటేల్.
ఇవి చదవండి: Sanam Saeed: ప్రైడ్ ఆఫ్ పాకిస్తాన్.. ఫ్యాన్ ఆఫ్ ఇండియా!
Comments
Please login to add a commentAdd a comment