పరివర్తనం: ‘దేవరపాలెం.. దేవరపాలెం..’ | Funday Special Story Parivarthanam Written By Srinivasarao Thirukkovuluru | Sakshi
Sakshi News home page

పరివర్తనం: ‘దేవరపాలెం.. దేవరపాలెం..’

Published Sun, Sep 29 2024 1:01 AM | Last Updated on Sun, Sep 29 2024 1:01 AM

Funday Special Story Parivarthanam Written By Srinivasarao Thirukkovuluru

‘దేవరపాలెం.. దేవరపాలెం..’ అంటూ కండక్టర్‌ కనకరాజు రాబోయే స్టాపులో దిగబోయే ప్రయాణికులను అలర్ట్‌ చేస్తూ గట్టిగా అరిచాడు. కనకరాజు అరుపులకు కొంతమంది సీట్లలోంచి లేచి, హడావిడిగా తమ సామాన్లను తీసుకుంటున్నారు. ‘రావాలి.. రావాలి..’ అంటూ కనకరాజు వారిని మరింత వేగిరపెట్టాడు. కొంతమంది దిగిపోయాక, కొంతమంది ఎక్కారు. కనకరాజు టికెట్స్‌ కొట్టే కట్టర్‌తో ఎదురుగా ఉన్న ఇనుప రాడ్‌ మీద ‘రైట్‌.. రైట్‌..’ అంటూ గట్టిగా కొట్టాడు. అతను ఇచ్చిన శబ్దసందేశానికి బస్సు పొగలు చిమ్ముకుంటూ బయల్దేరింది.

ఆ బస్టాపుకి కొద్దిదూరంలో వున్న ఒకావిడ మర్రిచెట్టు కింద కూర్చుని, బస్సులోంచి దిగుతున్న ప్రయాణికులను ఆత్రంగా చూడటం కనకరాజు కొద్దిరోజులుగా గమనిస్తున్నాడు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వచ్చే ఆ బస్‌ కోసమే ఆమె రెండు పూటలా వస్తోంది. ఆమెకు సుమారుగా నలభై ఐదేళ్లుంటాయి. ఆమె కళ్ళు తీక్షణంగా మెరుస్తూ, దేనికోసమో వెతుకుతున్నట్టుగా కనిపిస్తున్నాయి. ప్రతిరోజు ఇదే ఆమె క్రమం తప్పని  దినచర్య!

‘ఆమె ఎవరు? రోజూ ఎవరి కోసం ఎదురుచూస్తోంది?’ అనే ప్రశ్నలు ఆమెని చూసినప్పుడల్లా కనకరాజు మదిని తొలిచేస్తున్నాయి. 
కనకరాజు తన ఆలోచనల్లోంచి బయటికి వచ్చి, ఓ పెద్దాయనకు టికెట్‌ కొడుతూ ‘బాబాయ్, ఎవరావిడ?’ తన మనసుని కుదిపేస్తున్న ప్రశ్నని అతని ముందు పెట్టాడు.
‘ఆవిడో పిచ్చి మాలోకమయ్యా..!’ అతను ముక్తసరిగా బదులిచ్చాడు. 
కనకరాజు ఇంకేమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు.

తన డ్యూటీ ముగించుకొని ఇంటికి చేరుకున్న కనకరాజు నిస్సత్తువగా హాల్లోని సోఫాలో వాలిపోయాడు. భర్త రాకను గమనించిన అతని భార్య సరోజ వంటగదిలోంచి వస్తూ ‘టీ పెట్టమంటారా?’ అని అనునయంగా అడిగింది.
‘వద్దు సరోజా.. అలేఖ్యకి ఇప్పుడెలా వుంది? నిద్రపోతోందా?’ దుఃఖాన్ని గుండె లోతుల్లోనే దిగమింగుకుని నెమ్మదిగా అడిగాడు కనకరాజు.
‘జ్వరం కొంచెం కూడా తగ్గుముఖం పట్టడంలేదు. ఏమి తిన్నా వాంతులు చేసుకుంటోంది. ఇప్పుడే పడుకుంది’ చెప్పింది సరోజ బాధని పంటితో బిగబట్టుకుని.

కనకరాజుని ఈ మధ్యకాలంలో బాగా వేధిస్తోన్న అతిపెద్ద సమస్య తన ఎనిమిదేళ్ల కూతురి అనారోగ్యం! అతని కూతురు సంవత్సర కాలంగా అంతుచిక్కని కొత్త తరహా న్యుమోనియాతో నరకాన్నే చూస్తోంది. ఏడాదిగా స్కూలుకి కూడా పోవడంలేదు. తెలిసిన వాళ్లు చెప్పిన స్పెషలిస్టులందరికీ చూపించాడు. డాక్టర్లు సూచించిన అన్నిరకాల టెస్టులు చేయించాడు, చేయిస్తూనే వున్నాడు. ఫలితం మాత్రం శూన్యం!

కనకరాజుకి ఎప్పటిలాగే ఆరోజు కూడా దేవరపాలెం బస్టాపు దగ్గర రెండు దఫాలూ అదే దృశ్యం ఎదురైంది. ఈసారి ఎవరినీ అడగకూడదని, తనే స్వయంగా ఆమెని కలిసి, విషయమేంటో ఆరా తీయాలని గట్టిగా తీర్మానించుకున్నాడు. తన సెలవు రోజున దేవరపాలెం వెళ్లాడు. బస్టాపు దగ్గర్లోని ఓ బడ్డీ కొట్టులో ఒక వాటర్‌ బాటిల్‌ కొంటూ, మర్రిచెట్టు కింద కూర్చున్న ఆవిడను చూపిస్తూ ‘ఎవరండీ ఆవిడ? రోజూ అక్కడ కూర్చుని, ఎవరి కోసం ఎదురు చూస్తుంది?’ అడిగాడు కాస్త చొరవతీసుకుని.

‘ఆవిడా? ఎప్పుడో చిన్నప్పుడే పారిపోయిన కొడుకు తిరిగొస్తాడని.. అవిడో పిచ్చిది సార్‌!’ క్లుప్తంగా బదులిచ్చాడతడు.
‘ఈ మాత్రం చాలు. ఆమెని చేరుకోవడానికి’ అనుకుంటూ, ఆ పక్కనే వున్న చెక్కబల్ల మీద కూర్చున్నాడు. ఆ కాసేపటికి బస్సు రావడం, వెళ్లిపోవడం జరిగిపోయాయి. బస్సు వచ్చేటప్పుడు ఆమె కళ్లల్లో అదే వెలుగు.  బస్సు వెళ్లిపోయిన మరుక్షణమే నిరాశగా ఇంటిదారి పట్టింది. కనకరాజు దూరం నుంచే ఆమెను అనుసరించసాగాడు. ఆమె వెళ్తూవెళ్తూ ఓ ఇంటి ముందు ఆగిపోయింది. అదే.. తన నివాసం కాబోలు అనుకున్నాడు. అది ఓ సెంటు స్థలంలో కట్టిన చిన్న పాత పెంకుటిల్లు.

కనకరాజు ధైర్యాన్ని కూడగట్టుకుని, మరో ఆలోచన చేయకుండా గబగబా ఆమె దగ్గరకు వెళ్లి ‘అమ్మా..! నా పేరు కనకరాజు. మీ బిడ్డకోసం ఎదురు చూస్తున్నారని విన్నాను. నేను డ్యూటీ మీద చాలాచోట్లకు తిరుగుతుంటాను. మీ అబ్బాయి గురించి వివరాలు చెప్తే, నా శాయశక్తులా వెతికిపెడతాను’ నిజాయితీగా తన మనసులోని మాటని ఆమె ముందు పెట్టాడు. ఆమె కనకరాజు వైపు ఆశ్చర్యంగా చూస్తూ ‘ఎవరు బాబూ మీరు? మీరు చెబుతున్నది నిజమేనా? నా బిడ్డ నిజంగా నా చెంతకొస్తాడా?’ ఆత్రంగా అడిగింది.

‘అవునన్నట్లు’ తలూపాడు కనకరాజు. ఆమె మొహం ఒక్కసారిగా కాంతివంతమైంది.
‘బాబూ.. నా కొడుకు పారిపోయి పదిహేనేళ్లు గడిసిపోనాయి. కానీ ఇంతవరకు ఎవ్వరూ యివ్వని భరోసాని యిత్తున్నావు. అందరూ నన్ను ‘పిచ్చిది’ అనేటోళ్లే గానీ, ఎవరూ యిలా చెప్పలేదు బాబూ..’ తన పట్టరాని సంతోషాన్ని, కన్నీళ్ల రూపేణా వ్యక్తపరచింది.
ఆమె భావోద్వేగానికి కనకరాజు ఎంతోగానో చలించిపోయాడు. అతని కంట్లో కూడా నీళ్లూరాయి.
‘మీ పేరెంటమ్మా..’ అడిగాడు.  ‘ఎర్రయ్యమ్మ..’  చెప్పింది.
మిగతా వివరాలూ అడిగాడు కనకరాజు. 
తన కొడుకు పేరు రాజు అని చెప్పింది ఆమె. పదేళ్లప్పుడు మాస్టారు కొట్టారని పుస్తకాల సంచిని అక్కడే విసిరికొట్టి, ఇంటికొచ్చేశాడట. కొడుక్కి బుద్ధి రావాలని రెండు దెబ్బలు వేసిందట ఎర్రయ్యమ్మ. అంతే..

కోపంతో రాజు ఊరొదిలి పారిపోయాడు. అది మొదలు ఎర్రయ్యమ్మ పిచ్చిదానిలా చుట్టుపక్కల ఊళ్లే కాదు, సిటీలోని వీథులు, రోడ్లనూ గాలించిందట. తిరిగి తిరిగి కాళ్లు అరిగాయి కానీ కొడుకు జాడ మాత్రం తెలియలేదు. అదో తీరని వెతగా మారిపోయింది. కొడుకు కోసం ఎదురుచూస్తూ లోకం దృష్టిలో పిచ్చిదైపోయింది. ప్రభుత్వం అందిస్తోన్న ఫించనుతోపాటు రెండు ఇళ్లల్లో పాచిపనులు చేస్తూ జీవితాన్ని నెట్టుకొస్తోంది. తను వుంటున్నది అద్దె ఇల్లే! అయితే ఒకప్పుడు అది తనదేనట. తాగుబోతు భర్త తన వ్యసనాల కోసం ఆ ఇంటిని అమ్మేశాడట. అయితే పెళ్లయిన మూడేళ్లకే చనిపోయాడట అతను. త్వరలోనే తన కొడుకు తనని వెతుక్కుంటూ ఇంటికి వస్తాడని ఈమధ్యనే ఓ సాధువు ఆమెకు జోస్యం చెప్పాడట.

ఆమె నోట ఆ వివరాలన్నీ విన్న కనకరాజు ‘ఎర్రయ్యమ్మా, అప్పుడెప్పుడో పారిపోయిన నీ కొడుకు ఇన్నేళ్ల తర్వాత కనిపిస్తే ఎలా గుర్తుపడతావు?’ అనుమానంగా అడిగాడు. అంతే.. ఆమె గబగబా ఇంట్లోకెళ్లి, పోస్టుకార్డు సైజులో వున్న బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫొటో ఒకటి తెచ్చి, ‘మా రాజుగాడి కుడి చెంప మీద కంది గింజంత పుట్టుమచ్చ వుంది.. చూశావా బాబూ..?’ అంటూ ఆ ఫొటోలో స్పష్టంగా కనిపిస్తోన్న పుట్టుమచ్చని చూపించింది.

కనకరాజు ఆ ఫొటోని అడుగుదామనుకునేలోపే ఎర్రయ్యమ్మే ‘ఈ ఫొటో నీ దగ్గర ఉంచు బాబూ.. మా వాడిని గుర్తుపట్టడానికి.. ఇంకా ఇలాంటి ఫొటోలు నాలుగైదు నా దగ్గరున్నాయిలే’ అంటూ ఆ ఫొటోని కనకరాజు చేతిలో పెట్టింది.
ఆ ఫొటోని భద్రంగా జేబులో పెట్టుకుంటూ, చిన్న కాగితం మీద తన మొబైల్‌ నెంబరు రాసి ఆమెకిచ్చాడు కనకరాజు. అలా ఎర్రయ్యమ్మకు అంతులేని విశ్వాసాన్ని కలిగించి, కొండంత ధైర్యాన్ని నూరిపోసి ఆమె దగ్గర సెలవు తీసుకున్నాడు.
తర్వాత కొన్ని రోజులకే  డిపోవారు కనకరాజు డ్యూటీ రూటు మార్చేయడంతో అతనికి ఎర్రయ్యమ్మను చూసే వీలు చిక్కలేదు. కూతురిని తరచుగా ఆసుపత్రికి తీసుకెళ్లాల్సి రావడం వల్ల కూడా అతనికి ఎర్రయ్యమ్మను కలిసే తీరిక దొరకలేదు. అలా రెండునెలలు గడిచిపోయాయి. ఒకరోజు ఎర్రయ్యమ్మే అతనికి ఫోన్‌ చేసింది తన కొడుకు ఇంటికి వచ్చేశాడంటూ! ఆనందాశ్చర్యాలకు లోనయ్యాడు కనకరాజు. డ్యూటీకి సెలవు పెట్టి, ఉన్నపళంగా దేవరపాలెం బయలుదేరాడు.
కనకరాజుని చూడగానే సంతోషంతో ఉప్పొంగిపోయింది ఎర్రయ్యమ్మ.

‘అయ్యా! మీరు చెప్పినట్టుగానే నా బిడ్డ నాకు దక్కాడు.. మీరు నా పాలిట భగమంతుడే! తమరు కలకాలం చల్లగా ఉండాలయ్యా..’ అంటూ ఆనందబాష్పాలతో కృతజ్ఞతలు చెప్పుకుంది.
‘నీ కొడుకు ఎక్కడమ్మా..?’అంటూ ఆత్రంగా అడిగాడు కనకరాజు.
‘వంట సరుకులు కొనుక్కొత్తానని వెళ్లాడు బాబూ, వచ్చేత్తాడు..’ ఎర్రయ్యమ్మ అంటుండగానే ఓ పాతికేళ్ల యువకుడు రెండు చేతులతో రెండు సంచులను మోసుకుంటూ ఆ ఇంట్లోకి అడుగుపెట్టాడు.

అతను ఎర్రయ్యమ్మలాగే సన్నగా, పొడవుగా వున్నాడు. ఇంకా పసితనపు ఛాయలు పోలేదు. ఏదో తేజస్సు ఆ కుర్రాడి ముఖంలో! ఎర్రయ్యమ్మ ‘రాజూ, నేను చెప్పానే, గొప్ప మనసున్న మారాజు అని.. ఈ బాబే’ అంటూ కొడుక్కి కనకరాజుని పరిచయం చేసింది.
ఆ అబ్బాయి తన రెండు చేతులెత్తి కనకరాజుకి దండం పెట్టాడు. ఎర్రయ్యమ్మ, కొడుక్కి ఏదో చెప్తున్నట్టుగా సైగచేసింది. ఆ యువకుడు చెక్క బెంచీపై కూర్చున్న కనకరాజు కాళ్లకి నమస్కరించాడు.

అనుకోని ఆ పరిణామానికి కనకరాజు బిత్తరపోతూ, ఆ కుర్రాడిని పైకి లేపుతూ మనస్ఫూర్తిగా ఆశీర్వదించాడు. భోంచేసి వెళ్లాలని ఎర్రయ్యమ్మ పట్టుపట్టింది. భోంచేసి, వాళ్లిద్దరి దగ్గర వీడ్కోలు తీసుకుని బస్సులో కూర్చున్న కనకరాజు మనసుకి ఎంతో ఊరటగా ఉంది. కానీ.. ఎక్కడో ఏదో తెలియని వెలితి!
ఆ వెలితికి సాక్షీభూతంగా నిలిచిన ఓ సంఘటన కళ్ల ముందు కదుల్తూ అతన్ని రెండు వారాల వెనక్కు తీసుకువెళ్లింది.

రాజు ఫొటోతో ఎర్రయమ్మ ఇల్లు దాటిన నాటి నుంచి ఎక్కడికి వెళ్లినా.. ఏ కుర్రాడు కనిపించినా ఆ ఫొటోతో పోల్చి చూసుకోవడం కనకరాజు దినచర్యలో భాగమైపోయింది. అలా ఎర్రయ్యమ్మ వేదన గురించే ఆలోచిస్తోన్న కనకరాజుకి ఒకరోజు.. బస్సులో ఓ పాతికేళ్ల యువకుడు బేల ముఖంతో చిన్నగా శోకిస్తూ కనిపించాడు. అది చివరి ట్రిప్‌ కావడంతో బస్సంతా ఖాళీగావుంది. అతన్ని గమనించిన కనకరాజు, అతని పక్కనే కూర్చుని ‘ఏమైంది బాబూ.. అంతగా కుమిలిపోతున్నావు?’ అంటూ అనునయంగా అడిగాడు. ఆ అనునయానికి కదిలిపోయిన ఆ కుర్రాడు నెమ్మదిగా గొంతు విప్పాడు.

‘నా పేరు డేవిడ్‌ రాజు. ఒక క్రిస్టియన్‌ మిషనరీ స్కూల్లో చదువుకున్నాను. మా అమ్మను చూడాలని, ఆమెతో కబుర్లు చెప్పుకోవాలని ఆశ! మా అమ్మ గురించి నా శక్తి మేర చాలా సమాచారం సేకరించాను. అమ్మ నాకు తిండిపెట్టలేని దీనావస్థలో నన్ను మిషనరీ ట్రస్ట్‌లో వదిలేసిందట. ఏడాది పాటు అమ్మ ఆచూకీ కోసం చాలాచోట్లకి తిరిగాను.  చాలామందిని కలిశాను. చిట్టచివరికి తన అడ్రస్‌ పట్టుకోగలిగాను. కానీ, నాలాంటి దురదృష్టవంతుడు ఇంకొకడు ఉండడు సార్‌! తను ఓ నెల కిందటే ఎవరూలేని అనాథలా చనిపోయింది. నన్ను నిజంగానే అనాథని చేస్తూ..’ అంటూ బొటబొటా కన్నీళ్లుకార్చాడు.

తను చదివిన ‘లా ఆఫ్‌ అట్రాక్షన్‌’ ప్రత్యక్షంగా ఎదురుకావడంతో మాటల్లో చెప్పలేని వింతానుభూతికి లోనయ్యాడు కనకరాజు. ‘మనం ఏదైనా బలంగా కోరుకుంటే.. అది జరిగితీరుతుంది!’ అని ఆ పుస్తకంలో చదివినట్టు జ్ఞాపకం. కుర్రాడి కళ్ల కిందుగా జారిపోతున్న కన్నీళ్లను  తుడుస్తూ ‘నీకు అమ్మ ప్రేమ దక్కేటట్టు చేసే బాధ్యత నాది!’ అంటూ తిరుగులేని హామీనిచ్చాడు.
ఆ కుర్రాడు తన్నుకొస్తోన్న దుఃఖాన్ని ఆపుకుంటూ, కుతూహలంగా కనకరాజు వైపు చూశాడు. 
‘అయితే, నీ కుడి చెంప మీద చిన్న పుట్టుమచ్చ ఒక్కటే లోటు’ అన్నాడు కనకరాజు ఏదో ఆలోచిస్తూ!
ఆరోజు ఆలా రెండు హృదయాల వేదనలను ‘ఒక సంతోష సాఫల్యం’గా రూపకల్పన చేశాడు కనకరాజు.

ఎర్రయ్యమ్మ, రాజును కలిసిన కనకరాజు తన ఇంటికి చేరుకునేసరికి సాయంత్రమైంది. మెయిన్‌ గేటు తీసి, లోనికి అడుగుపెడుతుండగా ఎదురుగా కనిపించిన దృశ్యం అతన్ని సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. అతని కూతురు ‘నాన్నా..’ అంటూ కిలకిలా నవ్వుతూ తనకేసి పరుగుతీస్తోంది లేడిపిల్లలా. పట్టరాని భావోద్వేగంతో కూతుర్ని చేతుల్లోకి తీసుకుని గుండెకు హత్తుకున్నాడు. కళ్లు కన్నీటి సంద్రాలయ్యాయి. ఎదురుగా వస్తోన్న అతని భార్య, తల్లి ముఖాల్లో వెల్లివిరిసిన వసంతకాలపు వెలుగులు!

ఆశ్చర్యంగా భార్య వైపు చూశాడు. ‘ఉదయాన్నే మీరు అలా వెళ్లారో లేదో.. ఎప్పుడూ తిననని మొండికేసే పిల్ల ‘ఆకలీ.. ఆకలీ..’ అంటూ ఒకటే గొడవ. జ్వరం ఉందేమోనని చూశాను. ఏదో మంత్రం వేసినట్టుగా పూర్తిగా మాయం! అప్పటికప్పుడు టిఫిన్‌ చేసి, వేడివేడిగా తినిపించాను. తిన్నప్పటి నుంచి ఒకటే అల్లరి! ఇల్లంతా ఉరుకులు, పరుగులు! ఉదయం నుంచి పది నిమిషాలకొకసారి ఏదో ఒకటి అడిగి తింటూనే ఉంది. ఒక్క వాంతి కూడా కాలేదు. నాకే ఆశ్చర్యంగా ఉందండీ..’అంటూ ఆమె సంబరంగా జరిగినదంతా చెప్పుకుపోయింది. ‘సాటి మనిషికి సాయం చేసే నీ తత్త్వమేరా నీ బిడ్డకు ఆయుష్షు పోసుంటుంది..!’ అంది కనకరాజు తల్లి, కొడుకు వైపు మెచ్చుకోలుగా చూస్తూ. తల్లి మాటలకు చిన్నగా నవ్వేస్తూ, కూతురిని మురిపెంగా చూసుకుంటూ ఇంట్లోకి నడిచాడు కనకరాజు.

ఎర్రయ్యమ్మని రాజు ఎలా చూసుకుంటున్నాడో తెలుసుకోవాలన్పించి, ఒకరోజు దేవరపాలెం వెళ్లాడు కనకరాజు.  సాదరంగా ఆహ్వానించింది ఎర్రయ్యమ్మ.  రాజు ఇంట్లో లేడు. ఆఫీస్‌ పని మీద సిటీకి వెళ్లాడని చెప్పింది. సాఫ్ట్‌వేర్‌ అయిన రాజు.. వారానికి ఒకటీ, రెండ్రోజులు మాత్రమే ఆఫీసుకి వెళ్తుంటాడు. మిగతా రోజులన్నీ వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌. ఎర్రయ్యమ్మ కట్టూబొట్టూ పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు ఆమె ఒంటి మీదకి బంగారం కూడా చేరింది. కొడుకు కోరిక మేరకు పాచిపనులకు స్వస్తి చెప్పింది.

ఎర్రయ్యమ్మ చెప్పిన మరో విషయం రాజు మీద కనకరాజుకి తిరుగులేని నమ్మకాన్ని కలిగించింది. తన భర్త ద్వారా పోగొట్టుకున్న, ఒకప్పటి తన సొంతిల్లు అదే ఇప్పుడు అద్దెకున్న ఆ ఇల్లు, దాన్ని ఆనుకొని వున్న మరికొంత ఖాళీస్థలాన్నీ కొని, ఎర్రయ్యమ్మ పేరిట కాగితాలు రాయించాడని చెప్పింది. విన్న కనకరాజు తన ప్రయత్నం సంపూర్తిగా సఫలీకృతమైంది అనుకున్నాడు. మనసు నిండింది.
‘ప్రతి జీవితానికి చెప్పుకోవడానికి ఏదో ఒకటి ఉండాలంటారు. నా జీవితానికిది చాలు!’ అనుకుంటూ బయల్దేరడానికి సమాయత్తమయ్యాడు కనకరాజు.

కుర్చీలోంచి లేచిన కనకరాజు కాళ్లకి ఎర్రయ్యమ్మ నమస్కరించబోయింది. ఆ హఠాత్పరిణామానికి అతను బిత్తరపోయి దూరం జరుగుతూ ‘ఎర్రయ్యమ్మా, నేను నీ తమ్ముడు లాంటివాడిని. నువ్వు నా కాళ్లకు నమస్కరించడం ఏంటీ?’ అన్నాడు ఇబ్బందిపడుతూ.
‘సాటిమనిషి కోసం ఆలోచించే తీరికలేని ఈ కాలంలో..  అనామకురాలైన ఈ ఎర్రయ్యమ్మ కోసం నువ్వు ఎంత తాపత్రయపడ్డావో నాకెరుకే బాబూ..! పారిపోయిన నా కొడుక్కి కుడి చెంప మీద కంది గింజంత పుట్టుమచ్చ ఉందని చెప్పాను. కానీ, వాడి ఛాతీ మీదున్న పాపిడి బిళ్లంత మరొక పుట్టుమచ్చ గురించి చెప్పలేదు! అది నీకు తెలియదు కదా బాబూ..’ అంటోన్న ఆమెకు బదులేం ఇవ్వాలో తెలియక నిశ్శబ్దంగా ఉండిపోయాడు కనకరాజు.

‘నా బాధ చూడలేక, నా కొడుకు రూపంలో ఈ అబ్బాయిని, నువ్వే పంపించావని నాకు ఎరుకే బాబూ! రాజు నా కడుపున కాయకపోయినా అంతకన్నా ఎక్కువే! ఇలాంటి మారాజు బిడ్డని నాకు చూపించినందుకు నీకు ఈ ఎర్రయ్యమ్మ జనమ జనమలకు రుణపడి ఉంటాది బాబూ..! నా కొడుకు మొన్ననే నీ గురించి ఓ మాట చెప్పినాడు.. ‘కండక్టర్‌’ అంటే నడిపించేవాడని అర్థమట! నువ్వు, నిజంగా మా బతుకులను నడిపించిన దేవుడివయ్యా..’ అంటూ చేతులెత్తి దండం పెట్టింది.

‘ఎర్రయ్యమ్మా.. నీ రాజును నీ దరికి చేర్చే క్రమంలో నిన్ను ఒక అబద్ధంతో మభ్యపెడుతున్నానని ఎంతో అపరాధభావానికి గురయ్యాను. ఆ వెలితిని కాస్త దూరం చేశావు. నేనే నీకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి’ అన్నాడు కనకరాజు. తేలికపడిన మనసుతో తన ఇంటి దారి పట్టాడు. – శ్రీనివాసరావు తిరుక్కోవుళ్ళూరు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement