మెదడు.. మోకాల్లోకి.. | Sakshi Funday Story Written By Datla Devadaman Raju | Sakshi
Sakshi News home page

మెదడు.. మోకాల్లోకి..

Published Sun, Sep 15 2024 12:55 AM | Last Updated on Sun, Sep 15 2024 12:55 AM

Sakshi Funday Story Written By Datla Devadaman Raju

కలో.. భ్రమో.. రాత్రి తోకచుక్క కనపడింది. తోకచుక్క సంఘ సంస్కరణ ప్రయాణ పతాక కదా. ఏం జరుగుతుందో ఏం జరగదో.. మెలకువను స్వప్నించి నిద్రలోనే లేచినట్టు.. తిరిగినట్టు.. మాట్లాడినట్టు.. చీకటి తెరలు పూర్తిగా తొలగిపోలేదు. తెల్లవారిన సందడి ఇపుడిపుడే మేల్కొంటోంది. పలుచని మంచు పొగలా చుట్టుకుంటోంది.

లేచాను. రోజూ లేచే ఉదయపు నడకల సమయమే. అడుగు ముందుకేశాను. ఒకరకమైన తూలింపు. పట్టించుకోలేదు. లుంగీ మడిచి బాత్రూమ్‌కు వెళ్ళాను. అపుడు చూశాను, మోకాలు కొద్దిగా వాచినట్లుంది. నొప్పి లేదు. ఎత్తుగా ఉబ్బిన చోట చేతితో నొక్కాను. మెత్తగా నునుపుదేరి ఉంది, రబ్బరు బంతిలా. ఏమైందీ? ఎక్కడైనా తగిలిందా? ఏదైనా కుట్టిందా? గిల్లి మాత్రం చూడలేదు. నడక దుస్తుల్లోకి మారాను. నడుస్తుంటే ఇబ్బందేమీ లేదు. సలుపు కూడా లేదు. ఆటల మైదానంలో పదిసార్లు వలయంగా తిరిగాను. రెండు కిలోమీటర్లు తిరిగినట్టు లెక్క. 

‘అలా నడుస్తున్నారేంటీ? కాలు ఈడుస్తున్నట్టు..’ ఇంటికొస్తుంటే సుబ్బారాయుడు పలకరించాడు.
‘ఏమీ.. లేదే..’ అన్నాను జాగ్రత్తగా అడుగులేస్తూ. ప్రతిక్షణం నడక దగ్గర్నుంచి మాట దగ్గర్నుంచి అందరికీ కావాలి. రోజువారీకి భిన్నంగా ఎవరూ ఉండకూడదు. ఉంటే ఒకటే ప్రశ్నలు.. ఎందుకు, ఏమిటి, ఎలా.. ఆరా! అరే.. ఎదురైన చాలామంది నడకల్లో ఏదో తేడా స్పష్టంగా కనబడుతోంది. కుంటి నడక కాదు గానీ నేలకు పాదం ఈడుస్తూ.. ఎవర్నీ అడగలేదు. తీరా ఇంట్లోకి చేరగానే ఉమ ఎదురొచ్చింది. ఆమె నడక తీరూ అలాగే ఉంది. ఉన్నట్టుండి నన్ను ఆట పట్టించడానికన్నట్టు గాలిలోకి ఎగిరింది. పైగా నవ్వుతోంది. ఆశ్చర్యంగా చూశాను. 

‘ఏమీ లేదండి. నొప్పేం లేదు. అయితే నేలకు తాకించి నడుస్తుంటే బావుంది’ 
ఇంకేం ప్రశ్నలు వేయలేదు. మొత్తమ్మీద లోకమంతా తెలియని రాగమేదో ఆలపిస్తోంది. ఒకరి నుంచి మరొకరికి అంటుకునేదా? కాదేమో. స్నానానికి వెళ్ళినపుడు తేరిపారి పరిశీలనగా చూశాను. మోకాలు చిప్ప ఉబ్బి నల్లగా తాటికాయలా ఒకవిధమైన గరుకుగా మారింది. రెండో కాలు మామూలుగానే ఉంది. కూరగాయలు కొనడానికి మార్కెట్టుకెళ్ళాను. అందరూ తెలిసినవారే. కొంచెం పట్టుబట్టి జాగ్రత్తగా అడుగులేస్తూ తిరుగుతున్నాను. చాలామంది ముఖాలు నీరసంగా కనిపిస్తున్నాయి. ఏదో పోగొట్టుకుని దాచినా దాగని సత్యాన్ని మోస్తున్నట్టుగా భారంగా అడుగులేస్తున్నారు. లోకం వింతగా కనిపిస్తోంది.

రెండురోజుల క్రితం రామంగాడి గృహప్రవేశం సందర్భంగా సత్యనారాయణ ప్రతం చేయించిన పురోహితుడు కనిపించాడు. ఆయన పంచె ఎగదోసి మోకాలు చిప్ప కనిపించేలా ఎత్తి ఎత్తి అడుగులేస్తూ నడిచి వస్తున్నాడు. అసింటా అన్నట్టు దూరంగా జరుగుతూ అడుగులేస్తున్నాడు. ఆయనకు కూడా అదే చోటులో నల్లగా చర్మం చిట్లినట్లుగా ఉంది. మొన్నటి దృశ్యం కళ్ళ ముందు కనిపించింది. 
వ్రతం అయిపోయింది. ఇక కథ చెప్పాలి. చెప్పడం మొదలెట్టగానే అది ఎప్పుడూ చెప్పే పాతకథ అని తెలిసిపోయింది. ఆగమని సైగ చేశాను.

‘అయ్యా.. పురోహితులు గారూ.. మన్నించండి. ఎపుడూ అదే కథా? మీరు కథలో చెబుతున్న సముద్ర వ్యాపారాలు గట్రా ఇపుడు లేవు కదా. వ్రతం చేయకపోతే వచ్చే నష్టం మా రామం గాడికి వర్తించదు. వాడిది రియలెస్టేటు బిజినెస్‌. దానికి సంబంధించిన కథ అల్లి చెబితే సబబుగా అర్థవంతంగా ఉంటుంది. వాడు జాగ్రత్తలేవో పడతాడు. అలాగే సాఫ్టువేర్‌ ఇంజనీరు.. గవర్నమెంటు ఉద్యోగం.. సారా వ్యాపారం.. ఎగుమతులు దిగుమతులు, వాణిజ్యం.. వగైరాల కథలు రెడీమేడ్‌గా తయారుచేసుకుని ఉంచుకుని చెప్పొచ్చు కదా! ఎపుడూ పాత పురాణమేనా.. ఎవరు మెచ్చుకుంటారు?’ అన్నాను సూటిగా చూస్తూ.

పురోహితుడు ఒక్కక్షణం మాట్లాడలేదు. ఎదుట వ్యక్తి చెప్పేవి కొందరికి సహించవు. అహం దెబ్బతింటుంది కాబోలు. రామాన్నీ నన్నూ చూస్తూ ఉండిపోయాడు. ఆలోచిస్తున్నట్టుగా ఆగాడు. కాసేపటికి తేరుకున్నాడు. ఆ తర్వాత తనకు సహజసిద్ధమైన లౌక్యం ప్రదర్శించాడు.
‘నిజమే సుమండీ.. మహ బాగా చెప్పారు. మీరన్నట్టుగా మహ బేషుగ్గా ఉంటుంది. మీరు చెప్పింది చక్కగా ఉంది. కానీ కథలెక్కడ్నుంచి వస్తాయండీ’ అంటూ దీర్ఘం తీస్తూ అన్నాడు. ఇందాక మొదలెట్టిన కథను తిరిగి చెప్పడం ప్రారంభించాడు. అంతేకాదు వెళుతూ వెళుతూ నా ముఖం కేసి చూసి నాలో ఏ దైన్యం సూచిక కనిపించిందో ఏమో ఒక ఉచిత సలహా విసిరాడు.

‘ఏడు ఏలకులను పసువు గుడ్డలో చుట్టి దిండు కింద పెట్టుకుని పడుకోండి. మీ అప్పులన్నీ తీరిపోతాయి. మీరూ బ్రహ్మాండమైన ఇంతకుమించిన గృహం కట్టుకుంటారు’ అన్నాడు. ఆయన వృత్తికి నేనేమైనా ఆటంకం కలిగించానా? ఏమో మరి. ఇది జరిగి మూడురోజులైంది. ఇంతలో ఇట్లాంటి మోకాలుతో కనిపించాడు. తిరిగొస్తుంటే కామేశ్వరరావు కనిపించాడు. వాళ్ళ అమ్మాయికి ఇంకా పెళ్ళి ఘడియలు రాలేదనుకుంటాడు. వయసొచ్చిన ఆడపిల్ల ఇంట్లో ఉంది. భారం దేవుడి మీద వేసేశాడు. అసలు జరిగిందేమిటంటే కళ్యాణ యోగం గురించి ఒక జ్యోతిష్యుడ్ని సంప్రదించాడు. అతగాడేమో ‘రెండు సంవత్సరాలు ఆగాలి. ఈలోపు ఎంత ప్రయత్నించినా మీ అమ్మాయికి పెండ్లి చేయలేవు’ అని చెప్పాడట.

అంతే ఇక మౌనంగా ఉండిపోయాడు. సరిగ్గా అదే సమయంలో మంచి సంబంధాలు కోరి వచ్చినా ఉలుకూ పలుకూ లేకుండా ఉండిపోయాడు. ఆ తర్వాత కుజదోషమనీ వరనిరూపణ కుదరలేదనీ.. అదనీ ఇదనీ జాతకాల పిచ్చిలోపడి కాలయాపన చేసేశాడు. పోనీ ఆ జ్యోతిష్యుడు చెప్పిన ఆ రెండేళ్ళు ఊరుకుని తర్వాత కాలంలో గట్టి ప్రయత్నం చేస్తే ఈపాటికి కూతురుకు పెళ్ళి జరిగిపోయేదేమో. కార్యసాధనకు ప్రయత్నం తోడుగా ఉండాలి. గీచి గీచి జాతకాలు పట్టించుకుని చెడగొట్టుకుంటున్నాడు. పలకరించాను. చేతితో మోకాలు దగ్గర తడుముకున్నాడు. ఎత్తుగా గాలి బుడగలా కనిపిస్తోంది. అతని పరిస్థితి అర్థమైపోయింది.

ఇంటికెదురుగా శంకరయ్య ఉన్నాడు. భార్య పేరు భారతమ్మ. బయటికెళితే చాలు ప్రతిరోజూ పెళ్ళాం ఎదురు రావాలి. వీధిలోంచి గట్టిగా రమ్మని అరుస్తాడు. ఇంటి లోపల ఎక్కడున్నా ముసిముసి నవ్వులు నవ్వుతూ చీర చెంగుతో ముఖం తుడుచుకుంటూ వచ్చేస్తుంది భారతమ్మ. ఎదురురావడాన్ని మొగుడు ప్రసాదిస్తున్న అరుదైన గౌరవంగా భావిస్తుంది. ఆ అవకాశం ఇచ్చి అర్ధాంగి దగ్గర మంచి మార్కులు కొట్టి బంధం గట్టిగా ముడిపెట్టే చిట్కాను శంకరయ్య పాటిస్తున్నాడేమో. ఆవేళ చూద్దును కదా శంకరం కుంటుకుంటూ నడుస్తున్నాడు. ఓహో .. అనుకున్నాను.

జబ్బకూ మెడలోనూ తాయెత్తులు కట్టుకునే వీరయ్య, మెడనిండా ఏవో పసుపు, ఎరుపు రంగుల తాళ్ళూ, ఒంటి మీద కాషాయం దుస్తులూ ముఖం నిండా ఎర్రటి పెద్ద బొట్టూ నుదుటన విభూది పూసుకునే నారాయణ, రాహు కాలం, వర్జ్యం, ముహూర్తం చూసుకుంటే గానీ ఇల్లు కదలని వీరబాబు, ప్రతిరోజూ టెంకాయ కొట్టి దేవుని దర్శనం చేసుకునే సూరిబాబు, నలుపు ఎరుపు దుస్తుల్లో కనిపిస్తున్న సీజనల్‌ భక్తులు, నిత్యం నదీ స్నానం చేసే వీరభద్రాచార్యులు, దూరపు బంధువెవరో చనిపోతే నిష్ఠగా ఎండుగడ్డితో తలగడ చేసుకుని నేల మీద పడుకుంటూ మైల పడుతున్న రామచంద్రం.. వీళ్ళందరూ అదేరోజు తారసపడ్డారు. అందరూ మోకాలు వాచినవాళ్ళే.

ఈవేళే ఎందుకు అకస్మాత్తుగా పాదాలు ఎగేస్తూ కనిపిస్తున్నారు? అసలు నేనెందుకు ఇదే బాధ అనుభవిస్తున్నాను? మనిషి నాగరీకం అయ్యే కొలదీ కొత్త కొత్త బలహీనతల్ని ఎందుకు మోస్తున్నాడు? తాతగారి నాన్నగారి బామ్మగారి భావాలతో కునారిల్లి సొంత ఆలోచనల్ని చంపుకుని బతకడం సరైనదేనా? ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే ఏ పని అయినా విజయం సాధిస్తుందనీ మూఢనమ్మకాలతో కాలాన్ని వృథా చేసుకోవడం తగదనీ ఎంతమందికి చెప్పగలం? ఉపాధ్యాయుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న నాకు తత్వం బోధపడింది. నడవడికలో అమలు చేయాలి.

ఉదయం తొమ్మిది గంటలు. బైకు తీసుకుని రోడ్డు మీదకు రాగానే తెల్లని బట్టలతో అచ్చమ్మ ఎదురు పడింది. నన్ను చూసింది. అశుభం అని తలచి వెనక్కి తిరిగి నిలబడింది. తన వల్ల ఎవరికీ మనసులో కూడా ఏ బాధా ఇబ్బంది కలగకూడదనే తలంపుతో చేసిన పని అది. ఆవిడెందుకలా చేసిందో తెలుసు. నేను ఊరుకుంటానా? నేనూ ఆగాను. వారగా తల తిప్పి చూసింది. ఆమె వంకే చూస్తున్నాను. ‘నాకు చాలా ముఖ్యమైన పని ఉంది. మీరు ఎదురొస్తేనే ముందుకు వెళతాను. లేకపోతే ఇక్కడ్నుంచి కదలను’ అన్నాను. ఆమె కళ్ళు మెరిశాయి. ముఖంలో కాంతులు. గబగబా నా దగ్గరకొచ్చి నిలబడింది.

‘నా బాబే.. నా నాయనే.. నా ఆయుస్సు కూడా పోసుకుని నిండు నూరేళ్ళూ సుఖసంతోషాలతో బతుకు తండ్రీ..’ అని తటాలున తన తలలోంచి తెల్ల వెంట్రుకను పీకి నా తలలో వేసి తెల్లని స్వచ్ఛమైన నవ్వుతో అనేక రకాలుగా దీవించింది. మనస్ఫూర్తిగా ఎదురొచ్చి ‘అంతా శుభమే జరుగుతుంది’ అంది. వెనక్కి చూడకుండా వెళ్ళిపోయింది. ఎన్నాళ్ళ నుండో గుట్టగా దాచిన శుభాశీస్సుల బలం.. నాకొక్కడికే చెందుతుందనుకోడం ఎందుకు? దీవెనలు, ఆశీస్సులను ఒక సానుకూల దృక్పథ సంకేతంగానే చూడాలి. పాఠశాల చేరాను. మనసు ఎంతో ఎపుడూ లేనంత ఉల్లాసంగా ఉంది. రోజంతా నెగటివ్‌ భావనలు రానీయకుండా మసలుకున్నాను. నా వైపు నుండి కాకుండా ప్రతి వ్యక్తినీ అతని దృష్టి కోణంలోంచి పరిశీలిస్తున్నాను. నాలోని మార్పుకు నాకే ఆనందం అనిపించింది. హాయిగా ఉంది.

మోకాలు వాపు విచిత్రంగా కొద్దిగా తగ్గింది. ఫలితం అపుడే కనిపించిందా? మనిషి నడవడికను బట్టే రోగాలొస్తాయి. ప్రవర్తనలు ఆలోచనలు దేహానికీ మససుకూ చెందినవేనా? ఖాళీ పీరియడ్‌లో మళ్ళీ ఆలోచనలు చుట్టుముట్టాయి. ఇంతకీ నాకెందుకు మోకాలు వాచింది? తటాలున బుర్రలో ఒక వెలుగు.. మిత్రుడి బలవంతం మీద శంకుస్థాపన జరిగినరోజున కొబ్బరికాయ కొట్టడం గుర్తుకొచ్చింది. అంతేనా? ఇంకా ఏమైనా ఉందా? ఆలోచనలు సాగుతున్నాయి. ఇప్పటికిప్పుడు ఏమీ గుర్తుకు రావడంలేదు.

ఏదో అపసవ్యంగా ఉండే ఒక చెడు నమ్మకాన్ని మనసులో దూర్చే ఉంటాను. లేకపోతే ఎంతో కొంత శాస్త్రీయంగా ఆలోచించే నాకీ తిప్పలు ఎందుకొచ్చాయి? స్కూలు అయ్యింతర్వాత అట్నుంచి అటే జిల్లా పరిషత్‌కు వెళ్ళాల్సి వచ్చింది. కార్యాలయం హడావుడిగా ఉంది. క్యాంటీను నిండుగా ఉంది. ఉద్యోగుల్లో చాలామంది ఒక కాలు కుంటుకుంటూనో ఈడ్చుకుంటూనో మోకాలు నిమురుకుంటూనో నడుస్తున్నవారే. ఇంటికి చేరేటప్పటికి రాత్రి ఎనిమిది అయ్యింది. వాకిట్లోనే చిన్నాన్న ఎదురయ్యాడు. ఆందోళనగా ఉన్నాడు. నలిగిన ముఖం. నుదుటన చెరిగిన ఎర్రని నిలువు బొట్టు. చెదిరిన జుట్టు. కొద్దిగా కుంటుతూ దగ్గుతూ దగ్గరకొచ్చాడు.

‘నీ కోసమే ఎదురు చూస్తున్నాను. నీవేం కంగారుపడకు. పద.. పద.. లోపలికి..’
చిన్నాన్న ఎప్పుడూ అంతే. ఏదీ సరిగ్గా చెప్పడు. విషయం కొస అందిస్తాడు. సాగదీసి గానీ అసలు సంగతి చెప్పడు. మా ఇద్దరిదీ ఒకే ఇల్లు. అన్నదమ్ముల పంపకం. ఇంట్లో వెనుక వైపు వాటాలో ఉంటాడు. భక్తిపరుడు. సకల సెంటిమెంట్లనూ గౌరవిస్తాడు. పాటిస్తాడు. రోజూ పంచాంగం చూస్తాడు. అడిగినవాళ్ళకు అడగనివాళ్ళకు మంచిచెడ్డలు చెప్పడమే పనిగా పెట్టుకుంటాడు. ఎవరింటికైనా వెళితే దిక్కుల్ని చూసి వాస్తు గురించి ఉచిత సలహాలిస్తాడు.

‘ఏమైంది?’ గాభరాగా లోపలికెళ్ళాను. గుండెల మీద చేతులేసుకుని సీలింగు చూస్తున్నాడు నాన్న. నన్ను చూసి తల పక్కకు తిప్పి నీరసంగా నవ్వాడు. నోరు విప్పి నెమ్మదిగా గుసగుసగా మాట్లాడుతున్నాడు. మాట స్పష్టంగా లేదు. దగ్గరగా ముఖం పెట్టి వినడానికి ప్రయత్నం చేశాను. ఏదో చెప్పాలనుకుంటున్నాడు. చెప్పలేకపోతున్నాడు. కాసేపటికి చూపు నిలబడిపోయింది. చిన్నాన్నకు అర్థమైంది. ‘ఒరేయ్‌.. రండి.. వాకిట్లో పడుకో పెడదాం..’ చిన్నాన్న ఉద్దేశం తెలిసింది. ఆయనకేసి కోపంగా చూశాను. చేయి అడ్డంగా పెట్టి వారించాను. ‘మీరాగండి, చిన్నాన్నా.. ఇక్కడ్నుంచి ఆయన్ని కదల్చడానికి వీల్లేదు. ఏమొచ్చింది మీకు? ఇప్పటి దాకా బాగానే ఉన్న వ్యక్తి.. ఇంతట్లోనే ఇంటికి చెడ్డ అయిపోయాడా?’ అన్నాను.

‘ఏమంటున్నావు? నీకేమైనా తెలుస్తుందా? ఇంట్లో పోతే ఇల్లు పాడు పెట్టాల్సి వస్తుంది. నా మాట విను..’ బాబాయి హోదా, వయసు తెచ్చిన అధికారంతో నన్ను గదమాయించాడు. ఆయనను దూరంగా గది మూలకు తీసుకెళ్ళి చెప్పడం మొదలెట్టాను. ‘ఆయన ఇన్నాళ్ళూ ఉన్న ఇల్లు ఇది. ఈ ఇంట్లో ఈ గదిలో ఆఖరి ఊపిరి తీసుకునే హక్కు ఆయనకు ఉంది. ఎక్కడికెళ్ళినా ఎంత రాత్రయినా చేరుకునే చోటు ఇది. నా ఊరూ నా ఇల్లూ అంటూ నిత్యం పలవరించేవాడు. మరోచోట నిద్ర పట్టదనేవాడు. మీరెన్నైనా చెప్పండి.. ఇక్కడ్నుంచి కదపడానికి ఒప్పుకోను. పొద్దుట దాక ఇక్కడే ఉంటారు’ స్థిర స్వరంతో చెప్పాను.

‘ఈ సమస్య నీ ఒక్కడిదే కాదు. మాది కూడా. ఇదే ఇంట్లో నేనూ కాపురం ఉంటున్నానని గుర్తు పెట్టుకో. మంచి ఘడియలు కావు ఇవి. ఆరుమాసాలో సంవత్సరమో ఇల్లు మైల పడితే ఎక్కడికెళ్ళాలి? ఇంటి పెద్దగా చెబుతున్నాను. చెప్పింది చేయి’ అంటూ వంగి మోకాలు చిప్ప దగ్గర పాముకుంటూ నొక్కుకుంటూ అన్నాడు చిన్నాన్న.

నేను రాజీ పడలేదు. పట్టుదలను వీడలేదు. ‘రోజులకు పేర్లు, తిథులు మనం కల్పించుకున్నవే. ఇందులో మంచి చెడ్డలంటూ ఉండవు. అన్ని రోజులూ ఒకలాంటివే. ఆయన ఇంట్లో ఆయన బతకడానికి ఎంత హక్కు ఉందో చావడానికీ అంతే హక్కు ఉంది. ఆ హక్కును కాపాడటానికి కొడుకుగా ఎంతకైనా తెగిస్తాను’ చివర మాట గట్టిగా అన్నాను. ఈ మాటలు పలికానో లేదో మోకాలు చిప్ప వాపు పూర్తిగా తగ్గిపోయింది. ఆయన మాటను విననని అర్థమైపోయింది. నసుక్కుంటూ వెళ్ళిపోయాడు.

‘పెద్దాళ్ళు సరే కుర్రాళ్ళు పుట్టుకతో వృద్ధులైపోతున్నారు. మనుషులు చేసిన దేవుళ్ళారా.. మీరెక్కడ? మిమ్మల్ని పోగుచేసి వ్యాపారం చేసే వాళ్ళనీ అసలు మూఢవిశ్వాసాల్ని ఎగదోసేవాళ్ళనీ వినియోగదారుల చట్ట పరిధిలోకి తీసుకు రావాలి. భవిష్యత్తు చెప్పేవాళ్ళకు చెప్పింది జరగనపుడు కఠినశిక్ష విధించి తీరాలి. కనీసం వందేళ్ళ తర్వాత కాలం వీటన్నింటినీ మాన్పుతుందనే నమ్మకం నాది’ అనుకుంటూ సన్నగా లోలోపల మూలిగాను. మామూలు స్థితికి వచ్చిన మోకాలును ప్రేమగా నిమిరాను. ఇంతట్లో మెలకువ తట్టి లేపింది. – దాట్ల దేవదానం రాజు


ఈ కథను వినడానికి ఈ క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేయండి. ఇకపై ప్రతివారం ‘ఈవారం కథ’కు క్యూఆర్‌ కోడ్‌ ఇక్కడ ఉంటుంది.

ఇవి చదవండి: సింగరేణి తంగలాన్‌..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement