చెరువు ఏమీ ఎరగనట్టుగా ఉంది. లేత మట్టిరంగు నీరు గాలికి అలలను ఏర్పరుస్తూ ఉంది. చాలా పెద్ద చెరువే అది. ఎంత లోతు ఉంటుందో. లోతును తలుచుకునే సరికి రాఘవకు కొంచెం భయం వేసింది. మళ్లీ తెగింపు వచ్చింది. ఆ తెగింపును చెదరగొడుతున్నట్టుగా గుడి గంట టంగుమని మోగింది. రాఘవ తల తిప్పి చూశాడు.
చెరువు గట్టునే ఉన్న గుడికి పనుల మీద వెళుతున్నవాళ్లు ఆగి నమస్కారాలు పెట్టి వెళుతున్నారు. కొందరు దర్శనం కోసమే వచ్చి లోపలికి వెళుతున్నారు. ఉదయం తొమ్మిది అయి ఉంటుంది. అక్కడికి కాస్త దూరంలోనే ఉన్న స్కూల్ ఫస్ట్ బెల్ కూడా టంగుమని మోగింది.
రాఘవ అదేమీ పట్టనట్టుగా దృష్టిని చెరువు వైపు మళ్లించాడు. గుడి వైపు చెరువు ఒడ్డు ఉండటంతో నీళ్లు తక్కువగా ఉన్నాయి. గట్టు మీద నడుచుకుంటూ వెళితే కుడి చివర నీళ్లు ఎక్కువగా ఉన్నాయి. అంచు నుంచి జారినా దూకినా గల్లంతే. రాఘవకు చెమట పట్టింది. వెంటనే ఆకలి కూడా వేసింది. స్టవ్ మీద ఇడ్లీ ఉడుకుతుంటే తల్లి ‘ఆగరా’ అంటున్నా వచ్చేశాడు. తండ్రి గొంతు వెనుక నుంచి వినిపిస్తూనే ఉంది ‘పోనీ వెధవనీ’ అని.
వెధవా తను? టెన్త్‌లో ఎన్ని మార్కులొచ్చాయి. ఇంటర్‌లో ఎన్ని మార్కులొచ్చాయి. బీటెక్ పూర్తి చేశాక కాలేజీలో అందరూ ‘నువ్వే టాప్. క్యాంపస్ సెలక్షన్‌లో నీకు ఉద్యోగం వస్తుంది’ అనంటే నిజమే అనుకున్నాడు. మార్కెట్ డౌన్‌లో ఉందట. క్యాంపస్ సెలక్షన్సే జరగలేదు. ఒక చిన్న కంపెనీ ముంబై నుంచి ఉద్యోగం ఇస్తానని అందిగాని అది బోగస్‌దని తేలింది. ఆరు నెలలుగా ఖాళీగా ఉన్నాడు. తండ్రిని చేతి ఖర్చులు అడగాలన్నా నామోషీగా ఉంది. తండ్రి మాత్రం ఏం చేయగలడు. చిన్న ఊరు. చిన్న ఉద్యోగం.
చేతికందొస్తాడనుకున్న కొడుకు ఖాళీగా ఉంటే బాధ ఉంటుంది. విసుక్కుంటున్నాడు. రాత్రి ఫోన్ చూసుకుంటూ పడుకుని ఉంటే తిట్టాడు. ‘దేశంలో అందరికీ ఉద్యోగాలొస్తుంటే నీకెందుకు రావడం లేదురా. ముప్పొద్దులా తింటూ ఫోను చూసుకుంటూ వుంటే ఎవడిస్తాడు’ అన్నాడు. బాధ కలిగింది. థూ ఎందుకీ జన్మ అనిపించింది. హైదరాబాద్‌లో ఉన్న ఫ్రెండ్స్‌కు ఫోన్ చేశాడు. ‘మేమే బెంచ్ మీద ఉన్నాం బ్రో. ప్రాజెక్ట్‌లో దూరడం చాలా కష్టంగా ఉంది’ అన్నారు. ఏ ఆశా మిగల్లేదు. ఆ అర్ధరాత్రే వెళ్లి చెరువులో దూకుదామా అనుకున్నాడు. ధైర్యం చాల్లేదు. ఉదయాన్నే లేచి టిఫిన్ కూడా చేయకుండా ఇటొచ్చేశాడు. వచ్చి? దూకాలి. దూకాలంటే మాటలా?
ఏదో అలికిడిగా కేరింతలుగా వినిపించింది. గుడి దగ్గర ఎవరో తాత. గుడ్డ పరిచి జామకాయలు అమ్ముతున్నాడు. స్కూలుకెళ్లే పిల్లలు చుట్టూ మూగి ఉన్నారు. పిల్లలు అంతగా మూగడానికి కారణం ఏమిటో చూద్దామని అటుగా అడుగులు వేశాడు. అతనికి తెలియకుండానే పెదాల మీద చిరునవ్వు వచ్చింది. తాత భుజం మీద చిలుక. పిల్లలతో ముద్దు ముద్దు మాటలు చెబుతోంది. ఆ మాటలకు పిల్లలు సంతోషంతో కేరింతలు కొడుతుంటే అది తన రెండు రెక్కల్ని అటు ఇటు ఆడిస్తూ ముక్కుతో శబ్దం చేస్తూ వారిలో మరింత ఉత్సాహాన్ని నింపుతోంది. పిల్లలు ‘హాయ్’ అని పలకరిస్తే అది దాని రెండు రెక్కల్ని కలిపి వందనం చేసింది. జామకాయలు అమ్ముతున్న తాత ‘చిలకమ్మా.. గుడి ఎటువైపుంది’ అనగానే కుడి రెక్కతో గుడి వైపు చూపిస్తూ శబ్దం చేసింది. ‘బడి ఎక్కడుందో చెప్పు’ అనగానే తన ఎడమ రెక్కతో బడివైపు చూపిస్తూ శబ్దం చేసింది. ‘బడి, గుడి అంటే నీకు ఇష్టమా తల్లీ?’ అని తాత అనగానే చిలకమ్మ అవునన్నట్లు బుర్ర ఊపుతూ శబ్దం చేసింది.
తాత చిలకమ్మకి ఎంత చక్కగా ట్రైనింగ్ ఇచ్చాడో అనుకున్నాడు రాఘవ. ఓ పిల్లవాడు తాత భుజాన్ని బలంగా తాకడంతో భుజంపైన ఉన్న చిలకమ్మ కింద పడింది. ‘అయ్యో’ అంటూ దాన్ని చేతిలోకి తీసుకున్న రాఘవకి తెలిసింది దాని రెండు కాళ్లలో బలం లేదని. అది తన పొట్ట మీద తాత భుజం మీద కూచుని ఉందని. తాత వెంటనే చిలకమ్మని తన చేతిలోకి తీసుకుని దాని వీపు మీద నిమురుతూ మరల తన భుజం పైకి ఎక్కించుకుని ప్రేమగా జాంపండు తినిపించసాగాడు.
రాఘవ కళ్లల్లోని బాధను చూసి ‘మనుషులకే కాదు పక్షులకు కూడా పక్షవాతం వస్తుంది బాబూ. ఇది ఇంతకు ముందు బానే ఉండేది. ఏమైందో ఏమో ఒకరోజు ఉన్నట్టుండి కాళ్లు పడిపోయాయి. కాళ్లు పడిపోయాక రెక్కలున్నా లాభం లేదు. అయినా మా చిలకమ్మ బాధ పడదు. సందడి చేయడం ఏ మాత్రం ఆపదు. దానికి తెలుసు అది సందడి ఆపేస్తే ఈ తాత దగ్గర పిల్లలు మూగరు. జామకాయలు కొనరు. అందుకే ఎగిరే శక్తి పోయినా ఎగరగలననే ఆశను చావనివ్వదు’ అన్నాడు తాత.
ఆ మాటలకు చిలకమ్మ తనకి ఏదో అర్థమైనట్టుగా తాత బుగ్గ మీద ముక్కుతో అటు ఇటు రాస్తూ ముద్దాడింది.
దానికి వచ్చిన కష్టంతో పోలిస్తే తనకు వచ్చిన కష్టాలు ఏమంత పెద్దవి? తల్లిదండ్రుల ఆశ తీర్చలేకపోయినందుకు బాధ కలిగి, వారికి తన మొహం చూపించలేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు.
నిజంగా అలా చేస్తే వాళ్లు ఏమైపోతారు? వాళ్లు మాత్రం సంతోషంగా జీవిస్తారా? నిజంగా అది వాళ్లకి చావు కంటే పెద్ద నరకం. అంటే తన చేతులారా తన కన్న తల్లిదండ్రులని తనే చంపుకున్నట్టు కదా... ఇంతకంటే ఘోర పాపం ఉంటుందా?
ఇంత ముసలివాడైన తాత జామకాయలు అమ్ముతూ ఎవరి మీద ఆధారపడకుండా జీవిస్తున్నాడే... యువకుడైన తనకీ నిరాశ ఏమిటి? తాత రాఘవ వైపు చూస్తూ ‘చెరువులో దూకడానికి వచ్చావు గదా బాబూ’ అన్నాడు.
రాఘవ ఉలిక్కి పడ్డాడు.
‘నీకెలా తెలుసు?’ అన్నాడు.
‘ఉదయమే చూశాను బాబూ నిన్ను చెరువు గట్టున. నీలాంటి కుర్రాళ్లు ఒంటరిగా వచ్చి హైరానా పడుతుంటే ఆ మాత్రం కనిపెట్టలేనా బాబూ. నేను ముసలాణ్ణయినా ఇప్పటికీ చెరువులో ఆ చివర నుంచి ఈ చివరకు ఈదగలను. ఒకవేళ నువ్వు దూకితే లటుక్కున దూకి జుట్టు పట్టుకుని లాక్కొద్దామని ఒక కన్ను వేసే ఉంచాను. నువ్వే వచ్చావు. ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది నాయనా.. వెతకాలి. కష్టమొచ్చిన ప్రతి ఒక్కరూ చనిపోతే ఈ లోకంలో మనుషులే ఉండరు‘ అన్నాడు.
రాఘవ మనసులో ఇప్పుడు ఉదయపు కోరిక పూర్తిగా చచ్చిపోయింది. కొత్త రాఘవ అయ్యాడు.
‘ఈ జామకాయ తిను బాబూ’ అంటూ తన జామకాయల బుట్టలో నుంచి ఓ కాయని తీసి తాత రాఘవ చేతిలో పెట్టాడు. రాఘవ ‘అయ్యో.. నా దగ్గర పైసా కూడా లేదు తాతా’ అనగానే ‘మరేం పర్వాలేదు బాబూ’ అన్నాడు. జామకాయ చాలా రుచిగా ఉంది. చిన్న ముక్క అరచేతిలో ఉంచి చిలకమ్మ దగ్గర పెడితే స్వతంత్రంగా పొడిచి గుటుక్కుమనిపించిందది. నవ్వుకున్నాడు.
‘కాయ చాలా రుచిగా ఉంది తాతా’
‘ఊరవతల తోటలోవి బాబూ. వాళ్లు నాకు తెలిసినవాళ్లే. మంచి కాపొచ్చే తోట. డబ్బున్నోళ్లు. చేసుకోవాలని లేదు. ఎవరికైనా గుత్తకు ఇద్దామనుకుంటున్నారు. ఈ కాయలను ఒక ఆటోలో వేసుకొని టౌన్‌కు తీసుకెళ్లి అమ్మితే ఇక్కడ పది రూపాయలకు అక్కడ యాభై వస్తాయి. నేనా చేయలేను’ అన్నాడు తాత.
రాఘవకు ్రౖడైవింగ్ వచ్చు. చిన్న ట్రాలీ అద్దెకు తీసుకోగలడు. ‘తోట యజమానితో మాట్లాడి నన్ను పరిచయం చేయి తాతా. తర్వాతి కథ నేను చూసుకుంటాను. రేపటి నుంచి మన బిజినెస్ టౌన్‌లోనే. నువ్వు తోడుండు చాలు’ అన్నాడు రాఘవ.
‘ఏంటి బాబూ నువ్వనేది’
‘అవును తాతా’ అన్నాడు రాఘవ.
తాత కూడా చిరునవ్వు నవ్వాడు.
‘ఏం చిలకమ్మా’ అన్నాడు.
అది కిచకిచమని అంగీకారం తెలిపింది.
ముగ్గురూ లేచి అక్కడ నుంచి కదిలారు. గుడి గంట మరోసారి టంగుమంది. కొత్త రెక్కలతో రాఘవ, తాత, చిలకమ్మ ముందుకు సాగిపోయారు. – నేదూరి భాను సాయి శ్రేయ
Comments
Please login to add a commentAdd a comment