'చేసే పని పట్ల నిబద్ధత.. నిజాయితీ ఉంటే చాలు.. ఫలితం ఏదైనా గ్రాఫ్ స్టడీగానే ఉంటుంది. సిద్ధి ఇద్నానీ విషయంలో అదే జరిగింది. ఆమె నటించిన ఎన్నో సినిమాలు ఫ్లాప్ అయినా నటిగా ఆమె మాత్రం ఫెయిల్ అవలేదు. కెరీర్‌లో గ్యాప్ వచ్చింది కానీ ఆమె తెరమరుగు కాలేదు. ఆమె నటించిన ఇటీవలి ‘ద కేరళ స్టోరీ’ మూవీయే అందుకు సాక్ష్యం. జయాపజయాలతో సంబంధంలేని పాపులారిటీని సొంతం చేసుకున్న సిద్ధి వివరాలు కొన్ని..'
సిద్ధి.. ముంబైలో పుట్టి పెరిగింది. తండ్రి.. సింధీ, తల్లి.. గుజరాతీ. వాళ్లది ప్రేమ వివాహం. అమ్మ.. హిందీ టెలివిజన్ సీరియల్స్, గుజరాతీ చిత్రాల్లో నటించేవారు. నాన్న బిజినెస్ మేన్. చిన్నతనంలో అమ్మతో కలసి సీరియల్ సెట్స్‌కి వెళ్లేది. ఆ ప్రభావంతోనే తనూ నటి కావాలనుకుంది. 2014లో క్లీన్ అండ్ క్లియర్ బాంబే టైమ్స్ ఫ్రెష్ ఫేస్ పోటీలో థర్డ్ రన్నరప్‌గా నిలిచింది. దాంతో ‘గ్రాండ్ హాలీ’ అనే గుజరాతీ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. తర్వాత గ్రాడ్యుయేషన్ ఇంపార్టెంట్ అనుకొని మాస్ మీడియాలో డిగ్రీ పూర్తి చేసింది.
సీరియల్స్, కమర్షియల్స్ చేస్తున్నప్పుడే ఒకసారి.. ఓ ఏజెన్సీ వాళ్లు సిద్ధికి ఫోన్ చేసి సినిమా ఆడిషన్‌కి పిలిచారు. అలా ఆమె తెలుగులో ‘జంబలకిడి పంబ’తో హీరోయిన్‌గా మారింది. తర్వాత ‘అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి’, ‘ప్రేమకథా చిత్రం 2’ సినిమాల్లో నటించింది. కానీ ఆశించిన స్థాయిలో సక్సెస్ రాలేదు. ‘వెందు తనిందది కాడు’ చిత్రంతో తమిళ్‌లోనూ ఎంట్రీ ఇచ్చి అదృష్టాన్ని పరీక్షించుకుంది.
వరుసగా కొన్ని చాన్స్‌లైతే వచ్చాయి కానీ.. విజయం ఇంకా ఎదురుచూపుల్లోనే చిక్కుకుపోయింది. కొంచెం గ్యాప్ తీసుకొని.. దేశవ్యాప్తంగా వివాదాస్పదమైన ‘ది కేరళ స్టోరీ’లో నటించింది. అందులోని ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈసారి సక్సెస్ ‘గ్రాండ్’ అనే విశేషణాన్ని జత చేర్చుకుని తన పాత బాకీలనూ తీర్చేసుకుంది. ఈ చిత్రం జీ 5లో స్ట్రీమింగ్‌లో ఉంది.
'నా దృష్టిలో యాక్టింగ్ అంటే యాక్టింగే. భావమే దాని భాష. అందుకే భాష కన్నా కథ.. నా పాత్రే నాకు ముఖ్యం.' – సిద్ధి ఇద్నానీ
Comments
Please login to add a commentAdd a comment