పూర్వం ఒకానొక ద్వీపాన్ని ధర్మవర్తి అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ రాజుగారు ఉండే నగరంలోనే ఒక సంపన్న వర్తకుడు ఉండేవాడు. అతడు ఉత్తముడు. ఒకరోజు ఒక కాకి అతడి పెరటి గోడ మీద వాలింది. వర్తకుడి కొడుకులు ఆ కాకికి ఎంగిలి మెతుకులు పెట్టారు. అప్పటి నుంచి కాకి ఆ ఇంటికి అలవాటు పడింది. వర్తకుడి కొడుకులు రోజూ పెట్టే ఎంగిలి మెతుకులు తింటూ బాగా బలిసింది. బలిసి కొవ్వెక్కిన కాకికి గర్వం తలకెక్కింది. లోకంలోని పక్షులేవీ బలంలో తనకు సాటిరావని ప్రగల్భాలు పలుకుతుండేది.
ఒకనాడు వర్తకుని కొడుకులు ఆ కాకిని వ్యాహ్యాళిగా సముద్ర తీరానికి తీసుకెళ్లారు. సముద్రతీరంలో కొన్ని రాజహంసలు కనిపించాయి. వర్తకుని కొడుకులు ఆ రాజహంసలను కాకికి చూపించి, ‘నువ్వు వాటి కంటే ఎత్తుగా ఎగరగలవా?’ అని అడిగారు. ‘చూడటానికి ఆ పక్షులు తెల్లగా కనిపిస్తున్నాయే గాని, బలంలో నాకు సాటిరాలేవు. అదెంత పని, అవలీలగా వాటి కంటే ఎత్తుగా ఎగరగలను’ అంది కాకి.
‘సరే, వాటితో పందేనికి వెళ్లు’ ఉసిగొల్పారు వర్తకుడి కొడుకులు. ఎంగిళ్లు తిని బలిసిన కాకి తారతమ్యాలు మరచి, హంసల దగ్గరకు డాంబికంగా వెళ్లింది. తనతో పందేనికి రమ్మని పిలిచింది. కాకి తమను పందేనికి పిలవడంతో హంసలు పకపక నవ్వాయి. ‘మేం రాజహంసలం. మానససరోవరంలో ఉంటాం. విహారానికని ఇలా ఈ సముద్రతీరానికి వచ్చాం. మేం మహాబలవంతులం. హంసలకు సాటి అయిన కాకులు ఉండటం లోకంలో ఎక్కడైనా విన్నావా?’ అని హేళన చేశాయి.
కాకికి పౌరుషం పొడుచుకొచ్చింది.
‘నేను నూటొక్క గతులలో ఎగరగలను. ఒక్కో గతిలో ఒక్కో యోజనం చొప్పున ఆగకుండా వంద యోజనాలు అవలీలగా ఎగరగలను. మీరెలా కావాలంటే అలా ఎగురుదాం. కావాలంటే పందెం కాద్దాం’ కవ్వించింది కాకి.
‘మేము నీలా రకరకాల గతులలో ఎగరలేం. నిటారుగా ఎంతదూరమైనా ఎగరగలం. అయినా, నీతో పోటీకి మేమంతా రావడం దండగ. మాలో ఏదో ఒక హంస నీతో పోటీకి వస్తుంది’ అన్నాయి హంసలు.
ఒక హంస గుంపు నుంచి ముందుకు వచ్చి, ‘కాకితో పందేనికి నేను సిద్ధం’ అని పలికింది.
పందెం ప్రారంభమైంది.
కాకి, హంస సముద్రం మీదుగా ఎగరసాగాయి.
హంస నెమ్మదిగా నిటారుగా ఎగురుతూ వెళుతుంటే, కాకి వేగంగా హంసను దాటిపోయి, మళ్లీ వెనక్కు వచ్చి హంసను వెక్కిరించసాగింది. ఎగతాళిగా ముక్కు మీద ముక్కుతో పొడవడం, తన గోళ్లతో హంస తల మీద జుట్టును రేపడం వంటి చేష్టలు చేయసాగింది.
కాకి వెక్కిరింతలకు, చికాకు చేష్టలకు హంస ఏమాత్రం చలించకుండా, చిరునవ్వు నవ్వి ఊరుకుంది. చాలాదూరం ఎగిరాక కాకి అలసిపోయింది. అప్పుడు హంస నిటారుగా ఎగసి, పడమటి దిశగా ఎగరసాగింది.
కాకి ఎగరలేక బలాన్నంతా కూడదీసుకుని ఎగురుతూ రొప్పసాగింది. హంస నెమ్మదిగానే ఎగురుతున్నా, కాకి ఆ వేగాన్ని కూడా అందుకోలేక బిక్కమొహం వేసింది. ఎటు చూసినా సముద్రమే కనిపిస్తోంది. కాసేపు వాలి అలసట తీర్చుకోవడానికి ఒక్క చెట్టయినా లేదు. సముద్రంలో పడిపోయి, చనిపోతానేమోనని కాకికి ప్రాణభీతి పట్టుకుంది.
కాకి పరిస్థితిని గమనించిన హంస కొంటెగా, ‘నీకు రకరకాల గమనాలు వచ్చునన్నావు. ఆ విన్యాసాలేవీ చూపడం లేదేం కాకిరాజా?’ అని అడిగింది.
కాకి సిగ్గుపడింది.
అప్పటికే అది సముద్రంలో పడిపోయేలా ఉంది.
‘ఎంగిళ్లు తిని కొవ్వెక్కి నాకెవరూ ఎదురులేరని అనుకునేదాన్ని. నా సామర్థ్యం ఏమిటో ఇప్పుడు తెలిసి వచ్చింది. సముద్రంలో పడిపోతున్నాను. దయచేసి నన్ను కాపాడు’ అని దీనాలాపాలు చేసింది.
కాకి పరిస్థితికి హంస జాలిపడింది. సముద్రంలో పడిపోతున్న కాకి శరీరాన్ని తన కాళ్లతో పైకిలాగింది. ఎగురుకుంటూ వెళ్లి ఒడ్డుకు చేర్చింది.
‘ఇంకెప్పుడూ లేనిపోని డాంబికాలు పలుకకు’ అని బుద్ధిచెప్పింది హంస.
ఈ కథను కురుక్షేత్రంలో శల్యుడు కర్ణుడికి చెప్పాడు.
‘కర్ణా! నువ్వు కూడా వర్తకుడి పుత్రుల ఎంగిళ్లు తిన్న కాకిలాగ కౌరవుల ఎంగిళ్లు తిని అర్జునుణ్ణి ధిక్కరిస్తున్నావు. అనవసరంగా హెచ్చులకుపోతే చేటు తప్పదు! బుద్ధితెచ్చుకుని మసలుకో’ అని కర్ణుణ్ణి హెచ్చరించాడు. – సాంఖ్యాయన
Comments
Please login to add a commentAdd a comment