ఒక అడవిలో గుబురుగా ఉన్న చెట్ల మీద ఒక కోతుల జంట నివసిస్తోంది. పెద్దకోతులు మంచివే కానీ పిల్ల కోతులు నాలుగు మాత్రం చాలా అల్లరి చేస్తూ దారిలో వెళ్ళే అందరినీ ఇబ్బంది పెట్టసాగాయి. ఆ చెట్లకు కాస్త దూరంలో ఒక సెలయేరు ఉంది. అందులో కొన్ని తాబేళ్లు, చేపలు నివసిస్తున్నాయి. చేపలు, తాబేళ్లు నీటి మీద తేలియాడగానే కోతులు చెట్ల పైనుంచి పండ్లు, కాయలు, ఎండుకొమ్మలు వాటి మీదకు విసిరి బాధ పెట్టసాగాయి.
‘కోతి నేస్తాలూ! మేము మీకు ఏ విధంగానూ అడ్డురావడం లేదు. మరి మీరెందుకు మమ్మల్ని నీటి పైకి రానివ్వకుండా గాయపరుస్తున్నారు?’ అని ఒకరోజు ఒక చేప ప్రశ్నించింది. ‘మేము పిల్లలం, అల్లరి చేస్తూ ఆటలు ఆడుకుంటున్నాం. మేము తినగా మిగిలినవి గిరాటు వేస్తుండగా అవి పొరపాటుగా నీళ్లల్లో పడుతున్నాయి’ అని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చింది ఓ పిల్లకోతి.
‘చేప నేస్తాలూ! పిల్లకోతులు కావాలని అలా గిరాటు వేస్తున్నాయి. మనం వాటిని అడగడం వల్ల ఏమీ ఉపయోగం ఉండదు’ అంది ఓ తాబేలు.
రోజురోజుకు కోతుల ఆగడాలు పెరగసాగాయి. పాపం! తాబేళ్లు, చేపలు ఏమీ చేయలేక అలాగే అవస్థపడసాగాయి. ఒక రోజున పిల్ల కోతులు ఒక కొమ్మ మీద కూర్చుని ఉయ్యాలూగుతున్నాయి. ఆ కొమ్మ బలహీనంగా ఉండటం వలన ఫెళ్లున విరిగిపోయింది. ఊగుతున్న కోతులు ఆ వేగానికి సెలయేటి నీళ్లల్లో పడిపోయాయి. వాటికి ఈత రాకపోవడంతో ‘కాపాడండి.. కాపాడండి..’ అంటూ పెద్దగా అరవసాగాయి. ఆ అరుపులకు నీళ్లల్లో ఉన్న చేపలు, తాబేళ్లు బయటకు వచ్చాయి. ‘అయ్యో! పిల్ల కోతులు నీళ్లల్లో మునిగిపోతున్నాయి, వాటిని కాపాడుదాం’ అంది ఒక తాబేలు.
‘పిల్లకోతులూ! ఇలా మా వీపు మీద కూర్చోండి’ అంటూ నాలుగు పెద్ద తాబేళ్లు వాటి దగ్గరకు వెళ్ళాయి. అవి తాబేళ్ల మీద కూర్చోగానే ఈదుతూ వాటిని ఒడ్డుకు చేర్చాయి. ‘మేము మిమ్మల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టినా మీరు మా ప్రాణాలను రక్షించారు. ఇక నుంచి మనం మంచి మిత్రులుగా ఉందాం’ అన్నాయి పిల్ల కోతులు. ‘అలాగే!’ అన్నాయి తాబేళ్లు.
అప్పటి నుంచి అవన్నీ చాలా స్నేహంగా ఉండసాగాయి. ఒకరోజు అడవికి ఒక బెస్తవాడు సెలయేటిలో చేపలు పట్టడానికి వచ్చాడు. అతణ్ణి చెట్టు మీద ఉన్న పిల్లకోతులు చూశాయి. ఈలోగా బెస్తవాడు వలను నీటిలోకి విసిరాడు. ఆదమరచి ఉన్న చేపలు, తాబేళ్లు వలలో చిక్కుకున్నాయి.
‘ఈ రోజు నా అదృష్టం పండింది. చాలా చేపలు, తాబేళ్లు కూడా దొరికాయి’ అంటూ బెస్తవాడు సంబరపడి వాటిని తనతో తెచ్చుకున్న బుట్టలో వేసుకున్నాడు.
‘అయ్యో! మన నేస్తాలను ఇతను తీసుకెళ్లిపోతున్నాడు’ అని పిల్ల కోతులు మాట్లాడుకున్నాయి. అన్నీ కూడబలుక్కుని ఒక్కసారిగా బెస్తవాడి మీదకు దూకాయి. ఊహించని పరిణామానికి అతను కంగారుపడ్డాడు. తప్పించుకోవడానికి ప్రయత్నించినా.. కోతులు అతని శరీరాన్ని రక్కేశాయి. బుట్ట, వల అక్కడే వదిలేసి పరుగెత్తుకుంటూ పారిపోయాడు. కోతులు బుట్టను తెరిచి చేపలను, తాబేళ్లను సెలయేటిలోకి వదిలేశాయి. అవి పిల్ల కోతులకు కృతజ్ఞతలు తెలిపి హాయిగా ఊపిరి పీల్చుకున్నాయి. ‘మనం ఎప్పుడూ ఇలాగే ఒకరికి ఒకరం స్నేహంగా ఉండాలి’ అనుకున్నాయి అన్నీ! మనం ఒకరికి సహాయపడితే మనకు దేవుడు సహాయపడతాడు. – కైకాల వెంకట సుమలత
Comments
Please login to add a commentAdd a comment