స్పూర్తిదాయకమైన కథ
మీర్‌పేట మహారాజు మాణిక్యవర్మ. అతని ఏకైక కూతరు మూకాంబికకు పక్షులంటే మహా ప్రాణం. కొందరు ఆమె పుట్టినరోజుకు ప్రత్యేకతలు నేర్చిన పక్షులను బహుమతిగా ప్రదానం చేసేవారు. వాటిని చూసి మూకాంబిక ముచ్చట పడేది. యువరాణికి పక్షిని బహుకరించినందుకు ఊహించనంత నగదు ముట్ట చెప్పేవాడు మాణిక్య వర్మ. ఆమె దగ్గర పాటలు పాడే కోకిల, మాటలు చెప్పే చిలుక, నాట్యం చేసే నెమలి ఉన్నాయి. మల్లారం గ్రామంలో మాల్యాద్రి అనే యువకుడు ఉండేవాడు. అతను చాలా మెండివాడు. తన స్వభావం మార్చుకోమని ఎవరు చెప్పినా వినేనాడు కాదు. తనకు నచ్చింది చేసుకుపోయేవాడు.
వచ్చే మాసంలో ఉన్న యువరాణి మూకాంబిక పుట్టినరోజుకు ఏదైన పక్షిని బహుకరించి నగదు పొందాలనుకున్నాడు మాల్యాద్రి. వెంటనే వల పట్టుకుని అడవి బాటపట్టాడు. వలవేసి ధాన్యం, పురుగులు చల్లి చెట్టు నీడలో చతికిల పడ్డాడు. కొద్ది సేపటికి వలలో ఒక అందమైన తెల్లని కొంగ పిల్ల చిక్కింది. కొంగను బుట్టలో వేసుకుని ఇంటికి బయలు దేరాడు. కొంగ తెల్లగా, అందంగా ఉన్నందుకు మురిసి పోయాడు.
‘అందమైన కొంగ యువరాణికి బహుకరిస్తే రాజుగారు ఊహించనంత నగదు ఇస్తాడని’ కలలు కన్నాడు. ఐతే కొంగకు ఏదో ఒక ప్రత్యేకత ఉంటేనే యువరాణి మెచ్చుతుంది. కొంగకు ఏం ప్రత్యేకత ఉందో మాల్యాద్రికి తెలీదు. దారిలో గుడిముందు ఒక సాధువు కనిపించాడు. వంగి నమస్కరించి ‘సామీ ! కొంగకు ఏమైనా ప్రత్యేకతలుంటాయా!?’ అడిగాడు మాల్యాద్రి. సాధువు బుట్టలో ఉన్న కొంగను గమనించాడు. చిన్నగా నవ్వి ‘సరిగమ పదనిస’ అనేవి సప్త స్వరాలని తెలుసు కదా! అందులో ప్రతి స్వరం పక్షి లేదా జంతువు అరుపు నుంచి తీసుకున్నవే. అందులో ‘మ’ అంటే ‘మధ్యమం’ కొంగ అరుపు నుండి తీసుకోబడిందని చెపుతారు. ఇలా కొంగకు కూడా ఓ ప్రత్యేకమైన అరుపు ఉంటుంది. కానీ చిలుకలా మాట్లాడదు. నేర్పితే నేర్చుకోదు’ అన్నాడు.
‘ఎందుకు నేర్చుకోదు సామీ! నాకాడ నాటకాలు నడవవు. నేను నేర్పిస్తాగా!’ అంటూ ముందుకు కదిలాడు. ఇంటికి చేరిన మాల్యాద్రి కొంగ పిల్లను పంజరంలో పెట్టాడు. దానికి పంజరంలో ఉండటం నచ్చలేదు. మల్యాద్రి కొంగకు జీడిపప్పు, బాధం పప్పు పెట్టాడు. కానీ దానికి స్వేచ్ఛగా ఎగిరి, కష్టపడి సొంతంగా ఆహారం సంపాదించటమే ఇష్టం. దానికి చెరువులో చేపల కోసం, తీరంలో ఎరలు, పురుగులు, కప్పలను వెతుకుతూ ఒడ్డు వెంబడి నిశ్శబ్దంగా నడవటం ఆనందం. నిశ్చలంగా నిలుచుని ఆహారం కనబడగానే చటుక్కున పట్టుకొని గుటుక్కున మింగటంలోనే తృప్తి.
ఇలా కష్టం లేకుండా పంజరంలో పెట్టిన ఆహారం దానికి రుచించలేదు. కొంగతో చిన్న చిన్న పదాలు పలికించటానికి ప్రయత్నించాడు మాల్యాద్రి. అది ఏదన్నా తిరిగి ‘మా’ అని అరిచేదే తప్ప చిలుకలా తిరిగి పలికేది కాదు. చుట్టు పక్కలవాళ్లు ‘కొంగలు.. మనుషుల మాటలు విని తిరిగి పలుకలేవు. నీ ప్రయత్నం మానుకో’ అని చెప్పారు. కానీ మొండివాడైన మాల్యాద్రికి వారి మాటలు చెవికెక్కలేదు. పక్షం రోజులైనా కొంగ తిరిగి మాట్లాడలేదు. మాల్యాద్రికి కొంగపై విసుగొచ్చింది. అప్పుడే అటుగా పోతున్న సాధువు మాల్యాద్రిని చూసి ఆగాడు.
‘చెప్పాను కదా నాయనా ! కొంగ వినటమే తప్ప చిలుకలా మాట్లాడదని! చిలుకలకు వాటి శ్వాసనాళంలో ప్రత్యేక అవయవం ఉంటుంది. ఆ అవయవం చిలుకకు మానవ భాష మాట్లాడటానికి సహాయపడుతుంది. ఇప్పటికైనా నీ ప్రయత్నం మానుకుని కొంగను పంజరం నుంచి విడుదలచెయ్యి’ అన్నాడు సాధువు. మాల్యాద్రి మొండితనం వీడి ఆలోచించాడు. చిలుక, కొంగలు పక్షులైనా స్వభావాలు వేరని గ్రహించాడు. మాల్యాద్రి తన స్వభావం మార్చుకున్నాడు. మారిన మాల్యాద్రి పంజరం నుంచి కొంగను విడుదల చేశాడు. — ముద్దు హేమలత
ఇవి చదవండి: ఎవరూ.. బయటకు రావడానికి సాహసించని నిశిరాత్రి అది..
Comments
Please login to add a commentAdd a comment