childrens story
-
ఆడంబరాలు.. అనర్థాలు తెస్తాయి!
అవంతి రాజ్యాన్నేలే ఆనందవర్మకి ఒక్కడే కొడుకు. అతని విద్యాభ్యాసం పూర్తయ్యింది. వివాహం చేసి పట్టాభిషేకం చేయాలనుకున్నాడు ఆనందవర్మ. ఆ మాట రాణితో అంటే, ఆమె ‘అవును.. పెళ్ళి అంగరంగవైభవంగా చేయాలి. ఎందుకంటే మనకు ఒక్కగానొక్క కొడుకాయే!’ అంది. అదే విషయాన్ని రాజు మంత్రితో చెబితే, ఆయనా రాణి అన్నట్లే అన్నాడు. బంధుగణమూ, రాజోద్యోగులూ ‘అవును ఆకాశమంత పందిరేసి, భూదేవంత అరుగేసి చేయాలి’ అన్నారు.రాజుగారు అందరిమాట మన్నించి కుంతల రాకుమారితో యువరాజు వివాహం కనీవినీ ఎరుగనంత వైభవంగా చేశాడు. ఆ వేడుకలు చూసిన రాజ్యంలోని ప్రజలంతా ‘ఇలాంటి పెళ్ళి ఇంతకు ముందెప్పుడూ జరగలేదు. ఇక ముందు కూడా జరగబోదు’ అంటూ పొగడటం ప్రారంభించారు. రాజుగారి ఆనందం అంతా ఇంతా కాదు. అయితే ఆ ఆనందం అట్టేకాలం నిలవలేదు. ఒకరోజు చావు కబురు చల్లగా చెప్పాడు మంత్రి.. ఖజానా ఖాళీ అయిందని! ‘పరిష్కారం ఏమిటీ?’ అని రాజుగారు అడిగితే, ‘కొత్త పన్నులు వేసి ధనం రాబట్టడమే’ అన్నాడు మంత్రి. కొత్త పన్నులు విధించాడు రాజు. కొత్తగా పన్నులు వేసినపుడు ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవడం రాజుగారికి అలవాటు. అలా రాజు, మంత్రి ఇద్దరూ మారువేషాల్లో బయలుదేరారు.పొద్దుపోయేసరికి రుద్రవరం అనే గ్రామం చేరారు. రాత్రికి అక్కడే సేదదీరి ఉదయాన్నే తిరిగి ప్రయాణం ప్రారంభిద్దామనుకుని, గుడి వద్ద సందడిగా ఉంటే అక్కడికెళ్లారు. గ్రామాధికారి కూతురి పెళ్ళి జరుగుతున్నది. పట్టుమని వంద మంది అతిథులు కూడా లేరు. ‘అంత పెద్ద పదవిలో ఉండి ఇంత నిరాడంబరంగా పెళ్ళి చేస్తున్నాడేమిటీ?’ అని ఆశ్చర్యపోయి రాజుగారు గ్రామస్థుల్ని విచారించాడు. ‘ముందుగా మన రాజుగారిలాగే ఆడంబరాలకు పోయి గ్రామాధికారి తన కుమార్తె వివాహం ఘనంగా చేయాలనుకున్నాడు. ఖర్చులు లెక్కేస్తే లక్షవరహాలు దాటేటట్టు అనిపించింది. ఆయనకది ఇష్టంలేకపోయింది.పెళ్ళి నిరాడంబరంగా జరిపి, ఆ లక్షవరహాలతో ఊర్లో వైద్యశాల నిర్మిస్తే తరతరాలు సేవలందిస్తుందని ఆలోచించాడు. ఇదే విధంగా రాజుగారు కూడా ఆలోచించి ఉంటే అనవసర వ్యయం తగ్గివుండేది. ఆ ధనంతో ఏదైనా సత్కార్యం చేసుంటే తరతరాలు రాజుగారి పేరు చెప్పుకునేవారు. ఆ విధంగా ఆయన చరిత్రలో నిలిచిపోయేవారు. మాకు ఈ కొత్త పన్నుల బాధ తప్పేది’ అన్నారు నిష్ఠూరంగా. రాజుగారికి ఎవరో చెంప ఛెళ్ళుమనిపించినట్లయింది.ఆయన తిరిగి మంత్రితో రాజధాని చేరి, చర్చలు జరిపి కొత్త పన్నులను రద్దు చేశాడు. అంతఃపుర ఖర్చులు తగ్గించాడు. వేట, వినోద కార్యక్రమాల ఖర్చులూ తగ్గించాడు. పాలనలో అనవసర వ్యయాలను తగ్గించాడు. ఆ తర్వాత ఖజానా సులువుగానే నిండింది. అప్పటినుంచి ఆనందవర్మ ఏ కార్యక్రమాన్నయినా ఒకటికి పదివిధాలుగా ఆలోచించి చేయసాగాడు. ఆడంబరాలకు పోక పొదుపు పాటించసాగాడు. ప్రజలపై పన్నుల భారం మోపకుండా మంచిపేరు సంపాదించుకున్నాడు. – డా. గంగిశెట్టి శివకుమార్ఇవి చదవండి: రోండా హిన్సన్.. 'అమ్మా రోమ్! నీకు ఏమైంది తల్లీ'? -
జాలరి కానుక..
బుర్హాన్‌పురం జమీందారు భువనచంద్ర. అతని పుట్టినరోజు విందుకు ప్రజలందరినీ పిలిచేవాడు. కొందరు పెంచుకునే కోడినో, బాతునో జమీందారుకు కానుకగా ఇచ్చేవారు. బుర్హాన్‌పురంలోనే సైదులు అనే పేద జాలరి ఉండేవాడు. ప్రతిరోజు ఉదయాన్నే వల తీసుకుని చెరువుకు పోయి చేపలు పట్టేవాడు. తాటాకు బుట్ట నిండాక వాటిని సంతలో అమ్మి జీవించేవాడు. ప్రతిఏడు జమీందారు పుట్టిన రోజుకు పెద్ద చేపను కానుకగా ఇచ్చేవాడు. ఎప్పటిలా ఆ సంవత్సరమూ భువనచంద్ర పుట్టినరోజు వచ్చింది. ఈసారి మరింత పెద్ద చేపను పట్టి జమీందారుకు కానుకగా ఇవ్వాలనుకున్నాడు సైదులు. తాటాకు బుట్ట, వల తీసుకుని చెరువుకు పోయాడు. చెరువులో నీళ్లు చాలా తక్కువగా ఉన్నాయి.ఆ ఏడు వానలు సరిగా పడలేదు. వరుణుడు కరుణిస్తేనే జాలరి నోట్లోకి బువ్వ పోయేది. చెరువులో వల విసిరాడు. కొద్దిసేపటికి వల బరువెక్కింది. వలలో పెద్ద చేపే చిక్కిందని ఆశతో వలను లాగి ఒడ్డుకు తెచ్చి దులిపాడు. చేప చిక్కలేదు కానీ.. తాబేలు వలలో చిక్కింది. తాబేలు తన డిప్పలోంచి తల బయటకి పెట్టి చూసి, చెరువు వైపు అడుగులు వేసింది. చేప చిక్కనందుకు నిరాశ చెందాడు సైదులు. ఒక్క నిమిషం ఆలోచించి, తాబేలును పట్టుకుని తాటాకు బుట్టలో వేసుకున్నాడు. పేదవాడైన సైదులు వద్ద జమీందారుకు కానుకగా ఇవ్వటానికి ఏమీలేదు. చేసేది లేక తాబేలునే కొత్త బుట్టలో వెంట తీసుకెళ్లాడు. జమీందారుకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పి, పాదాలకు దండం పెట్టి బుట్టను కానుకగా ఇచ్చాడు. ఎప్పటిలా పెద్ద చేపనే తెచ్చాడనుకుని తెరచి చూశాడు భువనచంద్ర. కానీ బుట్టలో తాబేలును చూసి ఆశ్చర్యపోయాడు.‘అయ్యా! క్షమించండి. ఎప్పటిలా పెద్ద చేపనే పట్టి తెద్దామనుకున్నాను. కానీ వర్షాలు లేక చెరువు ఎండిపోయింది. చేపలు లేవు’ అని చెప్పాడు సైదులు దిగులుగా.‘అలాగా! మరి నీకు ఎలా గడుస్తోంది సైదులు?’ అడిగాడు జమీందారు.‘చేపలు దొరికిన నాడు నోట్లోకి బువ్వ! దొరకని నాడు పస్తులే! అలవాటైపోయిందయ్యా’ అన్నాడు సైదులు. భువనచంద్ర ఒక్క క్షణం ఆచించించి ‘ఇంట్లో పెంచుకోటానికి, పూజించటానికి తాబేలును పట్టి తెమ్మని నేనే కబురు పెడదామనుకున్నాను. ఇంతలో నువ్వే కానుకగా ఇచ్చావు. చాలా సంతోషం!’ అన్నాడు. విందు చేసి ఇంటికి పోతున్న సైదులుకు చిన్న సంచి నిండా ధనసాయం చేశాడు.నాటి నుంచి తాబేలును పెంచుకోసాగాడు జమీందారు. అంతేకాదు బుర్హాన్‌పురం అంతటా వృక్షాలు నరకటం నిషేధించి, కొత్త మొక్కలను నాటించాడు. వచ్చే ఏటికల్లా.. వర్షాలు పడి చెరువులు నిండాయి. రాంకీ -
చంద్రసేనుడి ఔన్నత్యం! స్వర్ణగిరి, చంద్రగిరి రాజ్యాల మధ్య..
స్వర్ణగిరి, చంద్రగిరి రాజ్యాల మధ్య తరతరాలుగా శత్రుత్వం ఉంది. పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. చంద్రగిరి రాజు చంద్రసేనుడు ఇరుగుపొరుగు రాజ్యాలతో మంచి సంబంధాలు కలిగి ఉండాలని కోరుకుంటాడు. ఒకరోజు స్వర్ణగిరి రాజు సూర్యసేనుడికి ఒక లేఖ పంపాడు. ‘సూర్యసేన మహారాజులవారికి నమస్కారములు.నేను మీతో మైత్రి కోరుకుంటున్నాను. శత్రుత్వమనేది మన తండ్రుల మధ్య ఉండేది. మన మధ్య కాదు. ప్రజల మధ్య కాదు. ఆ శత్రుత్వం వారితోనే అంతమవనీ. మన రాజ్యాల మధ్య ఆరోగ్యకరమైన సంబంధాన్ని కోరుకుంటున్నాను. మీరు అంగీకరించగలరని భావిస్తున్నాను’ అని లేఖలో కోరాడు.సూర్యసేనుడు అందుకు సమాధానంగా..‘మా నాన్న తన జీవితకాలమంతా మీ రాజ్యాన్ని శత్రురాజ్యంగానే భావిస్తూ వచ్చాడు. మీతో కలవలేదు. నేనూ మా నాన్నగారి మార్గంలోనే నడుస్తాను. మీతో స్నేహం నాకిష్టం లేదు’ అంటూ చంద్రసేనుడితో స్నేహాన్ని తిరస్కరిస్తూ లేఖ రాశాడు. ఇరుగు పొరుగు రాజ్యాలతో మంచి సంబంధాలు కలిగి ఉండటం మంచిదని, వారు స్నేహ హస్తం అందిస్తున్నప్పుడు తిరస్కరించడం మంచిది కాదని మంత్రి ఎంత చెప్పినా సూర్యసేనుడు ఒప్పుకోలేదు.ఒకసారి చంద్రగిరి రాజ్యంలో విపరీతంగా వర్షాలు కురవడంతో చెరువులు తెగి వరద వచ్చింది. వేల ఎకరాల్లో పంట నీట మునిగింది. పేదల గుడిసెలు కొట్టుకొని పోయాయి. వరద వల్ల చాలా నష్టం వాటిల్లింది. ఇరుగు పొరుగు రాజ్యాల రాజులు ఆహారపదార్థాలు, నిత్యావసర వస్తువులు, వస్త్రాలు,« దనం, ఔషధాలు మొదలగునవి అందించి వరద బాధితులను ఆదుకున్నారు. సూర్యసేనుడు మాత్రం మంత్రి చెప్పినా ‘శత్రురాజ్యానికి మనమెందుకు సాయం చేయాలి?’ అంటూ పూచిక పుల్ల కూడా సాయం చేయలేదు.ఒకసారి సాయంత్రం సూర్యసేనుడు వనవిహారం చేస్తూ ఓ మొక్కపై అందంగా ఊగుతున్న ఓ పువ్వును చూశాడు. దాన్ని తుంచి వాసన చూశాడు. కొద్ది సేపటికి స్పృహ తప్పి పడిపోయాడు. రాజ భటులు భవనానికి చేర్చారు. రాజ వైద్యుడు వైద్యం చేసి మెలకువ తెప్పించాడు. ఆ రోజు నుండి ఆయన తీవ్రమైన నరాల నొప్పితో బాధ పడసాగాడు. రాజవైద్యుడు.. అనేక రకాల ఔషధాలు వాడినా నరాల జబ్బు నయం కాలేదు. మంత్రి, రాజవైద్యుడు చుట్టు పక్కల రాజ్యాల నుండి రాజవైద్యులను పిలిపించి వైద్యం చేయించారు.రోజురోజుకీ నొప్పి పెరుగుతోంది కానీ తగ్గలేదు. రాజవైద్యుడు సూర్యసేనుడితో ‘మహారాజా! మీరు అంగీకరిస్తే ఒక మాట చెబుతాను. చంద్రగిరి రాజ్య వైద్యుడు సౌశీల్యుడిని మించిన వైద్యుడు ఈ చుట్టుపక్కల లేడు. వైద్యశాస్త్రంలో దిట్ట. ఆయనకు తెలియని వైద్యం లేదు. ఆయన మాత్రమే మీ జబ్బును నయం చేయగలడని నా నమ్మకం’ అని చెప్పాడు. సూర్యసేనుడు తటపటాయిస్తూ ‘చంద్రసేనుడు మనతో స్నేహం కోరితే తిరస్కరించాను. ఆ రాజ్యం వరదలతో అతలాకుతలమైతే నేను పూచిక పుల్ల కూడా సాయం చేయలేదు. ఇప్పుడు నా కోసం వాళ్ళ వైద్యుడిని చంద్రసేనుడు పంపుతాడంటారా?’ అన్నాడు సందేహంగా.అక్కడే ఉన్న మంత్రి ‘ప్రయత్నిస్తే తప్పులేదు కదా! నేనే స్వయంగా వెళ్లి అడుగుతాను’ అన్నాడు. సూర్యసేనుడు అంగీకరించాడు. మంత్రి చంద్రగిరి రాజ్యానికి వెళ్లి చంద్రసేనుడితో విషయం చెప్పాడు. చంద్రసేనుడు మారుమాట్లాడకుండా తన వైద్యుడిని పంపడానికి సమ్మతించాడు. సౌశీల్యుడు.. మంత్రిని జబ్బు వివరాలు అడిగి రకరకాల ఔషధాలు తీసుకుని స్వర్ణగిరికి వచ్చాడు. సూర్యసేనుడిని పరీక్షించి కొంతకాలం ఆ రాజ్యంలోనే ఉండి తన వైద్యంతో జబ్బును నయం చేశాడు.చంద్రసేనుడి పట్ల తన ప్రవర్తనకు సూర్యసేనుడు పశ్చాత్తాపపడ్డాడు. ఇరుగుపొరుగుతో శత్రుత్వం మంచిది కాదని, అందరితో కలసిమెలసి ఉండటమే ఉత్తమ లక్షణమని, పట్టింపులతో సాధించేదేమీ లేదని సూర్యసేనుడు గ్రహించాడు. చంద్రసేనుడి ఔన్నత్యాన్ని ప్రశంసిస్తూ, స్నేహం కోరుతూ లేఖ రాశాడు. ఆనాటి నుంచి రెండు రాజ్యాల మధ్య స్నేహం చిగురించింది. – డి.కె.చదువులబాబుఇవి చదవండి: ఈ దొంగతనమనేది ఒక పెద్ద జబ్బు.. చివరికి? -
పిల్లల కథ.. కోయిలమ్మ కొత్తగూడు!
గోదావరికి ఈవల ఉన్న వసంత విహారం అనే అడవికి కొత్తగా వచ్చింది కోయిలమ్మ. దాని దరికి చేరాయి మిగిలిన పక్షులన్నీ! అందులో నెమలి, పావురాలు, గోరువంకలు, గువ్వలు, వడ్రంగి పిట్టలు, పాలపిట్టలు, కాకులూ న్నాయి. వాటిని చూడగానే వినయంగా నమస్కరించింది కోయిల. ‘నేను ఇంతకు ముందు కృష్ణ తీరాన వున్న అడవిలో ఉండే దాన్ని. నా జోడీ ఒక ప్రమాదంలో మరణించడంతో ఇక అక్కడ ఉండలేక ఇలా వచ్చాను.మీరు ఆదరిస్తే ఇక్కడే ఉండి పోతాను. ఇప్పుడు నాకు గుడ్లు పెట్టే సమయం నన్ను ఆదరించండి’ అంటుంది కోయిల. ‘నీవు ఇక్కడ ఉండడానికి మాకే అభ్యంతరమూ లేదు’ అన్నాయి ఆ పక్షులు. ‘చాలా సంతోషం. అలాగే నాకు గుడ్లు పెట్టుకోవడానికి ఓ గూడు చూపించండి’ అని కోరింది కోయిల. ‘వేరే గూడు ఎందుకు? మా కాకమ్మ గూడు ఉందిగా’ అన్నది గోరువంక. ‘అయ్యో.. నా గూడు చాలా చిన్నది. ఇప్పటికే నేను నాలుగు గుడ్లు పెట్టున్నాను. ఖాళీ లేదు’ నొచ్చుకుంది కాకి. ‘అయితే.. వేరే పెద్ద గూడు కట్టుకుంటే సరి’ సలహా ఇచ్చింది గువ్వ. ‘ఇప్పటికిప్పుడు వేరే గూడు అంటే మాటలా?’ ఆందోళన చెందింది కాకి. ‘పని కోయిలమ్మది కనుక తాను సహాయ పడుతుంది’ తీర్మానించాయి మిగిలిన పక్షులు. ‘తనకి కొత్త కనుక మేం కూడా సహాయ పడతాం’ చెప్పాయి గువ్వ, గోరింకలు.గూడు కట్టడం మొదలయింది. ఎండిన పుల్లలు, నార, ఈనులను కోయిలమ్మ తీసుకురాగా.. కొత్త గూడు కట్టసాగింది కాకి. నాలుగు రోజుల్లోనే కోయిల గుడ్లు కోసం కొత్త గూడు తయారయింది. ‘నువ్వు వేరే చోట ఉండడం ఎందుకు ఈ కొత్త గూటిలోనే నీ గుడ్లనూ పొదుగు’ అంది కోయిల. దాంతో కాకమ్మ తన గుడ్లను కొత్త గూటికి చేర్చింది. కోకిల గుడ్లు, తన గుడ్లని తేడా లేకుండా రెండిటినీ పొదిగింది కాకి. నాలుగు కాకి పిల్లలు, మూడు కోయిల పిల్లలతో గూడు కళకళలాడింది.తన పిల్లలను చూసుకుంటూ మురిసిపోయింది కోయిల. పిల్లలన్నీ కాస్త పెరిగాక.. కాకి పిల్లలకి.. కోయిల పిల్లలు తమ జాతివి కావని తెలిసింది. ఒకరోజు అమ్మ లేని సమయంలో తెలిసీతెలియని వయసున్న కాకి పిల్లలన్నీ కోయిల పిల్లల్ని బయటకి నెట్టేశాయి. పాపం కోయిల పిల్లలు గూడు నుంచి కిందపడ్డాయి. చెట్టు కింద మెత్తని మట్టి ఉండటం వలన వాటికేమీ కాలేదు. తిరిగి వచ్చిన కాకి జరిగింది తెలుసుకుని తన పిల్లలని మందలించింది.కాకి పిల్లలు తల్లికి ఎదురు తిరిగాయి.. ‘ఎవరి పిల్లలనో మనమెందుకు ఆదరించాలి?’ అని! పిల్లల అమాయకత్వాన్ని చూసి ఏమీ మాట్లాడలేకపోయింది కాకి. కిందపడిన తన పిల్లలను చూసి కన్నీరు పెట్టుకుంది కోయిల. పక్కనే ఉన్న మర్రి చెట్టు తొర్రలోకి వాటిని చేర్చింది. ఎదుగుతున్న కోయిల పిల్లలు కొత్త రాగాలు ఆలపించసాగాయి. కోయిలా వాటితో జత కలిపింది. వాటి పాటలు వినడానికి పక్షులన్నీ అక్కడికి వచ్చేవి. కొన్ని తమ పిల్లలకి పాటలు నేర్పమని కోయిలని బతిమాలాయి. అలా కోయిల పక్షులకి పాటలు నేర్పడం మొదలుపెట్టింది.కాకి పిల్లలూ పాటలు నేర్చుకోవాలని అనుకున్నాయి. కోయిలమ్మతో మాట్లాడి తమకు పాటలు నేర్పించమని తల్లిని పోరాయి. ‘ఏ మొహం పెట్టుకుని అడగాలి మీరు చేసిన పనికి?’ అని పిల్లల్ని కోప్పడింది కాకి. ‘తెలియక చేసిన తప్పు అది. నువ్వా రోజు మా తప్పును సరిదిద్ది ఉండాల్సింది’ అన్నాయి తల్లితో. ‘నిజమే.. అప్పుడు మీ మీద మమకారంతో నా కళ్లుమూసుకుపోయాయి. అందుకే నాకిప్పుడు మొహం చెల్లడం లేదు కోయిల దగ్గరకు వెళ్లడానికి!’ అని బాధపడింది కాకి.‘సరే అయితే.. మేమే అడుగుతాం.. మమ్మల్ని క్షమించమని’ అన్నాయి ఆ పిల్లలు ముక్త కంఠంతో! ‘శభాష్.. ఇప్పుడు నా పిల్లలు అనిపించుకున్నారు మీరు. చేసిన తప్పుని గ్రహించి.. క్షమాపణ అడగాడానికి సిద్ధమయ్యారు’ అంటూ పిల్లల పరిణతికి సంతోషపడింది కాకి. ఆ కొమ్మకు కాస్త దూరంలో ఉన్న కోయిల ఆ సంభాషణనంతా విన్నది. వెంటనే తన పిల్లల్ని పిలిచి కాకి పిల్లలను వెంటబెట్టుకుని రమ్మనమని వాటిని కాకి గూటికి పంపింది. అవి కాకి గూటికి వెళ్లి.. ‘మా అమ్మ మిమ్మల్ని మా గూటికి రమ్మంటోంది.మా గూడు కోసం మీ అమ్మ మాకు చాలా సాయం చేసిందట కదా.. అసలు మమ్మల్ని మీ అమ్మే పొదిగిందట కదా మా అమ్మ చెప్పింది. మనం అన్నదమ్ములమనీ.. పోట్లాడుకోకూడదనీ చెప్పింది’ అంటూ కాకి పిల్లలను తమ వెంట తీసుకెళ్లాయి. వాటి మాటలకు అబ్బురపడింది కాకి. ‘ఎంత మంచిదానవు కోయిలా.. పిల్లల్ని ఎంత బాగా పెంచావు!’ అంటూ కోయిలను ప్రశంసించింది. ‘ఊరుకో కాకమ్మా.. నువ్వు చేసిన సాయం గురించి చెప్పానంతే! మీ సహవాసం వల్ల నాకూ కాసింత మంచితనం అబ్బినట్టుందిలే. ఈ పొగడ్తలకేం కానీ.. పిల్లలకు పాటలు నేర్పనివ్వూ..’ అంటూ కాకిపిల్లలతో సాధన మొదలుపెట్టించింది కోయిల. – కూచిమంచి నాగేంద్ర -
Children's Story: సహన రెండవ తరగతి చదువుతోంది.. ఒకరోజూ..!
సహన రెండవ తరగతి చదువుతోంది. ఆమె అన్నింటికీ తొందరపడుతుంది. ఏదయినా సరే తను అడిగిన వెంటనే నిమిషాల్లో జరిగిపోవాలి. లేదంటే గొడవ చేసి అమ్మ నాన్నలను విసిగిస్తుంది.‘అమ్మా! నా జడకు రబ్బర్ బ్యాండ్ వదులుగా ఉంది, సరిగ్గా పెట్టు’ వంట చేస్తున్న మానస దగ్గరకు వచ్చి అంది సహన. ‘పప్పు తాలింపు పెడుతున్నాను, ఐదు నిమిషాలు ఆగు’ అంది మానస. ‘అమ్మా! ప్లీజ్ అమ్మా, రామ్మా’ అంటూ నస పెట్టింది అమ్మాయి. దాంతో చేసే పని ఆపి సహన జడకి రబ్బర్ బ్యాండ్ సరిగ్గా పెట్టింది మానస.‘డాడీ! నాకు సాయంత్రం రంగు పెన్సిళ్లు తీసుకురండి’ ఆఫీసుకు వెళ్తున్న తండ్రితో చెప్పింది సహన.‘సరే అలాగే‘ అంటూ వెళ్ళిన ఆయన సాయంత్రం రంగు పెన్సిళ్లు మరచిపోయి వచ్చారు. అందుకు సహన మొండి పేచీ పెట్టింది. ఆ పేచీ భరించలేక ఆయన మళ్ళీ బజారుకి వెళ్ళి తీసుకువచ్చారు. ‘సహనా! నీకసలు ఓపిక లేదు. ఏదైనా అడిగిన వెంటనే దొరకదు. సమయం పడుతుంది. దానికోసం ఓర్పుగా ఎదురు చూడాలి. ఇలా తొందరపడితే.. తొందరపెడితే ముందు ముందు చాలా కష్టపడాల్సి వస్తుంది’ బాధపడుతూ కూతురితో అన్నారాయన. ఆ మాటలను సహన పెద్దగా పట్టించుకోలేదు.ఒకరోజు స్కూల్ నుంచి ఇంటికి వస్తూనే అమ్మతో ‘స్కూల్ యాన్యువల్ డేకి నన్నో గ్రూప్ డాన్స్‌కి సెలెక్ట్ చేశారు టీచర్. గ్రూప్ డాన్స్ కాదు సోలో డాన్స్ చేస్తానని చెప్పాను’ అంది సహన.‘మంచిదే.. కానీ గ్రూప్ డాన్స్ అంటే నువ్వెలా చేసినా అందరిలో కలసిపోతుంది. సోలో డాన్స్ అయితే చాలా శ్రద్ధపెట్టి నేర్చుకోవాలి! ఒక్కసారి ప్రాక్టీస్‌కే నాకంతా వచ్చేసిందని తొందరపడితే కుదరదు. రోజూ ఇంటి దగ్గర కూడా సాధన చేయాలి మరి!’ అంది మానస. ‘అలాగేలే అమ్మా’ అంటూ తల ఊపింది సహన నిర్లక్ష్యంగా! యాన్యువల్ డే కోసం స్కూల్లో డాన్స్ నేర్పించడం మొదలైంది. కానీ సహన ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయట్లేదు. అది గమనించి కూతురితో అన్నది మానస ‘ఇంటి దగ్గర నువ్వు సరిగా ప్రాక్టీస్ చేయడం లేదు. అలా అయితే స్టేజీ మీద బాగా చేయలేవు’ అని! ‘స్కూల్లోనే బాగా చేస్తున్నానమ్మా! అది చాల్లే’ అని జవాబిచ్చింది సహన ఎప్పటిలాగే నిర్లక్ష్యంగా. ఇంక చెప్పినా వినేరకం కాదని వదిలేసింది మానస.సహన వాళ్ల స్కూల్ వార్షిక దినం రానే వచ్చింది. సాంస్కృతిక కార్యక్రమాలు మొదలయ్యాయి. సహన వంతు వచ్చింది. పాట మొదలైంది. దానికి తగ్గ స్టెప్స్.. హావభావాలతో డాన్స్ చేయసాగింది సహన. అయితే హఠాత్తుగా తను వేయాల్సిన స్టెప్స్‌ని మరచిపోయి వేసిన స్టెప్స్‌నే మళ్లీ మళ్లీ వేయసాగింది. ‘అలా కాదు సహనా.. ఇలా చేయాలి’ అంటూ స్టేజీ పక్క నుంచి వాళ్ల డాన్స్ టీచర్ చిన్నగా హెచ్చరిస్తూ చేతులతో ఆ స్టెప్స్‌ని చూపించసాగింది. అర్థం చేసుకోలేక అయోమయానికి గురైంది సహన. దాంతో డాన్స్ ఆపేసి.. బిక్కమొహం వేసి నిలబడిపోయింది.స్టేజీ మీదకు వెళ్లి ఆమెను కిందకు తీసుకొచ్చేసింది టీచర్. ప్రేక్షకుల్లో ఉన్న మానస లేచి.. గబగబా సహన దగ్గరకు వెళ్లింది. కూతురిని హత్తుకుంది. దానితో అప్పటివరకు ఉన్న భయం పోయి తల్లిని గట్టిగా వాటేసుకుంది. ‘అమ్మా! నేను డా¯Œ ్స మధ్యలో స్టెప్స్ మరచిపోయాను’ వస్తున్న దుఃఖాన్ని దిగమింగుతూ చెప్పింది సహన. ‘నీకు చాలాసార్లు చెప్పాను.. ఏదైనా పూర్తిగా నేర్చుకోనిదే రాదని! కొంచెం రాగానే అంతా వచ్చేసిందనుకుంటావు. ఇప్పుడు చూడు ఏమైందో! సాధన చేయకపోవడం వల్ల ఆందోళన పడ్డావు. అదే చక్కగా ప్రాక్టీస్ చేసుంటే ఈ కంగారు ఉండేది కాదు కదా! తొందరపాటు వల్ల ఇలాంటివి జరుగుతాయనే ఓర్పుగా ఉండాలని చెప్పేది’ అంది మానస.అమ్మ మాటలనే వింటూ ఉండిపోయింది సహన. ‘చదువులోనూ అంతే! జవాబులో కొంత భాగం రాగానే వచ్చేసిందంటావు. ముక్కున పట్టి అప్పచెప్పి ఇక చదవడం ఆపేస్తావు. ముక్కున పట్టింది ఎంతసేపో గుర్తుండదు. అందుకే పరీక్షల్లో సరిగ్గా రాయలేక మార్కులు తెచ్చుకోలేకపోతున్నావు. అప్పటికప్పుడు ఏదీ వచ్చేయదు. నిదానంగా ఏ రోజు పాఠాలు ఆ రోజు చదివి అర్థం చేసుకోవాలి’ చెప్పింది మానస.అలా అంతకుముందు అమ్మ ఎన్నిసార్లు చెప్పినా సహనకు అర్థం కాలేదు. కానీ ఈసారి బాగా అర్థమయింది. తన పొరబాటును గ్రహించింది. ‘అమ్మా.. ఇప్పటి నుంచి తొందరపడను. నిదానంగా ఆలోచిస్తాను. దేన్నయినా పూర్తిగా నేర్చుకుంటాను’ అన్నది సహన .. అమ్మను చుట్టేసు కుంటూ! ‘మా మంచి సహన.. ఇక నుంచి పేరును సార్థకం చేసుకుంటుంది’ అంటూ.. కూతురు తల నిమిరింది మానస. – కైకాల వెంకట సుమలతఇవి చదవండి: మిస్టరీ.. 'ఆ వస్తువుల్ని ఎవరైనా తీసుకెళ్తే.. ఎందుకలా జరుగుతుంది'? -
'నిజాయితీ'..! ఒక రాజు.. అంతు చిక్కని రోగంతో..
అనగనగా ఒక రాజు. అతనో అంతు చిక్కని రోగంతో బాధపడసాగాడు. తానింక ఎన్నో రోజులు బతకనని అతనికి అర్థమైంది. అందుకే తను బతికుండగానే.. రాజ్యానికి నిజాయితీపరుడైన యువరాజును ఎన్నుకోవాలనుకున్నాడు. మరునాడే రాజ్యంలోని యువకులందరినీ పిలిపించి.. యువరాజు ఎంపిక విషయం చెప్పాడు. అందరికీ తలా ఒక విత్తనం ఇచ్చి, దాన్ని నాటమని చెప్పి.. పదిరోజుల తర్వాత మొలకెత్తిన ఆ మొక్కను తీసుకొని రమ్మన్నాడు. ఎవరి మొక్క అయితే ఏపుగా, బలంగా పెరుగుతుందో అతనే ఈ రాజ్యానికి యువరాజు అవుతాడు’ అని సెలవిచ్చాడు రాజు. ‘అలాగే రాజా..’ అంటూ అందరూ ఆ విత్తనాలను ఇంటికి తీసుకువెళ్లి మట్టి కుండల్లో వేశారు.పది రోజుల తర్వాత వాళ్లంతా ఆ మట్టికుండలను తీసుకుని రాజుగారి కొలువుకు వచ్చారు. మహేంద్ర అనే ఒక యువకుడు మాత్రం ఖాళీ కుండతో వచ్చాడు. రాజు అందరి కుండలను పరిశీలించి.. ఖాళీ కుండ తెచ్చిన మహేంద్రనే యువరాజుగా ప్రకటించాడు. ఆ మాట విన్న మిగతా యువకులంతా విస్తుపోయారు. ఓ యువకుడు కాస్త ధైర్యం చేసి ‘రాజా! మీరు చెప్పిన దాని ప్రకారం ఎవరి మొక్క అయితే ఏపుగా, బలంగా పెరుగుతుందో వారే కదా యువరాజు! మా విత్తనాలన్నీ మొలకెత్తి చక్కగా పెరిగాయి. పోటీ మా మధ్యనే ఉండాలి. కానీ విత్తనమే మొలకెత్తని మహేంద్రను యువరాజుగా ఎలా ప్రకటిస్తారు?’ అని ప్రశ్నించాడు.అప్పుడు రాజు చిన్నగా నవ్వుతూ ‘నేను మీకు ఉడకబెట్టిన విత్తనాలను ఇచ్చాను. వాటి నుంచి మీ అందరి కుండల్లోకి మొక్కలు ఎలా వచ్చాయి?’ అని తిరిగి ప్రశ్నించాడు రాజు. ఆ ఎదురు ప్రశ్నకు ఆ యువకులంతా బిత్తరపోయారు. తాము చేసిన మోసాన్ని రాజు గ్రహించాడని వాళ్లకు తెలిసిపోయింది. సిగ్గుతో తలవంచుకున్నారు! వాళ్లంతా రాజు ఇచ్చిన విత్తనాలను కాకుండా వేరే విత్తనాలను నాటారు. అందుకే అవి మొలకెత్తి ఏపుగా పెరిగాయి. మహేంద్ర మాత్రం రాజు ఇచ్చిన విత్తనాన్నే వేశాడు. అందుకే అది మొలకెత్తలేదు.అతని నిజాయితీని మెచ్చిన రాజు.. ఆ రాజ్యానికి సమర్థుడైన పాలకుడు మహేంద్రనే అని అతన్నే యువరాజుగా ప్రకటించాడు. తదనంతర కాలంలో ఆ రాజ్యానికి మహేంద్ర రాజు అయ్యాడు. నిజాయితీకి మారుపేరుగా నిలిచాడు. ప్రజలకు ఏ లోటూ రానివ్వకుండా పాలన సాగించాడు. – పుల్లగూర్ల శీర్షికఇవి చదవండి: 'కిడ్నాప్..'! ఓరోజు సాయంత్రం.. ఆఫీసు నుండి తిరిగి వస్తుండగా.. -
Children's Inspirational Story: 'యుద్ధకాంక్ష'! పూర్వం సింహపురిని..
పూర్వం సింహపురిని విక్రమసేనుడు అనే రాజు పరిపాలించేవాడు. ఆ రాజ్యం చుట్టూ పెద్దపెద్ద దేశాలు ఉన్నా ఈ రాజ్యం కేసి కన్నెత్తి చూసే సాహసం లేదెవరికి. కానీ పొరుగు దేశమైన విజయపురినేలే జైకేతుడికి మాత్రం ఎలాగైనా సింహపురిని జయించి తన రాజ్యంలో కలుపుకోవాలనే కోరిక ఉండేది. అందుకోసం రెండుసార్లు యుద్ధం చేసి ఓటమి చవిచూశాడు. అయినా అతనిలో ఆశ చావలేదు.ఒకసారి మంత్రి మండలిని సమావేశపరచి ‘సింహపురి మన కంటే చాలా చిన్న దేశం. సైనికబలమూ తక్కువే. అయినా దాన్ని మనం ఎందుకు జయించలేకపోతున్నాం? ఈసారి యుద్ధంలో ఎట్టిపరిస్థితుల్లో సింహపురిని ఓడించాల్సిందే. మన దేశంలో విలీనం చేసుకోవాల్సిందే. మన విజయపురిని సువిశాల సామ్రాజ్యంగా తీర్చిదిద్దాల్సిందే’ అన్నాడు రాజు. అతనిలోని ఈ యుద్ధకాంక్ష వల్ల దేశంలో కరువుకాటకాలు పెరిగిపోవడమే కాక ఎంతోమంది సైనికులు ప్రాణాలు కోల్పోసాగారు.ఎలాగైనా ఈ యుద్ధకాండను ఆపించి రాజు కళ్ళు తెరిపించాలని మంత్రి నిర్ణయించుకున్నాడు. అందుకే రాజుతో ‘క్షమించండి మహారాజా! దేశం.. సైన్యం.. ఎంత పెద్దవైనా.. ఎదుటివారి శక్తిని అంచనా వేయకుండా యుద్ధం ప్రకటిస్తే ఏమవుతుందో మీకు తెలిసిందే! ఇప్పుడు శక్తి కన్నా యుక్తి కావాలి. సింహపురి బలమేంటో.. బలహీనతేంటో వారి విజయరహస్యం ఏమిటో తెలుసుకోగలగాలి. అప్పుడు విజయం మనకు సులువు అవుతుంది.అందుకోసం సమర్థుడైన వ్యక్తిని వినియోగిద్దాం’ అన్నాడు మంత్రి. రాజుకు మంత్రి సలహా సరియైనదే అనిపించింది. ఒక్క క్షణం ఆలోచించి ‘ఎవరినో ఎందుకు? మనమే మారు వేషాలతో వెళ్దాం. అక్కడి రాజకీయ పరిస్థితులు, వారి విజయరహస్యాలను తెలుసుకుందాం’ అన్నాడు. దానికి మంత్రీ సరే అన్నాడు. మరునాడు ఉదయాన్నే రాజు, మంత్రి.. మామూలు ప్రయాణికుల్లా.. తమ గుర్రాలపై సింహపురికి బయలుదేరారు.ఆ నగరంలో అడుగు పెడుతూనే ఇద్దరికీ విస్మయం కలిగింది. నగరం చుట్టూ పొలాలు.. పండ్లతోటలతో ఆ నేలంతా ఆకుపచ్చ తివాచీ పరచినట్టు శోభయమానంగా కనిపించింది. జలాశయాలన్నీ నిండుగా కళకళలాడసాగాయి. నగరవీథులైతే.. శుభ్రంగా అద్దంలా మెరిసిపోసాగాయి. నగరవాసులు ఎవరిపనుల్లో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు. కుటీర పరిశ్రమల్లో రకరకాల వస్తువులు.. రంగురంగుల దుస్తులు తయారవసాగాయి.ఒక ఇంటి ముందు పనిచేసుకుంటూ కనిపించిన వృద్ధుడిని చూసి.. రాజు, మంత్రి తమ గుర్రాలను అతని దగ్గరకు నడిపించారు. అతణ్ణి సమీపిస్తూనే ‘అయ్యా మేము బాటసారులం. విదేశ సంచారం చేస్తూ ఈ దేశానికి వచ్చాము. ఈ దేశం ఇంత అభివృద్ధి చెందడానికి కారణాలు ఏమిటో చెబుతారా?’ అని అడిగారు. దానికా వృద్ధుడు ‘మా రాజు పాలనాదక్షుడు. ప్రజారంజకుడు. మా దేశవాసులు స్వయంకృషిని నమ్ముకుంటారు. మాకు ఆహార కొరతలేదు.మేం పండించిన ధాన్యాన్ని, తయారుచేసిన వస్తువులను మా చుట్టుపక్కల దేశాలకు ఎగుమతి చేస్తుంటాం. మా పొరుగున ఉన్న విజయపురి అయితే అచ్చంగా మా దేశ ఉత్పత్తుల మీదనే ఆధారపడి ఉంది. ఆ దేశవాసులు కొనే వస్తువులన్నీ మా దేశానివే. మా విజయ రహస్యానికి వస్తే.. మా దేశంలో ప్రతి పౌరుడు సైనిక శిక్షణ పొందవలసిందే! యుద్ధం అంటూ వస్తే అందరూ సైనికులై పోరాడుతారు. వారిని ప్రజాదళం అంటారు. వారిది స్వచ్ఛంద పోరాటం’ అని చెప్పాడు.తర్వాత రాజు, మంత్రి తమ గుర్రాలపై అలా నగర వీథుల్లో తిరుగుతూ.. పౌరులతో మాట్లాడుతూ కొత్త కొత్త విషయాలను తెలుసుకున్నారు. ఆరాత్రి అక్కడే బసచేసి మర్నాడు తిరిగి తమ దేశానికి బయలుదేరారు. మార్గంలో మహారాజు.. మంత్రితో ‘సింహపురి వైభవం చూశాక నాకెంతో సిగ్గుగా అనిపిస్తుంది. ఆ పరిపాలన, అక్కడి ప్రజల క్రమశిక్షణ నాకెంతో నచ్చాయి’ అన్నాడు. దానికి మంత్రి ‘ఆ దేశం చిన్నదైనా పచ్చని పాడిపంటలతో తులతూగుతూ ఉంది. ఎటు చూసినా కుటీర పరిశ్రమలు నెలకొని ఉన్నాయి.అక్కడి ప్రజలు తమ అవసరాలకే కాదు ఎగుమతులకూ అవరసమయ్యేంత శ్రమిస్తూ దేశ ఆర్థికపరిపుష్టికి పాటుపడుతున్నారు. క్షమించండి రాజా.. సింహపురితో మన దేశాన్ని పోల్చుకోలేము. మన దేశం విశాలమైందే. కానీ ఎక్కడ చూసినా ఎండిన బీళ్ళు. ఇంకిపోయిన చెరువులు, ఆకలి, నిరుద్యోగం దర్శనమిస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో పొరుగు దేశాన్ని గెలుచుకుని మన సువిశాలసామ్రాజ్యాన్ని పెంచుకోవటమంటే మన దారిద్య్రాన్ని, కరువుని పెంచడమే! మీరు తప్పుగా అనుకోకపోతే ఒక మాట చెబుతాను.. ముందు మనల్ని మనం సంస్కరించుకుందాం.మన దేశాన్ని పాడిపంటలతో తులతూగేలా చేద్దాం. ప్రతి పౌరుడికీ చేతినిండా పని కల్పిద్దాం. సింహపురిని ఆదర్శంగా తీసుకుందాం. ఇప్పుడు యుద్ధానికి కన్నా మనకు ఈ సంస్కరణలు అవసరం’ అని చెప్పాడు. అదంతా విన్నాక రాజు ‘నిజమే! ముందు మన దేశాన్ని సుభిక్షంగా.. సుస్థిరంగా తయారు చేద్దాం! వ్యవసాయానికి పెద్ద పీట వేద్దాం. త్వరలోనే విజయపురిని మరో సింహపురిగా మార్చేద్దాం! అందుకు కావలసిన ప్రణాళికను సిద్ధం చేయండి’ అని ఆజ్ఞాపించాడు రాజు.‘చిత్తం మహారాజా! మీ ఆశయం తప్పక నెరవేరుతుంది’ అంటూ భరోసా ఇచ్చాడు మంత్రి. — బూర్లె నాగేశ్వరరావు -
Short Story: ఉదయాన్నే ఒక గంట శబ్ధం వినపండింది.. అదేంటో కనుక్కోండి..!
ఒకనాటి ఉదయాన్నే అడవిలోంచి ఒక గంట శబ్దం మృగరాజైన సింహం చెవుల్లో సోకి ఎంతగానో ఆకట్టుకుంది. దాని ఉనికి తెలుసుకోవాలన్న కుతూహలంతో వెంటనే అన్ని జంతువులనూ సమావేశపరచింది. ‘ఈరోజు ఉదయాన్నే ఒక గంట శబ్దం నా చెవిన పడి నన్ను ముగ్ధుడిని చేసింది. తక్షణమే దాని గురించి కనుక్కుని చెప్పండి’ అని తన గుహలోకి పోయింది. అది విన్న జంతువులన్నీ తమలో తాము గుసగుసలాడుకున్నాయి.‘ఔను! నేనూ ఈరోజు ఆ గంట శబ్దం విన్నాను భలేగా ఉంది.. గణగణలాడుతూ..’ అన్నది కుందేలు. ‘ఆ చప్పుడుకి తెల్లవారుతూనే నాకు తెలివొచ్చేసింది. ఏదో కొమ్మ మీంచి కొమ్మకు గెంతుతుంటే అదోవిధమైన ధ్వని నా మనసును హత్తుకుంది’ తోడేలు చెప్పింది. ‘మీకెందుకలాగ అనిపించిందో నాకైతే బోధపడటం లేదు. పదేపదే ఆ గంట మారుమోగుతుంటే చెడ్డ చిరాకేసింది. అది ఎవరు చేస్తున్నదీ తెలిస్తే చంపకుండా వదలను’ అని కోపం ప్రదర్శించింది ఎలుగుబంటి.‘మృగరాజు చెప్పిన పనిని మనం చేయడం ధర్మం. సరేనా!’ అన్నది ఒంటె. మళ్ళీ గంట శబ్దం అదేపనిగా వినబడసాగింది. చీకటిపడే సమయానికి కూడా దాని ఉనికి కనుక్కోలేక తమ గూటికి చేరాయన్నీ. మర్నాడు ఉదయం ఒక కోతి గెంతుకుంటూ వచ్చి ‘ఒక పిల్లి తన గంట మెడలో కట్టుకుంది. అది కదిలినప్పుడల్లా మారుమోగి అడవి అంతా వ్యాపిస్తోంది. ఇదే విషయం మనం సింహానికి చెప్పేద్దామా?’ అని సాటి జంతువులతో అన్నది. ‘చెబితే మనల్ని ఆ గంట తెమ్మని అడగవచ్చు. దానికి సిద్ధపడితేనే మనం చెప్పాలి. లేకపోతే అంతా ఆలోచించాక చెవిన వేద్దాం’ అన్నది ఏనుగు.అదే సమయంలో గుహలోంచి సింహం గర్జిస్తూ బయటకొచ్చి ‘మీరంతా గంట సంగతి ఏం చేశారో చెప్పారు కాదు. ఈ ఉదయం కూడా అది నాకు వినబడి మరింత ఆకట్టుకుంది. చెప్పండి..’ అని హుంకరించింది. ‘మరి.. మరి.. అది.. ఒక పిల్లి మెడలో ఉండటం ఈ కోతి కళ్ళబడింది’ అని చెప్పేసింది కుందేలు.‘ఆ! ఒక పిల్లి మెడలో గంటా? అది దాని మెడలోకి ఎలావచ్చింది? ఎవరు కట్టారు? ఒక పిల్లి అంత ధైర్యంగా గంట కట్టుకుని అడవంతా తిరగటమేమిటి? ఈ రోజు ఎలాగైనా ఆ గంటను తెచ్చి నా మెడకు కట్టండి. లేకుంటే ఏంచేస్తానో నాకే తెలీదు’ అని గర్జించింది సింహం. వెంటనే జంతువులన్నీ అడవిలో గాలించడం మొదలెట్టాయి. అదే సమయంలో ఒక లేడి చెంగుచెంగున గెంతుకుంటూ వచ్చి ‘పిల్లి మెడలో గంట కట్టింది ఎలుకలని తెలిసింది. అవి ఎందుకలా కట్టాయో వాటికి కబురుపెట్టి అడగండి..’ అని చెప్పింది.ఎలుకలకు కబురు వెళ్ళింది. ఎలుకల నాయకుడు జంతువుల ముందు హాజరై ‘మా ఎలుకలకు ప్రాణహాని కలిగిస్తున్న ఒక పిల్లి నుండి రక్షించుకోడానికి మెడలో గంటకడితే ఆ చప్పుడుకి దాని ఉనికి తెలుస్తుందని అప్పుడు మేమంతా జారుకోవచ్చని ఉపాయం ఆలోచించాం’ అన్నది. ‘మరి మీరు చేసిన పనికి మేమంతా ఇప్పుడు ఇరుక్కున్నాం. ఆ శబ్దం మృగరాజుకు తెగ నచ్చేసింది. అందువలన మీరు ఆ గంటను దాని మెడలోంచి తీసి మాకివ్వాలి. మేము దాన్ని సింహం మెడలో కట్టాలి. ఆ పని మీరు త్వరగా చేయాలి’ అని ఎలుగుబంటి హుకుం జారీ చేసింది. ‘అయ్యో రామ! మా రక్షణ నిమిత్తం చచ్చేంత భయంతో ధైర్యం చేసి కట్టాం. మళ్ళీ దాన్ని తీసి తేవాలంటే గండకత్తెరే! మా కంటే మీరంతా శక్తిమంతులు. ధీశాలులు. దయచేసి మీలో ఎవరో ఒకరు పిల్లి మెడలో గంటను తొలగించండి. మళ్ళీ మాకు పిల్లి నుండి ప్రాణగండం తప్పదు. అయినా భరిస్తాం’ నిస్సహాయంగా చెప్పింది ఎలుకల నాయకుడు. ‘ఐతే సరే! వెళ్ళు. దానిపని ఎలా పట్టాలో మాకు తెలుసు. మృగరాజు కోరిక తీర్చడం మాకు ముఖ్యం’ అని ఎలుకను పంపేసింది ఏనుగు.కుందేలు ఎగిరి గంతేస్తూ ‘పిల్లి మెడలో గంట శబ్దం మన మృగరాజుకి నచ్చడం మన అదృష్టం. సింహానికి ఎప్పుడు ఆకలి వేసినా ఎవరని కూడా చూడకుండా వేటకు సిద్ధపడుతుంది. అలాంటప్పుడు మెడలో గంట ఉంటే ఆ చప్పుడు మనందరికీ వినిపించి తప్పించుకోడానికి అవకాశం వస్తుంది. అందువలన ఆ పిల్లి మెడలో గంటను తీసుకొచ్చి సింహానికి కట్టేయాలి’ అని అందరి వైపు చూసింది.‘పిల్లి మెడలో గంట తస్కరించడం ఏ మాత్రం? మీరు ఊ అంటే చాలు.. సాయంత్రంకల్లా తెచ్చేస్తా’ అన్నది కోతి హుషారుగా. జంతువులు ‘ఊ’ కొట్టాక కోతి అడవిలోకి పోయి గంట చప్పుడైన దిశగా పయనించింది. కోతి రాకను గమనించిన పిల్లి చెట్లన్నిటి పైనా తిరిగి తప్పించుకో చూసింది. అప్పుడు కోతి ‘మిత్రమా! నీరాక తెలుసుకొని నీ నుండి తప్పించుకోడానికి ఎలుకలు పన్నిన కుట్రలో భాగమే నీ మెడలో ఈ గంట. దాన్ని తీసిస్తే నీకే మంచిది. నువ్వు సడి చప్పుడు లేకుండా వెళ్ళి ఎలుకల పనిపట్టి నీ ఆకలి తీర్చుకోవచ్చును’ అన్న మాటలకి సంతోషపడి ఒప్పుకుంది. దాని మెడలోని గంటను విప్పి పట్టుకెళ్లి జంతువులందరి ముందు ఎలుగుబంటి చేతిలో పెట్టింది కోతి. ‘ఇక చూడండి.. మన మృగరాజు తన గోతిలో తానే పడే సమయం వచ్చింది’ అని తోడేలు అంటున్నంతలోనే.. గుహ లోపలున్న సింహం దగ్గరకి వెళ్ళి గంట దొరికిందని చెప్పింది కుందేలు.‘ఆహా! ఎంత అదృష్టం! నేను కోరుకున్న గంటను ఇక నామెడలో అలంకరించండి. ఆ శబ్దంతో అడవంతా మారుమోగి పోవాలి’ అన్నది బయటకొచ్చిన సింహం. ఎలుగుబంటి తన దగ్గర ఉన్న గంటను ఏనుగుకు ఇవ్వగా అది మృగరాజు మెడలో వేసింది. గంటను పదేపదే చూసుకుని మెడను తిప్పుతూ గంట శబ్దానికి తెగ ముచ్చట పడిపోతూ అడవిలోకి పరుగు తీసింది మృగరాజు. దాని వైఖరికి జంతువులన్నీ ‘గంట చప్పుడుకి మురిసిపోతోంది కాని అది తనకే గండమన్న సంగతి తెలుసుకోలేకపోయింది పాపం!’ అంటూ నవ్వుకున్నాయి. ‘సింహం కోరిక తమ పాలిట వరం’ అనుకుంటూ తమ దారిన తాము వెళ్లిపోయాయి. – కె.కె.రఘునందనఇవి చదవండి: ప్రకృతి కూడా అతడి కోపానికి భయపడేది.. ఒకరోజు.. -
పిల్లల కథ.. 'మల్లారం గ్రామంలో మారిన మాల్యాద్రి'..
మీర్‌పేట మహారాజు మాణిక్యవర్మ. అతని ఏకైక కూతరు మూకాంబికకు పక్షులంటే మహా ప్రాణం. కొందరు ఆమె పుట్టినరోజుకు ప్రత్యేకతలు నేర్చిన పక్షులను బహుమతిగా ప్రదానం చేసేవారు. వాటిని చూసి మూకాంబిక ముచ్చట పడేది. యువరాణికి పక్షిని బహుకరించినందుకు ఊహించనంత నగదు ముట్ట చెప్పేవాడు మాణిక్య వర్మ. ఆమె దగ్గర పాటలు పాడే కోకిల, మాటలు చెప్పే చిలుక, నాట్యం చేసే నెమలి ఉన్నాయి. మల్లారం గ్రామంలో మాల్యాద్రి అనే యువకుడు ఉండేవాడు. అతను చాలా మెండివాడు. తన స్వభావం మార్చుకోమని ఎవరు చెప్పినా వినేనాడు కాదు. తనకు నచ్చింది చేసుకుపోయేవాడు. వచ్చే మాసంలో ఉన్న యువరాణి మూకాంబిక పుట్టినరోజుకు ఏదైన పక్షిని బహుకరించి నగదు పొందాలనుకున్నాడు మాల్యాద్రి. వెంటనే వల పట్టుకుని అడవి బాటపట్టాడు. వలవేసి ధాన్యం, పురుగులు చల్లి చెట్టు నీడలో చతికిల పడ్డాడు. కొద్ది సేపటికి వలలో ఒక అందమైన తెల్లని కొంగ పిల్ల చిక్కింది. కొంగను బుట్టలో వేసుకుని ఇంటికి బయలు దేరాడు. కొంగ తెల్లగా, అందంగా ఉన్నందుకు మురిసి పోయాడు. ‘అందమైన కొంగ యువరాణికి బహుకరిస్తే రాజుగారు ఊహించనంత నగదు ఇస్తాడని’ కలలు కన్నాడు. ఐతే కొంగకు ఏదో ఒక ప్రత్యేకత ఉంటేనే యువరాణి మెచ్చుతుంది. కొంగకు ఏం ప్రత్యేకత ఉందో మాల్యాద్రికి తెలీదు. దారిలో గుడిముందు ఒక సాధువు కనిపించాడు. వంగి నమస్కరించి ‘సామీ ! కొంగకు ఏమైనా ప్రత్యేకతలుంటాయా!?’ అడిగాడు మాల్యాద్రి. సాధువు బుట్టలో ఉన్న కొంగను గమనించాడు. చిన్నగా నవ్వి ‘సరిగమ పదనిస’ అనేవి సప్త స్వరాలని తెలుసు కదా! అందులో ప్రతి స్వరం పక్షి లేదా జంతువు అరుపు నుంచి తీసుకున్నవే. అందులో ‘మ’ అంటే ‘మధ్యమం’ కొంగ అరుపు నుండి తీసుకోబడిందని చెపుతారు. ఇలా కొంగకు కూడా ఓ ప్రత్యేకమైన అరుపు ఉంటుంది. కానీ చిలుకలా మాట్లాడదు. నేర్పితే నేర్చుకోదు’ అన్నాడు. ‘ఎందుకు నేర్చుకోదు సామీ! నాకాడ నాటకాలు నడవవు. నేను నేర్పిస్తాగా!’ అంటూ ముందుకు కదిలాడు. ఇంటికి చేరిన మాల్యాద్రి కొంగ పిల్లను పంజరంలో పెట్టాడు. దానికి పంజరంలో ఉండటం నచ్చలేదు. మల్యాద్రి కొంగకు జీడిపప్పు, బాధం పప్పు పెట్టాడు. కానీ దానికి స్వేచ్ఛగా ఎగిరి, కష్టపడి సొంతంగా ఆహారం సంపాదించటమే ఇష్టం. దానికి చెరువులో చేపల కోసం, తీరంలో ఎరలు, పురుగులు, కప్పలను వెతుకుతూ ఒడ్డు వెంబడి నిశ్శబ్దంగా నడవటం ఆనందం. నిశ్చలంగా నిలుచుని ఆహారం కనబడగానే చటుక్కున పట్టుకొని గుటుక్కున మింగటంలోనే తృప్తి. ఇలా కష్టం లేకుండా పంజరంలో పెట్టిన ఆహారం దానికి రుచించలేదు. కొంగతో చిన్న చిన్న పదాలు పలికించటానికి ప్రయత్నించాడు మాల్యాద్రి. అది ఏదన్నా తిరిగి ‘మా’ అని అరిచేదే తప్ప చిలుకలా తిరిగి పలికేది కాదు. చుట్టు పక్కలవాళ్లు ‘కొంగలు.. మనుషుల మాటలు విని తిరిగి పలుకలేవు. నీ ప్రయత్నం మానుకో’ అని చెప్పారు. కానీ మొండివాడైన మాల్యాద్రికి వారి మాటలు చెవికెక్కలేదు. పక్షం రోజులైనా కొంగ తిరిగి మాట్లాడలేదు. మాల్యాద్రికి కొంగపై విసుగొచ్చింది. అప్పుడే అటుగా పోతున్న సాధువు మాల్యాద్రిని చూసి ఆగాడు. ‘చెప్పాను కదా నాయనా ! కొంగ వినటమే తప్ప చిలుకలా మాట్లాడదని! చిలుకలకు వాటి శ్వాసనాళంలో ప్రత్యేక అవయవం ఉంటుంది. ఆ అవయవం చిలుకకు మానవ భాష మాట్లాడటానికి సహాయపడుతుంది. ఇప్పటికైనా నీ ప్రయత్నం మానుకుని కొంగను పంజరం నుంచి విడుదలచెయ్యి’ అన్నాడు సాధువు. మాల్యాద్రి మొండితనం వీడి ఆలోచించాడు. చిలుక, కొంగలు పక్షులైనా స్వభావాలు వేరని గ్రహించాడు. మాల్యాద్రి తన స్వభావం మార్చుకున్నాడు. మారిన మాల్యాద్రి పంజరం నుంచి కొంగను విడుదల చేశాడు. — ముద్దు హేమలత ఇవి చదవండి: ఎవరూ.. బయటకు రావడానికి సాహసించని నిశిరాత్రి అది.. -
కాకి మాట
నందనవనంలో పెద్ద మర్రిచెట్టు ఉంది. నెమలి, చిలుక, మైనా, కోకిల, పావురం, కాకి వంటి పక్షులన్నీ ఆ చెట్టు మీద గూళ్లు పెట్టుకుని నివసిస్తున్నాయి. ప్రతిరోజూ సాయంత్రం అయ్యేసరికి పక్షులన్నీ చెట్టు మీదకు చేరుకుని కబుర్లు చెప్పుకుంటూ కష్టసుఖాలు పంచుకునేవి. ఒకరోజు అవి కబుర్లలోంచి వాదనలోకి దిగాయి. ‘‘నేనెంత అందమైన దాన్నో తెలుసా? నేను జాతీయ పక్షిని. నా ఈకలను అలంకరణ వస్తువులుగా అందరూ ఇళ్లలో అలంకరించుకుంటారు. చిత్రకారులు నా అందమైన రూపాన్ని చిత్రిస్తారు. నాట్య కళాకారుల్లో మేటి వారిని నాట్యమయూరి బిరుదుతో గౌరవిస్తారు’’ అంటూ నెమలి వయ్యారాలు పోయింది. ఈ మాటలతో రామచిలుకకు చిర్రెత్తింది. ‘‘ఏంటేంటీ... నువ్వొక్కదానివే అందగత్తెవా? నేను కానా? ఏ అమ్మాయి అందాన్నయినా నాతోనే పోలుస్తారు. ఎవరు ఏ మాట మాట్లాడినా తిరిగి అంటాను. చాలామంది నన్ను పంజరంలో ఉంచి ముద్దుగా పెంచుకుంటారు తెలుసా?’’ అంది. చిలుక మాటలు విన్న పావురం తానేమీ తక్కువ తినలేదంటూ... ‘‘నన్ను అందరూ శాంతికి గుర్తుగా భావిస్తారు. జాతీయ పండుగ రోజుల్లో నన్ను ఎగురవేస్తారు. పర్యాటక ప్రదేశాల్లో నేను కనిపిస్తే గింజలు చల్లి ఆనందిస్తారు’’ అంది. అప్పటి వరకు మౌనంగా ఉన్న కోకిల కూడా గొంతు విప్పింది. ‘‘నా పాటకు సాటి ఎవరు? ప్రకృతిలోని అందమంతా నా పాటలోనే ఉంది. కవులకు కవితా వస్తువును నేను’’ అంది. ఇలా పక్షులన్నీ నేను గొప్పంటే నేను గొప్పని తెగ వాదించుకున్నాయి. చివరకు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్న కాకి మీద పడ్డాయి. ‘‘అసలు ఏ విషయంలో నువ్వు గొప్పదానివి? నిన్ను చూస్తేనే అందరికీ చీదర. నిన్ను చూస్తేనే హుష్ కాకి అని తరిమేస్తారు’’ అని హేళన చేశాయి. కాకి ఏమీ బదులివ్వకుండా తన గూటికి వెళ్లిపోయింది. మర్నాడు మళ్లీ అన్నీ కలిసి ‘‘నిన్న ఏమీ మాట్లాడకుండా అలా వెళ్లిపోయావేం?’’ అంటూ రెచ్చగొట్టాయి. అప్పుడు కాకి గొంతు సవరించుకుని, ‘‘మీరందరూ నాకంటే గొప్పవారే. కాదనను. కానీ మీకూ కష్టాలున్నాయే! వాటిని మరచిపోయారు. నెమలి ఎంత అందమైనదైనా స్వేచ్ఛగా ఎగరలేదు. కనిపిస్తే మనుషులు బంధిస్తారు. మరి చిలుకనూ పంజరంలో బంధిస్తారు. పావురాన్నీ, కోకిలనూ రుచికరమైన మాంసం కోసం మట్టుపెట్టేస్తారు. నేను అందంగా లేకపోయినా, నాకు ఏ విద్యలూ రాకపోయినా మనుషులకు పుణ్యలోకాలు ప్రాప్తించేందుకు సాయం చేస్తుంటాను. ఎవరు ఎంత ఘనత కలిగి ఉన్నా, ఒదిగి ఉంటేనే వారి గొప్పతనానికి అందం’’ అంటూ ముగించింది. కాకి సమాధానంతో మిగిలిన పక్షులన్నీ అక్కడి నుంచి చల్లగా జారుకున్నాయి. - ఉలాపు బాలకేశవులు -
ఎగిరే నక్క
ఒకసారి ఒక నక్కకు ‘నేను కూడా పక్షుల మాదిరిగా గాలిలో ఎగిరితే ఎంత బాగుంటుంది’ అనిపించింది. ఆ కోరిక నక్కలో బాగా పెరిగిపోయింది. ఒకరోజు నక్కకు ‘హమ్మింగ్‌బర్డ్’ కనిపించింది. అది ఒక చెట్టు మీది నుంచి మరో చెట్టు మీదికి ఎగురుతూ, ఒక పువ్వు మీది నుంచి మరో పువ్వు మీద వాలుతూ మకరందం తాగుతోంది. అది చూసిన నక్క దాని దగ్గరకు వెళ్లి– ‘‘దయచేసి ఎగరడంలో వున్న రహస్యం ఏమిటో చెప్పవా? నాకు కూడా నీలా ఎగరడం నేర్పించవా?’’ అని బతిమిలాడింది. ‘‘నిజానికి ఎగరడం చాలా తేలిక. అందుకోసం నువ్వు ఏంచేయాలంటే, ఒక పెద్ద చెట్టు దగ్గరికి వెళ్ళి, దాని మీద నుంచి కిందకు దూకు. ఒకవేళ నీకు కిందికి పడిపోతున్నట్లుగా అనిపిస్తే ‘పైకి, పైకి’ అనుకో. అప్పుడు నీకు గాలిలో ఎగరడం ఎలాగో తెలిసిపోతుంది’’ అని చెప్పింది హమ్మింగ్ బర్డ్. ‘‘ఎగరడమంటే ఇంతేనా?!’’ సంభ్రమంగా అడిగింది నక్క. ‘‘ఏమో మరీ, మా అమ్మ నాకు చెప్పింది అయితే అంతే మరి’’ అంటూ తేనె తాగడంలో మునిగిపోయింది హమ్మింగ్‌బర్డ్. నక్క ఊరుకోకుండా తన చుట్టాలు, పక్కాలు అందరి దగ్గరికి వెళ్లి... ‘‘మీకు, నాకు చాలా తేడా ఉంది. నేను చాలా గొప్పదాన్ని’’ అని ప్రగల్భాలు పలికింది. నక్క మాటలకు అవి బోలెడు ఆశ్చర్యపోయాయి. ‘‘నువ్వు మా కంటే ఎలా గొప్ప?’’ అని మిగిలి నక్కలు అడిగాయి. ‘‘మీరు గాలిలో ఎగరగలరా?’’ అని అడిగింది తెలివి తక్కువ నక్క. ‘‘అందరూ అన్నీ చేయలేరు. పక్షులు ఎగురుతాయి, మనం ఎగరలేము. అవి మనలా అరవలేవు...’’ అని రకరకాలుగా తెలివితక్కువ నక్కకు హితబోధ చేశాయి మిగిలిన నక్కలు. కానీ తెలివి తక్కువ నక్క ఆ మాటలను చెవికెక్కించుకోలేదు. ‘‘నేను గాలిలో ఎగిరిచూపిస్తాను. ఆ తరువాత మాత్రం నేను మీ కంటే గొప్పదాన్ని అని అంగీకరించాలి’’ అన్నది తెలివి తక్కువ నక్క. ‘‘ఎవరు గొప్పా? ఎవరు కాదు? అనేది ఇప్పుడు అనవసరంగానీ, నీలాగే మన తాతల కాలంలో ఒక నక్క పులిని చూసి వాతలు పెట్టుకొని లబోదిబో అందట. నువ్వు అలాంటి పనిచేయకు’’ అని హెచ్చరించాయి బంధుమిత్ర నక్కలు. అయినా సరే, ఆ మాటలను పెడచెవిన పెట్టింది తెలివితక్కువ నక్క. ‘‘మీరు నాతో రావల్సిందే. నేను గాలిలో ఎగిరిచూపిస్తాను’’ అని పట్టుబట్టి వాటిని తనతో పాటు తీసుకెళ్ళింది. అడవంతా గాలించి ఒక పెద్ద చెట్టు కనుక్కుంది. బంధుమిత్ర సపరివారంగా ఆ చెట్టు దగ్గరికి చేరి దాని పైకి ఎక్కింది. కింద నిలబడి చూస్తున్న తన వాళ్లతో... ‘‘ఇప్పుడు నేను ఎట్లా ఎగురుతున్నానో చూడండి’’ అంది కొంచెం గర్వంగా. ఆ జంతువులన్నీ ‘‘వద్దు, వద్దు... కిందపడతావు’’ అని అరిచాయి. కానీ వాటి అరుపులను ఏమాత్రం లెక్క చేయకుండా నక్క ఉత్సాహంగా చెట్టు కొమ్మ చివరి నుంచి ఒక్క ఉదుటున పైకి ఎగిరింది–మనసులో ‘పైకి, పైకి’ అనుకుంటూ. పైకి ఎగరడం మాటేమిటోగానీ, నేల మీద కుప్పకూలిపోయి ‘కుయ్యో మొర్రో’ అని అడవంతా ప్రతిధ్వనించేలా పెడబొబ్బలు పెట్టింది పాపం తెలివి తక్కువ నక్క! ∙ మేకల మదనమోహనరావు -
ఆ వంతెన దెయ్యం కట్టింది..!
వేణువు ఊదుకుంటున్న గోపాలుడికి ఆ సాయంత్రం పొద్దెక్కడం కొంచెం ఆలస్యంగా తెలిసింది. హడావుడి పడుతూ తన మేకలను కాలువ వైపు తోలాడు. ఊళ్లో వాళ్లెవరూ ఆ కాలువ వైపు, ఆ వంతెన వైపు చీకటి పడే సమయానికి రారు. భయం. ఎప్పుడో చెక్కతో కట్టిన వంతెన అది. ఇప్పుడో, అప్పుడో పడిపోయేటట్టుంది ఆ వంతెన. ఆ వంతెన ఇవతల గట్టుకి ఆనుకుని ఒక పెద్ద మర్రి చెట్టుంది. దాని మీద దెయ్యాలున్నాయిని ఆ ప్రాంతం ప్రజల నమ్మకం. చీకటి పడిన తరువాత ఆ వంతెన మీదుగా ఆ కాలువని దాటి ఏ ప్రాణి అయినా ఆ మర్రిచెట్టు కిందగా వెళ్తే దాని మీదున్న దయ్యాలు చంపేసి, రక్తం తాగి, శవాన్ని ఆ కాలువలో పడేస్తాయని తరతరాలుగా ఆ ఊళ్ళో వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. కాని గోపాలుడి మేకలని తొందరగా ఇంటికి చేర్చాలనే ఆలోచనలో ఉండి, ఆ మర్రిచెట్టు కిందుగా వెళ్ళి, ఆ కాలువ వంతెన మీదుగా దాటిస్తున్నాడు. అప్పటికే చీకటి పడిపోయింది. మర్రిచెట్టు భయంకరమైన దయ్యంలాగా కనబడుతోంది. గాలి విసురుగా తగుల్తోంది. మేకలన్ని పరిగెడుతున్నాయి. ఆఖరు మేక వంతెన దాటి గట్టు మీదకి చేరింది. దాని వెనకే గోపాలుడు కుడి కాలు మోపాడు. ఎడం కాలు ముందుకు తీసుకుని అడుగు వేస్తున్నాడు... వేసేశాడు. ఇప్పుడు కాలువకు ఇవతలి గట్టు మీదున్నాడు. పేద్ద శబ్దం చేస్తూ వంతెన ముక్కలు, ముక్కలుగా విరిగిపోయి, ఆ కాలువలోకి భళ్ళున పడిపోయింది. భయంతో మేకలన్నీ ఇంటి వైపు పరుగెట్టడం మొదలు పెట్టాయి. పరుగో పరుగు. ఒకటే పరుగు. ఆగితే దయ్యాలు తమని కూడా పట్టుకుంటాయని భయం. సరిగ్గా అప్పుడే గోపాలుడికి భయంతో ఏడుస్తున్న మేక పిల్ల అరుపు వినిపించింది. గబుక్కున వెనక్కి తిరిగి చూశాడు గోపాలుడు. ఆ కమ్ముకుంటున్న చీకట్లో అవతలి గట్టు మీద కనపడింది మేక పిల్ల. అది ‘మే.. మే..’ అని భయంతో ఏడుస్తోంది. ఎర్రటి కళ్లతో దాని పీకని పట్టుకుని కనపడింది దయ్యం. చూడటానికే భయంకరంగా ఉంది ఆ దయ్యం. ‘‘దాన్ని వదిలేయి, దయ్యమా! నువ్వేది అడిగితే అది ఇస్తాను’’ అని గోపాలుడు ఆ దయ్యాన్ని అడిగాడు. ఇవ్వను అన్నట్టుగా తలని అడ్డంగా అటూ ఇటూ తిప్పింది దయ్యం. గోపాలుడు మోకాళ్ల మీద మోకరిల్లి, రెండు చేతులూ కలిపి దణ్ణం పెడుతూ, ‘‘దయ్యం, దయ్యం దయచేసి నా మేకపిల్లని వదిలెయ్యవా’’ అని మళ్లీ అడిగాడు. అప్పుడు దయ్యం, ‘‘సరే, వదిలేస్తాను. మరీ ఈ మేకపిల్ల నీ దగ్గిరకు ఎలా వస్తుంది?’’ అని అడిగింది. గోపాలుడుకి ఏమి సమాధానం చెప్పాలో తెలియక బిక్క మొహం వేశాడు. అప్పుడు దయ్యం ‘‘నువ్వు ఒప్పుకుంటే ఒక షరతు మీద ఈ మేక పిల్లని వదిలేస్తాను’’ అని అంది. ‘‘ఏమిటా షరతు?’’ అని అడిగాడు గోపాలుడు. ‘‘నువ్వు రేపు వచ్చేటప్పటికి ఇక్కడ ఒక సరికొత్త వంతెన ఏర్పాటు చేస్తాను. కానీ...’’ ‘‘ఊ... కానీ.. నేను ఏం చెయ్యాలో చెప్పు’’ అని ఆదుర్దాగా అడిగాడు గోపాలుడు. ‘‘ఆ వంతెన మీదుగా దాటి వచ్చిన మొదటి ప్రాణిని నాకు బలి ఇవ్వాలి’’అని అంది ఆ దయ్యం. ‘‘ఆ...’’ అని ఆలోచనలో పడ్డాడు గోపాలుడు. ‘‘నువ్వు ఒప్పుకోకపోతే ఈ మేకపిల్లని ఇప్పుడే చంపేస్తాను. రేపు ఆ వంతెన కూడా ఉండదు’’ అని అంది ఆ భయంకరమైన దయ్యం. ‘‘వద్దు, ఆ మేకపిల్లని చంపకు. నువ్వు చెప్పింది నాకు అంగీకారమే. అలాగే చేస్తాను’’ అని అన్నాడు గోపాలుడు. మరుసటి రోజు ఉదయం, తన సద్దిమూటతో మేకలని తోలుకుంటూ కాలువ దగ్గిరకి బయలుదేరాడు గోపాలుడు. ఆశ్చర్యం! కాలువ మీద కట్టెలతో కట్టిన సరికొత్త వంతెన సిద్ధంగా ఉంది అక్కడ. కాలువ అవతల గట్టున వంతెన దగ్గర దయ్యం నిలబడి ఉంది. కాలువ ఇవతల గట్టున, వంతెనకి ఇవతల గోపాలుడు, అతని వెనకే మేకలు. ఆ మేకలతో పాటు ఒక గజ్జి కుక్క. మేకలని గట్టు మీదే ఉండమని చెప్పి, తను ఆ వంతెన మీద కాలు బెట్టి గట్టిగా ఉందో లేదో చూద్దామనుకున్నాడు. కానీ ఈ లోపు దయ్యానికి తనకి ఉన్న ఒప్పందం గుర్తు వచ్చింది. అందుకని వంతెన మీద కాలుపెట్టకుండా ఇవతలే నిలబడ్డాడు. భుజానికి ఉన్న సద్ది మూటని విప్పాడు. అందులో నుంచి తను విడిగా పెట్టుకున్న మాంసం ముక్కని బయటికి తీసాడు. తన మేకలతో పాటే వచ్చిన గజ్జి కుక్కకి దాన్ని వాసన చూపించాడు. తన బలం అంతా వినియోగిస్తూ కుడి చేత్తో ఆ మాంసం ముక్కని వంతెన మీదుగా దయ్యం నిలబడి ఉన్న గట్టు మీదకి విసిరాడు. ఆ మాంసం ముక్క అవతల గట్టు మీద పడేలోపు గజ్జి కుక్క ఆ కాలువ మీదున్న వంతెన మీదుగా అటు వైపుకి దూకింది. అటు దూకడేమేమిటి, ఆ గట్టు మీద పడ్డ మాంసం ముక్కని నోటితో పట్టుకోవడం కూడా అయిపోయింది. ఇదంతా చూస్తున్న దయ్యం ఆశ్చర్యంతో నిర్ఘాంత పోయింది. దాని పక్కనే ఉన్న మేకపిల్ల దయ్యం పట్టు విదిలించుకుని ఆ గట్టునుంచి ఇటు గట్టు మీదకి పరిగెత్తుకుంటూ వచ్చేసింది. గోపాలుడు దాన్ని ఎత్తుకుని ముద్దు పెట్టుకుంటూ దయ్యం వైపు చూశాడు. దయ్యం బూడిదగా మారి కుప్పగా కూలిపోయింది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఆ మర్రిచెట్టు, ఆ కాలువ గట్టునా దయ్యాలు మళ్ళీ కనపడలేదు. - అనిల్ అట్లూరి -
గడసరి బుజ్జిమేక
బుల్లి బుల్లి మేక బుజ్జి మేక గంతులేసి తిరుగుతోంది. తల్లిమేక ఆ నిర్వాకం చూసి మురిసిపోయింది. మర్రి చెట్టు దగ్గర గొలుతో కట్టేసిన పొట్టేలును చూసింది. మెడలో రంగు రంగుల తాడుకు కట్టిన మువ్వలు, గలగల గజ్జెలు చూసింది. ‘‘ఆహా! ఎంత బాగున్నాయి అందంగా కనిపిస్తున్నావు. అదృష్టమంటే నీదే కదా!’’ బుజ్జిమేక సన్న సన్నగా అంది. ‘‘ఏం అదృష్టంలే!’’ బాధగా అంది పొట్టేలు. ‘‘అలా అంటావేం? అలంకరణలతో ముచ్చటగా కనిపిస్తున్నావు’’బుజ్జిమేక మురిసిపోతూ అంది. పొట్టేలు కాస్తా విచారపడుతూ ‘‘వెర్రిదానా, అందం సంగతలా ఉంచు. నీ లాగ నాకుస్వేచ్ఛ లేదు, కదా! ఎక్కడికీ తిరగలేను. ఎందుకీ వేషం!’’ మేకపిల్లతో అంది. ‘‘అయ్యో! సరే సరే’’ అనునయిస్తూ బుజ్జిమేక కదిలింది. ‘‘చూడు! స్వేచ్ఛ ఉందని పక్కనున్న అడవిలోకి వెళ్లకు. క్రూర జంతువులు నిన్ను నమలి పారేస్తాయి, జాగ్రత్త!’’ అంటూ పొట్టేలు హెచ్చరించింది. ‘‘అలాగే!’’ అని నిర్లక్ష్యంగా పరుగు తీసింది. తల్లి దగ్గరకు చేరి గంతులేసింది. ఆ గంతులు చూసి తల్లి– ‘‘ఏయ్! ఎటూ తిరగకు సుమా! మంద విడచి వెళ్లకు జాగ్రత్త సుమా!’’ తల్లిమేక కోపంగా అంది. ‘‘సరేలే’’ అంటూనే అటూ ఇటూ తిరగడం ప్రారంభించింది. ‘‘ఏయ్ బుల్లీ! బుజ్జీ! పక్కనున్న అడవికి వెళ్లకు. క్రూరమృగాలు తిరుగుతుంటాయి. ఒకవేళ ఎదురైనా గడుసుగా తప్పించు కోవాలి’’ బుజ్జిమేక అమ్మమ్మ చెప్పింది. ఇంతమంది చెబుతున్నారు మరి అడవి చూసి రావాలని కదిలింది. అసలే చిన్న వయస్సు, తుంటరి బుద్ధి. బుజ్జిమేక మనసు ఆపుకోలేక పోయింది. అటూ ఇటూ చూసింది. తనపై ఎవరి దృష్టీ లేకపోవడం చూసి గబ గబా అడవిలోకి వెళ్లింది. పెద్ద పెద్ద చెట్లు, దట్టమైన పొదలు, చెట్లకు వాటేసుకున్న తీగలు... చల్లని గాలితో చూడ ముచ్చటగా, ఎంతో హాయిగా ఉంది అడవి. ఇంతలో నక్క ఎదురైంది. దానిని చూడగానే చిన్న భయం కలిగింది. అమ్మమ్మ మాటలు గుర్తుకు వచ్చాయి. ధైర్యం తెచ్చుకుంది. ‘‘ఏయ్ తుంటరీ! నిన్నిప్పుడు నంజుకు తింటాను’’ అంది నక్క. ‘‘మామా! నేనెవరు అనుకుంటున్నావు. రాజుగారి ముద్దుబిడ్డను. జాగ్రత్త!’’ అని గద్దించింది బుజ్జిమేక. రాజుగారి మాట చెప్పగానే నక్క జడిసిపోయింది. ఏమిటా అన్నట్లు చూసింది. ‘‘రాజు గారు నన్ను రమ్మని ఆహ్వానించారు. పొట్టేలు బాబాయి సాయం వస్తానంటే వద్దన్నాను’’అంది. నాకెందుకు ఈ అనవసరమైన గోలని జారుకుంది నక్క. ఇంతలో తోడేలు ఎదురైంది. రాజు బిడ్డనని చెప్పినా వినుకోలేదు. ముందుకు రాబోయింది తోడేలు. ఇంతలో ఏనుగు రావడం చూసి తోడేలు ప్రక్కకు తప్పుకుంది. ఏనుగు బుజ్జిమేకను చూసి ఎవరు నువ్వని అడిగింది. ‘‘నేను వనరాజు ముద్దు బిడ్డను’’ అని చెప్పింది. ఏనుగు కోపంతో ముందుకు వచ్చింది. ‘‘ఏయ్ రాజుగారంటే భయం లేదా? నీకు!’’ బుజ్జిమేక హెచ్చరించినా భయం లేకుండా ఏనుగు తొండంతో విసిరింది. అదృష్టం కొద్దీ ఎదురు వస్తున్న సింహం వీపు మీద కూచున్నట్లు పడింది. ఏమిటా అన్నట్లు చూసింది సింహం. ‘‘అడవికి మీరే రాజని నేనంటే కాదని వాదిస్తోంది ఆ ఏనుగు. ఆ కోపంతోనే నన్ను విసిరేసింది..’’ బుజ్జిమేక చెప్పేసరికి ఏనుగు వెనక్కు పరుగు తీసింది. సింహం బుజ్జి మేకను చూసి ముచ్చట పడింది. ఎలుగుబంటిని సాయంగా ఇచ్చి మంద వద్దకు పంపింది. మేకలు అన్నీ దానిని చూసి ఆనందించాయి. - బెహరా ఉమామహేశ్వరరావు -
పండితుడి గర్వభంగం
శ్రీరంగపురాన్ని విజయసింహుడు ఎంతో సమర్థంగా పరిపాలిస్తున్నాడు. సంగీత సాహిత్యాలను బాగా ఆదరించేవాడు. అతని మంత్రి సుశర్మ. ఒక రోజు మహారాజు కొలువుతీరి ఉండగా రామబ్రహ్మం అనే పండితుడు వచ్చి ‘‘మహారాజా! నేను దేశ దేశాలు తిరిగి నా పాండిత్యంతో ఎందరో పండితులను ఓడించి ఇన్ని కంకణాలను గెలుపొందాను’’ అని చేతికున్న కంకణాలను చూపించాడు. ‘‘ఇప్పుడు మీ రాజ్యంలోని పండితులను ఓడించడానికి వచ్చాను. నాతో పోటీకి దిగని పక్షంలో మీరు ఓటమిని అంగీకరించి నా కాలికి గండపెండేరం తొడగాలి!’’ అని సవాలు చేశాడు. ‘‘అయ్యా! మహాపండితుల వారు మీ పోటీకి మేము అంగీకరిస్తున్నాము. కాకపోతే పోటీ ఎల్లుండి ఉంటుంది. మీకు సమ్మతమేనా?’’ అన్నాడు మహామంత్రి సుశర్మ. ‘‘నాకు సమ్మతమే’’ అన్నాడు పండితుడు. ‘‘చాలా సంతోషం అంతవరకు మీరు మా ఆతిథ్యాన్ని స్వీకరించండి’’ అన్నాడు మహారాజు. ‘‘సంతోషం మహారాజా!’’ అన్నాడు పండితుడు. ఎటువంటి సమస్యనైనా ఇట్టే పరిష్కరించే మంత్రిపైన మహారాజుకు పూర్తి నమ్మకం ఉంది. రామబ్రహ్మం ఆ రోజుకు విశ్రాంతి తీసుకున్నాడు. మరుసటిరోజు సుశర్మ ‘అలా మా రాజ్యంలోని సరస్వతీదేవి, లక్ష్మీదేవి ఆలయాలను చూసి వద్దాము పదండి’ అని అతడిని తీసుకు వెళ్ళాడు. అక్కడ గుడి పక్కగా ఆవరణలో ఎంతోమంది పెద్దలు కూర్చొని ఉండగా ఒక పన్నెండేళ్ళ పిల్లవాడు కొన్ని విషయాలను భోదిస్తున్నాడు. ‘‘తోద్యవి యంనవి తయధేవి యిస్తావ దిఅ తీస్వరస క్షంటాక ల్లవ యిస్తాభిల తోనిదా విదేక్ష్మీల హంగ్రనుఅ డాకూ దిస్తుంద్ధిసి... కేనిత్రామా తఅం నునే ణ్ణితుడిపం నిఅ స్తేరికహంఅ రుద్దఇ లూల్లుత రుతావుమరదూ’’ అన్నాడు. ‘‘నువుఅ... నువుఅ దినప్పిచెవ్వును త్యంసరక్షఅ’’ అన్నారు కూర్చున్న పెద్దలు. ‘‘ఏంటి ఆ పిల్లవాడు ఏం చెబుతున్నాడు అది ఏ భాష?’’అన్నాడు పండితుడు. ‘‘ఇది మీ లాంటి పండితులకు తెలియక పోవటమేమిటి అది తెలుగు భాష!’’ అన్నాడు సుశర్మ. పరువు పోతుందని ‘‘సంస్కృతమేమో అనుకున్నాను. అవును అది తెలుగు భాషే!’’ అన్నాడు తత్తరపాటు కప్పిపుచ్చుకుంటూ పండితుడు. ‘‘దేశ భాషలందు మన తెలుగు భాష లెస్స’’ అన్నాడు సుశర్మ. ‘‘అవును... అన్నట్టు ఆ పిల్లవాడు ఎవరు?’’ ‘‘అతను మహాపండితుడు శంకరశాస్త్రి గారి ముఖ్య శిష్యుడు సుధాముడు. అతనికి ఎన్నో భాషలలో పట్టు ఉంది. రేపు పాండిత్యంలో మీతో తలపడబోయేది అతనే’’ ‘‘అంత చిన్న పిల్లవాడు పాండిత్యంలో పోటీపడతాడా?’’ ‘‘అవును శంకరశాస్త్రి గారు ఎక్కడ పోటీ జరిగినా ఆ సుధముణ్ణే పంపిస్తారు... అతనికి ఇప్పటివరకు ఓటమే లేదు’’ ‘‘సరే విడిదికి పోదాము పదండి’’ అన్నాడు ముఖంలో రంగులు మారిన పండితుడు. విడిదికి చేరుకున్న పండితుడు ఎంతో ఆలోచించాడు ఆ పిల్లవాడు మాట్లాడే తెలుగు భాషే అర్థం కావడంలేదు ఇక సంస్కృత భాష ఎలాగుంటుందోనని భయపడ్డాడు. తెల్లవారితే ఆ పిల్లవాడితో పోటీ, దానితో ఒక నిర్ణయానికి వచ్చాడు. ఒంటరిగా మహారాజును కలిసి’’ మహారాజా! నాకు ఆరోగ్యం సరిగా లేదు నేను పోటీలో పాల్గొనలేను. నాకు సెలవు ఇప్పించండి ఇప్పుడే మా రాజ్యం చేరుకుంటాను’’ అన్నాడు. అప్పుడే అక్కడకు వచ్చాడు మంత్రి సుశర్మ. ‘‘చూడండి మహామంత్రి! ఈ పండితులవారికి ఆరోగ్యం సరిగా లేదట పోటీలో పాల్గొనలేను అంటున్నారు. వెంటనే రాజ వైద్యుణ్ణి పిలిపించి వీరి ఆరోగ్యం బాగు చేయించండి. రేపు వీరు పోటీలో పాల్గొనాలి!’’ ‘‘చిత్తం మాహారాజా! మెరుగైన వైద్యం అందించి రేపు పోటీలో పాల్గొనేలా చేస్తాను.’’ రాజ వైద్యుడు వచ్చాడు. పండితుణ్ణి పరీక్షించి ఒక గుళిక ఇవ్వబోయాడు. ‘‘అయ్యో మహారాజా! నేను పోటీలో పాల్గొనలేను’’ ‘‘పోటీలో పాల్గొన లేకపోవడానికి గల కారణం చెప్పండి?’’ అన్నాడు సుశర్మ. ‘‘అయ్యా! మంత్రివర్యా! ఆ సుధాముడు మాట్లాడిన తెలుగు భాష కొంచెం విన్నట్టు అనిపిస్తుంది కానీ పూర్తిగా అర్థం కావడం లేదు పైగా నేను అది చదువుకోలేదు. ఆ పిల్లవాడితో నేను పోటీ పడలేను. సభలో ఓటమికంటే మీముందు ఓటమిని అంగీకరిచడం ఉత్తమమని తలచాను.’’ ‘‘అయ్యో! మీలాంటి మహాపండితులతో పోటీ పడి ఓడిపోవడమే సుధాముడికి కావలసింది. మీరు వెళ్లిపోతే అతను నొచ్చుకుంటాడు’’ అన్నాడు సుశర్మ. ‘‘ఇక మీదట ఎవ్వరితోనూ పాండిత్యంలో పోటీ పడను. ఈ నా చేతి కంకణాలు తీసి మీకు ఇస్తాను. వీటిని ఆ పిల్లవాడికి బహుమానంగా ఇవ్వండి... నన్ను ఈ రాత్రికే వెళ్లనీయండి’’ అని చేతికున్నవి తీయబోయాడు. ‘‘అవి తీయకండి మీరు వెళ్లడానికి అంగీకరిస్తున్నాను... కవులను, కళాకారులను, పండితులను ఆదరించడం మా దేశ ఆచారం!’’ అని వంద వరహాలు ఇచ్చి పట్టు వస్త్రాలతో సత్కరించి అతని ప్రయాణానికి తగిన ఏర్పాట్లు చేశాడు మహారాజు. పండితుడు మహారాజుకు, మంత్రికి ధన్యవాదాలు చెప్పి వెనుదిరిగాడు. పండితుడు వెళ్ళిన తరువాత ‘‘ఏం మంత్రిగారు! ఈ పాండిత్య గండాన్ని ఎలా గట్టెక్కించారు?’’ అన్నాడు మహారాజు. ‘‘ఏమీ లేదు మహారాజా! మన తెలుగునే మన సుధాముడితో తిరిగేసి మాట్లాడించేలా చేశాను. ఆ వాక్యాలు ఏమిటంటే... విద్యతో వినయం విధేయత వస్తాయి. అది సరస్వతీ కటాక్షం వల్ల లభిస్తాయి దానితో లక్ష్మీదేవి అనుగ్రహం కూడా సిద్ధిస్తుంది. అంత మాత్రానికే నేను పండితుణ్ణి అని అహంకరిస్తే ఇద్దరు తల్లులూ దూరమవుతారు’’అని మంత్రి చెప్పాడు. మంత్రి తెలివిని ఎంతగానో మెచ్చుకున్నాడు. మరుసటి రోజు సభలో పండితుడి విషయం చెప్పి మంత్రిని, సుధాముణ్ణి ఘనంగా సత్కరించాడు మహారాజు. సభ చప్పట్లతో మార్మోగింది. - యు.విజయశేఖర రెడ్డి -
రాజ్యానికి రక్షణ కవచం
రాయవరపుకోటను గజేంద్రవర్మ అనే రాజు పరిపాలిస్తుండేవాడు. గజేంద్రవర్మకు ప్రజలంటే అమితమైన ప్రేమ. తన రాజ్యంలో ప్రజలకు ఎలాంటి లోటూ ఉండకూడదని భావించేవాడు. ప్రజల క్షేమం కోసం అహర్నిశలూ ఆలోచించేవాడు. ప్రజలు కూడా గజేంద్రవర్మను అభిమానిస్తూ, మహారాజు నిండు నూరేళ్లు బతకాలని దేవుని ప్రార్థించేవారు. కానీ గజేంద్రవర్మ బంధువులు ఎలాగైనా రాయవరపు కోటను తమ రాజ్యంలో కలుపుకోవాలని కలలు కనేవారు. గజేంద్రవర్మతో సన్నిహితంగా ఉంటూనే కపట ఉపాయాలు పన్నేవారు. ఇరుగుపొరుగు రాజ్యాలైన బంధువులు మనవారే మన మంచి కోసమే పాటుపడతారని గజేంద్రవర్మ అనుకునేవాడు. ఇరుగు పొరుగు రాజ్యాల రాజులు మీ బంధువులే అయినా, మన రాజ్యంపై కన్ను వేశారని దోచుకోవాలని చూస్తున్నారని మహారాజు గజేంద్రవర్మకు ఎందరు చెప్పినా నమ్మేవాడు కాదు. వారు మన శ్రేయోభిలాషులు అంటూ చిరునవ్వు చిందించే వాడు. మరోసారి అలాంటి ప్రస్తావన తేకూడదని చెప్పేవాడు. రాయవరపు కోట రాజ్యం చుట్టూ పెద్ద అడవులు ఉండేవి. అడవులలోకి ఎవరికీ అనుమతి ఉండేది కాదు. దారులలో మాత్రమే పొరుగు రాజ్యాలకు ప్రయాణం సాగేది. అడవుల మూలంగా వర్షాలు కురవడం వల్ల ప్రజలు పంటలు పండించుకుంటూ జీవనాధారం పొందేవారు. పంటలు పండటం మూలంగా మహారాజు నుంచి ప్రజలు ఏమీ ఆశించేవారు కాదు. మహారాజు కూడా మితిమీరి పన్నులు వసూలు చేయకుండా ప్రజలు సంతోషంగా బతకమనేవాడు. పొరుగు రాజ్యాల్లో వర్షాలు లేక కష్టపడుతూ, గజేంద్రవర్మ వద్ద అప్పుగా ధనం తీసుకెళ్లేవారు గజేంద్రవర్మ కూడా వారికి సాయపడేవాడు. ఒకసారి గజేంద్రవర్మ పొరుగు రాజ్యాల గురించి ఇంతలా చెప్తున్నారు, వారి సంగతి తెలుసుకుందాం అనుకున్నాడు. కొన్ని దశాబ్దాలుగా అప్పుగా తీసుకున్న ధనం చెల్లించాలని పొరుగు రాజ్యాలకు వర్తమానం పంపాడు. ‘‘మాకు వర్షాలు లేక పంటలు పండక కష్టాల్లో ఉన్నాం. మేము మీకు తిరిగి అప్పులు చెల్లించాలా? లేదు మేము దండయాత్ర చేసి మీ రాజ్యాన్ని ఆక్రమించుకుని దోచుకుంటాం’’ అని తిరుగు వర్తమానం పంపారు. విషయం తెలుసుకున్న గజేంద్రవర్మ నమ్మలేకపోయాడు. చేసేది లేక రాజ్యాన్ని యుద్ధానికి సన్నద్ధం చేసి, పొరుగు రాజ్యాల దారుల్లో నిలిపాడు. పొరుగు రాజ్యాలు దారుల వెంట సైన్యాన్ని ఎదుర్కోవడం కష్టమని రాజ్యం చుట్టూ ఉన్న అడవుల గుండా లోనికి ప్రవేశించాలని బయలుదేరారు. అడవులలో ఉన్న పొదలు నరుక్కుంటూ ముందుకు సాగారు. ఎంత ముందుకు వెళ్లాలన్న చెట్లను చేమను గడ్డిపరకలను కొమ్మలను తగిలి కింద పడసాగారు. ఒక్క రోజంతా అడవి గుండా వెళ్దామన్నా మైలు కూడా దాటలేకపోయారు. అలసిసొలసి కిందపడిపోయారు. చెట్ల కదలికలు, శబ్దాలు విన్న పులులు సింహాలు ఏనుగులు జంతువులు అరుపులతో రాసాగాయి. పొరుగు రాజ్య సైనికులంతా బతుకుజీవుడా అంటూ ప్రాణాలు అరచేత పట్టుకుని పరుగులు తీశారు. అడవుల మూలంగా ప్రకృతి పచ్చదనంతో పాటుగా రాజ్యానికి రక్షణ కవచంలా ఉపయోగపడతాయని పొరుగు రాజ్యాల రాజులు తెలుసుకుని, అడవుల గుండా వెళ్లి రాయవరపు కోటను ఆక్రమించుకోవాలని అనుకున్న భ్రమ నుంచి బయటపడ్డ రాజులు గజేంద్రవర్మను క్షమించమని వేడుకున్నారు. తప్పుకు క్షమించమని అప్పులు కడతామని చెప్పారు. గజేంద్ర వర్మ చిరునవ్వుతో ‘‘నాకు ధనం ముఖ్యం కాదు. మీ గుణం తెలిసింది. మీరు బంధువులని చెప్పుకోవడానికి అర్హత లేదు. ఇక నుంచి బుద్ధిగా మెలగండి’’ అంటూ హెచ్చరించాడు. గజేంద్రవర్మ పంటల కోసం రాజ్య రక్షణ కోసం అడవులు పెంచుతున్నారని తెలుసుకుని ప్రజలు ఆనందించారు. గజేంద్రవర్మ ప్రజల క్షేమమే ధర్మం అంటూ రాజ్యపాలన చేయసాగాడు. - ఉండ్రాల రాజేశం -
సింహానికి ప్రాణ భిక్ష
సింహం ఒకరోజు జంతువును వేటాడి చంపి తినసాగింది .అప్పటికే కడుపు నిండి పోవడంతో మిగిలిన మాంసాన్ని తనకు సహాయం చేసే జంతువుకు ఇవ్వాలని అనుకొంది. సింహానికి కొద్దీ దూరంలో ఉన్న కుందేలు సింహం వైపు చూస్తూ ‘‘ఏమిటి సింహం మామా! ఆ మాంసం తినకుండా అలాగే ఉన్నావు. కడుపు నిండి పోయిందా?’’ అడిగింది ‘‘ఔను కుందేలూ! ఈ మాంసాన్ని నాకు ఆకలిగా ఉన్న సమయాన ఎక్కడ ఏ జంతువు ఉన్నదో తెలిపే ఆ నక్కకు ఇద్దామనుకుంటున్నాను. ఆ నక్క ఎక్కడకు వెళ్లిందో...’’ ‘‘ఏదైనా నీలాంటి సింహం దగ్గర బాగా తిని ఉంటుంది. ఆకలి లేదు కాబట్టి రానట్లుంది. పాపం చెట్టుమీద ఆ కాకులు, గద్దలు నీ వైపే చూస్తున్నాయి. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళావంటే ఆ పక్షులన్నీ ఒక్కసారిగా వచ్చి పూర్తిగా తినేస్తాయి.’’ ‘‘నాకు సహాయం చేసేవాటికే ఈ మాంసం ఇద్దామనుకుంటున్నాను...’’ ‘‘సింహం మామా! నువ్వు మళ్లీ పొరపాటు పడుతున్నావు. ఒకసారి మీ తాతయ్య వేటగాడి వలలో పడితే చిట్టెలుక ఆ వలను కొరికి ప్రాణభిక్ష పెట్టిందన్న సంగతి గుర్తుందా?’’ ‘‘ఎలుక అంటే సరే... కానీ ఈ పక్షులు నాకు ఏమి సహాయం చేస్తాయి?’’ ‘‘సింహం మామా! ఎలాగూ ఆ మాంసం తినడానికి ఎవరూ లేనప్పుడు ఆ పక్షులకు ఇచ్చి పుణ్యం తెచ్చుకో.’’ ‘‘పుణ్యం కోసం అని చెప్పావు బాగుంది. నువ్వు చెప్పినట్లే ఆ పక్షులు తినడానికి వీలుగా నేను ఇక్కడి నుంచి వెళ్తాను’’ అంటూ సింహం అక్కడి నుంచి వెళ్లిపోయింది. జరిగినదంతా చూస్తున్న కాకులు, గద్దలు ఒక్కసారిగా ఆ జంతుమాంసం దగ్గరకు వచ్చి తిన్న తరువాత కుందేలు చేసిన సహాయానికి మెచ్చుకున్నాయి. ఒక రోజు సింహం నిదురపోతున్న వేళ పక్షుల అరుపులతో సింహం ఒక్కసారిగా మేలుకొని చిరాకుగా పక్షుల వైపు చూస్తూ ‘‘ఏమిటీ కాకిగోల’’ అని కోపంగా అంది ‘‘సింహం మిత్రమా! ఇద్దరు వేటగాళ్లు విల్లంబులతో మిమ్మల్ని చంపడానికి వస్తున్నారు. మీరు వెంటనే గుహలోకి వెళ్ళండి’’ అంది కాకుల నాయకుడు సింహం వెంటనే గుహలోకి వెళ్లి దాక్కొంది. వేటగాళ్లు వచ్చి చాలా సేపు చూసిన తరువాత తిరిగి వెళ్లారు. సింహం గుహ బయటకు వచ్చి ‘‘ఓ పక్షుల్లారా! మీరు నాకు ప్రాణభిక్ష పెట్టారు..’’ అంటూ తన కృతఙ్ఞతలు తెలుపుకొంది. ఆ తరువాత సింహం కాకుల స్నేహం దినదినాభివృద్ధి చెందసాగింది. ఇప్పుడు సింహం ఏ జంతువును వేటాడినా అందులో కొంత భాగం చెట్టుపైనున్న తన మిత్ర పక్షులకు ఇవ్వడం అలవాటు చేసుకొంది. - ఓట్ర ప్రకాష్ రావు -
దిద్దుబాటు
పిల్లల కథ వీరవర్మ అనే ముక్కోపి అవంతీపురాన్ని పాలించేవాడు. మంత్రులు, సేవకులు తరచూ అతడి ఆగ్రహాన్ని చవిచూస్తుండేవారు. ముక్కోపానికి విరుగుడు ముఖస్తుతేనన్న సత్యాన్ని గ్రహించిన తెలివిగల మంత్రులు నిత్యం అతడిని పొగడటం అలవాటు చేసుకున్నారు. పొగడ్తల మత్తులో వీరవర్మ నెమ్మదిగా మంత్రుల దారిలోకి వచ్చాడు. కొన్నాళ్లకు పొగడ్తలు విననిదే నిద్రపట్టని స్థితికి చేరుకున్నాడు. ఇలా రోజులు గడుస్తుండగా, వర్షాకాలం వచ్చింది. రాజ్యంలో నదులన్నీ పొంగిపొర్లి వరదలు ముంచెత్తాయి. సహాయక చర్యలు ప్రారంభించేలోగానే, వాటిలో తలెత్తబోయే లోటుపాట్లను కప్పిపుచ్చుకోవడానికి మంత్రులందరూ పొగడ్తలు అందుకున్నారు. ‘ప్రభూ! మీ కరుణాకటాక్షాలు ప్రజలపై ఉండబట్టే నదులు కూడా ఆనందంతో ఉప్పొంగి మీకు జేజేలు పలుకుతున్నాయి.. ’ అంటూ స్తోత్రపాఠాలు ప్రారంభించారు ఇంతలో వచ్చిన అధికారులు.. వరదల వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులను వీరవర్మకు వివరించారు. సహాయక చర్యలకు కావలసిన పైకాన్ని ఖజానా నుంచి తీసుకు వెళ్లమని ఆదేశించాడు వీరవర్మ. ఇళ్లు కోల్పోయిన వారికి ఇళ్లు, పంటలు పోగొట్టుకున్న వారికి నష్టపరిహారం, వ్యాధుల బారిన పడ్డ వారికి వైద్య సౌకర్యాలు.. మొత్తానికి వీటి ఖర్చులు ఖజానాపై పెనుభారాన్నే మోపాయి. ‘ప్రభూ! వరదలు వచ్చిన వెంటనే మీరు స్పందించే తీరు దేవునికైనా సాధ్యం కాదేమో? ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచే రాజాధిరాజులు మీరు!’ అంటూ మళ్లీ పొగిడారు మంత్రులు.. ఆ పొగడ్తకు వీరవర్మ పులకించిపోయాడు. ఏడాది గడచింది. ఇప్పుడు రాజ్యం కరువు బారినపడింది. పంటలు పండలేదు సరికదా, ప్రజలు దాహం తీర్చుకోవడానికి కూడా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి. ‘ప్రభూ! మేఘుడు మీ రాజసానికి అసూయ చెంది పారిపోయాడు. ఈ దుర్భిక్షాన్ని గట్టెక్కించే ధీరులు తమరు మాత్రమే’ అంటూ పొగడ్తలు లంకించుకున్నారు మంత్రులు. ‘కరువు నివారణ ఇప్పటికిప్పుడు అసాధ్యం. పొరుగు రాజ్యాల నుంచి ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకోండి. కావలసిన పైకాన్ని ఖజానా నుంచి తీసుకోండి’ అంటూ ఫర్మానా జారీ చేశాడు వీరవర్మ. దీంతో ఖజానా ఖాళీ అయినా కరువు సమస్య తీరింది. యథాప్రకారం పొగడ్తలు అందుకున్నారు మంత్రులు.. వాటిని వీరవర్మ వీనులవిందుగా ఆస్వాదించాడు. మరో ఏడాది గడచింది. ఈసారి ప్రకృతి అనుకూలించి, పంటలు బాగానే పండాయి. ఖజానా నింపుకోవడానికి ఇదే తగిన తరుణం అనుకున్న వీరవర్మ ప్రజలపై ఎడాపెడా పన్నులు వడ్డించాడు. ‘పన్ను’పోటుకు ప్రజలు చిర్రెత్తిపోయారు. ప్రజాగ్రహం ముందు మంత్రుల పొగడ్తలు పనిచేయలేకపోయాయి. పరిస్థితి విషమించడంతో వీర వర్మ నేరుగా ప్రజలతో ముఖాముఖి అయ్యాడు. ‘ప్రభూ! మొదటి సంవత్సరం వరదల రూపంలో ప్రకృతి మనకు నీరు ప్రసాదించింది. దూరదృష్టితో ఆనకట్టలు నిర్మించి నీటిని నిల్వ ఉంచి ఉంటే, వరంగా మారేది. అలా నిర్మించకపోవడంతో అది శాపమై, నష్టాన్ని మిగిల్చింది. ఆ నీరే నిల్వ ఉంటే రెండో సంవత్సరంలో వచ్చిన కరువుకు తక్షణ నివారణగా ఉపయోగపడేది. ప్రజలకూ నష్టం తప్పేది’ అన్నాడు ఒక పౌరుడు. మరొక పౌరుడు లేచి, ‘ప్రభూ! ప్రభుత్వ సాయం అంతంత మాత్రమేనని మీకు తెలియంది కాదు. అధిక పన్నులు మమ్మల్ని మరింత అప్పుల ఊబిలోకి నెట్టే ప్రమాదం ఉంది. ఇప్పుడు మమ్మల్ని ఆదుకుంటే ఖజానా ఎప్పటికైనా నిండే అవకాశం ఉంటుంది’ అన్నాడు. విమర్శలన్నీ వీరవర్మకు శూలాల్లా గుచ్చుతున్నాయి. వాటిలో వాస్తవం ఉండటంతో ఆలోచనలో పడ్డాడు. ప్రజాగ్రహం తిరుగుబాటుగా మారక ముందే దిద్దుబాటు చర్యలు చేపట్టాలనుకున్నాడు. పన్నులు తగ్గించాడు. పౌరుల శ్రమశక్తితో రాజ్యాభివృద్ధికి బాటలు వేయడం ప్రారంభించాడు. కొద్దిరోజులకే మంచి రాజుగా పేరు తెచ్చుకున్నాడు వీరవర్మ. - బి.వి.పట్నాయక్ -
వ్యాపార దక్షత
పిల్లల కథ రఘునాథపురంలో శీనయ్య అనే యువకుడు ఉండేవాడు. చిన్నతనంలోనే తల్లి తండ్రి చనిపోతే వాడి నానమ్మ వాడిని పెంచి పెద్ద చేసింది. నానమ్మ గారాబం వలన శీనయ్య ఏ పనీ చేయకుండా పెరిగాడు. స్వతహాగా తెలివితేటలు ఉన్నా పనిచేయవలసిన అవసరం లేక సోమరిలా తయారయ్యాడు. ‘‘ఒరే శీనూ! నేను పెద్దదాన్ని అయిపోయాను. ఇక పనిచేసే ఓపిక నాకు లేదు. కనుక నువ్వే ఏదన్నా పనిచేసి డబ్బు సంపాదించి తీసుకురాకపోతే ఇల్లు గడవడం కష్టం’’ అంది ముసలావిడ. ఎప్పుడూ అంత గట్టిగా మాటాడని నానమ్మ అలా అనేసరికి ఆలోచనలో పడ్డాడు శీనయ్య. నిజమే నానమ్మ పెద్దదైపోయింది. పాపం ఇంత కాలం అక్కడ ఇక్కడ పనిచేసి నెట్టుకొచ్చింది. ఇక లాభం లేదు, తనే ఏదో పనిచేసి డబ్బు సంపాదించాలి. కాని ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఊరి మధ్యనున్న శివాలయం దగ్గరికి చేరుకున్నాడు. అక్కడ ఉన్న సాధువుతో శీనయ్య తన కుటుంబ పరిస్థితి వివరించి, ‘ఏం చేయాలో తెలియడం లేదు’ అన్నాడు. సాధువు చిరునవ్వు నవ్వి, జోలినించి ఓ పచ్చి మామిడికాయ తీసి శీనయ్య చేతిలో పెట్టాడు. ‘‘నాయనా! ఇది పెట్టుబడిగా వ్యాపారం ప్రారంభించు. అనతికాలంలోనే మంచి జరుగుతుంది’’ అని దీవించాడు. సాధువు ఇచ్చిన మామిడికాయతో ఇంటికి చేరి, జరిగినదంతా నానమ్మకు చెప్పి, కారం, ఉప్పు, రెండు డబ్బాలలో పోసుకుని, మామిడికాయతో ఊరి మధ్యనున్న కూడలి వద్దకు చేరుకున్నాడు. మామిడికాయను సన్నగా తరిగి, ఉప్పు, కారం చల్లి, ‘‘ముక్క పావలా’’ అంటూ గట్టిగా అరుస్తూ, అందరినీ ఆకర్షించాడు. ఒక అరగంటలోనే శీనయ్య దగ్గర మామిడికాయ ముక్కలన్నీ అయిపోయాయి. శీనయ్యకు అయిదు రూపాయలు వచ్చాయి. దానిలో మూడు రూపాయలకు పచ్చిసెనగలు తీసుకున్నాడు శీనయ్య, మిగతా రెండు రూపాయలతో ఇంటికి చేరుకున్నాడు. సెనగలు నానబెట్టి, ఊరు చివరనున్న మామిడి తోటకు పోయాడు శీనయ్య. తోటమాలితో బేరమాడి, తన దగ్గర ఉన్న రెండు రూపాయలకి, నాలుగు పెద్ద మామిడికాయలు కొన్నాడు. మరుసటిరోజు ఊరిలో గౌరమ్మ సంబరం. సెనగలను ఉడకబెట్టి, ఉప్పు, కారం చల్లి గుడి దగ్గర అమ్మాడు. ఈ సారి శీనయ్య చేతికి యాభై రూపాయలు వచ్చాయి. మొదటినించి ఓ మామిడి పండ్ల వ్యాపారి శీనయ్యను గమనిస్తున్నాడు. శీనయ్య దగ్గరకు వచ్చి ‘‘బాబూ! నా పేరు పరంధామయ్య. నేను ప్రతి వేసవిలో మామిడిపళ్ల వ్యాపారం చేస్తుంటాను. ఎప్పుడూ లాభాలు రాలేదు. నువ్వు వ్యాపారం బాగా చేస్తున్నావ్. నా వ్యాపారం ఇద్దరం చూసుకుందాం. పెట్టుబడి నాది, లాభాలు ఇద్దరివి’’ అన్నాడు పరంధామయ్య. ‘‘సరే నే చెప్పినట్టుగా చేస్తానంటే ఒప్పుకుంటాను’’ అన్నాడు శీనయ్య. ఒకేసారి లాభాలు ఆర్జించాలి అనే ఆశతో పరంధామయ్య మామిడిపళ్లను రేటు ఎక్కువ చెప్పడంతో పెద్దగా వ్యాపారం జరిగేది కాదు. ఇదంతా తెలుసుకున్న శీనయ్య ఒక ఉపాయం ఆలోచించాడు. ఉదయం తోట నుండి పరంధామయ్య తెచ్చిన మామిడిపళ్లను చెరి సగం చేశాడు. రోజులానే పరంధామయ్యను తన వ్యాపారం తనను చేసుకోమన్నాడు. అతని దగ్గరగా మరో బండిమీద పరంధామయ్య కంటే తక్కువ ధరకే అని గట్టిగా అరుస్తూ, అన్నింటినీ అమ్మేశాడు. ఎవరూ చూడకుండా పరంధామయ్య బండి మీదున్న పళ్లను కూడా తన బండి మీదకు చేర్చి అమ్మేశాడు. నలిగిన మామిడిపళ్లను ఇంటికి తీసుకెళ్లి రసం తీసి ఒక చాపమీద పూసి తాండ్ర తయారీ మొదలుపెట్టాడు. ‘‘ఏ వ్యాపారానికైనా పోటీ ఉండాలి. అమ్మేవాడికి పట్టు విడుపు ఉండాలి. మనం చెప్పిన ధరకే అంటే అందరికీ ఆసక్తి ఉండదు. కొంత ధర పెంచి మరల తగ్గించి కొనేవారిని ఆకట్టుకోవాలి. అందులోనూ పండ్ల వ్యాపారం ఏ రోజుకారోజు ముగించకపోతే చాలా నష్టం వస్తుంది’’ అన్న శీనయ్య మాటలకు చాలా సంతోషించాడు పరంధామయ్య. శీనయ్య నానమ్మతో మాట్లాడి, తన కుమార్తె నాగమణిని ఇచ్చి పెండ్లి చేయడమే కాకుండా, తన వ్యాపారాన్ని కూడా శీనయ్యకు అప్పగించాడు. ఆ రోజునుంచి శీనయ్య మంచి మెళకువలతో పండ్ల వ్యాపారం అభివృద్ధి చేసి, మంచి దక్షత గల వ్యాపారవేత్తగా ఎదిగాడు. - కూచిమంచి నాగేంద్ర -
మారిన దొంగలు
పిల్లల కథ పూర్వపు కోసల దేశాధిపతి విజయదేవవర్మ జనరంజక పరిపాలకుడు. రాజుకు ఒక సమస్య ఉంది. ఆ రాజ్యంలో రత్తయ్య అనే బందిపోటు దొంగ ఉండేవాడు. అతడు పెద్ద దొంగల ముఠాకి నాయకుడు. రత్తయ్య తన అనుచరులతో ఎవరికీ అంతు చిక్కని రహస్య స్థావరంలో దాగివుండి మెరుపులా అకస్మాత్తుగా వచ్చి దారి దోపిడీలకు పాల్పడేవాడు. ఎదురుతిరిగిన వారిని దారుణంగా కొట్టి హింసించేవాడు. దేశ ప్రజలు అనేక సార్లు ఫిర్యాదు చేశారు. విజయదేవవర్మ దొంగల ముఠాను పట్టుకోవాలని ఎన్నో విధాల ప్రయత్నించి విఫలుడయ్యాడు. రాజు ఈ సమస్యను శాంతియుతంగా పరిష్కరించాలనుకున్నాడు. ఒక మనిషి దొంగగా మారడానికి పేదరికమే కారణం కావచ్చునని భావించాడు. అందుకే ఓ ప్రకటన జారీ చేశాడు. దానిని దేశమంతటా ప్రచారం చేయించాడు. ‘రత్తయ్య అతడి అనుచరులు మూడు నెలలలోపు ప్రభుత్వానికి స్వచ్ఛందంగా లొంగిపోతే వారిపైన ఉన్న అభియోగాలన్నీ రద్దు అవుతాయి. ఎటువంటి శిక్షలు లేకుండా వారు స్వేచ్ఛగా జన జీవన స్రవంతిలో కలసిపోవచ్చు. లొంగిపోయిన ప్రతి ఒక్కరికీ నివసించడానికి ఓ ఇల్లు, వ్యవసాయం చేసుకోవడానికి ఐదెకరాల పొలం, వెయ్యి వరహాల డబ్బు ఇవ్వబడుతుంది. మూడు నెలల్లోపల లొంగకపోతే ఇక వారిని వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. ఏవిధంగానైనా పట్టుకొని తీరుతాం. అలా చిక్కిన ప్రతి ఒక్కరికీ మరణ దండన ఖాయం’ ఇదీ ప్రకటన సారాంశం. రాజుగారి ప్రకటన రత్తయ్య భార్య సూర్యమతిని ఆకర్షించింది. సూర్యమతి రహస్య స్థావరంలో తన భర్త, ఇతర దొంగలకు నచ్చచెప్పే ప్రయత్నం చేసింది. ‘‘పిడికెడు మెతుకు కోరుకునే జానెడు పొట్టకోసం మనం ఎన్నో దారుణాలకి పాల్పడుతున్నాం. మనం చేష్టల ద్వారా ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. అలాగని మనమూ స్వేచ్ఛగా జీవించడం లేదు. ఎలుకలు కలుగుల్లో దాక్కున్నట్టు రహస్య స్థావరంలో దాక్కొని బతుకీడుస్తున్నాం. రాజుగారు ఈ అవకాశం కల్పించడం మన అదృష్టం. ఇలాంటి అవకాశం మరోటి రాదు. మనమంతా లొంగిపోదాం’’ అని చెప్పింది సూర్యమతి. ఆమె మాటలకు రత్తయ్యతో సహా దొంగలంతా పకపక నవ్వారు. ‘‘వెర్రివాళ్లయితేనే ఇటువంటి ప్రలోభాలకి భ్రమించేది. ఇది రాజుగారి కుట్ర తప్ప మరేమీ కాదు. పొరపాటు పడితే మన పరిస్థితి ఎర్ర కోసం గాలానికి చిక్కిన చేపలా అవుతుంది’’ అన్నారు కొందరు. మరికొందరు, ‘‘రాజుగారు మనల్ని పట్టుకోవడం చేతకాక, పిరికితనంతో బేరసారాలకి దిగజారాడంటే మనం విజయం సాధించినట్లే. ఇటువంటి రాజుగారు మనల్ని ఎప్పటికీ ఏమీ చేయలేడు’’ అన్నారు. ‘‘నిజమే’’ అన్నాడు రత్తయ్య. సూర్యమతి తన మాట చెల్లుబాటు కాకపోయినందుకు లోలోన బాధపడుతూ మౌనంగా ఉండిపోయింది. తను ఇచ్చిన అవకాశాన్ని లెక్కచేయకపోవడంతో రాజు విజయదేవ వర్మలో పట్టుదల ఎక్కువైంది. మంత్రితో సహా మారువేషాల్లో సంచరిస్తూ మారుమూల గ్రామాల్లో సంచరిస్తూ దొంగల ఆచూకీ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఎట్టకేలకు విజయదేవ వర్మ దొంగల రహస్య స్థావరం తెలుసుకున్నాడు. అదేరోజు రాత్రి రాజుగారి బలగాలు దొంగల స్థావరంపై దాడి చేశాయి. గాఢ నిద్రలో ఉన్న దొంగలంతా బందీలుగా చిక్కి చెరసాల పాలయ్యారు. రత్తయ్యతో సహా దొంగలంతా ఇక చావు తప్పదని భయపడుతూ రోజులు లెక్కపెట్టుకోసాగారు. కానీ ఆశ్చర్యకరంగా రాజువారిని బంధ విముక్తుల్ని చేసి స్వేచ్ఛ ఇవ్వడమే కాక, ముందే ప్రకటించినట్లు ఇల్లు, పొలం, డబ్బు ముట్టజెప్పాడు. రత్తయ్యతో సహా అందరూ వ్యవసాయం మొదలుపెట్టడంతో వారికి శ్రమ విలువ తెలిసింది. కొద్దిరోజుల తరువాత దొంగలకు స్వేచ్ఛనివ్వాలనే ఒప్పందం మీద రహస్య స్థావరం గురించి రాజుకు సమాచారం ఇచ్చింది తన భార్య సూర్యమతేనని రత్తయ్యకు తెలిసింది. అయితే ఆమె మంచి పనే చేసిందని, తమకు గౌరవంగా జీవించే అవకాశం కల్పించిందని ఆమెకు కృతజ్ఞతలు చెప్పాడు రత్తయ్య. - గుండ్రాతి సుబ్రహ్మణ్యం గౌడు -
వ్యాపార వృక్షం
పిల్లల కథ మేకల మదన్ మోహన్‌రావు ఒకానొకప్పుడు తిమ్మయ శ్రేష్టి, తిప్పయ శ్రేష్టి అనే ఇద్దరు వర్తక మిత్రులు ఉండేవారు. ఇద్దరు కూడా పిత్రార్జితంగా వచ్చిన వ్యాపారాలు సమర్థవంతంగా చేస్తూ బాగా సంపాదించి, చక్కగా జీవించేవారు. పొరుగు దేశాలలో బాగా అమ్ముడుపోయే, మంచి గిరాకి ఉండే సుగంధ పరిమళ ద్రవ్యాలు, చీలి చీనాంబరాలు నావలలో పంపి బాగా డబ్బు గణించేవారు.ఒకసారి సముద్రంలో పెద్ద తుఫాన్ వచ్చి పడవలు మునిగిపోయాయి. బాగా ధనికులైన వాళ్లిద్దరూ ఒక్కరోజులోనే బికారులుగా మారారు. కుటుంబాలతో పొరుగు దేశానికి పోయారు. అక్కడికెళ్లాక తిప్పయ శ్రేష్టి, తిమ్మయ శ్రేష్టితో, ‘‘మనమిద్దరం వేరు వేరు ప్రాంతాలలో వ్యాపారం చేద్దాం. అందువల్ల మనం ఒకరితో ఒకరు పోటీపడం. బాగా డబ్బు సంపాదించేదాకా కష్టపడి పనిచేస్తూ, పొదుపుగా జీవిద్దాం. ఏడాది తర్వాత ఇక్కడే కలుద్దాం’’ అన్నాడు. అలా చెరొక ప్రాంతంలో వ్యాపారాలు మొదలుపెట్టారు. తిప్పయ కష్టపడి పనిచేస్తూ, సాధారణ జీవితం గడుపుతూ, వీలైనంత తక్కువ ఖర్చు చేస్తూ గడపసాగాడు. మళ్లీ ధనికుడై, తన అభిరుచికి తగ్గట్టుగా విశాలమైన భవనాన్ని నిర్మించుకున్నాడు. తిమ్మయ వ్యాపారం కూడా త్వరలోనే పుంజుకుంది. అతడు ‘నా వ్యాపారం బాగా వృద్ధి చెందింది. డబ్బు బాగానే సంపాదిస్తున్నాను. ఇక మామూలుగా ఎందుకు బతకాలి? ’ అనుకున్నాడు.అప్పటి నుంచి తిమ్మయ డబ్బును మంచి నీళ్లలా ఖర్చుపెట్టసాగాడు. దాంతో ధనమంతా ఖర్చయి, మళ్లీ బీదవాడైపోయాడు.అప్పటికి ఏడాది అవటంతో తన మిత్రుడు తిప్పయను కలవటానికి వెళ్లాడు. తిమ్మయ తన బాధలు, కష్టాలు తిప్పయతో చెప్పుకున్నాడు. అతనికి ఆ దుస్థితి ఎందుకొచ్చిందో తిప్పయకు అర్థమైంది. అతణ్ని కొద్దిరోజుల పాటు తన దగ్గరే ఉండిపొమ్మన్నాడు. తిప్పయ పనివాళ్లకు తిమ్మయకు సాదా భోజనం పెట్టమని చెప్పాడు. ఒకవారం దాకా ఎలాగో తిన్న తిమ్మయ అలాంటి భోజనం చేయలేకపోయాడు.మిత్రులిద్దరూ ఒక సాయంకాలం తోటలో పచార్లు చేస్తున్నప్పుడు తిమ్మయ అక్కడి చింతచెట్లను చూపిస్తూ, ‘‘నేను రోజూ చింతచిగురు తెంపుకుని అన్నంలో తినవచ్చా?’’ అని అడిగాడు. పరోక్షంగా తనకు పెట్టే భోజనం తనకు ఏమాత్రం రుచికరంగా లేదని తెలియజేస్తూ.తిప్పయ చిరునవ్వుతో, ‘‘అలాగే. ఇదిగో ఈ మొక్క ఆకులనే తెంపుకో’’ అని లేత చింతమొక్కను చూపించాడు.రోజూ ఆ మొక్క ఆకులు తెంపుకుని భోజనంలో కలుపుకోసాగాడు తిమ్మయ. ఆ మొక్కకు ఆకులన్నీ అయిపోయాయి. ‘‘ఆ మొక్కకు ఇంక ఆకులే లేవు. కాని దాని దగ్గర ఒక పెద్ద చింతచెట్టు ఉంది. దాని ఆకులు, చిగురు తెంపుకోనా?’’ అన్నాడు తిప్పయతో. ‘‘అలాగే. అయితే ఆ చెట్టు ఆకులు కూడా ఎంత తొందరగా పూర్తి చేస్తే, అంత తొందరగా నీకు మధుర పదార్థాలతో భోజనం పెట్టిస్తా’’ అన్నాడు. తిమ్మయ సంతోషించాడు - ఇకనైనా మంచి భోజనం దొరుకుతుందని. ఎన్ని రోజులు గడిచినా, ఎన్ని ఆకులు తెంపినా, ఆ పెద్ద చెట్టు ఆకులు ఎంతకూ తరిగిపోవటం లేదు. ఆఖరికి నిరాశగా, ‘‘ఈ చెట్టు ఆకులు ఎంతకూ తరగట్లేదు. ఇవ్వాళ తెంపిన ఆకుల స్థానంలో రేపటికి కొత్త ఆకులు మొలుస్తున్నాయి’’ అని ఫిర్యాదు చేశాడు. తిప్పయ నవ్వుతూ, ‘‘అవును. అది ప్రకృతి నియమం. ఆ చిన్న మొక్క మాదిరే నీ వ్యాపారంలో సంపాదించిందంతా అడ్డగోలుగా ఖర్చుపెట్టడంతో వట్టి పోయింది. కానీ నేను నా వ్యాపారం మహావృక్షంలా ఎదిగే దాకా ఓపిక పట్టాను. అందుకే ఇప్పుడు నేను విలాసవంతమైన జీవితం గడపగలను. నేను కూడా నీలాగే ఖర్చుపెట్టి ఉంటే, నీ స్థితిలోనే ఉండేవాణ్ని. ఇప్పుడు నేను ఎంత ఖర్చుపెట్టినా నాకు లోటు రాదు. అంతగా నా వ్యాపార వృక్షం పెరిగింది’’ అన్నాడు.తిప్పయ తనకు ఏం బోధించాలనుకుంటున్నాడో తిమ్మయకు అర్థమైంది. ‘‘చక్కటి గుణపాఠం నేర్పావు. ఇంక సెలవు ఇప్పించు’’ అన్నాడు.తిమ్మయ మళ్లీ వ్యాపారాన్ని పెంచుకోవటానికి తగినంత ధనం అప్పుగా ఇచ్చాడు తిప్పయ.ఈసారి గతంలో చేసిన తప్పు చేయకుండా జాగ్రత్తగా వ్యాపారం చేసుకుంటూ, బాగా డబ్బు సంపాదించి తన మిత్రుని బాకీ తీర్చివేసి, భార్యాపిల్లలతో సుఖంగా జీవించసాగాడు తిమ్మయ. -
కుందేలు తెలివి
పిల్లల కథ ఒక అడవిలో కుందేళ్ల గుంపు ఒకటి ఉంది. ఆ గుంపులో కుందేళ్లన్నీ అడవిలో దొరికిన ఆహారం తింటూ, హాయిగా ఆడుతూ, గెంతుతూ జీవిస్తున్నాయి. అలాంటి కుందేళ్ల దగ్గరకు ఒక నక్క వచ్చింది. కుందేళ్ల ఆనందాన్ని చూసి ఈర్ష్య పడింది. ఎలాగైనా వాటి ఆనందాన్ని హరించాలని మనసులో అనుకున్నది. అలా అనుకున్నదే తడవుగా సూటిపోటి మాటలతో కుందేళ్లను బాధపెట్టసాగింది. కుందేళ్లది జీవితమే కాదని, అది ఆనందమే కాదని పలురకాలుగా ఎద్దేవా చేయసాగింది. నక్క మాటలు కుందేళ్లను బాధపెట్టసాగాయి. కానీ అవి స్వతహాగా సాధు జంతువులు కావడంతో తిరిగి ఏమీ అనలేదు. మనసుకు కలిగిన బాధను భరించి మౌనంగా ఉండేవి. నక్కకు ఇది మంచి అవకాశంగా అనిపించింది. తన గొప్పలు వినడానికి కొన్ని అమాయకపు ప్రాణులు దొరికాయనుకుని ఇక రోజూ ఎటూ వెళ్లకుండా అక్కడనే తిష్ట వేసుకొని కూర్చునేది. అంతూదరీ లేకుండా ప్రగల్భాలు పలుకుతుండేది. ఒకరోజు నక్క కొత్త వ్యూహం పన్నింది. ఆ గుంపులోని పెద్ద కుందేలును పిలిచి, ఒక ప్రత్యేకమైన ప్రదేశానికి తీసుకెళ్తానని నమ్మబలికి తన వెంట దూరంగా తీసుకొని పోయింది. అక్కడ ఒక గుంతను చూపించి, కుందేలుతో ‘‘అందరూ నిన్ను నీవు చాలా తెలివిగలదానివని అంటారు. తెలివైన దానివే కాదు, శక్తిమంతురాలివి అని కూడా అంటుంటారు. ఈ గుంతలో దూకు. నీ శక్తి సామర్థ్యాలు ప్రదర్శించు. నీవు నాకన్నా గొప్పదానివని అంగీకరిస్తాను, అదే మాట అందరికీ చెబుతాను’’ అన్నది. నక్క ఏదో పన్నాగం పన్నిందని కుందేలుకు సందేహం కలిగింది. ఆ గుంతలోకి తొంగి చూసింది. గుంతలో ముళ్లకంప ఉంది. తాను అందులో దూకితే చావు తప్పదని దానికి తెలిసిపోయింది. అందుచేత నక్కతో... ‘‘నక్క బావా! నేను మా కుందేళ్ల జాతిలో మిగిలిన వాటికంటే ఏదో కొంత తెలివైన దానినే కానీ. నీ అంత తెలివైన దానిని కాదు. పైగా నాకు ఇలాంటి ప్రదేశాలు కొత్త. ముందు నువ్వు దూకితే ఎలా దూకాలో చూసి నేను కూడా దూకుతాను’’ అంది లౌక్యంగా. కుందేలు ఉపాయం నక్కకు కూడా అర్థమైంది. తన పథకం బెడిసికొట్టిందని తలచి వెంటనే మాట మార్చేసింది. మరొక రోజు నక్కను పెద్ద కుందేలు ఒక ఏరు దగ్గరకు తీసుకొని పోయింది. ఆ ఏటిలో దిగి ఒక అరగంట సేపు కళ్లు మూసుకొని ధ్యానం చేయమని చెప్పింది. ఎటువంటి పరిస్థితుల్లో కళ్లు తెరవద్దని కూడా హెచ్చరించింది. ‘‘అలా చేస్తే నా కన్నా నువ్వే తెలివిగల దానివని ఒప్పుకుంటాను నక్కబావా, అలా ఉండలేకపోయావనుకో... అప్పుడు నేనే తెలివైన దాన్నని నువ్వు అంగీకరించి తీరాలి. ఇంక మనిద్దరి మధ్యా ఎటువంటి పరీక్షలు అక్కర్లేదు. అయినా నాకు తెలుసులే నువ్వే తెలివైన దానివని. ఈ పరీక్షంతా ఇంకెవ్వరూ ఎప్పుడూ నిన్ను తక్కువ చేయకుండా ఉండడానికే సుమా’’ అని చెప్పింది. కుందేలును వెర్రిబాగుల దాన్ని చేయడానికి ప్రయత్నించాను, కాబట్టి కుందేలు ప్రతీకారం తీర్చుకోవడానికే ఇదంతా చేస్తున్నదా- అని నక్కకు సందేహం కలిగింది. ఎందుకైనా మంచిదని వెంటనే నీటిలోకి దిగకుండా... ముందుగా కుందేలునే ఆ పని చేయమంది. కుందేలు సరేనని ఆ నీటిలోకి దిగి, అరగంట సేపు కళ్లు మూసుకొని ధ్యానం చేసింది. అప్పుడు నక్కకు ఇందులో ప్రమాదమేమీ లేదనిపించింది. కుందేలు తన మీద తన నక్కజిత్తులే ప్రయోగిస్తోందని అది ఏ మాత్రం ఊహించలేదు. ‘‘ఓ అదెంత పని! నేను కూడా నీవు చేసినట్లే చేస్తాను’’ అని ఏటిలోకి దిగి కళ్లు మూసుకొంది. ఈ అదను కోసమే చూస్తూ ఉన్న కుందేలు... దూరాన ఉన్న తోటి పిల్ల కుందేళ్లకు సైగ చేసింది. వెంటనే అవి ఏటికి అడ్డుగా కట్టిన నీటి కట్టకు గండికొట్టాయి. ఒక్కసారిగా నీటి ప్రవాహం ఎక్కువైంది. నక్క ఆ ప్రవాహంలో కొట్టుకొని పోయింది. నక్క పీడ విరగడైనందుకు కుందేళ్లు ఎంతగానో సంతోషించాయి. కుందేళ్లు ఐకమత్యంతో కలసి బండలు, ఇసుకతో ఏటికి అడ్డుగా కట్ట వేసినట్లు నీటిలో కొట్టుకు పోతున్న నక్కకు తెలియదు. నక్క పీడ వదిలించుకోవడానికి తను వేసిన పథకం పారినందుకు కుందేలు ఎంతో సంతోషించింది. నీతి: * ఆపద నుండి గట్టెక్కడానికి తగిన ఉపాయం కావాలి. * ఐకమత్యం వల్ల దేనినైనా సాధించవచ్చు. - సంగనభట్ల రామకిష్టయ్య -
కుందేలు కూన కష్టం!
పిల్లల కథ కుందేలు కూనకుట్టి పొదలగుట్టు కింది బొరియలో నుండి బిరబిర బయటికొచ్చి చిన్న క్యారట్ దుంపను కసకస కొరికి పసపస నమలసాగింది. తల్లి కుందేలు, ‘‘కుట్టీ! నీవు తల్లి చాటు పిల్లవి. పసికందువి. ఏ పులి కంటనో, తోడేలు కంటనో పడ్డావంటే అది నిన్ను లటుక్కున పట్టి చటుక్కున పొట్టన పెట్టుకుంటుంది. లోపలికొచ్చేయ్’’ అంది. కుట్టి, ‘‘అమ్మా! ఏ వైపు నుండీ ఏ మృగమూ వస్తున్న జాడ లేదు. ఇంతసేపూ మన బొరియలో ఉక్కతో ఉక్కిరిబిక్కిరయ్యాను. ఇక్కడ నలువైపుల నుండీ మెల్లమెల్లగా వీస్తున్న చల్లటి పిల్లగాలుల వల్ల నా మనసు ఉల్లాసంతో ఉప్పొంగిపోతోంది. కాసేపు అటూ ఇటూ పచార్లు చేసి వస్తానే’’ అంది. ‘‘సరే, నీ ఇష్టం. జాగ్రత్త’’ అంది తల్లి కుందేలు. కుట్టి ఏరు పారుతున్న వైపు గంతులేయసాగింది. ఉన్నట్టుండి ఏనుగు ఘీంకారం వినిపించింది. కుట్టి తటాలున ఓ చెట్టు చాటుకెళ్లింది. ఏనుగు తొండాన్ని పెకైత్తి, కిందికి విడుస్తూ, చెవులు ఆడిస్తూ, పెద్ద పెద్ద అడుగులేస్తూ పోయింది. ‘‘ఏనుగు రూపం కుట్టికి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆ దేవుడు ఏనుగును పొడుగాటి తొండంతో, చాటలంత చెవులతో ఎందుకు సృష్టించాడో! కొండ లాంటి ఆ వేదండానికి తిండి దండగ’’ అని నవ్వుకుంది. హఠాత్తుగా ఒక ఉరుము ఉరిమి, ఒక మెరుపు మెరిసింది. కుట్టి వేరపుతో వెనుదిరిగి పొదల గట్టువైపు కదిలింది. కొన్ని క్షణాలకు పిడుగు పడటంతో ఒక పాదపం పెళపెళమని విరిగి పొదల గుట్టమీద కూలింది. అది చూసిన కుట్టి ‘‘అయ్యో! అమ్మ, అమ్మకేమైందో’’ అని ఏడుస్తూ గుట్టను సమీపించింది. ‘అమ్మా’ అని పిలిచింది. గుట్ట కింది బొరియలో ‘ఉ, ఉ, ఉ’’ అంటూ మూలుగులు వినిపించాయి. గుట్ట మీద నుండి ఆ చెట్టును తొలగిస్తేనే, అమ్మ బతుకుతుంది. లేకపోతే ప్రాణానికే ప్రమాదం, అమ్మను ఎలాగైనా బతికించుకోవాలి’’ అని కుట్టి దగ్గర్లోనే ఉన్న వరాహాన్ని సాయం కోరింది. పంది చెట్టును తొలగించటానికి ప్రయత్నించింది కానీ చెట్టు ఇసుమంతైనా కదల్లేదు. కుట్టి గబగబ వెళ్లి ఎలుగుబంటిని పిల్చుకొచ్చింది. చెట్టును కదిలించబోయి భల్లూకం బోర్లాపడింది. అనుకోకుండా అగుపించిన అడవిదున్నను ఆపదలో ఆదుకొమ్మని అడిగింది కుట్టి. దున్న కొమ్ములతో తోసినా తరువు, ఎక్కడున్నావే గొంగళీ అంటే వేసిన చోటనే అన్న చందాన, ఉన్న తావు నుండి ఒకింతైనా మెదల్లేదు. మూడు జంతువులూ జారుకోవటంతో కుట్టి కలత చెందింది. ఎదురుగా ఉన్న వేపచెట్టు మీది నుండి అంతా గమనించిన కోతి కిందికి దిగివచ్చి, ‘‘కుట్టీ! ఇందాక వెళ్లిన ఏనుగు తిరిగి ఇటే వస్తోంది. వెళ్లి విషయం విన్నవించి, కన్నీటితో కరికాళ్ల మీద పడు. నీకు మేలు జరుగుతుంది’’ అంది. గజం రానే వచ్చింది. కుట్టి, ‘‘ఏనుగు పెద్దాయనా! పిడుగుపాటుతో ఈ చెట్టు పొదలగుట్ట మీద పడింది. గుట్ట కింద బొరియలో మా అమ్మ బందీ అయింది. ఊపిరాడక మూలుగుతోంది. ఈ చెట్టును పక్కకు తొలగించి, మా అమ్మను కాపాడు’’ అని వేడుకుంది. ‘‘ఆ మాత్రం దానికి అంతగా అడగాలా?’’ అని ఏనుగు వెంటనే తన తొండాన్ని చెట్టు చుట్టూ గట్టిగా చుట్టి, పట్టి అవలీలగా ఎత్తి ఆవల పడేసి వెళ్లిపోయింది. తల్లి కుందేలు రొప్పుతూ రోజుతూ బయటికొచ్చింది. కుట్టి అపారమైన ఆనందంతో అమ్మ అక్కున చేరింది. ఇంతకుముందు ఏనుగును గూర్చిన తన ఆలోచనలను గుర్తు తెచ్చుకొని సిగ్గుపడింది. అపురూపమైన ఏనుగు జన్మను తాను అపార్థం చేసుకుంది. భగవంతుడు ఏనుగు లాంటి బలమైన జంతువు వల్ల చిన్నా చితకా ప్రాణులకు ప్రాప్తించే ప్రయోజనమేమిటో కుట్టికి అవగతమైంది. తన తల్లికి తటస్థపడ్డ విపత్తు నుండి విముక్తి కలిగించిన మాతంగానికి మోదంతో మనసులోనే కృతజ్ఞత తెలిపింది కుట్టి. - నరిశేపల్లి లక్ష్మీనారాయణ -
చాదస్తపు స్నేహితుడు
పిల్లల కథ నందనవనంలో నారాయణ అనే వ్యాపారి ఉండేవాడు. ఆ గ్రామంలో తనొక్కడిదే సరుకుల దుకాణం కావడంతో వ్యాపారం జోరుగా సాగేది. దుకాణంలోని పనంతా ఒక్కడే చేసుకోలేక పోలప్ప అనే తన చిన్ననాటి స్నేహితుణ్ని సహాయకుడిగా ఉంచుకున్నాడు. పోలప్పకు నెలకు ఐదువందలు వేతనంగా ఇచ్చేవాడు. ఒకరోజు దుకాణానికి సత్యమూర్తి అనే వ్యక్తి వచ్చాడు. అతడు కూడా నారాయణకు స్నేహితుడే! దుకాణంలో పోలప్పను గమనించిన సత్యమూర్తి ఏదో ప్రమాదాన్ని శంకించాడు. నారాయణను బయటకు పిలిచి, ‘‘ఏరా! ఈ అయోమయం శాల్తీని గుమాస్తాగా పెట్టుకున్నావా? వాడికి మందబుద్ధి, మూఢనమ్మకాలు అధికమని మనకు చిన్నప్పట్నించీ తెలుసు కదా. తెలిసీ ఇలా ఎందుకు చేశావు?’’ అని సున్నితంగా మందలించాడు. ‘‘భలే వాడివే! నీవు పోలప్పలోని కొన్ని గుణాలనే చూశావు. వాడికి చాదస్తం ఉన్న మాట నిజమే. కానీ నేను ఒక వ్యాపారిగా ఆలోచించి, వాడిని పనిలో పెట్టుకున్నాను. అతి తక్కువ జీతానికి రోజంతా దుకాణాన్ని కనిపెట్టుకుని ఉండేవాడు వీడొక్కడే! అలాగే నేను ఏ పని చెప్పినా కిక్కురుమనకుండా చేస్తాడు. పైగా... మధ్యాహ్నం పూట బేరాలు లేనప్పుడు ఆ కబురూ, ఈ కబురూ చెప్పి కాలం దొర్లిపోయేలా చేస్తున్నాడు’’ అని సత్యమూర్తిని సమాధానపరిచాడు నారాయణ. ‘‘సరే, నీ ఇష్టం. ఎందుకైనా మంచిది. జాగ్రత్తగా ఉండు. మూర్ఖులతో సాహచర్యం ఎప్పుడూ ప్రయోజనాన్నివ్వదు’’ అంటూ సత్యమూర్తి అక్కణ్నుంచి వెళ్లిపోయాడు. ఇది జరిగిన కొన్ని రోజుల తరువాత, ఒకసారి సరుకులు కొనడానికి రంగనగరం వెళ్లవలసి వచ్చింది. నారాయణ, పోలప్ప ఇద్దరూ బయలుదేరారు. రంగనగరానికి రెండు దారులు ఉన్నాయి. అందులో ఒకటి గుర్రపుబండ్లు వెళ్లేదారి, రెండవది కాలిబాట. కాలిబాటంతా చిక్కటి అడవి గుండానే సాగుతుంది. అయితే రంగనగరానికి వెళ్లడానికి అది దగ్గరి దారి! గుర్రపుబండిలో వెళితే ఖర్చవుతుందని, నారాయణ కాలిబాటన వెళ్లడానికే నిర్ణయించుకున్నాడు. ఒక రొట్టెల మూట, నీళ్లు నింపిన సొరకాయ బుర్రను పోలప్ప భుజాలపైకి ఎక్కించాక, ఇద్దరూ కాలిబాటన ప్రయాణించసాగారు. నారాయణకు ప్రయాణకష్టం తెలియకుండా పోలప్ప దారివెంట పలు కబుర్లు చెబుతూనే ఉన్నాడు. మధ్యాహ్నమయ్యాక, ఇద్దరూ ఒక మర్రిచెట్టు కింద ఆగారు. కాసిన్ని రొట్టెలు తిన్నాక, చేతులు కడుక్కోవడానికి నారాయణ చెట్టు వెనక్కు వెళ్లాడు. అయితే అక్కడో దిగుడుబావి ఉంది. అయితే చుట్టూ పెరిగిన గడ్డితో మూసుకుపోయి కనిపించకుండా ఉంది. నారాయణ పొరబాటున ఆ గడ్డిపై కాలుపెట్టి జారి బావిలో పడిపోయాడు. బావిలోకి జారిపోయేటప్పుడు భయంతో బిగ్గరగా కేకలు వేశాడు. రొట్టె తింటోన్న పోలప్ప ఆ కేకలు వినగానే ఆదుర్దాగా లేచి నారాయణ కోసం పరుగులు తీశాడు. చుట్టుపక్కల వెతికి బావిని కనిపెట్టాడు. అప్పటికే బావి నీటిలో నాలుగైదుసార్లు మునిగి తేలాడు నారాయణ. బావి అంచులో పెరిగి ఉన్న ఒక చెట్టుకొమ్మను ఆసరాగా పట్టుకుని, వేళ్లాడుతున్నాడు. అది చూసిన పోలప్ప, ‘‘నువ్వేమీ భయపడొద్దు. నిన్ను పైకి తెస్తాను’’ అని నారాయణకు ధైర్యం చెప్పి చుట్టుపక్కల వెతికాడు. కొంతసేపు వెదికాక గట్టిగా, పొడవుగా ఉన్న చెట్టుతీగ ఒకటి కనిపించింది. దానిని తెచ్చి ఒక కొస తాను పట్టుకుని మరో కొసను బావిలోకి వదిలాడు. ‘‘హమ్మయ్య, పోలప్ప సాయంతో బతికి బయటపడుతున్నాను’’ అని ఊపిరి పీల్చుకున్న నారాయణ ఆ కొసను గట్టిగా పట్టుకుని మెల్లగా పైకి రాసాగాడు. ఇంకొద్ది క్షణాలకు నారాయణ బావి పైకి చేరేవాడే! ఇంతలో... నీటిలో బాగా తడిసిన నారాయణకు వరుసపెట్టి తుమ్ములు వచ్చాయి. ఆ తుమ్ముల్ని వినగానే పోలప్పలోని చాదస్తం బయటపడింది. ‘తుమ్ముల్ని విన్న వెంటనే కాళ్లు చేతులు కడుక్కుని, కాసేపు విశ్రాంతి తీసుకున్నాకే ఏ పనైనా చేయాలి. సొరకాయ బుర్రలోని నీళ్లు కూడా అయిపోయాయి. కాళ్లు చేతులు ఎలా శుభ్రం చేసుకోవాలో?’ అని తనలో తాను గొణుక్కుంటూ, తన చేతిలోని తీగ కొసను వదిలేసి చుట్టుపక్కల నీళ్లకొరకు వెదకసాగాడు పోలప్ప. (పిల్లలూ... నారాయణ ఏమై ఉంటాడో ఊహించండి. అలాగే, నారాయణ స్థితికి కారణాన్ని కూడా మీ స్నేహితులతో చర్చించండి. చాదస్తం, మూఢ విశ్వాసాలు ఎంతటి ప్రమాదాలకు దారి తీస్తాయో తెలిసింది కదా!) - శాఖమూరి శ్రీనివాస్ -
పోయిన తోక వచ్చె...
పిల్లల కథ పిల్లి, కోతి మంచి మిత్రులు. అవి ఆడుకుంటూ, పాడుకుంటూ ఆనందంగా ఉండేవి. ఒకసారి కోతికి ఒక చిలిపి ఆలోచన వచ్చి, పిల్లి చూడకుండా దాని వెనుక నుంచి వెళ్లి, దాని రెండు చెవులు పట్టిలాగి, గబుక్కున చెట్ల చాటున దాచుకుంది. పిల్లికి కోపం వచ్చి, ‘‘ఏయ్, నా చెవులు పీకింది ఎవరు? మర్యాదగా నా ముందుకు రావాలి’’ అని అరిచింది. కోతి తాను దాక్కున్న చోటి నుంచి బయటికి వచ్చింది. ‘‘ఛీ! నువ్వింత అల్లరి కోతివి అనుకోలేదు’’ అంది పిల్లి నిరసనగా. ‘‘ఓ! నీ చెవులు సీతాకోకచిలుకల్లాగ అందంగా ఉన్నాయి. వాటిని గుంజి తప్పుచేశాను. మన్నించు’’ అంది కోతి. పిల్లి కోపంగా ‘కోతికి ఎలాగైనా గుణపాఠం నేర్పాలి’ అనుకుంటూ వెళ్లిపోయింది. కొద్దిరోజుల తర్వాత కోతి బాగా తక్కువ ఎత్తున్న చెట్టుకొమ్మ మీద పడుకుని ఉండటం కనిపించింది పిల్లికి. ‘ఇదే సమయం’ అనుకుని, కోతి తోకను ఆ చెట్టు కొమ్మకు ముడివేసింది. కోతి నిద్ర లేచి అలవాటుగా మరో కొమ్మ మీదకి దూకబోయింది. అంతే! దాని తోక పుటుక్కున తెగిపోయింది. అక్కడే ఉన్న పిల్లి చటుక్కున ఆ తోకను నోట కరచుకుని పరిగెత్తింది. కోతికి చాలా బాధ కలిగింది. ఇంక తాను ఏ చెట్టు కొమ్మకు కూడా తోకను చుట్టి వేళ్లాడలేదు కదా! ఎలాగైనా తోక మళ్లీ సంపాదించాలని వెతికి వెతికి ఆఖరికి ఒకచోట పిల్లిని పట్టుకుంది కోతి. ‘‘పిల్లీ, పిల్లీ! దయచేసి నా తోక నాకివ్వవా?’’ అంటూ బతిమిలాడింది. ‘‘అలాగైతే ముందు నాకు కొన్ని పాలు తీసుకురా’’ అంది పిల్లి. ‘‘పాలు ఎక్కడ దొరుకుతాయి?’’ ‘‘వెళ్లి ఆవును అడుగు. ఇస్తుంది’’ అంది పిల్లి. కోతి, ఆవు దగ్గరికి వెళ్లి, ‘‘ఆవూ, ఆవూ! నాకు కొన్ని పాలు ఇవ్వవా? నా తోక నాకు తిరిగి ఇవ్వటానికి పిల్లికి పాలు కావాలట’’ అని అడిగింది. ‘‘అలాగే ఇస్తా కాని, నాక్కొంచెం గడ్డి తెచ్చిపెట్టు’’ అంది ఆవు. ‘‘గడ్డి ఎక్కడ దొరుకుతుంది?’’ ‘‘వెళ్లి రైతును అడుగు’’ అంది ఆవు. కోతి, రైతు దగ్గరికి వెళ్లి, ‘‘రైతూ రైతూ! నాకు కొంచెం గడ్డి ఇవ్వవా? పాలు ఇవ్వటానికి ఆవుకు గడ్డి కావాలట. పిల్లికి నా తోక నాకు ఇవ్వటానికి పాలు కావాలట’’ అని అడిగింది. ‘‘అలాగే ఇస్తా కాని నాకు వాన కావాలి’’ అన్నాడు రైతు. ‘‘వాన... ఎక్కడ దొరుకుతుంది?’’ అంది కోతి. ‘‘వెళ్లి మబ్బును అడుగు’’ అన్నాడు రైతు. కోతి, మబ్బు దగ్గరికి వెళ్లి, ‘‘మబ్బూ! మబ్బూ! నాకు కొంచెం వాన ఇవ్వవా?’’ అంటూ తన కథంతా చెప్పింది కోతి. మబ్బు కొంచెం ఆలోచించి, ‘‘సరే, కొంచెం వాన తీసుకెళ్లి రైతుకు ఇవ్వు’’ అంది. కోతి మబ్బుకు కృతజ్ఞతలు చెప్పి, వానను తీసుకెళ్లి రైతుకు ఇచ్చింది. రైతు గడ్డి ఇచ్చాడు. గడ్డి తీసుకెళ్లి ఆవుకు ఇచ్చింది. ఆవు పాలు ఇచ్చింది. పాలు తీసుకెళ్లి పిల్లికి ఇచ్చింది. పిల్లి తోక ఇచ్చింది. తన తోక తనకు తిరిగి రాగానే, కోతి దానిని అతికించుకుని ఆనందంగా గెంతులు వేసింది. పిల్లి, కోతి మునపట్లా మళ్లీ స్నేహితులయ్యాయి. - ఎం. మదన్మోహన్రావు -
భూతదయ
పిల్లల కథ కుంతల రాజ్యాన్ని పాలించే విక్రమసేనునకు జంతువులంటే ఎంతో ప్రేమ. అందుకోసం ప్రత్యేకంగా జంతు సంరక్షణశాలను ఏర్పాటుచేసి వాటిని సంరక్షించేవాడు. ఆ జంతు సంరక్షణశాలలో సాధు జంతువులతో పాటు క్రూర జంతువులు కూడా ఉండేవి. వాటికి శిక్షణను ఇచ్చేందుకు ప్రత్యేక శిక్షకులు ఉండేవారు. మారువేషంలో తిరిగి ప్రజల కష్ట సుఖాలు తెలుసుకుని వారిని ఆదుకోవడం విక్రమసేనునకు అలవాటు.ఒకసారి విక్రమసేనుడు మంత్రి సుబుద్ధి, సైన్యాధికారి విజయునితోనూ కలసి నగర సంచారానికి బయలుదేరాడు. వారు ముగ్గురూ కొంతదూరం ప్రయాణించేసరికి ఒక దృశ్యం వారిని కలచివేసింది. బక్కచిక్కిన గుర్రమొకటి పచ్చిక మేస్తున్నది. ఆ దృశ్యం చూడగానే విక్రమసేనుని హృదయం ద్రవించిపోయింది. విక్రమసేనుడు సైన్యాధికారి వైపు తిరిగి, ‘‘ఆ గుర్రాన్ని చూడు... ఎంత బక్కచిక్కిపోయి ఉందో, గుర్రం పోషణ చూడకుండా వీధుల్లో వదిలేసిన ఆ యజమానిని రేపు ఉదయం కొలువులో హాజరుపరుచు. ఆ గుర్రాన్ని అశ్వశాలలో కట్టు’’ అని చెప్పాడు. సైన్యాధికారి అలాగే అంటూ గుర్రం వైపు నడిచాడు. మరునాడు గుర్రం యజమాని రమాకాంతుడిని మహారాజు ముందర హాజరుపరిచాడు సైన్యాధికారి విజయుడు. మహారాజు రమాకాంతుడిని తన వెంట రమ్మన్నాడు. మహారాజుని అనుసరించారు విజయుడు, రమాకాంతుడు. ముగ్గురూ అశ్వశాల దగ్గరకు చేరుకున్నారు. అశ్వశాలలో ఉన్న గుర్రాన్ని చూపుతూ ‘‘ఆ బక్కచిక్కిన గుర్రం నీదేనా?’’ అని అడిగాడు. రమాకాంతుడు ‘‘అవును మహారాజా, ఆ గుర్రం నాదే!’’ అన్నాడు. ‘‘గుర్రం నీదైనప్పుడు దానిని సంరక్షించుకోవలసిన బాధ్యత నీది కాదా? గుర్రానికి తిండి పెట్టకుండా వీధుల్లో ఎందుకు వదిలేశావు?’’ అని అడిగాడు. ‘‘ప్రభువులు నన్ను క్షమించాలి. నేను చాలా పేదవాడిని, మా నాన్న దగ్గరనుండి నాకు గుర్రపు బండి సంక్రమించింది. గుర్రపుబండి తోలుకుంటూ జీవనం సాగిస్తున్నాను. మా నాన్న దగ్గర నుండి ఈ గుర్రం ఉంది. గుర్రం ముసలిది కావడం వల్ల మనుషుల బరువును మోయలేకపోతుండటంతో మరొక గుర్రాన్ని కొని, బండికి అమర్చాను. నా సంపాదనతో రెండు గుర్రాలను పోషించలేను. అందుకే పనికిరాని ఈ ముసలి గుర్రాన్ని వీధుల్లో వదిలేశాను’’ చెప్పాడు రమాకాంతుడు. రమాకాంతుని మాటలు వినగానే మహారాజు కోపంగా, ‘‘తల్లిదండ్రులు దైవంతో సమానులు. తల్లిదండ్రులు ముసలివారైపోయారని విడిచి పెట్టేస్తున్నామా? అలాగే వయసుడిగి ముసలివైన జంతువులను వదిలిపెట్టడం మానవత్వం అనిపించుకోదు. ఎన్నో సంవత్సరాలు నీకు సహాయం చేసిన గుర్రాన్ని విడిచిపెట్టావంటే నీలో అసలు భూతదయ లేదని అర్థమవుతోంది. భూతదయను అలవరుచుకో. నువ్వు వీధుల్లో వదిలేసిన గుర్రం ఇకమీదట ఈ అశ్వశాలలోనే ఉంటుంది. నిన్ను ఈ క్షణమే అశ్వశాలకు రక్షణాధికారిగా నియమిస్తున్నాను. ఇకపై నీ గుర్రంతో పాటు అశ్వశాలలోని గుర్రాలన్నింటి బాధ్యత నీదే!’’ అన్నాడు మహారాజు. రాజు గారి మాటలకు రమాకాంతుడు క్షణకాలం నివ్వెరపోయి, ‘‘ప్రభూ! ఏ గుర్రాన్ని నేను చీదరించుకుని విడిచిపెట్టానో, ఆ గుర్రం వల్లనే ఈ రోజున నాకీ పదవి లభించింది. మీరు నాకు అప్పగించిన బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తాను. భూతదయను అలవరుచుకుని జంతువుల పట్ల ప్రేమతో ఉంటాను’’ అన్నాడు. మహారాజు తేలికపడ్డ మనసుతో తన మందిరానికి నడిచాడు. - మందరపు సోమశేఖరాచార్యులు