పిల్లల కథ.. కోయిలమ్మ కొత్తగూడు! | Sakshi
Sakshi News home page

కోయిలమ్మ కొత్తగూడు! గోదావరికి ఈవల ఉన్న అడవికి..

Published Sun, Jun 16 2024 10:57 AM

Children's Inspirational Story Koilamma Kothagudu As Written By Kuchimanchi Nagendra

గోదావరికి ఈవల ఉన్న వసంత విహారం అనే అడవికి కొత్తగా వచ్చింది కోయిలమ్మ. దాని దరికి చేరాయి మిగిలిన పక్షులన్నీ! అందులో నెమలి, పావురాలు, గోరువంకలు, గువ్వలు, వడ్రంగి పిట్టలు, పాలపిట్టలు, కాకులూ న్నాయి. వాటిని చూడగానే వినయంగా నమస్కరించింది కోయిల. ‘నేను ఇంతకు ముందు కృష్ణ తీరాన వున్న అడవిలో ఉండే దాన్ని. నా జోడీ ఒక ప్రమాదంలో మరణించడంతో ఇక అక్కడ ఉండలేక ఇలా వచ్చాను.

మీరు ఆదరిస్తే ఇక్కడే ఉండి పోతాను. ఇప్పుడు నాకు గుడ్లు పెట్టే సమయం నన్ను ఆదరించండి’ అంటుంది కోయిల. ‘నీవు ఇక్కడ ఉండడానికి మాకే అభ్యంతరమూ లేదు’ అన్నాయి ఆ పక్షులు. ‘చాలా సంతోషం. అలాగే నాకు గుడ్లు పెట్టుకోవడానికి ఓ గూడు చూపించండి’ అని కోరింది కోయిల. ‘వేరే గూడు ఎందుకు?  మా కాకమ్మ గూడు ఉందిగా’ అన్నది గోరువంక. ‘అయ్యో.. నా గూడు చాలా చిన్నది. ఇప్పటికే నేను నాలుగు గుడ్లు పెట్టున్నాను. ఖాళీ లేదు’ నొచ్చుకుంది కాకి. 

‘అయితే.. వేరే పెద్ద గూడు కట్టుకుంటే సరి’ సలహా ఇచ్చింది గువ్వ. ‘ఇప్పటికిప్పుడు వేరే గూడు అంటే మాటలా?’ ఆందోళన చెందింది కాకి. ‘పని కోయిలమ్మది కనుక తాను సహాయ పడుతుంది’ తీర్మానించాయి మిగిలిన పక్షులు. ‘తనకి కొత్త కనుక మేం కూడా సహాయ పడతాం’ చెప్పాయి గువ్వ, గోరింకలు.

గూడు కట్టడం మొదలయింది. ఎండిన పుల్లలు, నార, ఈనులను కోయిలమ్మ తీసుకురాగా..  కొత్త గూడు కట్టసాగింది కాకి.  నాలుగు రోజుల్లోనే కోయిల గుడ్లు కోసం కొత్త గూడు తయారయింది. ‘నువ్వు వేరే చోట ఉండడం ఎందుకు ఈ కొత్త గూటిలోనే నీ గుడ్లనూ పొదుగు’ అంది కోయిల. దాంతో కాకమ్మ తన గుడ్లను కొత్త గూటికి చేర్చింది. కోకిల గుడ్లు, తన గుడ్లని తేడా లేకుండా రెండిటినీ పొదిగింది కాకి. నాలుగు కాకి పిల్లలు, మూడు కోయిల పిల్లలతో గూడు కళకళలాడింది.

తన పిల్లలను చూసుకుంటూ మురిసిపోయింది కోయిల. పిల్లలన్నీ కాస్త పెరిగాక.. కాకి పిల్లలకి.. కోయిల పిల్లలు తమ జాతివి కావని తెలిసింది. ఒకరోజు అమ్మ లేని సమయంలో తెలిసీతెలియని వయసున్న కాకి పిల్లలన్నీ కోయిల పిల్లల్ని బయటకి నెట్టేశాయి. పాపం కోయిల పిల్లలు గూడు నుంచి కిందపడ్డాయి. చెట్టు కింద మెత్తని మట్టి ఉండటం వలన వాటికేమీ కాలేదు. తిరిగి వచ్చిన కాకి జరిగింది తెలుసుకుని తన పిల్లలని మందలించింది.

కాకి పిల్లలు తల్లికి ఎదురు తిరిగాయి.. ‘ఎవరి పిల్లలనో మనమెందుకు ఆదరించాలి?’ అని!  పిల్లల అమాయకత్వాన్ని చూసి ఏమీ మాట్లాడలేకపోయింది కాకి. కిందపడిన తన పిల్లలను చూసి కన్నీరు పెట్టుకుంది కోయిల. పక్కనే ఉన్న మర్రి చెట్టు తొర్రలోకి వాటిని చేర్చింది. ఎదుగుతున్న కోయిల పిల్లలు కొత్త రాగాలు ఆలపించసాగాయి. కోయిలా వాటితో జత కలిపింది. వాటి పాటలు వినడానికి పక్షులన్నీ అక్కడికి వచ్చేవి. కొన్ని తమ పిల్లలకి పాటలు నేర్పమని కోయిలని బతిమాలాయి. అలా కోయిల పక్షులకి పాటలు నేర్పడం మొదలుపెట్టింది.

కాకి పిల్లలూ పాటలు నేర్చుకోవాలని అనుకున్నాయి. కోయిలమ్మతో మాట్లాడి తమకు పాటలు నేర్పించమని తల్లిని పోరాయి.  ‘ఏ మొహం పెట్టుకుని అడగాలి మీరు చేసిన పనికి?’ అని పిల్లల్ని కోప్పడింది కాకి. ‘తెలియక చేసిన తప్పు అది. నువ్వా రోజు మా తప్పును సరిదిద్ది ఉండాల్సింది’ అన్నాయి తల్లితో. ‘నిజమే.. అప్పుడు మీ మీద మమకారంతో నా కళ్లుమూసుకుపోయాయి. అందుకే నాకిప్పుడు మొహం చెల్లడం లేదు కోయిల దగ్గరకు వెళ్లడానికి!’ అని బాధపడింది కాకి.

‘సరే అయితే.. మేమే అడుగుతాం.. మమ్మల్ని క్షమించమని’ అన్నాయి ఆ పిల్లలు ముక్త కంఠంతో! ‘శభాష్‌.. ఇప్పుడు నా పిల్లలు అనిపించుకున్నారు మీరు. చేసిన తప్పుని గ్రహించి.. క్షమాపణ అడగాడానికి సిద్ధమయ్యారు’ అంటూ  పిల్లల పరిణతికి సంతోషపడింది కాకి. ఆ కొమ్మకు కాస్త దూరంలో ఉన్న కోయిల ఆ సంభాషణనంతా విన్నది. వెంటనే తన పిల్లల్ని పిలిచి కాకి పిల్లలను వెంటబెట్టుకుని రమ్మనమని వాటిని కాకి గూటికి పంపింది. అవి కాకి గూటికి వెళ్లి.. ‘మా అమ్మ మిమ్మల్ని మా గూటికి రమ్మంటోంది.

మా గూడు కోసం మీ అమ్మ మాకు చాలా సాయం చేసిందట కదా.. అసలు మమ్మల్ని మీ అమ్మే పొదిగిందట కదా మా అమ్మ చెప్పింది. మనం అన్నదమ్ములమనీ.. పోట్లాడుకోకూడదనీ చెప్పింది’ అంటూ కాకి పిల్లలను తమ వెంట తీసుకెళ్లాయి. వాటి మాటలకు అబ్బురపడింది కాకి. ‘ఎంత మంచిదానవు కోయిలా..  పిల్లల్ని ఎంత బాగా పెంచావు!’ అంటూ కోయిలను ప్రశంసించింది. ‘ఊరుకో కాకమ్మా.. నువ్వు చేసిన సాయం గురించి చెప్పానంతే! మీ సహవాసం వల్ల నాకూ కాసింత మంచితనం అబ్బినట్టుందిలే. ఈ పొగడ్తలకేం కానీ.. పిల్లలకు పాటలు నేర్పనివ్వూ..’ అంటూ కాకిపిల్లలతో సాధన మొదలుపెట్టించింది కోయిల. – కూచిమంచి నాగేంద్ర

Advertisement
 
Advertisement
 
Advertisement