పూర్వం సింహపురిని విక్రమసేనుడు అనే రాజు పరిపాలించేవాడు. ఆ రాజ్యం చుట్టూ పెద్దపెద్ద దేశాలు ఉన్నా ఈ రాజ్యం కేసి కన్నెత్తి చూసే సాహసం లేదెవరికి. కానీ పొరుగు దేశమైన విజయపురినేలే జైకేతుడికి మాత్రం ఎలాగైనా సింహపురిని జయించి తన రాజ్యంలో కలుపుకోవాలనే కోరిక ఉండేది. అందుకోసం రెండుసార్లు యుద్ధం చేసి ఓటమి చవిచూశాడు. అయినా అతనిలో ఆశ చావలేదు.
ఒకసారి మంత్రి మండలిని సమావేశపరచి ‘సింహపురి మన కంటే చాలా చిన్న దేశం. సైనికబలమూ తక్కువే. అయినా దాన్ని మనం ఎందుకు జయించలేకపోతున్నాం? ఈసారి యుద్ధంలో ఎట్టిపరిస్థితుల్లో సింహపురిని ఓడించాల్సిందే. మన దేశంలో విలీనం చేసుకోవాల్సిందే. మన విజయపురిని సువిశాల సామ్రాజ్యంగా తీర్చిదిద్దాల్సిందే’ అన్నాడు రాజు. అతనిలోని ఈ యుద్ధకాంక్ష వల్ల దేశంలో కరువుకాటకాలు పెరిగిపోవడమే కాక ఎంతోమంది సైనికులు ప్రాణాలు కోల్పోసాగారు.
ఎలాగైనా ఈ యుద్ధకాండను ఆపించి రాజు కళ్ళు తెరిపించాలని మంత్రి నిర్ణయించుకున్నాడు. అందుకే రాజుతో ‘క్షమించండి మహారాజా! దేశం.. సైన్యం.. ఎంత పెద్దవైనా.. ఎదుటివారి శక్తిని అంచనా వేయకుండా యుద్ధం ప్రకటిస్తే ఏమవుతుందో మీకు తెలిసిందే! ఇప్పుడు శక్తి కన్నా యుక్తి కావాలి. సింహపురి బలమేంటో.. బలహీనతేంటో వారి విజయరహస్యం ఏమిటో తెలుసుకోగలగాలి. అప్పుడు విజయం మనకు సులువు అవుతుంది.
అందుకోసం సమర్థుడైన వ్యక్తిని వినియోగిద్దాం’ అన్నాడు మంత్రి. రాజుకు మంత్రి సలహా సరియైనదే అనిపించింది. ఒక్క క్షణం ఆలోచించి ‘ఎవరినో ఎందుకు? మనమే మారు వేషాలతో వెళ్దాం. అక్కడి రాజకీయ పరిస్థితులు, వారి విజయరహస్యాలను తెలుసుకుందాం’ అన్నాడు. దానికి మంత్రీ సరే అన్నాడు. మరునాడు ఉదయాన్నే రాజు, మంత్రి.. మామూలు ప్రయాణికుల్లా.. తమ గుర్రాలపై సింహపురికి బయలుదేరారు.
ఆ నగరంలో అడుగు పెడుతూనే ఇద్దరికీ విస్మయం కలిగింది. నగరం చుట్టూ పొలాలు.. పండ్లతోటలతో ఆ నేలంతా ఆకుపచ్చ తివాచీ పరచినట్టు శోభయమానంగా కనిపించింది. జలాశయాలన్నీ నిండుగా కళకళలాడసాగాయి. నగరవీథులైతే.. శుభ్రంగా అద్దంలా మెరిసిపోసాగాయి. నగరవాసులు ఎవరిపనుల్లో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు. కుటీర పరిశ్రమల్లో రకరకాల వస్తువులు.. రంగురంగుల దుస్తులు తయారవసాగాయి.
ఒక ఇంటి ముందు పనిచేసుకుంటూ కనిపించిన వృద్ధుడిని చూసి.. రాజు, మంత్రి తమ గుర్రాలను అతని దగ్గరకు నడిపించారు. అతణ్ణి సమీపిస్తూనే ‘అయ్యా మేము బాటసారులం. విదేశ సంచారం చేస్తూ ఈ దేశానికి వచ్చాము. ఈ దేశం ఇంత అభివృద్ధి చెందడానికి కారణాలు ఏమిటో చెబుతారా?’ అని అడిగారు. దానికా వృద్ధుడు ‘మా రాజు పాలనాదక్షుడు. ప్రజారంజకుడు. మా దేశవాసులు స్వయంకృషిని నమ్ముకుంటారు. మాకు ఆహార కొరతలేదు.
మేం పండించిన ధాన్యాన్ని, తయారుచేసిన వస్తువులను మా చుట్టుపక్కల దేశాలకు ఎగుమతి చేస్తుంటాం. మా పొరుగున ఉన్న విజయపురి అయితే అచ్చంగా మా దేశ ఉత్పత్తుల మీదనే ఆధారపడి ఉంది. ఆ దేశవాసులు కొనే వస్తువులన్నీ మా దేశానివే. మా విజయ రహస్యానికి వస్తే.. మా దేశంలో ప్రతి పౌరుడు సైనిక శిక్షణ పొందవలసిందే! యుద్ధం అంటూ వస్తే అందరూ సైనికులై పోరాడుతారు. వారిని ప్రజాదళం అంటారు. వారిది స్వచ్ఛంద పోరాటం’ అని చెప్పాడు.
తర్వాత రాజు, మంత్రి తమ గుర్రాలపై అలా నగర వీథుల్లో తిరుగుతూ.. పౌరులతో మాట్లాడుతూ కొత్త కొత్త విషయాలను తెలుసుకున్నారు. ఆరాత్రి అక్కడే బసచేసి మర్నాడు తిరిగి తమ దేశానికి బయలుదేరారు. మార్గంలో మహారాజు.. మంత్రితో ‘సింహపురి వైభవం చూశాక నాకెంతో సిగ్గుగా అనిపిస్తుంది. ఆ పరిపాలన, అక్కడి ప్రజల క్రమశిక్షణ నాకెంతో నచ్చాయి’ అన్నాడు. దానికి మంత్రి ‘ఆ దేశం చిన్నదైనా పచ్చని పాడిపంటలతో తులతూగుతూ ఉంది. ఎటు చూసినా కుటీర పరిశ్రమలు నెలకొని ఉన్నాయి.
అక్కడి ప్రజలు తమ అవసరాలకే కాదు ఎగుమతులకూ అవరసమయ్యేంత శ్రమిస్తూ దేశ ఆర్థికపరిపుష్టికి పాటుపడుతున్నారు. క్షమించండి రాజా.. సింహపురితో మన దేశాన్ని పోల్చుకోలేము. మన దేశం విశాలమైందే. కానీ ఎక్కడ చూసినా ఎండిన బీళ్ళు. ఇంకిపోయిన చెరువులు, ఆకలి, నిరుద్యోగం దర్శనమిస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో పొరుగు దేశాన్ని గెలుచుకుని మన సువిశాలసామ్రాజ్యాన్ని పెంచుకోవటమంటే మన దారిద్య్రాన్ని, కరువుని పెంచడమే! మీరు తప్పుగా అనుకోకపోతే ఒక మాట చెబుతాను.. ముందు మనల్ని మనం సంస్కరించుకుందాం.
మన దేశాన్ని పాడిపంటలతో తులతూగేలా చేద్దాం. ప్రతి పౌరుడికీ చేతినిండా పని కల్పిద్దాం. సింహపురిని ఆదర్శంగా తీసుకుందాం. ఇప్పుడు యుద్ధానికి కన్నా మనకు ఈ సంస్కరణలు అవసరం’ అని చెప్పాడు. అదంతా విన్నాక రాజు ‘నిజమే! ముందు మన దేశాన్ని సుభిక్షంగా.. సుస్థిరంగా తయారు చేద్దాం! వ్యవసాయానికి పెద్ద పీట వేద్దాం. త్వరలోనే విజయపురిని మరో సింహపురిగా మార్చేద్దాం! అందుకు కావలసిన ప్రణాళికను సిద్ధం చేయండి’ అని ఆజ్ఞాపించాడు రాజు.
‘చిత్తం మహారాజా! మీ ఆశయం తప్పక నెరవేరుతుంది’ అంటూ భరోసా ఇచ్చాడు మంత్రి. — బూర్లె నాగేశ్వరరావు
Comments
Please login to add a commentAdd a comment