అనగనగా ఒక రాజు. అతనో అంతు చిక్కని రోగంతో బాధపడసాగాడు. తానింక ఎన్నో రోజులు బతకనని అతనికి అర్థమైంది. అందుకే తను బతికుండగానే.. రాజ్యానికి నిజాయితీపరుడైన యువరాజును ఎన్నుకోవాలనుకున్నాడు. మరునాడే రాజ్యంలోని యువకులందరినీ పిలిపించి.. యువరాజు ఎంపిక విషయం చెప్పాడు. అందరికీ తలా ఒక విత్తనం ఇచ్చి, దాన్ని నాటమని చెప్పి.. పదిరోజుల తర్వాత మొలకెత్తిన ఆ మొక్కను తీసుకొని రమ్మన్నాడు.
ఎవరి మొక్క అయితే ఏపుగా, బలంగా పెరుగుతుందో అతనే ఈ రాజ్యానికి యువరాజు అవుతాడు’ అని సెలవిచ్చాడు రాజు. ‘అలాగే రాజా..’ అంటూ అందరూ ఆ విత్తనాలను ఇంటికి తీసుకువెళ్లి మట్టి కుండల్లో వేశారు.
పది రోజుల తర్వాత వాళ్లంతా ఆ మట్టికుండలను తీసుకుని రాజుగారి కొలువుకు వచ్చారు. మహేంద్ర అనే ఒక యువకుడు మాత్రం ఖాళీ కుండతో వచ్చాడు. రాజు అందరి కుండలను పరిశీలించి.. ఖాళీ కుండ తెచ్చిన మహేంద్రనే యువరాజుగా ప్రకటించాడు. ఆ మాట విన్న మిగతా యువకులంతా విస్తుపోయారు. ఓ యువకుడు కాస్త ధైర్యం చేసి ‘రాజా! మీరు చెప్పిన దాని ప్రకారం ఎవరి మొక్క అయితే ఏపుగా, బలంగా పెరుగుతుందో వారే కదా యువరాజు! మా విత్తనాలన్నీ మొలకెత్తి చక్కగా పెరిగాయి. పోటీ మా మధ్యనే ఉండాలి. కానీ విత్తనమే మొలకెత్తని మహేంద్రను యువరాజుగా ఎలా ప్రకటిస్తారు?’ అని ప్రశ్నించాడు.
అప్పుడు రాజు చిన్నగా నవ్వుతూ ‘నేను మీకు ఉడకబెట్టిన విత్తనాలను ఇచ్చాను. వాటి నుంచి మీ అందరి కుండల్లోకి మొక్కలు ఎలా వచ్చాయి?’ అని తిరిగి ప్రశ్నించాడు రాజు. ఆ ఎదురు ప్రశ్నకు ఆ యువకులంతా బిత్తరపోయారు. తాము చేసిన మోసాన్ని రాజు గ్రహించాడని వాళ్లకు తెలిసిపోయింది. సిగ్గుతో తలవంచుకున్నారు! వాళ్లంతా రాజు ఇచ్చిన విత్తనాలను కాకుండా వేరే విత్తనాలను నాటారు. అందుకే అవి మొలకెత్తి ఏపుగా పెరిగాయి. మహేంద్ర మాత్రం రాజు ఇచ్చిన విత్తనాన్నే వేశాడు. అందుకే అది మొలకెత్తలేదు.
అతని నిజాయితీని మెచ్చిన రాజు.. ఆ రాజ్యానికి సమర్థుడైన పాలకుడు మహేంద్రనే అని అతన్నే యువరాజుగా ప్రకటించాడు. తదనంతర కాలంలో ఆ రాజ్యానికి మహేంద్ర రాజు అయ్యాడు. నిజాయితీకి మారుపేరుగా నిలిచాడు. ప్రజలకు ఏ లోటూ రానివ్వకుండా పాలన సాగించాడు. – పుల్లగూర్ల శీర్షిక
ఇవి చదవండి: 'కిడ్నాప్..'! ఓరోజు సాయంత్రం.. ఆఫీసు నుండి తిరిగి వస్తుండగా..
Comments
Please login to add a commentAdd a comment