అంపశయ్య మీదనున్న భీష్ముడి వద్దకు వెళ్లిన ధర్మరాజు ‘పితామహా! లోకంలో కొందరు లోపల దుర్మార్గంగా ఉంటూ, పైకి సౌమ్యంగా కనిపిస్తుంటారు. ఇంకొందరు లోపల సౌమ్యంగా ఉన్నా, పైకి దుర్మార్గంగా కనిపిస్తుంటారు. అలాంటివాళ్లను గుర్తించడం ఎలా?’ అని అడిగాడు. అందుకు సమాధానంగా భీష్ముడు ‘ధర్మనందనా! నువ్వు అడిగిన సందేహానికి నేను పులి–నక్క కథ చెబుతాను’ అంటూ కథను మొదలుపెట్టాడు.
‘పూర్వం పురిక అనే నగరాన్ని పౌరికుడు అనే రాజు పాలించేవాడు. బతికినన్నాళ్లు క్రూరకర్మలు చేయడం వల్ల నక్కగా జన్మించాడు. పూర్వజన్మ జ్ఞానం ఉండటం వల్ల ఈ జన్మలో మంచిగా బతుకుదామని తలచి, అహింసావ్రతం చేస్తూ ఆకులు అలములు తినసాగాడు. ఇది చూసి అడవిలోని తోటి నక్కలు ‘ఇదేమి వ్రతం? మనం నక్కలం. ఆకులు అలములు తినడమేంటి? నువ్వు నక్కల్లో తప్పపుట్టావు. నీకు వేటాడటం ఇష్టం లేకుంటే చెప్పు, మేము వేటాడిన దాంట్లోనే కొంత మాంసం నీకు తెచ్చి ఇస్తాం’ అన్నాయి.
పూర్వజన్మ జ్ఞానం కలిగిన నక్క ‘తప్పపుట్టడం కాదు, తప్పనిసరిగా నక్కగా పుట్టాను. నాకు ఆకులు అలములు చాలు. నేను జపం చేసుకునే వేళైంది. మీరు వెళ్లండి’ అని చెప్పి మిగిలిన నక్కలను సాగనంపింది. నక్క అహింసావ్రతం చేçస్తున్న సంగతి అడవికి నాయకుడైన పులికి తెలిసింది. ఒకనాడు పులిరాజు స్వయంగా నక్క గుహకు వచ్చాడు.
‘అయ్యా! నువ్వు చాలా ఉత్తముడివని తెలిసింది. నువ్వు నాతో వచ్చేయి. నీకు తెలిసిన మంచి విషయాలు చెబుతూ, నన్ను మంచిదారిలో నడిపించు’ అని వినయంగా ప్రాధేయపడ్డాడు. ‘రాజా! చూడబోతే నువ్వు గుణవంతుడిలా ఉన్నావు. అయినా నేను నిన్ను ఆశ్రయించలేను. నాకు ఐహిక సుఖాల మీద మమకారం లేదు. నీతో రాలేను’ అని బదులిచ్చింది నక్క.
‘నాతో రాకపోయినా, నాతో సఖ్యంగా ఉంటూ నాకు మంచీచెడ్డా చెబుతూ ఉండు’ కోరాడు పులిరాజు.
‘పులిరాజా! నువ్వూ నేనూ స్నేహంగా ఉంటే, నీతోటి వాళ్లు అసూయ పడతారు. మనిద్దరికీ విరోధం కల్పించడానికి ప్రయత్నిస్తారు. దానివల్ల కీడు తప్పదు. అందువల్ల నా మానాన నన్ను విడిచిపెట్టు’ బదులిచ్చింది నక్క.
‘లేదు మహాత్మా! నీమీద ఎవరేం చెప్పినా వినను. అలాగని మాట ఇస్తున్నాను, సరేనా!’ అన్నాడు పులిరాజు.
నక్క సరేనని ఆనాటి నుంచి పులితో సఖ్యంగా ఉండసాగింది.
పులిరాజుకు నక్క మంత్రిగా రావడం మిగిలిన భృత్యులకు నచ్చలేదు. నక్క ఉండటం వల్ల తమకు విలువ దక్కడం లేదని అవి వాపోయాయి. చివరకు ఎలాగైనా నక్క పీడ విరగడ చేసుకోవాలని కుట్ర పన్నాయి. ఒకరోజు పులిరాజు గుహలో దాచుకున్న మాంసాన్ని దొంగిలించి, నక్క ఉండే గుహలో దాచిపెట్టాయి.
గుహలో మాంసం లేకపోయేసరికి పులిరాజు భృత్యులందరినీ పిలిచి వెదకమని నాలుగు దిక్కులకూ పంపాడు. వెదుకులాటకు తాను కూడా స్వయంగా బయలుదేరాడు. నక్క గుహ దగ్గరకు వచ్చేసరికి మాంసం వాసన పులిరాజు ముక్కుపుటాలను తాకింది. లోపలకు వెళ్లి చూస్తే, తాను దాచిపెట్టుకున్న మాంసమే అక్కడ కనిపించింది.
‘ఎంత మోసం!’ పళ్లు పటపట కొరికాడు పులిరాజు.
ఈలోగా మిగిలిన భృత్యులంతా అక్కడకు చేరి, ‘మహారాజా! మీరు స్వయంగా గుర్తించబట్టి సరిపోయింది. లేకుంటే, నక్క ఏమిటి? అహింసావ్రతమేమిటి? మీ ఆజ్ఞకు భయపడి ఊరుకున్నామే గాని, దీని సంగతి ఇదివరకే మాకు తెలుసు’ అన్నాయి.
‘వెళ్లండి. ఈ ముసలినక్కను బంధించి, వధించండి’ ఆజ్ఞాపించాడు పులిరాజు.
ఇంతలో పులిరాజు తల్లి అక్కడకు వచ్చింది. ‘ఆగు! వివేకం లేకుండా ఏం చేస్తున్నావు? భృత్యులు చెప్పేదంతా తలకెక్కించుకునేవాడు రాజుగా ఉండతగడు. అధికులను చూసి హీనులు అసూయపడతారు. ఇలాంటివాళ్ల వల్లనే ఒకప్పుడు ధర్మం అధర్మంలా కనిపిస్తుంది. అధర్మం ధర్మంలా కనిపిస్తుంది. రాజు దగ్గర సమర్థుడైన మంత్రి ఉంటే, తమ ఆటలు సాగవని దుష్టులైన భృత్యులు నాటకాలాడతారు. అలాంటివాళ్లను ఓ కంట కనిపెట్టి ఉండాలి’ అని హితబోధ చేసింది.
పులిరాజు తన భృత్యుల మోసాన్ని గ్రహించాడు. వెంటనే నక్కను పిలిచి, ‘మహాత్మా! నావల్ల పొరపాటు జరిగిపోయింది. మన్నించు. దుర్మార్గులైన నా భృత్యులను దండిస్తాను’ అని వేడుకున్నాడు.
‘పులిరాజా! తెలిసిగాని, తెలియకగాని ఒకసారి అనుమానించడం మొదలుపెట్టాక తిరిగి కలుపుకోవాలని అనుకోవడం అవివేకం. ఒకవేళ నువ్వు నాతో సఖ్యంగా ఉండాలనుకున్నా, ఇక నాకిక్కడ ఉండటం ఇష్టంలేదు’ అంటూ పులి దగ్గర సెలవు తీసుకుని బయలుదేరింది. నిరాహారదీక్షతో శరీరం విడిచి, సద్గతి పొందింది.
రాజు ఎన్నడూ చెప్పుడు మాటలకు లోబడకూడదు. మంచిచెడులను గుర్తెరిగి, మంచివారు ఎవరో, చెడ్డవారు ఎవరో తెలుసుకుని మసలుకోవాలి’ అని ధర్మరాజుకు బోధించాడు భీష్ముడు. – సాంఖ్యాయన
ఇవి చదవండి: రాతి కోటల్లో.. గాంధారి ఖిల్లా!
Comments
Please login to add a commentAdd a comment