Childrens stories
-
ఒక అడవిలో తాబేళ్లు... చేపలు... కోతులు
ఒక అడవిలో గుబురుగా ఉన్న చెట్ల మీద ఒక కోతుల జంట నివసిస్తోంది. పెద్దకోతులు మంచివే కానీ పిల్ల కోతులు నాలుగు మాత్రం చాలా అల్లరి చేస్తూ దారిలో వెళ్ళే అందరినీ ఇబ్బంది పెట్టసాగాయి. ఆ చెట్లకు కాస్త దూరంలో ఒక సెలయేరు ఉంది. అందులో కొన్ని తాబేళ్లు, చేపలు నివసిస్తున్నాయి. చేపలు, తాబేళ్లు నీటి మీద తేలియాడగానే కోతులు చెట్ల పైనుంచి పండ్లు, కాయలు, ఎండుకొమ్మలు వాటి మీదకు విసిరి బాధ పెట్టసాగాయి.‘కోతి నేస్తాలూ! మేము మీకు ఏ విధంగానూ అడ్డురావడం లేదు. మరి మీరెందుకు మమ్మల్ని నీటి పైకి రానివ్వకుండా గాయపరుస్తున్నారు?’ అని ఒకరోజు ఒక చేప ప్రశ్నించింది. ‘మేము పిల్లలం, అల్లరి చేస్తూ ఆటలు ఆడుకుంటున్నాం. మేము తినగా మిగిలినవి గిరాటు వేస్తుండగా అవి పొరపాటుగా నీళ్లల్లో పడుతున్నాయి’ అని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చింది ఓ పిల్లకోతి.‘చేప నేస్తాలూ! పిల్లకోతులు కావాలని అలా గిరాటు వేస్తున్నాయి. మనం వాటిని అడగడం వల్ల ఏమీ ఉపయోగం ఉండదు’ అంది ఓ తాబేలు.రోజురోజుకు కోతుల ఆగడాలు పెరగసాగాయి. పాపం! తాబేళ్లు, చేపలు ఏమీ చేయలేక అలాగే అవస్థపడసాగాయి. ఒక రోజున పిల్ల కోతులు ఒక కొమ్మ మీద కూర్చుని ఉయ్యాలూగుతున్నాయి. ఆ కొమ్మ బలహీనంగా ఉండటం వలన ఫెళ్లున విరిగిపోయింది. ఊగుతున్న కోతులు ఆ వేగానికి సెలయేటి నీళ్లల్లో పడిపోయాయి. వాటికి ఈత రాకపోవడంతో ‘కాపాడండి.. కాపాడండి..’ అంటూ పెద్దగా అరవసాగాయి. ఆ అరుపులకు నీళ్లల్లో ఉన్న చేపలు, తాబేళ్లు బయటకు వచ్చాయి. ‘అయ్యో! పిల్ల కోతులు నీళ్లల్లో మునిగిపోతున్నాయి, వాటిని కాపాడుదాం’ అంది ఒక తాబేలు.‘పిల్లకోతులూ! ఇలా మా వీపు మీద కూర్చోండి’ అంటూ నాలుగు పెద్ద తాబేళ్లు వాటి దగ్గరకు వెళ్ళాయి. అవి తాబేళ్ల మీద కూర్చోగానే ఈదుతూ వాటిని ఒడ్డుకు చేర్చాయి. ‘మేము మిమ్మల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టినా మీరు మా ప్రాణాలను రక్షించారు. ఇక నుంచి మనం మంచి మిత్రులుగా ఉందాం’ అన్నాయి పిల్ల కోతులు. ‘అలాగే!’ అన్నాయి తాబేళ్లు.అప్పటి నుంచి అవన్నీ చాలా స్నేహంగా ఉండసాగాయి. ఒకరోజు అడవికి ఒక బెస్తవాడు సెలయేటిలో చేపలు పట్టడానికి వచ్చాడు. అతణ్ణి చెట్టు మీద ఉన్న పిల్లకోతులు చూశాయి. ఈలోగా బెస్తవాడు వలను నీటిలోకి విసిరాడు. ఆదమరచి ఉన్న చేపలు, తాబేళ్లు వలలో చిక్కుకున్నాయి.‘ఈ రోజు నా అదృష్టం పండింది. చాలా చేపలు, తాబేళ్లు కూడా దొరికాయి’ అంటూ బెస్తవాడు సంబరపడి వాటిని తనతో తెచ్చుకున్న బుట్టలో వేసుకున్నాడు. ‘అయ్యో! మన నేస్తాలను ఇతను తీసుకెళ్లిపోతున్నాడు’ అని పిల్ల కోతులు మాట్లాడుకున్నాయి. అన్నీ కూడబలుక్కుని ఒక్కసారిగా బెస్తవాడి మీదకు దూకాయి. ఊహించని పరిణామానికి అతను కంగారుపడ్డాడు. తప్పించుకోవడానికి ప్రయత్నించినా.. కోతులు అతని శరీరాన్ని రక్కేశాయి. బుట్ట, వల అక్కడే వదిలేసి పరుగెత్తుకుంటూ పారిపోయాడు. కోతులు బుట్టను తెరిచి చేపలను, తాబేళ్లను సెలయేటిలోకి వదిలేశాయి. అవి పిల్ల కోతులకు కృతజ్ఞతలు తెలిపి హాయిగా ఊపిరి పీల్చుకున్నాయి. ‘మనం ఎప్పుడూ ఇలాగే ఒకరికి ఒకరం స్నేహంగా ఉండాలి’ అనుకున్నాయి అన్నీ! మనం ఒకరికి సహాయపడితే మనకు దేవుడు సహాయపడతాడు. – కైకాల వెంకట సుమలత -
భీష్ముడు చెప్పిన.. పులి–నక్క కథ!
అంపశయ్య మీదనున్న భీష్ముడి వద్దకు వెళ్లిన ధర్మరాజు ‘పితామహా! లోకంలో కొందరు లోపల దుర్మార్గంగా ఉంటూ, పైకి సౌమ్యంగా కనిపిస్తుంటారు. ఇంకొందరు లోపల సౌమ్యంగా ఉన్నా, పైకి దుర్మార్గంగా కనిపిస్తుంటారు. అలాంటివాళ్లను గుర్తించడం ఎలా?’ అని అడిగాడు. అందుకు సమాధానంగా భీష్ముడు ‘ధర్మనందనా! నువ్వు అడిగిన సందేహానికి నేను పులి–నక్క కథ చెబుతాను’ అంటూ కథను మొదలుపెట్టాడు.‘పూర్వం పురిక అనే నగరాన్ని పౌరికుడు అనే రాజు పాలించేవాడు. బతికినన్నాళ్లు క్రూరకర్మలు చేయడం వల్ల నక్కగా జన్మించాడు. పూర్వజన్మ జ్ఞానం ఉండటం వల్ల ఈ జన్మలో మంచిగా బతుకుదామని తలచి, అహింసావ్రతం చేస్తూ ఆకులు అలములు తినసాగాడు. ఇది చూసి అడవిలోని తోటి నక్కలు ‘ఇదేమి వ్రతం? మనం నక్కలం. ఆకులు అలములు తినడమేంటి? నువ్వు నక్కల్లో తప్పపుట్టావు. నీకు వేటాడటం ఇష్టం లేకుంటే చెప్పు, మేము వేటాడిన దాంట్లోనే కొంత మాంసం నీకు తెచ్చి ఇస్తాం’ అన్నాయి.పూర్వజన్మ జ్ఞానం కలిగిన నక్క ‘తప్పపుట్టడం కాదు, తప్పనిసరిగా నక్కగా పుట్టాను. నాకు ఆకులు అలములు చాలు. నేను జపం చేసుకునే వేళైంది. మీరు వెళ్లండి’ అని చెప్పి మిగిలిన నక్కలను సాగనంపింది. నక్క అహింసావ్రతం చేçస్తున్న సంగతి అడవికి నాయకుడైన పులికి తెలిసింది. ఒకనాడు పులిరాజు స్వయంగా నక్క గుహకు వచ్చాడు.‘అయ్యా! నువ్వు చాలా ఉత్తముడివని తెలిసింది. నువ్వు నాతో వచ్చేయి. నీకు తెలిసిన మంచి విషయాలు చెబుతూ, నన్ను మంచిదారిలో నడిపించు’ అని వినయంగా ప్రాధేయపడ్డాడు. ‘రాజా! చూడబోతే నువ్వు గుణవంతుడిలా ఉన్నావు. అయినా నేను నిన్ను ఆశ్రయించలేను. నాకు ఐహిక సుఖాల మీద మమకారం లేదు. నీతో రాలేను’ అని బదులిచ్చింది నక్క.‘నాతో రాకపోయినా, నాతో సఖ్యంగా ఉంటూ నాకు మంచీచెడ్డా చెబుతూ ఉండు’ కోరాడు పులిరాజు.‘పులిరాజా! నువ్వూ నేనూ స్నేహంగా ఉంటే, నీతోటి వాళ్లు అసూయ పడతారు. మనిద్దరికీ విరోధం కల్పించడానికి ప్రయత్నిస్తారు. దానివల్ల కీడు తప్పదు. అందువల్ల నా మానాన నన్ను విడిచిపెట్టు’ బదులిచ్చింది నక్క.‘లేదు మహాత్మా! నీమీద ఎవరేం చెప్పినా వినను. అలాగని మాట ఇస్తున్నాను, సరేనా!’ అన్నాడు పులిరాజు. నక్క సరేనని ఆనాటి నుంచి పులితో సఖ్యంగా ఉండసాగింది.పులిరాజుకు నక్క మంత్రిగా రావడం మిగిలిన భృత్యులకు నచ్చలేదు. నక్క ఉండటం వల్ల తమకు విలువ దక్కడం లేదని అవి వాపోయాయి. చివరకు ఎలాగైనా నక్క పీడ విరగడ చేసుకోవాలని కుట్ర పన్నాయి. ఒకరోజు పులిరాజు గుహలో దాచుకున్న మాంసాన్ని దొంగిలించి, నక్క ఉండే గుహలో దాచిపెట్టాయి.గుహలో మాంసం లేకపోయేసరికి పులిరాజు భృత్యులందరినీ పిలిచి వెదకమని నాలుగు దిక్కులకూ పంపాడు. వెదుకులాటకు తాను కూడా స్వయంగా బయలుదేరాడు. నక్క గుహ దగ్గరకు వచ్చేసరికి మాంసం వాసన పులిరాజు ముక్కుపుటాలను తాకింది. లోపలకు వెళ్లి చూస్తే, తాను దాచిపెట్టుకున్న మాంసమే అక్కడ కనిపించింది.‘ఎంత మోసం!’ పళ్లు పటపట కొరికాడు పులిరాజు.ఈలోగా మిగిలిన భృత్యులంతా అక్కడకు చేరి, ‘మహారాజా! మీరు స్వయంగా గుర్తించబట్టి సరిపోయింది. లేకుంటే, నక్క ఏమిటి? అహింసావ్రతమేమిటి? మీ ఆజ్ఞకు భయపడి ఊరుకున్నామే గాని, దీని సంగతి ఇదివరకే మాకు తెలుసు’ అన్నాయి.‘వెళ్లండి. ఈ ముసలినక్కను బంధించి, వధించండి’ ఆజ్ఞాపించాడు పులిరాజు.ఇంతలో పులిరాజు తల్లి అక్కడకు వచ్చింది. ‘ఆగు! వివేకం లేకుండా ఏం చేస్తున్నావు? భృత్యులు చెప్పేదంతా తలకెక్కించుకునేవాడు రాజుగా ఉండతగడు. అధికులను చూసి హీనులు అసూయపడతారు. ఇలాంటివాళ్ల వల్లనే ఒకప్పుడు ధర్మం అధర్మంలా కనిపిస్తుంది. అధర్మం ధర్మంలా కనిపిస్తుంది. రాజు దగ్గర సమర్థుడైన మంత్రి ఉంటే, తమ ఆటలు సాగవని దుష్టులైన భృత్యులు నాటకాలాడతారు. అలాంటివాళ్లను ఓ కంట కనిపెట్టి ఉండాలి’ అని హితబోధ చేసింది.పులిరాజు తన భృత్యుల మోసాన్ని గ్రహించాడు. వెంటనే నక్కను పిలిచి, ‘మహాత్మా! నావల్ల పొరపాటు జరిగిపోయింది. మన్నించు. దుర్మార్గులైన నా భృత్యులను దండిస్తాను’ అని వేడుకున్నాడు.‘పులిరాజా! తెలిసిగాని, తెలియకగాని ఒకసారి అనుమానించడం మొదలుపెట్టాక తిరిగి కలుపుకోవాలని అనుకోవడం అవివేకం. ఒకవేళ నువ్వు నాతో సఖ్యంగా ఉండాలనుకున్నా, ఇక నాకిక్కడ ఉండటం ఇష్టంలేదు’ అంటూ పులి దగ్గర సెలవు తీసుకుని బయలుదేరింది. నిరాహారదీక్షతో శరీరం విడిచి, సద్గతి పొందింది.రాజు ఎన్నడూ చెప్పుడు మాటలకు లోబడకూడదు. మంచిచెడులను గుర్తెరిగి, మంచివారు ఎవరో, చెడ్డవారు ఎవరో తెలుసుకుని మసలుకోవాలి’ అని ధర్మరాజుకు బోధించాడు భీష్ముడు. – సాంఖ్యాయనఇవి చదవండి: రాతి కోటల్లో.. గాంధారి ఖిల్లా! -
మంత్రి ఎన్నిక! చంద్రగిరి రాజ్యాన్ని..
చంద్రగిరి రాజ్యాన్ని విజయసింహుడు పాలించేవాడు. కొంతకాలంగా మంత్రికి ఆరోగ్యం బాలేకపోవడంతో కొత్త మంత్రిని ఎన్నిక చేయాలనుకున్నాడు. అందుకు ఓ ప్రకటన చేయించాడు రాజు. అన్ని ప్రాంతాల నుంచి సుమారు పాతిక మంది దాకా మంత్రి పదవి పోటీకి వచ్చారు. వారికి నిర్వహించిన పోటీలలో గెలిచి చివరకు ధర్మయ్య, శివయ్య, సీతయ్య అను ముగ్గురు మిగిలారు. ‘వారిలో ఎవరు మంత్రి పదవికి సరిపోతారు?’ అని న్యాయనిర్ణేతను అడిగాడు రాజు. ‘ఆ ముగ్గురు మాసానికి ఎంత జీతం కావాలనుకుంటున్నారో దాన్ని బట్టి నిర్ణయిద్దాం మహారాజా’ అని చెప్పాడు న్యాయనిర్ణేత.మొదటగా ధర్మయ్యను అడిగాడు రాజు ‘నీకు మాసానికి ఎంత జీతం కావాలి?’అని. ‘మహారాజా! నాకు మాసానికి పది వరహాలు కావాలి’ చెప్పాడు ధర్మయ్య. అలాగే మిగిలిన ఇద్దరినీ అడగగా శివయ్యేమో ఎనిమిది వరహాలు కావాలని, సీతయ్యేమో ఆరు వరహాలు చాలని చెప్పారు.ముగ్గురి జవాబులు విన్న తరువాత ‘ధర్మయ్యా.. నీకు కాస్త ఆశ ఎక్కువగా ఉన్నట్టుంది. మాసానికి పది వరహాలు అడిగావు. అవతల ఇద్దరేమో రెండేసి వరహాలు తగ్గించి చెప్పారు’ అన్నాడు రాజు. ‘మహారాజా! నాకు ఈ మధ్యనే వివాహం అయ్యింది. నా తల్లిదండ్రులు నా మీదే ఆధారపడి ఉన్నారు. వారిని చూసుకోవలసిన బాధ్యత కూడా నాదే. కుటుంబ పోషణ, ఇంటి అద్దె ఇవన్నీ పోనూ ఒక వరహా అటూ ఇటూగా మిగులుతుంది. అప్పు లేకుండా జీవితం సాఫీగా జరిగిపోతుంది. నేను కోరింది న్యాయమైన జీతం’ బదులిచ్చాడు ధర్మయ్య.‘నువ్వు రెండు వరహాలు తగ్గించి ఎనిమిది వరహాలని ఎలా చెప్పావు?’ అని శివయ్యను అడిగాడు రాజు. ‘మహారాజా! నాకూ వివాహం అయ్యింది, తల్లిదండ్రులూ ఉన్నారు. ఖర్చుదేముంది ఎంతైనా పెట్టవచ్చు. ఉన్న దాంట్లోనే సర్దుకుంటాను. అందుకే ఎనిమిది వరహాలే చెప్పాను’ చెప్పాడు శివయ్య. ‘నువ్వు కూడా మరో రెండు వరహాలు తగ్గించి ఆరు వరహాలే చెప్పావు. వివరణ ఇవ్వు’ అని సీతయ్యనూ అడిగాడు రాజు. ‘మహారాజా! నాకూ భార్య, ఇద్దరు పిల్లలు, తల్లిదండ్రులు ఉన్నారు. ఉద్యోగం దొరకడం కష్టంగా ఉంది. ఎలాగోలా సర్దుకుంటాను. అందుకే ఆరు వరహాలు చాలు అన్నాను’ చెప్పాడు సీతయ్య.‘నువ్వేవిధంగా సేవలు అందిస్తావు?’ అడిగాడు ధర్మయ్యను న్యాయనిర్ణేత. ‘న్యాయపరంగా రాజుగారికి సలహాలు ఇవ్వడం, అవినీతి, లంచగొండితనానికి చోటు లేకుండా, ధర్మమార్గంలో నడుస్తూ అంకిత భావంతో దేశానికి సేవలు అందిస్తాను’ అన్నాడు ధర్మయ్య. శివయ్య, సీతయ్యలనూ అదే ప్రశ్న అడిగాడు న్యాయనిర్ణేత. తామూ మంచి దారిలోనే సేవలు అందిస్తామని చెప్పారు వారు.‘మహారాజా! ధర్మయ్య కోరింది న్యాయమైన జీతం. తక్కువ జీతం కోరిన శివయ్య, సీతయ్యలు కొలువు వస్తే చాలు అనే పద్ధతిలో రెండు వరహాలు తగ్గించి చెప్పారు. మంత్రి పదవి వచ్చాక కోటలో, బయట ఆ పదవికి భయపడే వారు ఎక్కువ. పక్కదారి పట్టి లంచాలు తీసుకుంటారు. కనుక ధర్మయ్యకే మంత్రి పదవి ఇవ్వండి’ అన్నాడు న్యాయనిర్ణేత.‘ధర్మయ్యా! మంత్రి పదవి నీకే ఇస్తున్నాను. చక్కగా కొలువు చేసుకో!’ చెప్పాడు రాజు. ‘మహారాజా! చాలా సంతోషం.. నా మీద ఎలాంటి ఆరోపణలు వచ్చినా ఆ క్షణమే నా ఉద్యోగం నుంచి తొలగిపోతాను’ అన్నాడు ధర్మయ్య. చెప్పినట్టుగానే నిజాయితీగా ఉద్యోగం చేసుకుంటూ తన పేరును సార్థకం చేసుకున్నాడు ధర్మయ్య.ఇవి చదవండి: ఇంద్రుడితో గృత్సమదుడి మైత్రి.. -
పులి మెచ్చిన చిత్రం!
సిద్ధారం గ్రామంలో సిద్ధప్ప అనే యువకుడు ఉండేవాడు. అతనికి ఓర్పు తక్కువ. ఏ పనైనా వెంటనే కావాలనుకునేవాడు. గురుకులంలో కూడా ఏరోజుది ఆరోజు చదవకుండా పరీక్షల ముందే చదివిన సిద్ధప్పకు చదువు ఆబ్బలేదు. రాసుకోటానికి ఇచ్చిన పుస్తకాలలోని కాగితాల మీద బొమ్మలు వేస్తూ కాలక్షేపం చేస్తుండేవాడు. పుస్తకాలలోని బొమ్మలు చూస్తూ తాను కూడా అలా బొమ్మలు గీయటానికి ప్రయత్నించేవాడు.దాంతో చుట్టు పక్కలవాళ్లు ‘వీడికి చదువురాదు కానీ, ఏ చిత్రకారుడివద్దయినా చిత్రకళ నేర్పించండి’ అని వాడి తల్లిదండ్రులకు సలహా ఇచ్చేవారు. కళ నేర్పించటానికి డబ్బు లేకపోవటంతో వాడిని నగరంలోని చిత్రకారుడి వద్ద పనికి కుదిర్చారు. సిద్ధప్ఫలో చక్కని చిత్రకళ దాగి ఉన్నదని గ్రహించాడు ఆ చిత్రకారుడు. గీతలతో ఒక అస్థిపంజరంలా బొమ్మను గీసి దానికి జీవం ఉట్టిపడేలా రంగులు, మెరుగులు దిద్దమని సిద్ధప్పకు పురమాయించేవాడు. కానీ సిద్ధప్పకు ఏమాత్రం ఓర్పు ఉండేది కాదు.రేఖలతో కాకుండా నేరుగా బొమ్మ వేసేవాడు. దాంతో బొమ్మ సరిగా రాకపోయేది. చిత్రకారుడు చెప్పే మెలకువలు పాటించేవాడు కాదు. అది చూసి ఆ చిత్రకారుడు ‘సిద్ధప్పా! రేఖ అనేది ప్రాథమిక దృశ్యమానం. ఇది సౌందర్య వ్యక్తీకరణకు పునాదిగా పని చేస్తుంది. ఓపికతో నేర్చుకుంటే నువ్వు నన్ను మించిన చిత్రకారుడివి అవుతావు!’ అని చెప్పాడు.గురువైన చిత్రకారుడి వద్ద తాను నేర్చుకునేదేమీ లేదని.. తనకే ఎక్కువ తెలుసని భావించేవాడు సిద్ధప్ప. ఒకరోజు గురువుకు చెప్పకుండా సిద్ధారం బయలుదేరాడు. తానుంటున్న నగరానికి సొంతూరు సిద్ధారానికి మధ్యలో దట్టమైన అడవి ఉంది. సిద్ధప్ప అడవి మధ్యలోకి వెళ్లేసరికి ఒక పెద్దపులి గాండ్రిస్తూ అతని వెంటపడింది. భయంతో ఒక్క పరుగున పక్కనే ఉన్న గుహలోకి దూరి, దాక్కున్నాడు. సిద్ధప్పకు తెలియని విషయం ఏమిటంటే.. ఆ గుహ పులిదేనని. తన ముందు ప్రత్యక్షమైన పులిని చూసి గజగజ వణికిపోతూ ‘పులిరాజా! నన్ను విడిచిపెట్టు. నేను చిత్రకారుడిని. చక్కటి రంగులతో ఈ గుహ గోడ మీద నీ బొమ్మ వేస్తాను’ అన్నాడు.అప్పటిదాకా తన ప్రతిబింబాన్ని నీటిలోనే చూసుకున్న పులి.. తన గుహ గోడ మీద సిద్ధప్ప రంగుల్లో తన బొమ్మను చిత్రిస్తాననేసరికి సంబరపడి ‘సరే’ అంది. భుజానికున్న సంచిలోంచి కుంచె, రంగులు తీసి క్షణాల్లో పులి బొమ్మ వేశాడు. అది చూసి పులి పెద్దగా గాండ్రిస్తూ ‘నీలో ఓర్పులేదు. చిత్రం ఏ కోణంలోనూ నాలాగా లేదు. అసలు నువ్వు చిత్రకారుడివే కాదు’ అంది.‘అయ్యో అలా కోప్పడకు పులిరాజా.. మరొకసారి వేసి చూపిస్తాను’ అంటూ గబగబా ఆ బొమ్మ చెరిపేసి పది నిమిషాల్లో మరో బొమ్మను వేశాడు. అది చూసి పులి ఈసారి మరింత పెద్దగా గాండ్రిస్తూ ‘నీలో అసలు ఏమాత్రం నేర్పు లేదు. అది నా బొమ్మ కానే కాదు’ అంది. చేసేదిలేక మరో అవకాశం కోసం పులిని వేడుకున్నాడు సిద్ధప్ప. తన గురువైన చిత్రకారుడిని మనసులోనే నమస్కరించి, ఎదురుగా ఉన్న పులిని నిశితంగా పరిశీలించాడు. అప్పుడు ఏకాగ్రత, ఓర్పు, నేర్పులతో పులి రేఖలు గీసి.. వాటికి రంగులతో ప్రాణం అద్దాడు సిద్ధప్ప. ఆ చిత్రాన్ని చూసి ముచ్చటపడింది పులి.‘శభాష్! నువ్వు గొప్ప చిత్రకారుడివే! కాకుంటే నీకు ఓర్పు తక్కువ. ఓర్పు లేకుంటే ఏ కళలోనూ రాణించలేరు’ అంటూ తన చేతికున్న బంగారు కడియాన్ని సిద్ధప్పకు బహూకరించింది పులి. తప్పు గ్రహించిన సిద్ధప్ప వెనుతిరిగి గురువును చేరుకున్నాడు. చిత్రకళలో మెలకువలన్నీ నేర్చుకుని గురువుకు బంగారు కడియం తొడిగాడు. కొద్దిరోజులకే గొప్పచిత్రకారుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఓర్పు ఎంత చేదుగా ఉంటుందో, దాని ప్రతిఫలం అంత తీయగా ఉంటుందని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు సిద్ధప్ప. – కొట్రా సరితఇవి చదవండి: మిస్టరీ.. ఎపెస్ బందిపోట్లు! -
నాన్న మాటల్లోని జీవిత సత్యం.. బోధపడిన ప్రవీణ్ ఆనాటి నుంచి..
వీరయ్య ఒక పేదరైతు. తనకున్న రెండెకరాల పొలంలో రెక్కలు ముక్కలయ్యేలా కష్టపడుతూ కుటుంబాన్ని లాక్కొస్తున్నాడు. అతనికి ఒక్కగానొక్క కొడుకు ప్రవీణ్. కొడుకును బాగా చదివించి, వాడిని ఉన్నతస్థాయిలో చూడాలని వీరయ్య ఆశ. తనలా తన కొడుకు కష్టాలు పడకూడదు అనుకునేవాడు. చదువుకు తన పేదరికం అడ్డుకాకూడదని తల తాకట్టుపెట్టయినా కొడుకును చదివించాలని దృఢనిశ్చయానికి వచ్చాడు వీరయ్య. కొడుకును పట్నంలో మంచి బడిలో చేర్పించాడు. మొదటి సంవత్సరం బాగానే చదువుకుని మంచి మార్కులు సంపాదించాడు ప్రవీణ్. స్నేహితులు కూడా పెరిగారు.వాళ్లంతా చెప్పుల నుంచి బట్టల వరకు ఖరీదైన బ్రాండెడ్ వస్తువులనే వాడేవారు. వారిని చూసి ప్రవీణ్ కూడా తనకూ అలాంటి బ్రాండెడ్ వస్తువులు కావాలని తండ్రిని వేధించసాగాడు. దానికి వీరయ్య ‘చూడు నాయనా.. వారు ధనవంతుల బిడ్డలు. ఎలాగైనా ఖర్చుపెట్టగలరు. నీ చదువుకే నా తలకు మించి ఖర్చుపెడుతున్నాను. మనకు అటువంటి కోరికలు మంచివికావు. మన స్థాయిని బట్టి మనం నడుచుకోవాలి’ అని నచ్చజెప్పాడు. అయినా కొడుకు చెవికెక్కించుకోలేదు. పైపెచ్చు స్నేహితుల తల్లిదండ్రులు.. వాళ్లకేది కావాలంటే అది కొనిస్తున్నారు, పుట్టినరోజులు బ్రహ్మాండంగా జరిపిస్తున్నారు. తనకు మాత్రం తన తండ్రి ఏ సరదా తీర్చడం లేదని అలిగాడు ప్రవీణ్. ఫలితంగా చదువు మీద దృష్టిపెట్టక వెనుకబడిపోయాడు.ఒకసారి.. దసరా సెలవులకు ప్రవీణ్ వాళ్ల అక్క పిల్లలిద్దరూ ఇంటికి వచ్చారు. ఒకరోజు ఆ పిల్లలు మట్టితో బొమ్మరిల్లు కట్టి ఆడుకోసాగారు. ఆ ఇల్లు మీద సూట్‌కేసులు పెద్దపెద్ద బరువైన వస్తువులు పెడదామని చూసింది చిన్నమ్మాయి. పెద్దమ్మాయేమో ‘వద్దు.. మనం అలాచేస్తే బొమ్మరిల్లు కూలిపోతుంది’ అని వారించింది. అయినా చిన్నమ్మాయి వినకుండా ‘ఏమీ కాదు.. తాతగారింటి డాబా మీద పెద్దపెద్ద వస్తువులు పెట్టడం లేదా.. అలాగే ఈ ఇంట్లోనూ పెట్టుకోవచ్చు’ అంటూ మొండికేసింది. ఇదంతా గమనించిన ప్రవీణ్ ‘మీరు కట్టుకుంది బొమ్మరిలు.్ల ఇది ఆడుకోవడానికే కానీ వాడుకోవడానికి కాదు. అందుకే ఇది పెద్ద వస్తువులను మోయలేదు. తాతగారిల్లు రాళ్లు, ఇటుకలు, ఇనుముతో గట్టిగా కట్టినిల్లు. ఆ ఇల్లు మోసే బరువులను ఈ బొమ్మరిల్లు మోయలేదు. కావాలంటే నీకు బొమ్మ సూట్‌కేసులు, బ్యాగులు చేసిస్తాను చూడు..’ అని చెప్పాడు. చెప్పినట్టుగానే వెంటనే మట్టితో ఆ బొమ్మలను చేసిచ్చాడు కూడా! వాటిని చూసి చిన్నపిల్ల భలే ముచ్చటపడింది.ఈ తతంగమంతా చూసిన వీరయ్య.. కొడుకుని మెచ్చుకున్నాడు. తర్వాత కొడుకుతో ‘మన పేద బతుకులు కూడా బొమ్మరిల్లు లాంటివే. ఏమాత్రం బరువెక్కువైనా కూలిపోతాయి. మన స్థాయికి తగ్గట్టు నడుచుకోకపోతే చితికిపోతాం. ఆ చిన్నపిల్ల తెలియక మారాం చేసింది. నీవు తెలిసి తప్పటడుగులు వేస్తున్నావు’ అంటూ జ్ఞానదోయం చేశాడు. నాన్న మాటల్లోని జీవిత సత్యం బోధపడిన ప్రవీణ్ .. ఆనాటి నుంచి బుద్ధిగా చదువుకోసాడు. – జయరామ్ నాయుడు -
‘మహారాజా.. మీరు మాకు దేవుడిచ్చిన వరం'!
మహారాజు సింహాసనం అధిష్టించి పది సంవత్సరాలు పూర్తి అయింది. దాంతో తన పరిపాలన ఎలా ఉందో తెలుసుకోవాలనుకున్నాడు. అంగరంగ వైభవంగా సమావేశం ఏర్పాటు చేశాడు. సామంతులు, సైన్యాధికారులు, వ్యాపారస్తులు, కళాకారులు, పుర ప్రముఖులు అందరినీ ఆహ్వానించాడు. మహారాజు వచ్చిన వాళ్లందరినీ చిరునవ్వుతో చూస్తూ ‘నా పాలనలో రాజ్యమంతా సుభిక్షంగా ఎలా ఉందో తెలుసుకోవడానికి ఈ సభ ఏర్పాటు చేశాను. బాగుంటే బాగుందనండి. లేదంటే లేదనండి. సరిదిద్దుకోలసిన అంశాలుంటే తెలియచేయండి.రాజ్యం మరింత సుసంపన్నం కావడానికి సలహాలు ఇవ్వండి’ అన్నాడు. ‘మహారాజా.. మీరు మాకు దేవుడిచ్చిన వరం. ఎన్ని జన్మలైనా మీరే మాకు రాజుగా ఉండాలి’ అంటూ నోరువిప్పారు సామంతులు. ‘మీ పాలనలో ఎటువంటి తిరుగుబాట్లు లేవు. రాజ్యమంతా ప్రశాంతంగా సుఖసంతోషాలతో నిండుంది’ అన్నారు సైన్యాధికారులు.‘వ్యాపారాలు పుష్కలంగా జరుగుతున్నాయి. గల్లాపెట్టెలు గలగలలాడుతున్నాయి. రాజ్యంలో దొరకని వస్తువంటూ లేదు. ఎగుమతులూ పుంజుకుంటున్నాయి’ అన్నారు వ్యాపారస్తులు. ‘ఎక్కడ చూసినా సభలు, సమావేశాలు, నాటక ప్రదర్శనలు, కవితా పఠనాలు, కొత్త గ్రంథాల ఆవిష్కరణలు, పురస్కారాలు, సన్మానాలతో సందడిగా ఉంది ప్రభూ’ పొగిడారు కళాకారులు.ఒక్కొక్క మాటకు రాజు మొహంలో కోటి నక్షత్రాల కాంతులు వెదజల్లసాగాయి. వచ్చిన వారందరికీ రకరకాల ఆహార పదార్థాలతో విందు భోజనం ఏర్పాటు చేసి కానుకలతో సత్కరించి పంపించాడు. ఆ రాత్రి అంతఃపురంలో మహారాణితో మహారాజు ‘చూశావా రాణీ.. నా పరిపాలన ఎలా కళకళలాడిపోతున్నదో! ఆకలి కేకలు లేవు, తిరుగుబాట్లు లేవంటూ నింగిని తాకేలా కీర్తిస్తున్నారంతా’ అన్నాడు సంబరంగా. రాణి చిరునవ్వుతో ‘అలాకాక ఇంకెలా చెబుతారులే మహారాజా మీ వద్ద!’ అంది.ఆ మాటల్లో ఏదో వ్యంగ్యం కనబడింది రాజుకు. ‘అంటే.. ఆ పొగడ్తలన్నీ కేవలం భయం వల్ల వచ్చినవే అంటావా?’ ప్రశ్నించాడు. ‘భయం వల్లనే కాకపోవచ్చు. మీతో వారికున్న అవసరాల వల్ల కూడా కావచ్చు. మీ ముందు నిలబడి మీకు వ్యతిరేకంగా మీ కింద పనిచేసే అధికారులెవరైనా నోరు విప్పగలరా? మనసులో మాట చెప్పగలరా? మీరేం చేసినా ఆహా.. ఓహో.. అని ఆకాశానికి ఎత్తేస్తారు తప్ప విమర్శిస్తారా?’ అంది.‘అయితే వాళ్ళందరూ నన్నలా ఊరికే పొగుడుతున్నారని నిరూపించగలవా?’ అన్నాడు రాజు. ‘తప్పకుండా మహారాజా.. మీకు అసలు రాని కళేదైనా ఉంటే చెప్పండి’ అంది. మహారాజు కాసేపు ఆలోచించి ‘నీకు తెలుసు కదా.. లలితకళల్లో ఎంతోకొంత ప్రావీణ్యం ఉన్న నాకు అసలు రానిది, ఎప్పుడూ ముట్టుకోనిది చిత్రలేఖనం ఒక్కటే అని’ అన్నాడు.‘అయితే ఒక పనిచేయండి మహారాజా.. ఒక్కరోజులో చిత్రలేఖనం గురించి తెలుసుకొని మీకు ఎలా తోస్తే అలా రకరకాలుగా చిత్రాలు వేయండి. అవన్నీ ప్రదర్శనకు పెడదాం. ఇప్పుడు పిలిచిన వాళ్లందరినీ అప్పుడూ ఆహ్వానిద్దాం. తెలుస్తుంది ఎవరేమంటారో!’ అంది. మహారాజు సరేనని ఒక ప్రముఖ చిత్రకారున్ని పిలిపించి ఒక రోజంతా చిత్రకళ గురించి తెలుసుకున్నాడు. తర్వాత రోజు నుంచి బొమ్మలు గీయడం మొదలుపెట్టాడు. కుడిచేత్తో కొన్ని, ఎడంచేత్తో కొన్ని, నోటితో పట్టుకొని కొన్ని, వెనక్కి తిరిగి కొన్ని, ఆఖరికి పడుకొని, కూర్చుని, నుంచుని రకరకాలుగా వారం రోజుల్లో వంద చిత్రాలు పూర్తి చేశాడు.వాటన్నింటినీ ప్రదర్శనకు పెట్టాడు. అందులో కొన్ని చిత్రాలను తిరగేసి కూడా పెట్టాడు. అప్పుడు పిలిచిన వాళ్లందరనీ ప్రదర్శనకు ఆహ్వానించాడు. ఏ చిత్రం చూసినా రంగులు ఒకదానితో ఒకటి కలసిపోయి కనిపించాయి. దేనిలో ఏముందో, అందులో భావముందో ఎంత ఆలోచించినా ఎవరికీ అంతుచిక్క లేదు. అర్థంకానిదంతా అద్భుతమే అని తీర్మానించుకున్నారంతా! అవతల ఉన్నది మహారాజు. తప్పు పట్టినా, బాగా లేదన్నా కొరడా దెబ్బలు తప్పవు. దాంతో ఎందుకైనా మంచిదని ‘ఆహా’ అన్నారు కొందరు. వెంటనే ‘ఓహో’ అన్నారు మరికొందరు. ‘అద్భుతం. మీకు మీరే సాటి’ అంటూ అందుకొన్నారు ఇంకొందరు.ఇలా పొడిపొడి మాటలైతే లాభం లేదనుకొని ఇంకొకరు ముందడుగు వేసి ‘మహారాజా.. ఇంత వేగంగా ఇన్ని చిత్రాలు గీయడం మామూలు మానవులకు సాధ్యం కాదు. మీలాంటి కారణజన్ములు ఏడేడు పద్నాలుగు లోకాల్లో ఎక్కడా ఉండరు. మీకు చిత్రరత్న పురస్కారం కచ్చితంగా ఇచ్చి తీరవలసిందే’ అన్నారు. అది విన్న మరికొందరు తాము ఎక్కడ వెనుకబడి పోతామేమోనని ‘మహారాజా.. ఈ చిత్రాలు మీరు గనుక మాకు ఇస్తే మా భవనాలలో అలంకరించుకుంటాం. వీటివల్ల మా ఇంటి అందం రెట్టింపవుతుంది’ అన్నారు.ఒకరిని చూసి మరొకరు పొగడ్తలలో పోటీపడ్డారు. వాళ్ళలా పొగడ్తల వర్షం కురిపిస్తుంటే మహారాజు తన పక్కనే ఉన్న మహారాణికి మొహం చూపించలేక సిగ్గుతో చితికిపోయాడు. ప్రదర్శన పూర్తయి అందరూ వెళ్ళిపోయాక ‘అర్థమైంది కదా రాజా ప్రముఖుల సంగతి. మీ పాలన గురించి నిజానిజాలు తెలియాలంటే ధనవంతులను కాదు కలవాల్సింది పేద ప్రజలను. అధికార దర్పంతో రాజుగా కాదు వాళ్లలో ఒకరిగా మారిపోవాలి. అప్పుడే మీ లోటుపాట్లు తెలుస్తాయి. సరిదిద్దుకోవలసినవి అర్థమవుతాయి’ అంది. మహారాణి వైపు ప్రశంసాపూర్వకంగా చూశాడు మహారాజు. మరుసటి మహారాజు పల్లెమనిషిగా మారు వేషంలో కాలినడకన సంచారానికి బయలుదేరాడు. నిజాల వేటకై! – డా.ఎం.హరి కిషన్ -
సుందరవనం అనే అడవిలో.. ఒక ముసలి అవ్వ..
సుందరవనం అనే అడవిలో ఒక ముసలి అవ్వ నివసించేది. ఆమె అడవిని చూడవచ్చిన వారికి ఇతర పనుల మీద అడవికి వచ్చిన వారికి అన్నం వండిపెట్టేది. ఆ అడవి దగ్గరలోని గ్రామాల్లో కొందరు ఆమెకు ధన రూపేణా, వస్తు రూపేణా కొంత విరాళంగా ఇచ్చేవారు. ఇలా ఉండగా ఒకరోజు కనకయ్య, గోవిందయ్య అనే ఇద్దరు మిత్రులు ఆమె ఇంటికి వచ్చి భోజనం పెట్టమన్నారు.ఆమె వారికోసం వంట మొదలుపెట్టింది. ఇంతలో మరో నలుగురూ వచ్చి తమకూ వండి పెట్టమని ఆ అవ్వను అడిగారు. ఆమె ‘సరే’అంటూ ఆ ఎసట్లో ఆరుగురికి సరిపోయే బియ్యం వేసింది. అది చూసి ఆ నలుగురూ వంటయ్యేలోపు సుందర వనం అందాలను చూసి వస్తామని వెళ్లారు. వంట పూర్తి కాగానే ఆమె ఆకలితో ఉన్న కనకయ్య, గోవిందయ్యలకు భోజనం వడ్డించింది. తిన్న తర్వాత వారూ అడవి అందాలు చూడడానికి వెళ్లారు.వాళ్లు వెళ్లగానే ఆ నలుగురూ కూడా అలా వచ్చి భోజనం చేసి వెళ్ళిపోయారు. కాసేపటికి గోవిందయ్య, కనకయ్యలూ అడవి నుంచి తిరిగివచ్చారు. అప్పుడు గోవిందయ్య తన సంచీ చూసుకుంటే.. తనకు ఎప్పుడో కనకయ్య కానుకగా ఇచ్చిన బంగారు ఉంగరం కనిపించలేదు. దాంతో గోవిందయ్యతో ‘నీవిచ్చిన బంగారు ఉంగరం కనబడట్లేదు. తిరిగి తీసుకున్నావా?’ అని అడిగాడు. ‘ఇచ్చిన ఉంగరాన్ని తిరిగి తీసుకుంటానా?’ అన్నాడు కనకయ్య. ‘అయితే మరి నా ఉంగరం ఏమైనట్టు?’ అని కంగారుపడుతూ అవ్వను అడిగాడు తన ఉంగరమేమైనా కనిపించిందా? అని. దానికి ఆమె తనకే ఉంగరం కనిపించలేదని చెప్పింది. అంతలో గోవిందయ్యకు ఏదో అనుమానం వచ్చి వెంటనే బయటకు పరుగెత్తాడు. తిరుగుబాటలో ఉన్న ఆ నలుగురినీ చేరుకుని.. అవ్వ రమ్మంటోందని పిలుచుకు వచ్చాడు.తిరిగొచ్చిన ఆ నులగురినీ గోవిందయ్య బంగారు ఉంగరం గురించి ప్రశ్నించింది అవ్వ. తామసలు ఇంట్లోనే లేమని, తామెందుకు తీస్తామని నిలదీశారు వాళ్లు. అప్పుడు గోవిందయ్య ‘అవ్వా! నీవు తీయలేదు. నా మిత్రుడు కూడా తీయలేదు. కచ్చితంగా ఈ నలుగురిలో ఎవరో ఒకరు తీశారు. దీని గురించి నేను గ్రామపెద్దకు ఫిర్యాదు చేస్తాను’ అంటూ గ్రామపెద్ద వద్దకు వెళ్లాడు. ఉంగరం పోయిందని ఫిర్యాదు చేశాడు.గ్రామపెద్ద ముసలి అవ్వ కనకయ్యతో పాటు ఆ నలుగురినీ పిలిపించాడు. గ్రామపెద్దతో గోవిందయ్య తనకు కనకయ్య ఉంగరాన్నిచ్చాడని, అది తను భోజనం చేసేకంటే ముందు ఉందని.. భోజనం తరువాత చూసుకుంటే కనబడలేదని చెప్పాడు. గ్రామపెద్ద ఆ నలుగురినీ ప్రశ్నించాడు. వారు తాము తీయలేదని చెప్పారు. ‘మరి ఆ ఉంగరం ఏమైనట్టు?’ అని అడిగాడు గ్రామపెద్ద. ఆ నలుగురిలో ఒకడైన రంగడు ‘ఎక్కడికి పోతుందండీ? ఈ ముసలామే తీసుంటుంది’ అన్నాడు.వెంటనే గ్రామపెద్ద రంగడిని పట్టుకుని ‘నిజం చెప్పు? ఆ ఉంగరం తీసింది నువ్వే కదా?’ పొరుగూడి వాడివి అవ్వ గురించి నువ్వు మాకు చెప్పేదేంటీ? ఆమె అన్నపూర్ణ. అలాంటి ఆమెపై నిందలు వేస్తున్నావంటే కచ్చితంగా నువ్వే ఉంగరం దొంగవి’ అంటూ నిలదీశాడు.‘నేను తీయలేదండీ’ అన్నాడు రంగడు. గ్రామపెద్ద మిగతా ముగ్గురిని ఉద్దేశిస్తూ ‘మీరంతా అడవికి వెళ్లినప్పుడు రంగడు మిమ్మల్ని వీడి ఒక్కడే ఎక్కడికైనా వెళ్లాడా?’ అని అడిగాడు. దానికి వారు ‘అవునండీ.. వెళ్లాడు.మాతో పాటే నడుస్తూ మధ్యలో ‘‘ఇప్పుడే వస్తాను.. మీరు వెళ్తూ ఉండండి’’ అంటూ వెనక్కి వెళ్లి మళ్లీ కాసేపటికి వచ్చాడు’ అని చెప్పారు. ‘అయితే ఆ సమయంలో నువ్వు అవ్వ ఇంటికి వచ్చి.. ఉంగరం కాజేసి ఏమీ ఎరగనట్టు మళ్లీ మీ వాళ్లను కలిశావన్నమాట’ అంటూ రంగడిని గద్దించాడు గ్రామపెద్ద. తన తప్పు బయటపడిపోయిందని.. ఇంక తను తప్పించుకోలేనని తెలిసి.. నిజాన్ని ఒప్పుకున్నాడు రంగడు. తాను దాచిన ఉంగరాన్ని తీసి గ్రామపెద్ద చేతిలో పెట్టాడు.అదంతా విని ఆశ్చర్యపోతూ గోవిందయ్య ‘అయ్యా.. రంగడే ఉంగరం తీశాడని మీరెలా గుర్తించారు?’ అని అడిగాడు. దానికి గ్రామపెద్ద ‘ఏముంది? నీ మిత్రుడు నీకిచ్చిన కానుకను తిరిగి తీసుకునే సమస్యే లేదు. అవ్వ ఎలాంటిదో మాకు బాగా తెలుసు. మిగిలింది ఈ నలుగురే కదా! వీళ్లలో ముగ్గురూ నిజాయితీగా తమకు తెలియదని చెప్పారు. ఈ రంగడు మాత్రం నేరాన్ని అవ్వ మీదకు నెట్టడానికి ప్రయత్నించాడు. అక్కడే నాకు అనుమానం మొదలైంది. అందుకే ఒంటరిగా ఎక్కడికైనా వెళ్లాడా అని అడిగా. వెళ్లాడని తేలింది. ఆ సమయంలో అవ్వ ఇంటికి దొంగచాటుగా వచ్చి.. గోవిందయ్య చిలక్కొయ్యకు వేసిన అతని చొక్కా జేబులోంచి ఎవరూ చూడకుండా ఉంగరాన్ని కాజేశాడు. గుట్టు చప్పుడు కాకుండా మళ్లీ వెళ్లి ఆ ముగ్గురితో కలిశాడు’ అని చెప్పాడు. ఉంగరాన్ని గోవిందయ్యకు అప్పజెప్పి రంగడికి జరిమానా విధించాడు గ్రామపెద్ద. వెంటనే అవ్వ.. గ్రామ పెద్దతో ‘అయ్యా! ఉంగరం దొరికింది కదా! రంగడికి విధించిన జరిమానా రద్దు చేయండి. కష్టం చేసుకుని బతికే కూలీ. కాయకష్టమంతా జరిమానా కట్టేస్తే కుటుంబానికేం ఇస్తాడు? ఈ గుణపాఠంతో మళ్లీ తప్పు చేయడు’ అని వేడుకుంది. చేయనన్నట్టుగా కన్నీళ్లతో దండం పెడుతూ ‘అమ్మలాంటి దానివి. నువ్వు పెట్టిన అన్నం తిని నీమీదే నేరం మోపాను. అయినా పెద్ద మనుసుతో నువ్వు నాకు క్షమాభిక్ష పెట్టమని కోరావు. నేను పాపాత్ముడిని. నన్ను క్షమించు అవ్వా..’ అంటూ అవ్వ కాళ్ల మీద పడ్డాడు రంగడు. అవ్వ మంచితనాన్ని గ్రామపెద్దతో పాటు అక్కడున్న అందరూ ప్రశంసించారు. – సంగనభట్ల చిన్న రామకిష్టయ్య -
మనల్ని నాశనం చేయడానికి ప్రతి ఇంట్లో బోన్లు పెట్టి..
ఓరోజు ఎలుకలన్నీ పెద్ద ఎలుక వద్దకు వెళ్లి ‘ఊర్లోని ఇంటి యజమానులంతా అప్రమత్తమయ్యారు, మనల్ని సమూలంగా నాశనం చేయడానికి ప్రతి ఇంట్లో బోన్లు పెట్టి మనల్ని హతమార్చే ప్రయత్నాలు ప్రారంభించారు’ అంటూ గగ్గోలు పెట్టాయి. ‘ఇక మేము పల్లెల్లో నివసించలేం, పట్టణాలకు వెళ్లిపోతాం. అక్కడ బోనులో చిక్కకుండా మెలకువలు నేర్చుకొని చక్కగా బతుకుతాం’ అని భీష్మించుకున్నాయి.పెద్ద ఎలుక వాటిని సముదాయించే ప్రయత్నం చేసింది. అయినా అవి ‘పల్లెల్లో ఉండం కాక ఉండం’ అంటూ మొండికేశాయి. ఇంతలో ఆ పల్లెకు, చుట్టపు చూపుగా ఓ ఎలుక రంగు గుడ్డలేసుకుని గెంతుతూ వచ్చింది. అన్ని ఎలుకలూ దానికి ఆహ్వానం పలికాయి. అదే సమయంలో ఓ మిద్దింటి నుంచి చేపల కూర వాసన గుప్పుగుప్పుమని వచ్చింది. పట్టణం ఎలుకకు నోరు ఊరింది. ‘ఎన్నాళ్లయ్యిందో చేపల కూర తిని.. నేను వెళ్లి తిని వస్తా!’ అని లొట్టలేసుకుంటూ బయలుదేరింది.‘ఆశపడి వెళ్లొద్దు.. ఇక్కడ అందరి ఇళ్లోల్లో బోనులు పెట్టి ఉన్నాయి. పొరపాటుగా నువ్వు బోనులో ఇరుక్కుపోయే ప్రమాదం ఉంది’ అంటూ ఎలుక పెద్ద హెచ్చరించింది. పట్టణం ఎలుక ఎగిరెగిరి నవ్వింది.. ‘నేనేమైనా పల్లెటూరి ఎలుకనా.. వారు వేసే ఎరలకు ఇరుక్కుపోవడానికి?’ అంటూ మిద్దె ఇంటి వైపు దౌడు తీసింది. ‘ఏమి జరుగుతుందో చూద్దాం..’ అని ఎలుకలన్నీ దాని వెనుకే పరుగులు తీశాయి.మిద్దె ఇంటిలోకి వెళ్తున్న పట్టణం ఎలుకను చూసిన మరో పల్లె ఎలుకకు కూడా నోరూరింది. దాంతో అది ఆ మిద్దె ఇంటిలోకి పట్టణం ఎలుకకన్నా ముందే దూరింది. బోనులో పెట్టిన ఎండు చేప వాసనకి పల్లె ఎలుక పరవశించి పోయింది. ముందు వెనుకలు చూడకుండా నేరుగా వెళ్ళి చేపను లాగింది. డబుక్కున బోను మూత పడటంతో ఇరుక్కుపోయానని తెలుసుకుని ‘కుయ్ కుయ్’ అని అరుస్తూ రచ్చ చేసింది. ‘పట్టణం ఎలుక ఏమి చేయబోతుందో..’ అని, మిగిలిన పల్లె ఎలుకలన్నీ అటకెక్కి వేడుక చూడసాగాయి.పట్టణం ఎలుక ఒయ్యారంగా మరో బోను ముందర నిలబడి ‘ఇట్టాంటి బోనులు ఎన్ని చూడలేదు..’ అంటూ ఇంటి యజమాని తెలివిని ఎద్దేవా చేస్తూ పడీపడీ నవ్వింది. బోను పైకెక్కి నాట్యం చేసింది. బోనులోని ఎండుచేప ‘నన్ను తినకుండా వెళ్ళిపోతావా మిత్రమా’ అని అడిగినట్లు అనిపించింది దానికి. ‘అయినా పట్టణంలోని పెద్దపెద్ద బోనుల్లోనే చిక్కలేదు నేను. అలాంటి నాకు ఈ పల్లెటూరి బోను ఒక లెక్కా! కనురెప్పలు మూసి తెరిచేలోగా టపీమని వెళ్ళి బోనులోని చేపను నోటితో లాక్కొని రానూ..’ అంటూ బోనులోకి దూరి చేపను లాగింది. టక్కుమని బోను మూత పడిపోయింది. ఇరుక్కుపోయిన సంగతి తెలుసుకుని బోనును లోపలే ‘డిష్యుం డిష్యుం’ అని కొట్టడం ప్రారంభించింది.ఆ ఆపదను ముందే గ్రహించిన పెద్ద ఎలుక.. అటకెక్కి చూస్తున్న తోటి ఎలుకల గుంపును తోడ్కొని .. ఆ రెండు బోనుల వద్దకు వెళ్లింది. తమ బలమంతా ప్రయోగించి ఆ రెండు ఎలుకలను బయటకు తీసి వాటికి ప్రాణభిక్ష పెట్టాయి ఆ ఎలుకలన్నీ! వెంటనే పెద్ద ఎలుక.. మిద్దింటి ముందరి పూలతోటలో ఆ ఎలుకలన్నిటినీ సమావేశపరచి ‘మనం బోనులో పెట్టిన ఎరల అకర్షణలో పడి పెద్దప్రాణాలకే ప్రమాదం తెచ్చుకోకూడదు.ఆ ‘ఎరుక’ ఉంటేనే పల్లెల్లో అయినా, పట్టణాల్లో అయినా ఎలుకలు బతికి బట్టకట్టగలవు. అసలు మనుషులు ఎలుకల్ని ఎందుకు బోనులో బంధిస్తారో తెలుసుకోవాలి. వారి విలువైన వస్తువులను, ఆహారాన్ని మనం నాశనం చేయడం వల్లనే వారు మనల్ని శత్రువులుగా చూస్తున్నారు. బోనులను ఏర్పాటు చేస్తున్నారు. ఈ విశాల విశ్వంలో మనకెన్నో ఆహార పదార్థాలు దొరుకుతాయి. కాబట్టి మనుషుల వస్తువులపై మన వ్యామోహం తగ్గించుకుంటే మనుషులు.. మనం.. ఇరువర్గాలం క్షేమంగా ఉంటాం’ అంటూ హితబోధ చేసింది.ఆ మాటలతో జ్ఞానోదయం చెందిన పల్లె ఎలుకలు తమ పట్టణ ప్రయాణాన్ని విరమించుకున్నాయి. ‘మంచి మాటలు చెప్పే పెద్ద దిక్కు మాకు లేదు. అందువల్ల అనేక ఎలుకలు ప్రాణాలు పోగొట్టుకుంటున్నాయి’ అని పట్టణం ఎలుక కొద్దిసేపు బాధపడింది. తర్వాత తన ప్రాణాలను రక్షించిన ఎలుకలన్నిటికీ ధన్యవాదాలు తెలిపి తనతో పాటు తీసుకొచ్చిన తీపి మిఠాయిలను అన్నిటికీ పంచి పెట్టింది. – ఆర్.సి. కృష్ణస్వామి రాజుఇవి చదవండి: మిస్టరీ.. అసలు డోల్స్ని ఎవరు చంపారు? వెరా ఏమైంది? -
మృగరాజు ఆంతరంగికుడు..
కేసరివనానికి రాజు సింహం. మంత్రి నక్క. మృగరాజు సింహానికి మారుతి అనే కోతి ఆంతరంగికుడిగా ఉండేది. మారుతి ఎప్పుడూ మృగరాజు వెన్నంటే ఉండేది. అడవిలో విహారానికి వెళ్లినా, వేటకు పోయినా, తోటి జంతువులు చేసుకునే శుభకార్యాలకు కదిలినా మారుతి.. మృగరాజు పక్కన ఉండాల్సిందే. మారుతి లేకుండా సింహం గుహదాటి బయటకు వచ్చేది కాదు.పక్క అడవుల రాజులు ఏనుగు, పులితో పాటు, ముఖ్యమైన విషయాలు చర్చించటానికి ఇతర జంతువులూ గుహకు వచ్చి సింహాన్ని కలిసేవి. ఒక్కోసారి సింహం కూడా పక్క అడవులకు వెళ్లేది. అక్కడ అవి మాట్లాడుకునే మాటలన్నీ మారుతి వినేది. అంతేకాదు గుహలో కూడా మృగరాజు కుటుంబం మాట్లాడుకునే కబుర్లు, రహస్యాలు కూడా మారుతి చెవిన పడేవి.దాంతో మారుతికి మృగరాజు బలాలు, బలహీనతలు అన్నీ తెలవటానికి ఎక్కువ సమయం పట్టలేదు. అడవిలో బాట వెంట సింహం నడుస్తుంటే మారుతి చెట్ల మీంచి గెంతుతూ, దూకుతూ చుట్టూ పరిసరాలను జాగ్రత్తగా గమనించేది. ఏదైన ప్రమాదం పొంచి ఉందనే అనుమానం వస్తే పైనుంచే సింహాన్ని హెచ్చరించేది.ఒకరోజు ఉదయాన్నే సింహంతో రహస్య సమావేశానికి పక్క అడవి రాజు ఏనుగు.. కేసరి వనానికి బయలుదేరింది. వనానికి చేరుకోగానే ఆ ఏనుగుపై గుర్తుతెలియని కొన్ని జంతువులు ఆకస్మికంగా దాడి చేశాయి. ఆ సమాచారం అందిన వెంటనే మృగరాజు సింహం, నక్క పరుగున వెళ్లి ఏనుగు ప్రాణాలను కాపాడాయి. తన రాజ్యంలో పక్క అడవి రాజు ఏనుగుపై దాడి జరగటం మృగరాజుకు అవమానంగా తోచింది. ‘మిత్రమా! నాకోసం నువ్వు వస్తున్నట్లు ఎవరికీ తెలీదు.ఈ దాడి ఎలా జరిగిందో అర్థం కావట్లేదు. ఇది పూర్తిగా నా వైఫల్యమే.. నన్ను క్షమించు’ అని ఏనుగును వేడుకొని తన గుహకు తోడ్కొని పోయింది సింహం. ‘ప్రభూ! మీరు మారుతిని గుడ్డిగా నమ్మి అన్ని విషయాలు పంచుకుంటున్నారు. పక్క అడవి రాజు.. పులి స్వభావం మీకు తెలియంది కాదు. మాటుగా దాడిచేసి రెండు రాజ్యాలను ఆక్రమించుకోవాలని చూస్తోంది. ఈ సమాచారాన్ని అందించింది మారుతీయేమోనని నా అనుమానం’ అంది నక్క. ఆ మాట విని మౌనంగా ఉండిపోయింది సింహం.ఇంకోరోజు పక్క అడవి నుంచి కాకి వచ్చి ‘మృగరాజా! రేపు మా పులిరాజు పుట్టినరోజు. వేడుకకు రమ్మని ఆహ్వానం పంపారు!’ అంది. అది విన్న మారుతి చేతివేళ్లతో లెక్కలు వేసి అక్కడి నుంచి బయటకు వెళ్లింది. మరునాడు సింహం, నక్క, కోతి పక్క అడవి పులిరాజు పుట్టినరోజు వేడుకకు బయలుదేరాయి. మరో దిక్కు నుంచి ఏనుగు తన పరివారంతో వేడుకకు బయలు దేరింది. అవి రెండూ పులి ఉండే అడవి శివార్లలో కలుసుకున్నాయి.‘గజరాజా.. ఎక్కడికి ప్రయాణం?’ అడిగింది నక్క. ‘పులిరాజు పుట్టినరోజు వేడుకకు’ జవాబిచ్చింది ఏనుగు. ఆశ్చర్యపోయింది నక్క. నలుదిక్కులూ చూడసాగింది. ‘ఎవరికోసం మంత్రివర్యా వెతుకుతున్నారూ?’ అడిగింది మారుతి.‘ఏం లేదు! ఏం లేదు’ తడబడుతూ చెప్పింది నక్క. అంతలో బంధించిన పులిని లాక్కొచ్చింది ఎలుగుబంటి. ‘మహామంత్రీ! మీ ధైర్యసాహసాలు చాలా గొప్పవి’ అని అభినందించింది ఏనుగు.‘మిత్రులారా! నన్ను మన్నించండి. నక్క చెప్పుడు మాటలు విని మీపై దాడిచేసి రెండు రాజ్యాలను ఆక్రమించాలనుకున్నాను. కానీ మృగరాజు ఆంతరంగికుడు మారుతి ముందు మా ఎత్తులు చిత్తయినవి. గతంలో గజరాజు పై దాడి కూడా నక్క సహకారంతో నేనే చేయించాను. ఇప్పుడు ఈ పుట్టినరోజు ఎత్తు కూడా నక్క సలహానే. మీ రెండు రాజ్యాలు ఆక్రమించేలా నక్క సహకరించినందుకు ఒక రాజ్యాన్ని తనకు అప్పగించి దానికి రాజును చెయ్యమని కోరింది’ అని చెప్పింది పులి.‘మారుతి అఆనుమానంతో లెక్కలు వేసి నీ పుట్టినరోజు ఈరోజు కాదని, దీని వెనుక ఏదో కుట్ర ఉందని ముందుగానే పసిగట్టి గజరాజు సహకారం కోరింది. గజరాజు ముందుగానే మీ అడవికి ఎలుగుబంటిని పంపాడు. ఇదంతా నాపై దాడికి వేసిన ఎత్తని తేలింది!’ అంది సింహం.నక్క సిగ్గుతో తలవంచుకుంది. క్షమించమని వేడుకుంది. మంచిదానిలాæ నటించి మారుతిపై చాడీలు చెప్పిన నక్కను, కుట్రలో భాగమైన పులినీ బంధించి చెరసాలలో వేసింది సింహం. ఏనుగు, సింహం, ఎలుగుబంటి.. ఆంతరంగికుడు మారుతిని అభినందించాయి. పులి రాజ్యానికి ఎలుగుబంటిని రాజును చేశాయి మృగరాజు, గజరాజులు. – ముద్దు హేమలత -
ఒకసారి తన రాజ్యంలో..
విజయనగర రాజు విజయేంద్రవర్మ మంచి ఇంద్రజాలికుడు. ఎక్కడికి వెళ్ళినా, కళల గురించి గొప్పగా మాట్లాడేవాడు. ఒకసారి తన రాజ్యంలో కళాకారులు ఎంత గొప్పగా జీవిస్తున్నారో, గౌరవించబడుతున్నారో తెలుసుకోవాలన్న కోరిక కలిగింది. వెంటనే మారువేషంలో గుర్రం మీద దేశసంచారానికి బయలుదేరాడు.ఒక ఊరి సంతలో కమ్మటి గానం విని గుర్రాన్ని ఆపి అటు వైపు వెళ్లాడు. అక్కడ నలుగురు సంగీత వాయిద్యాలు వాయిస్తుంటే మరో ఇద్దరు గానం చేస్తున్నారు. ఆ గానం చేస్తున్న యువతీ,యువకుడు ఇద్దరూ అంధులే! మధురంగా పాడటం ఆపాక సంతలో ఉన్నవారిని దానం చేయమని కోరారు. తన రాజ్యంలో కళాకారులు అడుక్కోవటం చూసి ఆశ్చర్యపోయాడు విజయేంద్రవర్మ. ‘రాజు గొప్ప కళాకారుడు! ఎప్పుడూ కళాకారుల గురించే మాట్లాడుతాడు! మీరు ఇలా యాచించటం వింతగా ఉంది!’ అంటూ యువతిని అడిగాడు రాజు. ‘రాజు కళాకారుడైనందుకు మా బతుకులు బాగైతాయని సంతోషించాము. అతని మాటలు కోటలు దాటుతాయి కానీ పనులు మాత్రం శూన్యం’ అన్నది ఆమె. విజయేంద్రవర్మ మౌనంగా ఉండిపోయాడు. గుర్రం ఎక్కి మరో గ్రామం చేరుకున్నాడు. అక్కడొక యువతి నృత్యం చేస్తుంటే .. కొందరు గ్రామ పెద్దలు వెకిలిగా నవ్వుతూ డబ్బులిస్తున్నారు. నృత్యం ముగిశాక ‘చూడమ్మా! రాజు కళాప్రేమికుడు కదా! నువ్వేంటి ఇలా దిగజారి అడుక్కుంటున్నావు?’ అడిగాడు విజయేంద్రవర్మ.‘రాజు కళాప్రేమికుడే. కాని కళాపోషకుడు మాత్రం కాదు. క్రియా శూన్యుడు. అతను చెప్పేది నిజంగా చేస్తే మాకు ఈ బతుకు ఉండక పోయేది!’ ఆవేశంగా అంది ఆమె. ఆ జవాబు విని మౌనంగా ముందుకు కదిలాడు రాజు. మరో గ్రామంలో ఒక వయసు పైబడిన ఇంద్రజాలికుడు ఇంద్రజాలం చేస్తూ కనిపించాడు. ఇంద్రజాలికుడిని చూడగానే విజయేంద్రవర్మకు ఎక్కడలేని ఉత్సాహం కలిగింది. రాజు అతనిలో తనని చూసుకున్నాడు. ప్రేక్షకులు చప్పట్లతో అతన్ని ఉత్సాహపరుస్తున్నారు. ఇంద్రజాలికుడి ప్రదర్శన ముగిశాక నెత్తిన ఉన్న టోపి తీసి దానం చేయమని అడిగాడు. ‘తాతా ! రాజు కూడా నీ వలె గొప్ప ఇంద్రజాలికుడు కదా! నువ్వేంటి ఇలా..!’ అడిగాడు రాజు.‘నువ్వు శంఖాన్ని ఎప్పుడైనా చెవి దగ్గర పెట్టుకొని విన్నావా? వింటే సముద్రపు హోరులా శబ్దం వస్తుంది. ఆ శబ్దం నిరంతరం వస్తూనే ఉంటుంది. అలా శబ్దం చేయడం వల్ల ప్రయోజనం అటు శంఖానికి, ఇటు మనకు ఉండదు! రాజు గారి ప్రసంగాలు కూడా అంతే!’ అన్నాడు అతను.కళాకారులు తనని తోటి కళాకారుడిగా, కళల పట్ల విడువకుండా రోజంతా మాట్లాడగలిగే మంచి వక్తగా గుర్తించారే తప్ప మంచి పాలకుడిగా గుర్తించలేదని తెలుసుకున్నాడు విజయేంద్రవర్మ. ఆనాటి నుండి కళాకారులను గుర్తించి, వారికి తగిన ఉద్యోగాలు కల్పించి ఆర్థికంగా ఆదుకున్నాడు. వికలాంగ కళాకారులను గుర్తించి వారికి ప్రత్యేకంగా ఆరోగ్య సౌకర్యాలు, వసతులు కల్పించాడు.పేద కళాకారులను గుర్తించి వీలున్న చోటల్లా వారి సేవలను వినియోగించుకుని ఘనంగా సత్కరించాడు. మాటల్ని డబ్బులంత పొదుపుగా వాడుకుంటూ చేతలను నీళ్ళలా పరోపకారం కోసం ప్రవహింపచేశాడు. అలా కొద్ది రోజుల్లోనే విజయేంద్రవర్మ క్రియా శూన్యుడు కాదు.. క్రియా శూరుడిగా పేరు పొందాడు. – కొట్రా సరితఇవి చదవండి: ఆ ముగ్గురూ... ఓ ఉత్తరం! -
ఒకరోజు వర్షాకాలం ఉదయాన్నే.. నదికి వెళ్లిన ముని..
శృంగవరం అడవుల్లో ఆశ్రమ జీవితం గడిపేవాడు ముని శతానందుడు. ఉదయాన్నే లేచి దైనందిన కార్యక్రమాలు పూర్తి చేసుకుని, తపస్సు చేసుకునేవాడు. ఆ ఆశ్రమం చుట్టూ పూల మొక్కలు, పండ్ల చెట్లు, పొదలు దట్టంగా ఉండేవి. ఆ ప్రశాంత వాతావరణానికి అలవాటు పడిన జంతువులు, పక్షులు అక్కడ సేదతీరడానికి ఇష్టపడేవి.ముని కూడా వాటిపట్ల దయతో ప్రవర్తించేవాడు. అవెప్పుడైనా జబ్బు చేస్తే, గాయపడితే వనమూలికలు, ఆకు పసర్లతో వైద్యం చేసేవాడు. అలా మునికి, వాటికి మధ్య స్నేహం కుదిరింది. ముని ధ్యానంలో మునిగిపోతే తియ్యటి పండ్లు, దుంపలు, పుట్ట తేనెను తెచ్చి ముని ముందు పెట్టేవి. ఆశ్రమ ప్రాంగణంలో ఆ జంతువులు, పక్షులు జాతి వైరం మరచి కలసిమెలసి ఉండేవి.ఒక వర్షాకాలం.. ఉదయాన్నే నదికి వెళ్లిన ముని తిరిగి వస్తూండగా.. జారి గోతిలో పడిపోయాడు. ఎంతప్రయత్నించినా పైకి లేవలేకపోయాడు. బాధతో మూలుగుతూ చాలాసేపు గోతిలోనే ఉండిపోయాడు. స్నానానికి వెళ్లిన ముని ఇంకా ఆశ్రమానికి తిరిగిరాలేదని ఒక చిలుక గమనించింది. ఎగురుకుంటూ నది వైపు వెళ్లింది. గోతిలో మునిని చూసింది. ఆయన ముందు వాలింది. ఆయన చెప్పగా ప్రమాదం గురించి తెలుసుకుంది. వెంటనే ఆశ్రమానికి వెళ్లి అక్కడున్న జంతువులన్నిటికీ చెప్పింది.వెంటనే ఏనుగు, ఎలుగుబంటి, గుర్రం, మేక, కోతి పరిగెడుతూ ముని ఉన్న గోతిని చేరాయి. ‘భయపడకండి మునివర్యా.. మిమ్మల్ని బయటకు తీస్తాము’ అని మునికి భరోసానిచ్చాయి. గోతి లోపలకి వెళ్ళడానికి దారి చేసింది ఏనుగు. తన తొండంతో మునిని లేపి గుర్రం మీద కూర్చోబెట్టింది. అలా ఆ జంతువులన్నీ కలసి మునిని ఆశ్రమానికి చేర్చాయి. వనంలోని మూలికలు, ఆకులను సేకరించి మునికి వైద్యం చేశాయి. చిలుక వెళ్లి తియ్యటి పండ్లను, కుందేలు వెళ్లి దుంపలను తెచ్చి మునికి ఆహారం అందించాయి.అలా అవన్నీ.. మునికి సేవలు అందించసాగాయి. నెల గడిచేసరికి ముని పూర్తిగా కోలుకున్నాడు. అవి తనకు చేసిన సేవకు ముని కళ్లు ఆనందంతో చిప్పిల్లాయి. ‘నా బంధువులైనా మీ అంత శ్రద్ధగా నన్ను చూసేవారు కాదు. మీ మేలు మరువలేను’ అన్నాడు శతానందుడు వాటితో. ‘ ఇందులో మా గొప్పదనమేమీ లేదు మునివర్యా..! మీ తపస్సు ప్రభావం వల్లనేమో మేమంతా జాతి వైరాన్ని మరచిపోయి ఒక్కటయ్యాం. మీ ఆశ్రమ ప్రాంగంణంలో.. మీ సాంగత్యంలో హాయిగా బతుకుతున్నాం. మీరు మాకెన్నోసార్లు వైద్యం చేసి మా ప్రాణాల్ని కాపాడారు.కష్టంలో ఉన్న ప్రాణిని ఆదుకోవాలనే లక్షణాన్ని మీ నుంచే అలవర్చుకున్నాం. మీకు సేవలందించాం. మీరు త్వరగా కోలుకోవాలని కోరుకున్నాం. ఆ భగవంతుడు మా మొర ఆలకించాడు. మీరు కోలుకున్నారు. ఇప్పుడే కాదు ఎప్పుడూ మిమ్మల్ని మా కంటికి రెప్పలా కాచుకుంటాం మునివర్యా..’ అన్నది ఏనుగు. ‘అవునవును’ అంటూ మిగిలినవన్నీ గొంతుకలిపాయి. ఆప్యాయంగా వాటిని తడిమాడు శతానందుడు. – నారంశెట్టి ఉమామహేశ్వరరావు -
Children's Story: ఉత్తమ శిష్యుడు! 'మేము సర్వసంగ పరిత్యాగులం'..
కౌశంబీ ఆశ్రమంలో విద్య అభ్యసించిన తరువాత విద్యార్థులు కౌకర్ణిక ఆశ్రమానికి వెళ్లాల్సి ఉంటుంది. అక్కడే ఉత్తమ శిష్యుల ఎంపిక జరుగుతుంది. తంత్ర విద్యలు, శక్తి విద్యలు అక్కడే సుకేతు మహర్షి నుంచి నేర్చుకోవాలి. కౌశంబీ నుంచి కేవలం ఆరుగురు మాత్రమే ఈ దఫా ఎన్నికయ్యారు. వారందరినీ కౌకర్ణికకు పయనవమని చెప్పాడు మహర్షి సంకేత. ఆరుగురు విద్యార్థులను పంపుతున్నానని వాళ్ళల్లో ఉత్తమ శిష్యుడిని ఎంపిక చేయమని కబురు పెట్టాడు సంకేత.ఆరుగురు కౌకర్ణిక ఆశ్రమానికి బయలుదేరారు. సుకేతు మహర్షి దివ్యదృష్టితో చూసి తన శక్తితో ఓ ఉద్ధృతమైన వాగును, ఆ వాగు దగ్గర అపూర్వ సౌందర్యవతిని సృష్టించాడు. శిష్యులు వాగు దగ్గరకు వచ్చారు. ఆ యువతిని చూడగానే ఆరుగురు శిష్యుల్లో ఐదుగురికి మతి చలించింది. అయినా దూరం నుంచే ‘అమ్మాయీ.. దారి తప్పుకో.. మేము వాగు దాటి వెళ్ళాలి’ అన్నాడు ఒకడు. దానికి ఆ యువతి ‘చీకటి పడుతోంది.. నేనూ వెళ్ళాలి. నన్ను వాగు దాటించండి’ అని అడిగింది. ‘మేము సర్వసంగ పరిత్యాగులం.పర స్త్రీని తాకము’ అంటూ ముందుకు కదిలారు ఆ ఐదుగురు. ‘బాబ్బాబులూ.. దయచేసి నన్ను వాగు దాటించండి’ అంటూ ఆ యువతి వేడుకుంది. ‘వాగు చాలా వేగంగా ప్రవహిస్తోంది. నువ్వు ఇంకెవరి సాయమైనా అడుగు’ అని చెప్పనైతే చెప్పారు కానీ.. ఆ యువతిని క్రీగంట గమనించడం మానలేదు వాళ్లు. ఆరవ శిష్యుడు విక్రముడు మాత్రం ‘నేను వాగు దాటిస్తాను రండమ్మా..’ అంటూ ముందుకు వచ్చాడు. మిగిలిన ఐదుగురు ‘ఆ పాపం మాకొద్దు’ అంటూ వాగులోకి దిగారు. విక్రముడు ఆ యువతి చేయి పట్టుకుని వాగులోకి దిగాడు. ‘అమ్మా.. వాగు ప్రవాహం ఉద్ధృతంగా ఉంది. మీరు నా భుజాల మీదకు ఎక్కండి’ అన్నాడు.మారు మాటాడకుండా ఆ యువతి విక్రముడి భుజాల మీదకు ఎక్కింది. అది చూసిన ఐదుగురు శిష్యులు తమకు దక్కని అదృష్టం వాడికి దక్కిందని అసూయపడ్డారు. వాగు దాటిన తరువాత ఆ యువతి విక్రముడికి కృతజ్ఞతలు చెప్పి.. తన దారిన తాను వెళ్ళిపోయింది. ఆ ఐదుగురు మాత్రం కౌకర్ణిక దారెంట విక్రముడిని కుళ్లబొడవసాగారు. ‘స్త్రీని తాకావు.. భుజాల మీద కూర్చోబెట్టుకున్నావు’ అంటూ! విక్రముడు ఆ మాటలను పట్టించుకోకుండా మౌనంగా నడవసాగాడు. సుకేతు తన దివ్య దృష్టితో ఇదంతా చూడసాగాడు. ఎట్టకేలకు ఆరుగురు శిష్యులు కౌకర్ణిక ఆశ్రమానికి చేరుకున్నారు. సుకేతు మహర్షికి పాదాభివందనం చేశారు.ఆ ఆరుగురినీ చూసి మహర్షి మందహాసం చేశాడు. విక్రముడిని తన పక్కకు వచ్చి నిల్చోమన్నాడు. మహర్షి చేప్పినట్టే చేశాడు విక్రముడు. అప్పుడు మహర్షి మిగిలిన ఐదుగురిని ఉద్దేశిస్తూ ‘ఆపదలో ఉన్న స్త్రీని విక్రముడు ఓ తల్లిగా, సోదరిగా భావించి వాగు దాటించాడు. కానీ మీరు ఆ స్త్రీని మోహించారు. పైకి సర్వసంగ పరిత్యాగుల్లా నటించారు. వాగు దాటిన తక్షణమే ఆ యువతిని, ఆమెకు చేసిన సాయాన్నీ మరచిపోయాడు విక్రముడు. కానీ మీరు మనసులో ఆ స్త్రీనే మోస్తూ విక్రముడిని కుళ్లబొడుస్తూ మీ మాలిన్యాన్ని ప్రదర్శించారు. మీ నిగ్రహాన్ని పరీక్షించడానికి ఆ యువతిని నేనే సృష్టించాను. ఆ పరీక్షలో విక్రముడు నెగ్గాడు. అతనే ఉత్తమ శిష్యుడు’ అని చెప్పాడు మహర్షి. ఆ విషయాన్ని కౌశంబీకీ కబురుపెట్టాడు. – కనుమ ఎల్లారెడ్డిఇవి చదవండి: వసు మహారాజు వృత్తాంతం! ఒకనాడు తన సోదరుల్లో.. -
కోకిలా! నోట్లో వేలు పెట్టుకోవడం మంచి అలవాటు కాదమ్మా!’
కోకిల నాలుగో తరగతి చదువుతోంది. రోజూ బడికి వెడుతుంది. తరగతిలో అందరి కంటే ముందు ఉంటుంది. అయితే కోకిల అస్తమానూ నోట్లో వేలు పెట్టుకుంటుంది. గోళ్లు కోరుకుతుంది. ‘కోకిలా! నోట్లో వేలు పెట్టుకోవడం మంచి అలవాటు కాదమ్మా!’ అంటూ అమ్మ ఎన్నిసార్లు చెప్పినా ,‘అలాగేనమ్మా! అలవాటు మానుకుంటాన’ని అంటుందే కానీ, మానుకోలేక పోతోంది. రోజూలానే ఆరోజు కూడా బడికి వెళ్ళింది కోకిల. సాయంత్రం చివరి పీరియడ్‌లో సైన్స్ పాఠాలు చెప్పే సుజాతా టీచర్ వచ్చారు. సుజాతా టీచర్ చెప్పే సైన్స్ పాఠాలు కోకిలకు ఎంతో ఇష్టం.‘పిల్లలూ! ఈ రోజు ‘అలవాట్లు’ అనే అంశం మీద మాట్లాడుకుందామా? మీరంతా ఖాళీ సమయంలో ఏమేమి చేస్తారో? ఒకొక్కరుగా టేబుల్ వద్దకు వచ్చి చెప్పాలి. సరేనా!’ అంటూ పిల్లలను అడిగారు సుజాతా టీచర్. ‘అలాగే టీచర్’ అంటూ ఉత్సాహంగా తలూపారు పిల్లలు. ‘అయితే మీ మీ అలవాట్లను చెప్పండి’ పిల్లల కేసి చూస్తూ అడిగారు టీచర్.శశాంక్ లేచి హుషారుగా టేబుల్ వద్దకు వచ్చి ‘టీచర్! నేను ఖాళీ సమయంలో బొమ్మలు వేస్తాను’ అని చెప్పాడు. ‘గుడ్! మంచి అలవాటు’ మెచ్చుకున్నారు టీచర్. ‘నేనయితే ఖాళీ సమయంలో కథలు చదువు తాను’ ఆనందంగా అన్నాడు కిరణ్. ‘వేరీ గుడ్!’ అని కిరణ్‌ని ప్రశంసిస్తూ ‘మరి నువ్వేం చేస్తావ్’ అంటూ కమలను అడిగారు టీచర్. ‘ఆడుకుంటాను టీచర్’ చెప్పింది కమల. ‘ఆటలు మానసిక ఆనందాన్ని, శారీరక ఆరోగ్యాన్ని ఇస్తాయి. మంచిది’ అని చెబుతూ ‘మరి నువ్వేం చేస్తావు కోకిలా?’ అంటూ కోకిలను అడిగారు టీచర్.కోకిల ముందుకు రాలేదు. ‘నేను చెప్పలేను టీచర్.. చెప్పను’ అంటూ విచారంగా జవాబు ఇచ్చింది కోకిల. ‘ముందు నీ అలవాటు చెప్పమ్మా! చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? పర్వాలేదు’ అని టీచర్ అనేసరికి ‘గోళ్లు కోరుకుతాను. అమ్మ ఎన్నిసార్లు వద్దని చెప్పినా, ఆ అలవాటు మానుకోలేకపోతున్నాను’ చెప్పింది కోకిల. విన్న పిల్లలంతా ఘొల్లున నవ్వారు. వెంటనే టీచర్ ‘హుష్! పిల్లలూ! అలా నవ్వకూడదు. అలవాటు మంచిదైతే మెచ్చుకోవాలి. చెడ్డదైతే వద్దని చెప్పాలి. అంతే గానీ వెక్కిరించరాదు’ అంటూ మందలించారు. దాంతో పిల్లలంతా కోకిలకు సారీ చెప్పారు. ‘కోకిలా! అలవాటు చెడ్డదైతే అది మన ఎదుగుదలకు ఆటంకంగా మారుతుంది. మీకు నా చిన్నతనంలో జరిగిన ఓ కథ చెబుతాను’ అన్నారు టీచర్ పిల్లలందరి వంకా చూస్తూ! కోకిలతో సహా పిల్లలంతా ‘చెప్పండి టీచర్’ అంటూ ఉత్సాహంగా అడిగారు. ‘నా చిన్నప్పుడు నాకు ‘చిట్టి ’ అనే స్నేహితురాలు ఉండేది. తనకు ఖాళీ సమయంలో ముగ్గులు పెట్టడమంటే ఎంతో ఇష్టం. బాగా పెట్టేది. చిట్టి ముగ్గు వేస్తే చాలా బావుంటుంది అని ఇరుగుపొరుగు వాళ్లంతా చిట్టిని మెచ్చుకునే వారు. అయితే చిట్టికి ఒక చెడ్డ అలవాటు ఉంది’ అంటూ పిల్లలకేసి చూశారు టీచర్.‘ఏం అలవాటు టీచర్?’ అంటూ ఆసక్తిగా అడిగింది కోకిల. ‘ఉదయాన్నే నిద్ర లేచేది కాదు. బారెడు పొద్దెక్కే దాకా మొద్దు నిద్ర పోయేది. ‘నిద్ర లే చిట్టీ’ అని అమ్మ ఎన్నిసార్లు చెప్పినా, వినిపించుకునేది కాదు. ఒకసారి ఊర్లో సంక్రాంతికి ముగ్గుల పోటీలు పెట్టారు. పచ్చని చిలుకలు, మామిడి తోరణాలతో స్వాగతం చెబుతున్న ముగ్గును పోటీలో వేయాలనుకుంది చిట్టీ. ప్రాక్టీస్ కూడా చేసుకుంది. మరునాడు ముగ్గుల పోటీ అనగా, ఆ రాత్రి పడుకోబోతూ.. ‘అమ్మా! ఉదయాన్నే నన్ను నిద్రలేపు. పోటీకి వెళ్ళాలి’ అని చెప్పి పడుకుంది. కానీ మరునాడు.. చిట్టీని అమ్మ ఎన్నిసార్లు నిద్రలేపినా బద్ధకంతో నిద్ర లేవలేదు చిట్టీ.’‘అయ్యో.. అప్పుడేమయింది? టీచర్?’ పిల్లలంతా ఆసక్తిగా అడిగారు. ‘ఏముంది? చిట్టి అక్కడకు వెళ్లేటప్పటికి పోటీ అయిపోయింది. చిట్టీకి ఏడుపొచ్చింది. అమ్మ చెప్పినట్లు ‘బద్ధకమే బద్ధ శత్రువ’ని గ్రహించింది. చిట్టికి ఆ అనుభవం ఒక గుణపాఠం అయింది. ఇంకెప్పుడూ మొద్దు నిద్ర పోలేదు. బద్ధకం చూపించలేదు. చక్కగా చదువు కుంది. టీచర్ అయ్యింది. ఇప్పుడు మీకు పాఠం చెబుతోంది’ అని ఆపారు సుజాతా టీచర్.పిల్లంతా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. అందరికన్నా ముందుగా తేరుకున్న కోకిల వెంటనే ‘చిట్టీ అంటే మీరేనా? టీచర్?’ అని అడిగింది. ‘అవును! కోకిలా, చిన్నప్పుడు నన్ను ముద్దుగా ‘చిట్టీ’ అని పిలిచేవారు. అర్థమైంది కదా కోకిలా .. చెడు అలవాట్ల వల్ల నష్టమేంటో.. పట్టుదలతో ప్రయత్నిస్తే చెడు అలవాట్లను మానుకోవడం పెద్ద కష్టమేం కాదని!’ అన్నారు టీచర్. ‘అవును టీచర్.. తప్పకుండా ప్రయత్నిస్తాను’ చెప్పింది కోకిల. ‘వేరీ గుడ్! కోకిల మారింది’ అంటూ టీచర్ అభినందించగానే, పిల్లలంతా కూడా కోకిలను అభినందిస్తూ చప్పట్లు కొట్టారు. – కె.వి.లక్ష్మణరావు -
Funday Story: బాలిశెట్టి అహం..!
బాలిశెట్టి.. కిరాణా కొట్టు వ్యాపారి. నిత్యావసర సరుకులు బియ్యం, బెల్లం, పప్పు, ఉప్పు, చింతపండు వంటివి అమ్మేవాడు. వ్యాపారం బాగా సాగటంతో చేతికింద పనివాడిని పెట్టుకోవాలని అనుకున్నాడు. పక్క గ్రామంలో ఉండే నర్సయ్య పనికి కుదిరాడు. బాలిశెట్టికి తన కింద పనిచేసేవారంటే చులకన ఎక్కువ. తన ముందు వాళ్లు దేనికీ సరితూగరనీ, ఎందుకూ పనికిరారనే అహంతో ఉండేవాడు. నర్సయ్యది కష్టపడి పనిచేసే స్వభావం. దుకాణం తెరిచినప్పటి నుండి మూసేవరకు బాలిశెట్టి చెప్పే రకరకాల పనులన్నిటినీ కాదనకుండా చేసేవాడు. దుకాణంలో దుమ్ము దులపడం, సరుకులు పొట్లాలు, మూటలు కట్టడం చేసేవాడు. అతనికి ఏమాత్రం విరామం దొరికినా.. పప్పులు, బియ్యంలో ఉండే రాళ్లు ఏరమని పురమాయించేవాడు బాలిశెట్టి. ఎంతపని చేసినా తృప్తి ఉండేది కాదు. పని వేళలు ముగిసి నర్సయ్య ఇంటికి వెళ్లబోతుంటే ఉల్లిగడ్డల బస్తాను కరణం గారింట్లోనో, బియ్యం బస్తాను మునసబు గారింట్లోనో వేసి పొమ్మనేవాడు. ఇంటికి ఆలస్యం అవుతుంది, మరునాడు వేస్తానంటే కించపరుస్తూ, వెక్కిరిస్తూ మాట్లాడేవాడు. బాలిశెట్టి కూతురు పెళ్ళీడు కొచ్చింది. చదువుకున్న పిల్ల కావటంతో మంచి సంబంధం కుదిరింది. నర్సయ్యను దుకాణం పనులతోపాటు, పెళ్ళి పనులకూ తిప్పుకోవటం మొదలుపెట్టాడు. దాంతో ఏ అర్ధరాత్రో ఇంటికి చేరేవాడు నర్సయ్య. ఇంట్లోవాళ్ళు బాలిశెట్టి దగ్గర పని మానేయమని ఒత్తిడి చేశారు. పెళ్ళికి మూడురోజుల ముందు బాలిశెట్టి ఇంట్లో దొంగలు పడి ఉన్న నగలు, నగదు దోచుకుపోయారు. కూతురు పెళ్లి ఆగిపోతుందని బాలిశెట్టి భయపడి నర్సయ్యకు చెప్పుకుని భోరున ఏడ్చాడు. ‘అయ్యా! మీరేం కంగారు పడకండి. మీకు అభ్యంతరం లేకపోతే పెళ్లి ఖర్చులు నేను సర్దుతాను’ అన్నాడు నర్సయ్య. ఆమాటకు బాలిశెట్టి ఆశ్చర్యపోయాడు. నర్సయ్యకు తన ఊరిలో పదిహేను ఎకరాల మాగాణి, ఇరవై ఎకరాల మామిడితోట, సొంత ఇల్లు ఉంది. ఇప్పుడు కొడుకు వ్యవసాయం పనులు చూసుకుంటున్నాడు. అతనికి ఇంట్లో కూర్చోని విశ్రాంతి తీసుకోవటం ఇష్టంలేకనే బాలిశెట్టి వద్ద పనిలో చేరాడని తెలిసింది. తన కూతురు పెళ్లికి నగదు సహాయం చేశాడు నర్సయ్య. ఆనాటి నుండి ఇతరులను తక్కువ అంచనా వేయటం, చులకనగా చూడటం మానేశాడు బాలిశెట్టి. — తేజశ్రీ -
పిల్లల కథ.. 'మల్లారం గ్రామంలో మారిన మాల్యాద్రి'..
మీర్‌పేట మహారాజు మాణిక్యవర్మ. అతని ఏకైక కూతరు మూకాంబికకు పక్షులంటే మహా ప్రాణం. కొందరు ఆమె పుట్టినరోజుకు ప్రత్యేకతలు నేర్చిన పక్షులను బహుమతిగా ప్రదానం చేసేవారు. వాటిని చూసి మూకాంబిక ముచ్చట పడేది. యువరాణికి పక్షిని బహుకరించినందుకు ఊహించనంత నగదు ముట్ట చెప్పేవాడు మాణిక్య వర్మ. ఆమె దగ్గర పాటలు పాడే కోకిల, మాటలు చెప్పే చిలుక, నాట్యం చేసే నెమలి ఉన్నాయి. మల్లారం గ్రామంలో మాల్యాద్రి అనే యువకుడు ఉండేవాడు. అతను చాలా మెండివాడు. తన స్వభావం మార్చుకోమని ఎవరు చెప్పినా వినేనాడు కాదు. తనకు నచ్చింది చేసుకుపోయేవాడు. వచ్చే మాసంలో ఉన్న యువరాణి మూకాంబిక పుట్టినరోజుకు ఏదైన పక్షిని బహుకరించి నగదు పొందాలనుకున్నాడు మాల్యాద్రి. వెంటనే వల పట్టుకుని అడవి బాటపట్టాడు. వలవేసి ధాన్యం, పురుగులు చల్లి చెట్టు నీడలో చతికిల పడ్డాడు. కొద్ది సేపటికి వలలో ఒక అందమైన తెల్లని కొంగ పిల్ల చిక్కింది. కొంగను బుట్టలో వేసుకుని ఇంటికి బయలు దేరాడు. కొంగ తెల్లగా, అందంగా ఉన్నందుకు మురిసి పోయాడు. ‘అందమైన కొంగ యువరాణికి బహుకరిస్తే రాజుగారు ఊహించనంత నగదు ఇస్తాడని’ కలలు కన్నాడు. ఐతే కొంగకు ఏదో ఒక ప్రత్యేకత ఉంటేనే యువరాణి మెచ్చుతుంది. కొంగకు ఏం ప్రత్యేకత ఉందో మాల్యాద్రికి తెలీదు. దారిలో గుడిముందు ఒక సాధువు కనిపించాడు. వంగి నమస్కరించి ‘సామీ ! కొంగకు ఏమైనా ప్రత్యేకతలుంటాయా!?’ అడిగాడు మాల్యాద్రి. సాధువు బుట్టలో ఉన్న కొంగను గమనించాడు. చిన్నగా నవ్వి ‘సరిగమ పదనిస’ అనేవి సప్త స్వరాలని తెలుసు కదా! అందులో ప్రతి స్వరం పక్షి లేదా జంతువు అరుపు నుంచి తీసుకున్నవే. అందులో ‘మ’ అంటే ‘మధ్యమం’ కొంగ అరుపు నుండి తీసుకోబడిందని చెపుతారు. ఇలా కొంగకు కూడా ఓ ప్రత్యేకమైన అరుపు ఉంటుంది. కానీ చిలుకలా మాట్లాడదు. నేర్పితే నేర్చుకోదు’ అన్నాడు. ‘ఎందుకు నేర్చుకోదు సామీ! నాకాడ నాటకాలు నడవవు. నేను నేర్పిస్తాగా!’ అంటూ ముందుకు కదిలాడు. ఇంటికి చేరిన మాల్యాద్రి కొంగ పిల్లను పంజరంలో పెట్టాడు. దానికి పంజరంలో ఉండటం నచ్చలేదు. మల్యాద్రి కొంగకు జీడిపప్పు, బాధం పప్పు పెట్టాడు. కానీ దానికి స్వేచ్ఛగా ఎగిరి, కష్టపడి సొంతంగా ఆహారం సంపాదించటమే ఇష్టం. దానికి చెరువులో చేపల కోసం, తీరంలో ఎరలు, పురుగులు, కప్పలను వెతుకుతూ ఒడ్డు వెంబడి నిశ్శబ్దంగా నడవటం ఆనందం. నిశ్చలంగా నిలుచుని ఆహారం కనబడగానే చటుక్కున పట్టుకొని గుటుక్కున మింగటంలోనే తృప్తి. ఇలా కష్టం లేకుండా పంజరంలో పెట్టిన ఆహారం దానికి రుచించలేదు. కొంగతో చిన్న చిన్న పదాలు పలికించటానికి ప్రయత్నించాడు మాల్యాద్రి. అది ఏదన్నా తిరిగి ‘మా’ అని అరిచేదే తప్ప చిలుకలా తిరిగి పలికేది కాదు. చుట్టు పక్కలవాళ్లు ‘కొంగలు.. మనుషుల మాటలు విని తిరిగి పలుకలేవు. నీ ప్రయత్నం మానుకో’ అని చెప్పారు. కానీ మొండివాడైన మాల్యాద్రికి వారి మాటలు చెవికెక్కలేదు. పక్షం రోజులైనా కొంగ తిరిగి మాట్లాడలేదు. మాల్యాద్రికి కొంగపై విసుగొచ్చింది. అప్పుడే అటుగా పోతున్న సాధువు మాల్యాద్రిని చూసి ఆగాడు. ‘చెప్పాను కదా నాయనా ! కొంగ వినటమే తప్ప చిలుకలా మాట్లాడదని! చిలుకలకు వాటి శ్వాసనాళంలో ప్రత్యేక అవయవం ఉంటుంది. ఆ అవయవం చిలుకకు మానవ భాష మాట్లాడటానికి సహాయపడుతుంది. ఇప్పటికైనా నీ ప్రయత్నం మానుకుని కొంగను పంజరం నుంచి విడుదలచెయ్యి’ అన్నాడు సాధువు. మాల్యాద్రి మొండితనం వీడి ఆలోచించాడు. చిలుక, కొంగలు పక్షులైనా స్వభావాలు వేరని గ్రహించాడు. మాల్యాద్రి తన స్వభావం మార్చుకున్నాడు. మారిన మాల్యాద్రి పంజరం నుంచి కొంగను విడుదల చేశాడు. — ముద్దు హేమలత ఇవి చదవండి: ఎవరూ.. బయటకు రావడానికి సాహసించని నిశిరాత్రి అది.. -
ఫన్డే: పిల్లల కథ - 'ఛూ.. మంతర్'
ఒక అడవిలో ఒక పులి ఉండేది. దానికి జాలి, కరుణ, దయ అనేవి లేవు. చిన్న చిన్న శాకాహార జంతువులను సైతం చంపి తినేది. పులికి బద్ధకం కూడా ఎక్కువే. ఆహారం కోసం పెద్ద పెద్ద జంతువులను వేటాడి చంపి తినటం దానికి అంతగా ఇష్టంలేదు. సులువుగా దొరికే కుందేళ్లను చంపి తినేది. దాంతో.. ఆ అడవిలో కుందేళ్ల సంఖ్య తగ్గిపోసాగింది. ఆ అడవిలో కుందేళ్లన్నీ వాటి నాయకుడిని కలిసి పులి బారి నుంచి కాపాడమన్నాయి. కుందేళ్ల నాయకుడు దీర్ఘంగా ఆలోచిస్తూ ‘మనం నీడని చూసి భయపడకూడదు. దగ్గరలో వెలుగుంటేనే నీడలుంటాయి. పులి ఇలా రెచ్చిపోయి మన సంతతిని నాశనం చేస్తుందంటే దానికి పోయేకాలం దగ్గర పడిందని నాకనిపిస్తోంది’ అంటూ ధైర్యం చెప్పాడు. మరుసటి రోజు ఆ అడవి మార్గం గుండా ఒక ఇంద్రజాలికుడు గుర్రపు బండిలో ప్రయాణించసాగాడు. గుర్రాన్ని చూసి పులి దూరం నుంచి∙పెద్దగా గాండ్రించింది. దాంతో.. ఆ గుర్రం అడ్డదిడ్డంగా అడవిలో పరుగు లంకించుకుంది. బండి నుంచి గుర్రం విడిపోయింది. ఇంద్రజాలికుడు ప్రాణ భయంతో ఎటో పరుగుతీశాడు. అతడు ప్రదర్శనకు ఉపయోగించే సామాగ్రిలోంచి ఒక కుందేలు పిల్ల బయటకు వచ్చింది. అది భయంతో తుర్రున పొదల్లోకి దూరింది. పొదల్లో భయంతో వణుకుతున్న కుందేలును కుందేళ్ల నాయకుడు చేరదీశాడు. ‘నాయకా! నేను ఎంతో కాలంగా ఇంద్రజాలికుడి వద్ద ఉండటంతో నాకు ఇంద్రజాల విద్యంతా తెలుసు. అతడు తన శిష్యులకు ఇంద్రజాల విద్య నేర్పించేటప్పుడు నేను చూసి కొంత నేర్చుకున్నాను. నన్ను మీ జట్టులో చేర్చుకోండి. నా మంత్ర విద్యతో మిమ్మల్ని వినోదపరుస్తాను’ అంది కుందేలు పిల్ల. ‘అయ్యో! వినోదం సంగతి దేముడెరుగు! అసలు క్షణక్షణం భయంతో కాలం గడుపుతున్నాము. పులి సంగతి నీకు తెలీదు. అది చిన్ని చిన్ని పసికూనలను సైతం మింగేసి ఆకలి తీర్చుకుంటోంది. దాంతో మనజాతి అంతరించిపోయే ప్రమాదం ఉంది. నువ్వు ఈ అడవిలో ఉండటం ప్రమాదం!’ అన్నాడు కుందేళ్ల నాయకుడు. కానీ కుందేలు పిల్ల అక్కడి నుంచి కదలలేదు. తన జాతి సంతతిని అంతం చేస్తున్న పులిపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంది. ఆ పులిని తను అంతం చేస్తానని నాయకుడికి చెప్పింది. మరుసటిరోజు ఉదయం కుందేలు పిల్ల తనకు తెలిసిన ఇంద్రజాల విద్యలను తన మిత్రుల ముందు ప్రదర్శిస్తూ వాటిని వినోదపరిచింది. ఇంతలో వాటికి దూరంగా పులి గాడ్రింపు వినిపించింది. ‘బాబోయ్! పులి వస్తుంది! పారిపోయి దాక్కోండి!’ పెద్దగా అరిచింది ఒక కుందేలు. వెంటనే మిగిలిన కుందేళ్లన్నీ పొదల్లో దాక్కున్నాయి. కానీ ఈ కుందేలు పిల్ల మాత్రం ధైర్యంగా అక్కడే నిలుచుంది. ‘మిత్రమా! ఆ పులి సంగతి నీకు తెలీదు. పారిపో!’ అంటూ అరిచాయి. కుందేళ్లన్నీ. అయినా అది కదలలేదు. ‘ఓసేయ్.. నీకెంత ధైర్యమే! నేను వస్తున్నా పారిపోలేదు. ఇదిగో నిన్ను ఇప్పుడే లటుక్కున చప్పరిస్తా!’ అంటూ చెయ్యి ముందుకు చాపింది పులి. ‘ఆగక్కడ! నీకు ప్రాణాల మీద ఆశ ఉంటే ఈ అడవిని వదలి పారిపో!’ అని అరిచింది కుందేలు పిల్ల. ఆ మాటకు పులి బిత్తరపోయింది. కుందేలు తన మంత్రదండం తీసుకుంది. కుందేలు ఏం చేస్తుందో పులికి అర్థం కాలేదు. పులి తిరిగి పెద్దగా గాండ్రించింది. ‘ఛూ.. మంతర్’ అంటూ మంత్ర దండాన్ని పులి ముఖం చుట్టూ తిప్పింది. ‘నువ్వు నన్నేమీ చేయలేవు. నీకు శక్తి లేదు. నువ్వు గాఢంగా నిద్ర పోతున్నావ్.. నిద్ర పోతున్నావ్.. పోతున్నావ్!’ అంది కుందేలు పిల్ల. కండ్లు తిరిగి పులి కింద పడిపోయింది. వెంటనే కుందేళ్లన్నీ పులిని మర్రి ఊడలతో బంధించి చెట్టుకు కట్టేశాయి. కొంతసేపటికి పులి తేరుకుంది. కండ్లు తెరిచి చూసి భయపడింది. ఏం జరిగిందో దానికి అర్థంకాలేదు. దాని కాళ్ళు, చేతులు మర్రి ఊడలతో కట్టేసి ఉండటంతో అది ఆహారం తెచ్చుకోలేకపోయింది. తిండి తిప్పలు లేక నీరసించి పోయింది. అటుగా వెళుతున్న నక్క, తోడేలు నీరసించి ఉన్న పులిని చూసి లొట్టలేశాయి, నాలుక చప్పరించాయి. ఇక ఆ అడవిలో పులిబాధ తప్పింది. కుందేలు పిల్లను జంతువులన్నీ అభినందించాయి. –పైడిమర్రి రామకృష్ణ ఇవి చదవండి: ఈ వారం కథ: 'లెఫి బొ' -
పరాయి సొమ్ము పాముతో సమానం.. వజ్రం కథ
రామయ్య అడవిలో ఎండిన చెట్ల కొమ్మలు గొడ్డలితో కొట్టి, వాటిని మోపుగా కట్టి, సాయంత్రం సంతలో అమ్మి.. ఆ వచ్చిన సొమ్ముతో కుటుంబ పోషణ చేస్తాడు. రామయ్యతో పాటు కొమ్మలు నరికే వారు తొమ్మిది మంది ఉన్నారు. ఒకసారి బాగా పొద్దు పోయాక రామయ్య వద్ద కట్టెల మోపును, రైతు చంద్రయ్య కొన్నాడు. వాటితో అతని భార్య వంట చేసింది. వంట పూర్తి అయ్యాక పొయ్యిలోని బూడిదను ఎత్తి పోస్తుంటే ఒక వజ్రం ధగధగా మెరిసింది. భర్తతో విషయం చెప్పి ‘అబ్బ ఇన్నాళ్లకు మన కష్టాలు తీరాయి’ అంది. ‘తప్పు.. మన మహారాజు ప్రజలను కన్న బిడ్డలుగా చూస్తున్నాడు. ఈ వజ్రం బహుశా కట్టెల మోపులో వచ్చి ఉంటుంది. పరాయి సొమ్ము పాముతో సమానం. ఇది మనకు వద్దు’ అని భార్యకు నచ్చజెప్పి ఆ వజ్రాన్ని తీసుకుని కోటకు వెళ్లి జరిగింది చెప్పి రాజుకు ఇచ్చాడు. ‘నీవు ఎవరి వద్ద కట్టెల మోపును కొన్నావో గుర్తు తెచ్చుకో!’ అని అడిగాడు రాజు. ‘ఆ రోజు బాగా పొద్దుపోయాక కొన్నాను.. ఎవరి వద్ద కొన్నానో తెలియదు మహారాజా!’ అన్నాడు చంద్రయ్య. ‘ఈ వజ్రం ఎవరిది? కట్టెల మోపులోకి ఎలా వచ్చింది?’ అని మంత్రితోనూ, న్యాయాధికారితోనూ చర్చించాడు రాజు. ‘మాంసం ముక్క అనుకుని ఏదైనా పక్షి ఈ వజ్రాన్ని ముక్కుతో కరుచుకుని.. కొమ్మ మీద ఉన్నప్పుడు అది జారి చెట్టు కొమ్మ సందులో ఇరుక్కుని ఉంటుంది. కొమ్మలు నరికినప్పుడు అది ఏ కొమ్మలోనైనా ఉండిపోయి ఉంటుంది. దానిని కట్టెలు కొట్టే అతను గమనించి ఉండడు. సంతలో ఎవరెవరు కట్టెల మోపును అమ్ముతారో వారందరినీ పిలిపించండి’ అని సలహా ఇచ్చాడు న్యాయాధికారి. రాజు అలాగే ఉత్తరువులు ఇచ్చాడు. తొమ్మిది మంది సభకు వచ్చారు. ‘కట్టెల మోపులను మేమే అమ్మాము. ఆ వజ్రం మాకే చెందుతుంది. మేము దానిని అమ్మి ఆ సొమ్మును సమానంగా పంచుకుంటాం’ అన్నారు ఆ తొమ్మండుగురు. గ్రామాధికారిని పిలిపించి ‘వీరేనా.. కట్టెలు కొట్టి అమ్మేవారు ఇంకా ఎవరైనా ఉన్నారా?’ అని అడిగాడు రాజు. ‘వీరితో పాటు రామయ్య అనే అతను కూడా ఉన్నాడు మహారాజా!’ చెప్పాడు గ్రామాధికారి. రామయ్యను కూడా పిలిపించాడు రాజు. ‘ఏం రామయ్యా! ఉత్తరువులు ఇచ్చినా నువ్వు సభకు ఎందుకు రాలేదు?’ అని కోపగించుకున్నాడు రాజు. ‘మహారాజా! కష్టపడి కొట్టిన కట్టెలను సంతలో అమ్ముతాను. దానికి గిట్టుబాటు ధర వస్తుంది. నాకు ఎలాంటి నష్టమూ జరగలేదు’ అన్నాడు రామయ్య. రామయ్య మాటలు విన్నాక ‘సందేహం లేదు మహారాజా! నేను ఆ రోజు ఇతని వద్దనే కట్టెల మోపును కొన్నాను. అతని మాటల వల్ల అతని కంఠాన్ని గుర్తు పట్టాను’ అని చెప్పాడు చంద్రయ్య. ‘నిజాయతీపరుడు ఎప్పుడూ ధైర్యంగానే మాట్లాడతాడు మహారాజా!’ అన్నాడు మంత్రి. ‘ఆ తొమ్మిది మందినీ చెరసాలలో పెట్టండి’ అని ఆజ్ఞాపించాడు రాజు. ‘ఆ వజ్రం రామయ్యకు చెందుతుంది అతనికే ఇవ్వండి’ అని ఉత్తర్వులూ జారీ చేశాడు రాజు. ‘మహారాజా! నాది కాని దానిని నేను ఎలా తీసుకోను?’ అన్నాడు రామయ్య. ‘మరి ఎలాగా?’ అన్నాడు రాజు. ‘దీనిని మన రాజ్యం కోసం మీ వద్దనే ఉంచండి అదే ధర్మం’ అన్నాడు రామయ్య. ‘చంద్రం, రామయ్య లాంటి నిజాయతీ పరులు మా రాజ్యంలో ఉన్నందుకు నేనెంతో గర్వపడుతున్నాను’ అని వారిద్దరికీ చిరు సత్కారం చేసి ‘నీ కోరిక ఏంటో చెప్పు రామయ్య’ అన్నాడు రాజు. ‘మహారాజా! నా మిత్రులైన ఆ తోమ్మండుగురిని చెర నుండి విడుదల చేయండి’ అన్నాడు రామయ్య. ‘విడుదల చేస్తాను. నీవు ఏదైనా కోరుకో’ అన్నాడు రాజు. ‘ప్రస్తుతం ఎండిన చెట్ల కొమ్మలను నరుకుతున్నాం. వాటి స్థానంలో కొత్తగా మొక్కలను నాటితే రాబోయే రోజులలో అవి మహావృక్షాలు అవుతాయి మహారాజా!’ అన్నాడు రామయ్య. రాజు మొక్కలను నాటాడానికి అనుమతి ఇచ్చాడు. చంద్రం, రామయ్యలను ప్రతి ఒక్కరూ మెచ్చుకున్నారు. -
మౌగ్లీ ఎక్కడి అమ్మాయి?
మన ఊళ్లోనే పెరుగుతూ... తప్పిపోయి అడవుల్లో తిరుగాడుతున్నట్లు అనిపించే అమ్మాయి మౌగ్లీ. నిజానికి ఈ పాత్ర రూపొందింది అమెరికాలో. రడ్యార్డ్ కిప్లింగ్ పిల్లల కథలు రాసేవారు. ఆయన ‘జంగిల్‌బుక్’ పేరుతో సంకలనాలు విడుదల చేశారు. ఆ జంగిల్‌బుక్ కథల కోసం సృష్టించిన పాత్ర మౌగ్లి. ఈ పాత్ర ఆధారంగా టెలివిజన్‌లో అనేక కామిక్ స్టోరీలు వస్తున్నాయి. అడవిలో జంతువులతో కలిసి మౌగ్లీ చేసే సాహసాలు చూసి తీరాల్సిందే. వీటిని తెలుగులోకి అనువదించి కూడా ప్రసారం చేశారు.