మహారాజు సింహాసనం అధిష్టించి పది సంవత్సరాలు పూర్తి అయింది. దాంతో తన పరిపాలన ఎలా ఉందో తెలుసుకోవాలనుకున్నాడు. అంగరంగ వైభవంగా సమావేశం ఏర్పాటు చేశాడు. సామంతులు, సైన్యాధికారులు, వ్యాపారస్తులు, కళాకారులు, పుర ప్రముఖులు అందరినీ ఆహ్వానించాడు. మహారాజు వచ్చిన వాళ్లందరినీ చిరునవ్వుతో చూస్తూ ‘నా పాలనలో రాజ్యమంతా సుభిక్షంగా ఎలా ఉందో తెలుసుకోవడానికి ఈ సభ ఏర్పాటు చేశాను. బాగుంటే బాగుందనండి. లేదంటే లేదనండి. సరిదిద్దుకోలసిన అంశాలుంటే తెలియచేయండి.
రాజ్యం మరింత సుసంపన్నం కావడానికి సలహాలు ఇవ్వండి’ అన్నాడు. ‘మహారాజా.. మీరు మాకు దేవుడిచ్చిన వరం. ఎన్ని జన్మలైనా మీరే మాకు రాజుగా ఉండాలి’ అంటూ నోరువిప్పారు సామంతులు. ‘మీ పాలనలో ఎటువంటి తిరుగుబాట్లు లేవు. రాజ్యమంతా ప్రశాంతంగా సుఖసంతోషాలతో నిండుంది’ అన్నారు సైన్యాధికారులు.
‘వ్యాపారాలు పుష్కలంగా జరుగుతున్నాయి. గల్లాపెట్టెలు గలగలలాడుతున్నాయి. రాజ్యంలో దొరకని వస్తువంటూ లేదు. ఎగుమతులూ పుంజుకుంటున్నాయి’ అన్నారు వ్యాపారస్తులు. ‘ఎక్కడ చూసినా సభలు, సమావేశాలు, నాటక ప్రదర్శనలు, కవితా పఠనాలు, కొత్త గ్రంథాల ఆవిష్కరణలు, పురస్కారాలు, సన్మానాలతో సందడిగా ఉంది ప్రభూ’ పొగిడారు కళాకారులు.
ఒక్కొక్క మాటకు రాజు మొహంలో కోటి నక్షత్రాల కాంతులు వెదజల్లసాగాయి. వచ్చిన వారందరికీ రకరకాల ఆహార పదార్థాలతో విందు భోజనం ఏర్పాటు చేసి కానుకలతో సత్కరించి పంపించాడు. ఆ రాత్రి అంతఃపురంలో మహారాణితో మహారాజు ‘చూశావా రాణీ.. నా పరిపాలన ఎలా కళకళలాడిపోతున్నదో! ఆకలి కేకలు లేవు, తిరుగుబాట్లు లేవంటూ నింగిని తాకేలా కీర్తిస్తున్నారంతా’ అన్నాడు సంబరంగా. రాణి చిరునవ్వుతో ‘అలాకాక ఇంకెలా చెబుతారులే మహారాజా మీ వద్ద!’ అంది.
ఆ మాటల్లో ఏదో వ్యంగ్యం కనబడింది రాజుకు. ‘అంటే.. ఆ పొగడ్తలన్నీ కేవలం భయం వల్ల వచ్చినవే అంటావా?’ ప్రశ్నించాడు. ‘భయం వల్లనే కాకపోవచ్చు. మీతో వారికున్న అవసరాల వల్ల కూడా కావచ్చు. మీ ముందు నిలబడి మీకు వ్యతిరేకంగా మీ కింద పనిచేసే అధికారులెవరైనా నోరు విప్పగలరా? మనసులో మాట చెప్పగలరా? మీరేం చేసినా ఆహా.. ఓహో.. అని ఆకాశానికి ఎత్తేస్తారు తప్ప విమర్శిస్తారా?’ అంది.
‘అయితే వాళ్ళందరూ నన్నలా ఊరికే పొగుడుతున్నారని నిరూపించగలవా?’ అన్నాడు రాజు. ‘తప్పకుండా మహారాజా.. మీకు అసలు రాని కళేదైనా ఉంటే చెప్పండి’ అంది. మహారాజు కాసేపు ఆలోచించి ‘నీకు తెలుసు కదా.. లలితకళల్లో ఎంతోకొంత ప్రావీణ్యం ఉన్న నాకు అసలు రానిది, ఎప్పుడూ ముట్టుకోనిది చిత్రలేఖనం ఒక్కటే అని’ అన్నాడు.
‘అయితే ఒక పనిచేయండి మహారాజా.. ఒక్కరోజులో చిత్రలేఖనం గురించి తెలుసుకొని మీకు ఎలా తోస్తే అలా రకరకాలుగా చిత్రాలు వేయండి. అవన్నీ ప్రదర్శనకు పెడదాం. ఇప్పుడు పిలిచిన వాళ్లందరినీ అప్పుడూ ఆహ్వానిద్దాం. తెలుస్తుంది ఎవరేమంటారో!’ అంది. మహారాజు సరేనని ఒక ప్రముఖ చిత్రకారున్ని పిలిపించి ఒక రోజంతా చిత్రకళ గురించి తెలుసుకున్నాడు. తర్వాత రోజు నుంచి బొమ్మలు గీయడం మొదలుపెట్టాడు. కుడిచేత్తో కొన్ని, ఎడంచేత్తో కొన్ని, నోటితో పట్టుకొని కొన్ని, వెనక్కి తిరిగి కొన్ని, ఆఖరికి పడుకొని, కూర్చుని, నుంచుని రకరకాలుగా వారం రోజుల్లో వంద చిత్రాలు పూర్తి చేశాడు.
వాటన్నింటినీ ప్రదర్శనకు పెట్టాడు. అందులో కొన్ని చిత్రాలను తిరగేసి కూడా పెట్టాడు. అప్పుడు పిలిచిన వాళ్లందరనీ ప్రదర్శనకు ఆహ్వానించాడు. ఏ చిత్రం చూసినా రంగులు ఒకదానితో ఒకటి కలసిపోయి కనిపించాయి. దేనిలో ఏముందో, అందులో భావముందో ఎంత ఆలోచించినా ఎవరికీ అంతుచిక్క లేదు. అర్థంకానిదంతా అద్భుతమే అని తీర్మానించుకున్నారంతా! అవతల ఉన్నది మహారాజు. తప్పు పట్టినా, బాగా లేదన్నా కొరడా దెబ్బలు తప్పవు. దాంతో ఎందుకైనా మంచిదని ‘ఆహా’ అన్నారు కొందరు. వెంటనే ‘ఓహో’ అన్నారు మరికొందరు. ‘అద్భుతం. మీకు మీరే సాటి’ అంటూ అందుకొన్నారు ఇంకొందరు.
ఇలా పొడిపొడి మాటలైతే లాభం లేదనుకొని ఇంకొకరు ముందడుగు వేసి ‘మహారాజా.. ఇంత వేగంగా ఇన్ని చిత్రాలు గీయడం మామూలు మానవులకు సాధ్యం కాదు. మీలాంటి కారణజన్ములు ఏడేడు పద్నాలుగు లోకాల్లో ఎక్కడా ఉండరు. మీకు చిత్రరత్న పురస్కారం కచ్చితంగా ఇచ్చి తీరవలసిందే’ అన్నారు. అది విన్న మరికొందరు తాము ఎక్కడ వెనుకబడి పోతామేమోనని ‘మహారాజా.. ఈ చిత్రాలు మీరు గనుక మాకు ఇస్తే మా భవనాలలో అలంకరించుకుంటాం. వీటివల్ల మా ఇంటి అందం రెట్టింపవుతుంది’ అన్నారు.
ఒకరిని చూసి మరొకరు పొగడ్తలలో పోటీపడ్డారు. వాళ్ళలా పొగడ్తల వర్షం కురిపిస్తుంటే మహారాజు తన పక్కనే ఉన్న మహారాణికి మొహం చూపించలేక సిగ్గుతో చితికిపోయాడు. ప్రదర్శన పూర్తయి అందరూ వెళ్ళిపోయాక ‘అర్థమైంది కదా రాజా ప్రముఖుల సంగతి. మీ పాలన గురించి నిజానిజాలు తెలియాలంటే ధనవంతులను కాదు కలవాల్సింది పేద ప్రజలను. అధికార దర్పంతో రాజుగా కాదు వాళ్లలో ఒకరిగా మారిపోవాలి. అప్పుడే మీ లోటుపాట్లు తెలుస్తాయి. సరిదిద్దుకోవలసినవి అర్థమవుతాయి’ అంది. మహారాణి వైపు ప్రశంసాపూర్వకంగా చూశాడు మహారాజు. మరుసటి మహారాజు పల్లెమనిషిగా మారు వేషంలో కాలినడకన సంచారానికి బయలుదేరాడు. నిజాల వేటకై! – డా.ఎం.హరి కిషన్
Comments
Please login to add a commentAdd a comment