చంద్రగిరి రాజ్యాన్ని విజయసింహుడు పాలించేవాడు. కొంతకాలంగా మంత్రికి ఆరోగ్యం బాలేకపోవడంతో కొత్త మంత్రిని ఎన్నిక చేయాలనుకున్నాడు. అందుకు ఓ ప్రకటన చేయించాడు రాజు. అన్ని ప్రాంతాల నుంచి సుమారు పాతిక మంది దాకా మంత్రి పదవి పోటీకి వచ్చారు. వారికి నిర్వహించిన పోటీలలో గెలిచి చివరకు ధర్మయ్య, శివయ్య, సీతయ్య అను ముగ్గురు మిగిలారు. ‘వారిలో ఎవరు మంత్రి పదవికి సరిపోతారు?’ అని న్యాయనిర్ణేతను అడిగాడు రాజు. ‘ఆ ముగ్గురు మాసానికి ఎంత జీతం కావాలనుకుంటున్నారో దాన్ని బట్టి నిర్ణయిద్దాం మహారాజా’ అని చెప్పాడు న్యాయనిర్ణేత.
మొదటగా ధర్మయ్యను అడిగాడు రాజు ‘నీకు మాసానికి ఎంత జీతం కావాలి?’అని. ‘మహారాజా! నాకు మాసానికి పది వరహాలు కావాలి’ చెప్పాడు ధర్మయ్య. అలాగే మిగిలిన ఇద్దరినీ అడగగా శివయ్యేమో ఎనిమిది వరహాలు కావాలని, సీతయ్యేమో ఆరు వరహాలు చాలని చెప్పారు.
ముగ్గురి జవాబులు విన్న తరువాత ‘ధర్మయ్యా.. నీకు కాస్త ఆశ ఎక్కువగా ఉన్నట్టుంది. మాసానికి పది వరహాలు అడిగావు. అవతల ఇద్దరేమో రెండేసి వరహాలు తగ్గించి చెప్పారు’ అన్నాడు రాజు. ‘మహారాజా! నాకు ఈ మధ్యనే వివాహం అయ్యింది. నా తల్లిదండ్రులు నా మీదే ఆధారపడి ఉన్నారు. వారిని చూసుకోవలసిన బాధ్యత కూడా నాదే. కుటుంబ పోషణ, ఇంటి అద్దె ఇవన్నీ పోనూ ఒక వరహా అటూ ఇటూగా మిగులుతుంది. అప్పు లేకుండా జీవితం సాఫీగా జరిగిపోతుంది. నేను కోరింది న్యాయమైన జీతం’ బదులిచ్చాడు ధర్మయ్య.
‘నువ్వు రెండు వరహాలు తగ్గించి ఎనిమిది వరహాలని ఎలా చెప్పావు?’ అని శివయ్యను అడిగాడు రాజు. ‘మహారాజా! నాకూ వివాహం అయ్యింది, తల్లిదండ్రులూ ఉన్నారు. ఖర్చుదేముంది ఎంతైనా పెట్టవచ్చు. ఉన్న దాంట్లోనే సర్దుకుంటాను. అందుకే ఎనిమిది వరహాలే చెప్పాను’ చెప్పాడు శివయ్య. ‘నువ్వు కూడా మరో రెండు వరహాలు తగ్గించి ఆరు వరహాలే చెప్పావు. వివరణ ఇవ్వు’ అని సీతయ్యనూ అడిగాడు రాజు. ‘మహారాజా! నాకూ భార్య, ఇద్దరు పిల్లలు, తల్లిదండ్రులు ఉన్నారు. ఉద్యోగం దొరకడం కష్టంగా ఉంది. ఎలాగోలా సర్దుకుంటాను. అందుకే ఆరు వరహాలు చాలు అన్నాను’ చెప్పాడు సీతయ్య.
‘నువ్వేవిధంగా సేవలు అందిస్తావు?’ అడిగాడు ధర్మయ్యను న్యాయనిర్ణేత. ‘న్యాయపరంగా రాజుగారికి సలహాలు ఇవ్వడం, అవినీతి, లంచగొండితనానికి చోటు లేకుండా, ధర్మమార్గంలో నడుస్తూ అంకిత భావంతో దేశానికి సేవలు అందిస్తాను’ అన్నాడు ధర్మయ్య. శివయ్య, సీతయ్యలనూ అదే ప్రశ్న అడిగాడు న్యాయనిర్ణేత. తామూ మంచి దారిలోనే సేవలు అందిస్తామని చెప్పారు వారు.
‘మహారాజా! ధర్మయ్య కోరింది న్యాయమైన జీతం. తక్కువ జీతం కోరిన శివయ్య, సీతయ్యలు కొలువు వస్తే చాలు అనే పద్ధతిలో రెండు వరహాలు తగ్గించి చెప్పారు. మంత్రి పదవి వచ్చాక కోటలో, బయట ఆ పదవికి భయపడే వారు ఎక్కువ. పక్కదారి పట్టి లంచాలు తీసుకుంటారు. కనుక ధర్మయ్యకే మంత్రి పదవి ఇవ్వండి’ అన్నాడు న్యాయనిర్ణేత.
‘ధర్మయ్యా! మంత్రి పదవి నీకే ఇస్తున్నాను. చక్కగా కొలువు చేసుకో!’ చెప్పాడు రాజు. ‘మహారాజా! చాలా సంతోషం.. నా మీద ఎలాంటి ఆరోపణలు వచ్చినా ఆ క్షణమే నా ఉద్యోగం నుంచి తొలగిపోతాను’ అన్నాడు ధర్మయ్య. చెప్పినట్టుగానే నిజాయితీగా ఉద్యోగం చేసుకుంటూ తన పేరును సార్థకం చేసుకున్నాడు ధర్మయ్య.
ఇవి చదవండి: ఇంద్రుడితో గృత్సమదుడి మైత్రి..
Comments
Please login to add a commentAdd a comment