వీరయ్య ఒక పేదరైతు. తనకున్న రెండెకరాల పొలంలో రెక్కలు ముక్కలయ్యేలా కష్టపడుతూ కుటుంబాన్ని లాక్కొస్తున్నాడు. అతనికి ఒక్కగానొక్క కొడుకు ప్రవీణ్. కొడుకును బాగా చదివించి, వాడిని ఉన్నతస్థాయిలో చూడాలని వీరయ్య ఆశ. తనలా తన కొడుకు కష్టాలు పడకూడదు అనుకునేవాడు. చదువుకు తన పేదరికం అడ్డుకాకూడదని తల తాకట్టుపెట్టయినా కొడుకును చదివించాలని దృఢనిశ్చయానికి వచ్చాడు వీరయ్య. కొడుకును పట్నంలో మంచి బడిలో చేర్పించాడు. మొదటి సంవత్సరం బాగానే చదువుకుని మంచి మార్కులు సంపాదించాడు ప్రవీణ్. స్నేహితులు కూడా పెరిగారు.
వాళ్లంతా చెప్పుల నుంచి బట్టల వరకు ఖరీదైన బ్రాండెడ్ వస్తువులనే వాడేవారు. వారిని చూసి ప్రవీణ్ కూడా తనకూ అలాంటి బ్రాండెడ్ వస్తువులు కావాలని తండ్రిని వేధించసాగాడు. దానికి వీరయ్య ‘చూడు నాయనా.. వారు ధనవంతుల బిడ్డలు. ఎలాగైనా ఖర్చుపెట్టగలరు. నీ చదువుకే నా తలకు మించి ఖర్చుపెడుతున్నాను. మనకు అటువంటి కోరికలు మంచివికావు. మన స్థాయిని బట్టి మనం నడుచుకోవాలి’ అని నచ్చజెప్పాడు. అయినా కొడుకు చెవికెక్కించుకోలేదు. పైపెచ్చు స్నేహితుల తల్లిదండ్రులు.. వాళ్లకేది కావాలంటే అది కొనిస్తున్నారు, పుట్టినరోజులు బ్రహ్మాండంగా జరిపిస్తున్నారు. తనకు మాత్రం తన తండ్రి ఏ సరదా తీర్చడం లేదని అలిగాడు ప్రవీణ్. ఫలితంగా చదువు మీద దృష్టిపెట్టక వెనుకబడిపోయాడు.
ఒకసారి.. దసరా సెలవులకు ప్రవీణ్ వాళ్ల అక్క పిల్లలిద్దరూ ఇంటికి వచ్చారు. ఒకరోజు ఆ పిల్లలు మట్టితో బొమ్మరిల్లు కట్టి ఆడుకోసాగారు. ఆ ఇల్లు మీద సూట్‌కేసులు పెద్దపెద్ద బరువైన వస్తువులు పెడదామని చూసింది చిన్నమ్మాయి. పెద్దమ్మాయేమో ‘వద్దు.. మనం అలాచేస్తే బొమ్మరిల్లు కూలిపోతుంది’ అని వారించింది. అయినా చిన్నమ్మాయి వినకుండా ‘ఏమీ కాదు.. తాతగారింటి డాబా మీద పెద్దపెద్ద వస్తువులు పెట్టడం లేదా.. అలాగే ఈ ఇంట్లోనూ పెట్టుకోవచ్చు’ అంటూ మొండికేసింది.
ఇదంతా గమనించిన ప్రవీణ్ ‘మీరు కట్టుకుంది బొమ్మరిలు.్ల ఇది ఆడుకోవడానికే కానీ వాడుకోవడానికి కాదు. అందుకే ఇది పెద్ద వస్తువులను మోయలేదు. తాతగారిల్లు రాళ్లు, ఇటుకలు, ఇనుముతో గట్టిగా కట్టినిల్లు. ఆ ఇల్లు మోసే బరువులను ఈ బొమ్మరిల్లు మోయలేదు. కావాలంటే నీకు బొమ్మ సూట్‌కేసులు, బ్యాగులు చేసిస్తాను చూడు..’ అని చెప్పాడు. చెప్పినట్టుగానే వెంటనే మట్టితో ఆ బొమ్మలను చేసిచ్చాడు కూడా! వాటిని చూసి చిన్నపిల్ల భలే ముచ్చటపడింది.
ఈ తతంగమంతా చూసిన వీరయ్య.. కొడుకుని మెచ్చుకున్నాడు. తర్వాత కొడుకుతో ‘మన పేద బతుకులు కూడా బొమ్మరిల్లు లాంటివే. ఏమాత్రం బరువెక్కువైనా కూలిపోతాయి. మన స్థాయికి తగ్గట్టు నడుచుకోకపోతే చితికిపోతాం. ఆ చిన్నపిల్ల తెలియక మారాం చేసింది. నీవు తెలిసి తప్పటడుగులు వేస్తున్నావు’ అంటూ జ్ఞానదోయం చేశాడు. నాన్న మాటల్లోని జీవిత సత్యం బోధపడిన ప్రవీణ్ .. ఆనాటి నుంచి బుద్ధిగా చదువుకోసాడు. – జయరామ్ నాయుడు
Comments
Please login to add a commentAdd a comment