సుందరవనం అనే అడవిలో ఒక ముసలి అవ్వ నివసించేది. ఆమె అడవిని చూడవచ్చిన వారికి ఇతర పనుల మీద అడవికి వచ్చిన వారికి అన్నం వండిపెట్టేది. ఆ అడవి దగ్గరలోని గ్రామాల్లో కొందరు ఆమెకు ధన రూపేణా, వస్తు రూపేణా కొంత విరాళంగా ఇచ్చేవారు. ఇలా ఉండగా ఒకరోజు కనకయ్య, గోవిందయ్య అనే ఇద్దరు మిత్రులు ఆమె ఇంటికి వచ్చి భోజనం పెట్టమన్నారు.
ఆమె వారికోసం వంట మొదలుపెట్టింది. ఇంతలో మరో నలుగురూ వచ్చి తమకూ వండి పెట్టమని ఆ అవ్వను అడిగారు. ఆమె ‘సరే’అంటూ ఆ ఎసట్లో ఆరుగురికి సరిపోయే బియ్యం వేసింది. అది చూసి ఆ నలుగురూ వంటయ్యేలోపు సుందర వనం అందాలను చూసి వస్తామని వెళ్లారు. వంట పూర్తి కాగానే ఆమె ఆకలితో ఉన్న కనకయ్య, గోవిందయ్యలకు భోజనం వడ్డించింది. తిన్న తర్వాత వారూ అడవి అందాలు చూడడానికి వెళ్లారు.
వాళ్లు వెళ్లగానే ఆ నలుగురూ కూడా అలా వచ్చి భోజనం చేసి వెళ్ళిపోయారు. కాసేపటికి గోవిందయ్య, కనకయ్యలూ అడవి నుంచి తిరిగివచ్చారు. అప్పుడు గోవిందయ్య తన సంచీ చూసుకుంటే.. తనకు ఎప్పుడో కనకయ్య కానుకగా ఇచ్చిన బంగారు ఉంగరం కనిపించలేదు. దాంతో గోవిందయ్యతో ‘నీవిచ్చిన బంగారు ఉంగరం కనబడట్లేదు. తిరిగి తీసుకున్నావా?’ అని అడిగాడు. ‘ఇచ్చిన ఉంగరాన్ని తిరిగి తీసుకుంటానా?’ అన్నాడు కనకయ్య. ‘అయితే మరి నా ఉంగరం ఏమైనట్టు?’ అని కంగారుపడుతూ అవ్వను అడిగాడు తన ఉంగరమేమైనా కనిపించిందా? అని. దానికి ఆమె తనకే ఉంగరం కనిపించలేదని చెప్పింది. అంతలో గోవిందయ్యకు ఏదో అనుమానం వచ్చి వెంటనే బయటకు పరుగెత్తాడు. తిరుగుబాటలో ఉన్న ఆ నలుగురినీ చేరుకుని.. అవ్వ రమ్మంటోందని పిలుచుకు వచ్చాడు.
తిరిగొచ్చిన ఆ నులగురినీ గోవిందయ్య బంగారు ఉంగరం గురించి ప్రశ్నించింది అవ్వ. తామసలు ఇంట్లోనే లేమని, తామెందుకు తీస్తామని నిలదీశారు వాళ్లు. అప్పుడు గోవిందయ్య ‘అవ్వా! నీవు తీయలేదు. నా మిత్రుడు కూడా తీయలేదు. కచ్చితంగా ఈ నలుగురిలో ఎవరో ఒకరు తీశారు. దీని గురించి నేను గ్రామపెద్దకు ఫిర్యాదు చేస్తాను’ అంటూ గ్రామపెద్ద వద్దకు వెళ్లాడు. ఉంగరం పోయిందని ఫిర్యాదు చేశాడు.
గ్రామపెద్ద ముసలి అవ్వ కనకయ్యతో పాటు ఆ నలుగురినీ పిలిపించాడు. గ్రామపెద్దతో గోవిందయ్య తనకు కనకయ్య ఉంగరాన్నిచ్చాడని, అది తను భోజనం చేసేకంటే ముందు ఉందని.. భోజనం తరువాత చూసుకుంటే కనబడలేదని చెప్పాడు. గ్రామపెద్ద ఆ నలుగురినీ ప్రశ్నించాడు. వారు తాము తీయలేదని చెప్పారు. ‘మరి ఆ ఉంగరం ఏమైనట్టు?’ అని అడిగాడు గ్రామపెద్ద. ఆ నలుగురిలో ఒకడైన రంగడు ‘ఎక్కడికి పోతుందండీ? ఈ ముసలామే తీసుంటుంది’ అన్నాడు.
వెంటనే గ్రామపెద్ద రంగడిని పట్టుకుని ‘నిజం చెప్పు? ఆ ఉంగరం తీసింది నువ్వే కదా?’ పొరుగూడి వాడివి అవ్వ గురించి నువ్వు మాకు చెప్పేదేంటీ? ఆమె అన్నపూర్ణ. అలాంటి ఆమెపై నిందలు వేస్తున్నావంటే కచ్చితంగా నువ్వే ఉంగరం దొంగవి’ అంటూ నిలదీశాడు.‘నేను తీయలేదండీ’ అన్నాడు రంగడు. గ్రామపెద్ద మిగతా ముగ్గురిని ఉద్దేశిస్తూ ‘మీరంతా అడవికి వెళ్లినప్పుడు రంగడు మిమ్మల్ని వీడి ఒక్కడే ఎక్కడికైనా వెళ్లాడా?’ అని అడిగాడు. దానికి వారు ‘అవునండీ.. వెళ్లాడు.
మాతో పాటే నడుస్తూ మధ్యలో ‘‘ఇప్పుడే వస్తాను.. మీరు వెళ్తూ ఉండండి’’ అంటూ వెనక్కి వెళ్లి మళ్లీ కాసేపటికి వచ్చాడు’ అని చెప్పారు. ‘అయితే ఆ సమయంలో నువ్వు అవ్వ ఇంటికి వచ్చి.. ఉంగరం కాజేసి ఏమీ ఎరగనట్టు మళ్లీ మీ వాళ్లను కలిశావన్నమాట’ అంటూ రంగడిని గద్దించాడు గ్రామపెద్ద. తన తప్పు బయటపడిపోయిందని.. ఇంక తను తప్పించుకోలేనని తెలిసి.. నిజాన్ని ఒప్పుకున్నాడు రంగడు. తాను దాచిన ఉంగరాన్ని తీసి గ్రామపెద్ద చేతిలో పెట్టాడు.
అదంతా విని ఆశ్చర్యపోతూ గోవిందయ్య ‘అయ్యా.. రంగడే ఉంగరం తీశాడని మీరెలా గుర్తించారు?’ అని అడిగాడు. దానికి గ్రామపెద్ద ‘ఏముంది? నీ మిత్రుడు నీకిచ్చిన కానుకను తిరిగి తీసుకునే సమస్యే లేదు. అవ్వ ఎలాంటిదో మాకు బాగా తెలుసు. మిగిలింది ఈ నలుగురే కదా! వీళ్లలో ముగ్గురూ నిజాయితీగా తమకు తెలియదని చెప్పారు. ఈ రంగడు మాత్రం నేరాన్ని అవ్వ మీదకు నెట్టడానికి ప్రయత్నించాడు. అక్కడే నాకు అనుమానం మొదలైంది. అందుకే ఒంటరిగా ఎక్కడికైనా వెళ్లాడా అని అడిగా. వెళ్లాడని తేలింది. ఆ సమయంలో అవ్వ ఇంటికి దొంగచాటుగా వచ్చి.. గోవిందయ్య చిలక్కొయ్యకు వేసిన అతని చొక్కా జేబులోంచి ఎవరూ చూడకుండా ఉంగరాన్ని కాజేశాడు. గుట్టు చప్పుడు కాకుండా మళ్లీ వెళ్లి ఆ ముగ్గురితో కలిశాడు’ అని చెప్పాడు. ఉంగరాన్ని గోవిందయ్యకు అప్పజెప్పి రంగడికి జరిమానా విధించాడు గ్రామపెద్ద.
వెంటనే అవ్వ.. గ్రామ పెద్దతో ‘అయ్యా! ఉంగరం దొరికింది కదా! రంగడికి విధించిన జరిమానా రద్దు చేయండి. కష్టం చేసుకుని బతికే కూలీ. కాయకష్టమంతా జరిమానా కట్టేస్తే కుటుంబానికేం ఇస్తాడు? ఈ గుణపాఠంతో మళ్లీ తప్పు చేయడు’ అని వేడుకుంది. చేయనన్నట్టుగా కన్నీళ్లతో దండం పెడుతూ ‘అమ్మలాంటి దానివి. నువ్వు పెట్టిన అన్నం తిని నీమీదే నేరం మోపాను. అయినా పెద్ద మనుసుతో నువ్వు నాకు క్షమాభిక్ష పెట్టమని కోరావు. నేను పాపాత్ముడిని. నన్ను క్షమించు అవ్వా..’ అంటూ అవ్వ కాళ్ల మీద పడ్డాడు రంగడు. అవ్వ మంచితనాన్ని గ్రామపెద్దతో పాటు అక్కడున్న అందరూ ప్రశంసించారు. – సంగనభట్ల చిన్న రామకిష్టయ్య
Comments
Please login to add a commentAdd a comment