ఓరోజు ఎలుకలన్నీ పెద్ద ఎలుక వద్దకు వెళ్లి ‘ఊర్లోని ఇంటి యజమానులంతా అప్రమత్తమయ్యారు, మనల్ని సమూలంగా నాశనం చేయడానికి ప్రతి ఇంట్లో బోన్లు పెట్టి మనల్ని హతమార్చే ప్రయత్నాలు ప్రారంభించారు’ అంటూ గగ్గోలు పెట్టాయి. ‘ఇక మేము పల్లెల్లో నివసించలేం, పట్టణాలకు వెళ్లిపోతాం. అక్కడ బోనులో చిక్కకుండా మెలకువలు నేర్చుకొని చక్కగా బతుకుతాం’ అని భీష్మించుకున్నాయి.
పెద్ద ఎలుక వాటిని సముదాయించే ప్రయత్నం చేసింది. అయినా అవి ‘పల్లెల్లో ఉండం కాక ఉండం’ అంటూ మొండికేశాయి. ఇంతలో ఆ పల్లెకు, చుట్టపు చూపుగా ఓ ఎలుక రంగు గుడ్డలేసుకుని గెంతుతూ వచ్చింది. అన్ని ఎలుకలూ దానికి ఆహ్వానం పలికాయి. అదే సమయంలో ఓ మిద్దింటి నుంచి చేపల కూర వాసన గుప్పుగుప్పుమని వచ్చింది. పట్టణం ఎలుకకు నోరు ఊరింది. ‘ఎన్నాళ్లయ్యిందో చేపల కూర తిని.. నేను వెళ్లి తిని వస్తా!’ అని లొట్టలేసుకుంటూ బయలుదేరింది.
‘ఆశపడి వెళ్లొద్దు.. ఇక్కడ అందరి ఇళ్లోల్లో బోనులు పెట్టి ఉన్నాయి. పొరపాటుగా నువ్వు బోనులో ఇరుక్కుపోయే ప్రమాదం ఉంది’ అంటూ ఎలుక పెద్ద హెచ్చరించింది. పట్టణం ఎలుక ఎగిరెగిరి నవ్వింది.. ‘నేనేమైనా పల్లెటూరి ఎలుకనా.. వారు వేసే ఎరలకు ఇరుక్కుపోవడానికి?’ అంటూ మిద్దె ఇంటి వైపు దౌడు తీసింది. ‘ఏమి జరుగుతుందో చూద్దాం..’ అని ఎలుకలన్నీ దాని వెనుకే పరుగులు తీశాయి.
మిద్దె ఇంటిలోకి వెళ్తున్న పట్టణం ఎలుకను చూసిన మరో పల్లె ఎలుకకు కూడా నోరూరింది. దాంతో అది ఆ మిద్దె ఇంటిలోకి పట్టణం ఎలుకకన్నా ముందే దూరింది. బోనులో పెట్టిన ఎండు చేప వాసనకి పల్లె ఎలుక పరవశించి పోయింది. ముందు వెనుకలు చూడకుండా నేరుగా వెళ్ళి చేపను లాగింది. డబుక్కున బోను మూత పడటంతో ఇరుక్కుపోయానని తెలుసుకుని ‘కుయ్ కుయ్’ అని అరుస్తూ రచ్చ చేసింది. ‘పట్టణం ఎలుక ఏమి చేయబోతుందో..’ అని, మిగిలిన పల్లె ఎలుకలన్నీ అటకెక్కి వేడుక చూడసాగాయి.
పట్టణం ఎలుక ఒయ్యారంగా మరో బోను ముందర నిలబడి ‘ఇట్టాంటి బోనులు ఎన్ని చూడలేదు..’ అంటూ ఇంటి యజమాని తెలివిని ఎద్దేవా చేస్తూ పడీపడీ నవ్వింది. బోను పైకెక్కి నాట్యం చేసింది. బోనులోని ఎండుచేప ‘నన్ను తినకుండా వెళ్ళిపోతావా మిత్రమా’ అని అడిగినట్లు అనిపించింది దానికి. ‘అయినా పట్టణంలోని పెద్దపెద్ద బోనుల్లోనే చిక్కలేదు నేను. అలాంటి నాకు ఈ పల్లెటూరి బోను ఒక లెక్కా! కనురెప్పలు మూసి తెరిచేలోగా టపీమని వెళ్ళి బోనులోని చేపను నోటితో లాక్కొని రానూ..’ అంటూ బోనులోకి దూరి చేపను లాగింది. టక్కుమని బోను మూత పడిపోయింది. ఇరుక్కుపోయిన సంగతి తెలుసుకుని బోనును లోపలే ‘డిష్యుం డిష్యుం’ అని కొట్టడం ప్రారంభించింది.
ఆ ఆపదను ముందే గ్రహించిన పెద్ద ఎలుక.. అటకెక్కి చూస్తున్న తోటి ఎలుకల గుంపును తోడ్కొని .. ఆ రెండు బోనుల వద్దకు వెళ్లింది. తమ బలమంతా ప్రయోగించి ఆ రెండు ఎలుకలను బయటకు తీసి వాటికి ప్రాణభిక్ష పెట్టాయి ఆ ఎలుకలన్నీ! వెంటనే పెద్ద ఎలుక.. మిద్దింటి ముందరి పూలతోటలో ఆ ఎలుకలన్నిటినీ సమావేశపరచి ‘మనం బోనులో పెట్టిన ఎరల అకర్షణలో పడి పెద్దప్రాణాలకే ప్రమాదం తెచ్చుకోకూడదు.
ఆ ‘ఎరుక’ ఉంటేనే పల్లెల్లో అయినా, పట్టణాల్లో అయినా ఎలుకలు బతికి బట్టకట్టగలవు. అసలు మనుషులు ఎలుకల్ని ఎందుకు బోనులో బంధిస్తారో తెలుసుకోవాలి. వారి విలువైన వస్తువులను, ఆహారాన్ని మనం నాశనం చేయడం వల్లనే వారు మనల్ని శత్రువులుగా చూస్తున్నారు. బోనులను ఏర్పాటు చేస్తున్నారు. ఈ విశాల విశ్వంలో మనకెన్నో ఆహార పదార్థాలు దొరుకుతాయి. కాబట్టి మనుషుల వస్తువులపై మన వ్యామోహం తగ్గించుకుంటే మనుషులు.. మనం.. ఇరువర్గాలం క్షేమంగా ఉంటాం’ అంటూ హితబోధ చేసింది.
ఆ మాటలతో జ్ఞానోదయం చెందిన పల్లె ఎలుకలు తమ పట్టణ ప్రయాణాన్ని విరమించుకున్నాయి. ‘మంచి మాటలు చెప్పే పెద్ద దిక్కు మాకు లేదు. అందువల్ల అనేక ఎలుకలు ప్రాణాలు పోగొట్టుకుంటున్నాయి’ అని పట్టణం ఎలుక కొద్దిసేపు బాధపడింది. తర్వాత తన ప్రాణాలను రక్షించిన ఎలుకలన్నిటికీ ధన్యవాదాలు తెలిపి తనతో పాటు తీసుకొచ్చిన తీపి మిఠాయిలను అన్నిటికీ పంచి పెట్టింది. – ఆర్.సి. కృష్ణస్వామి రాజు
ఇవి చదవండి: మిస్టరీ.. అసలు డోల్స్‌ని ఎవరు చంపారు? వెరా ఏమైంది?
Comments
Please login to add a commentAdd a comment