
‘అయ్యో వచ్చే వేసవి.. తెచ్చే తిప్పలు’ అనే మాటలకు ఇకపై స్మార్ట్‌గా చెక్ పెట్టొచ్చు. మండే ఎండల నుంచి తప్పించుకోవడానికి చల్లదనం కోసం, ప్రజలు రకరకాల చిట్కాలను పాటిస్తుంటారు. ఆ చిట్కాల్లో ఈ గాడ్జెట్లనూ చేర్చి, సమ్మర్‌కు స్మార్ట్‌గా, కూల్‌గా మార్చేయచ్చు. ఇందుకోసం ఉపయోగపడే కొన్ని లేటెస్ట్ గాడ్జెట్ల వివరాలు మీకోసం...
సన్‌స్క్రీన్ టెస్టర్
వేసవిలో మీ చర్మానికి రక్షణ ఉందా? లేదా? అని ఈ బుల్లి సన్‌స్క్రీన్ టెస్టర్ ద్వారా ఇట్టే తెలుసుకోవచ్చు. చిన్న పెన్‌డ్రైవ్‌లా కనిపించే ఈ పరికరం, నిజానికి ఒక ప్రత్యేకమైన కెమెరా. వేసవిలో ఒళ్లంతా చెమటలు పట్టిన తర్వాత, ఈత కొట్టినప్పుడు, రుమాలుతో ముఖం తుడుచుకున్నప్పుడు, రాసుకున్న క్రీమ్స్ చర్మంపై అక్కడక్కడ మిస్ అవుతుంటుంది.
అలాంటప్పుడు ఈ చిన్న కెమెరాలో నుంచి చూసినట్లయితే, సన్‌స్క్రీన్ క్రీమ్ రక్షణ తొలగిపోయిన ప్రదేశాలను డార్క్‌గా చూపిస్తుంది. ఇది పూర్తిగా వాటర్ ప్రూఫ్, అల్ట్రా పోర్టబుల్. దీని ధర రూ.10,311 మాత్రమే!
స్మార్ట్ వాటర్ బాటిల్
వేసవిలో హైడ్రేటెడ్‌గా ఉండటం తప్పనిసరి. పని ఒత్తిడిలో పడి చాలామంది తరచుగా నీళ్లు తాగటం మరచిపోతుంటారు. ఈ స్మార్ట్ వాటర్ బాటిల్‌తో మీరు హైడ్రేటెడ్‌గా ఉండొచ్చు. ఈ బాటిల్ మీరు నీటిని తీసుకోవడాన్ని ట్రాక్ చేస్తుంది.
అంతే కాకుండా, అవసరమైనప్పుడల్లా మిమ్మల్ని చల్లబరచడానికి మంచి కూలింగ్ వాటర్‌ను అందిస్తుంది. అలాగే వ్యాయామాలు, హైకింగ్‌లు, బీచ్ డేస్‌కి తీసుకెళ్లడానికి ఈ వాటర్ బాటిల్ చాలా అనువుగా ఉంటుంది. ఇలాంటి బాటిల్స్ మార్కెట్‌లో చాలానే దొరుకుతున్నాయి. రివ్యూలను చూసి తీసుకోవటం మంచిది.
క్యాప్ విత్ ఫ్యాన్
వేసవిలో చాలామంది ఉపయోగించే క్యాప్స్ కూడా స్మార్ట్‌గా మారాయి. ఈ క్యాప్స్‌కు అటాచబుల్ మిని ఫ్యాన్ వస్తుంది. ముఖానికి కప్పుకొనే చోట ఈ ఫ్యాన్ ఉంటుంది. దీనికి సోలార్ ప్యానెల్స్ సహాయంతో పవర్ సరఫరా అవుతుంది. క్యాప్ ఎండకు ఎక్స్‌పోజ్ కాగానే ఆటోమేటిక్‌గా ఈ ఫ్యాన్‌లు పనిచేస్తాయి. వీటిల్లో కొన్ని చార్జబుల్ స్టయిల్ మోడల్స్‌లోనూ లభిస్తున్నాయి. కంపెనీల్లో క్వాలిటీ బట్టి ధరల్లో తేడా ఉండొచ్చు. రివ్యూలను పరిశీలించి, కొనుగోలు చేసుకోవచ్చు.
చేతిలోనే ఫ్యాన్స్
విసనకర్రలను ఎక్కడికైనా తేలికగా తీసుకుపోగలిగినట్లే, ఈ మినీ ఫ్యాన్స్‌ను కూడా ఎక్కడికైనా సులువుగా తీసుకెళ్లవచ్చు. స్మార్ట్‌ఫోన్ , పవర్ బ్యాంకు మాదిరిగానే ఈ మినీ ఫ్యాన్స్‌ను కూడా పాకెట్‌లో లేదా హ్యాండ్‌బ్యాగులో పెట్టుకోవచ్చు. మండుటెండల్లో ఇవి ఎంతగానో ఉపశమనాన్ని కలిగిస్తాయి.
మల్టిపుల్ ఫ్యాన్ స్పీడ్స్‌కు తోడు రీచార్జబుల్ బ్యాటరీలు వీటిలో ఉంటాయి. వీటిలో కొన్ని యూఎస్‌బీ పవర్ సోర్స్‌కు కనెక్ట్ చేసుకుని కూడా వాడుకోవచ్చు. ఇలాంటి మినీ ఫ్యాన్స్‌లోనూ వివిధ రకాలు, స్టయిల్స్ ఉంటాయి. కొనుగోలు చేసే ముందు కాస్త నాణ్యత ప్రమాణాలను పరిశీలించడం మంచిది.
(చదవండి: 'యుద్ధాన్ని తలపించే పండుగ'..! కానీ అక్కడు అడుగుపెట్టారో..)
Comments
Please login to add a commentAdd a comment