నిన్నమొన్ననే జరిగిన క్రిస్‌మస్ సెలవుల కోసమని కొందరు, జనవరి మొదటిరోజు తమకు ఇష్టమైన వారిని కలవడం కోసం లేదా రాబోయే సంక్రాంతికి ఇంకొందరు ప్రయాణాలు చేస్తూనే ఉంటారు. కారణమేదైనా రకరకాల అవసరాల కోసం ఎప్పటికప్పుడు ఎవరో ఒకరు ప్రయాణాలు చేయాల్సిన ఆవశ్యకత ఉండనే ఉంటుంది. ప్రయాణాల్లో ఎలాంటి జాగ్రత్తలు
తీసుకోవాలో తెలిపే కథనమిది.
అన్నిటికంటే ముందుగా ప్రయాణం చేయబోయే ముందర తాము రెగ్యులర్‌గా సంప్రదించే జనరల్ ఫిజీషియన్‌ను తొలుత తప్పనిసరిగా కలవాలి. తాము వెళ్తున్న ప్రదేశం గురించి తెలపాలి. అక్కడ ఉండే వాతావరణానికి అనువుగా తాము తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకొని... ఆ మేరకు జాగ్రత్తలు తీసుకోవాలి.
తమకు ఏవైనా ఆరోగ్య సమస్యలుంటే డాక్టర్‌కు చెప్పి, ఆ నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటో తెలుసుకోవాలి.
ఆ మేరకు డాక్టర్లు ప్రిస్క్రయిబ్ చేసిన ప్రకారం... తమకు అవసరమైన మందులను ముందుగానే రెడీగా పెట్టుకోవాలి. ఉదాహరణకు హై–బీపీ, డయాబెటిస్, హై–కొలెస్ట్రాల్ వంటి సమస్యలు ఉన్నవారు తాము ప్రయాణం చేసే కాలానికి అవసరమైనన్ని మందులను రెడీ చేసుకొని పెట్టుకోవాలి. సరిగ్గా తాము అనుకున్న వ్యవధికి అవసరమైనన్నే కాకుండా... వీలైతే కొద్దిగా ఎక్కువ మందులే తీసుకెళ్లడం మంచిది. ఉదాహరణకు ఆస్తమా బాధితులు ఎటాక్ వచ్చిన వెంటనే తాము తక్షణం వాడాల్సిన
(ఎస్‌ఓఎస్) మందుల్ని వెంట ఉంచుకోవాలి. అలాగే వారు తమతోపాటు క్యారీ చేయాల్సిన ఇన్‌హేలర్స్, ప్రివెంటివ్ ఇన్‌హేలర్స్‌ను (వీలైతే ఒకటి రెండు ఎక్కువగానే) తీసుకెళ్లాలి. ఇది ఉదాహరణ మాత్రమే. ప్రయాణికులు తమ ఆరోగ్య సమస్యను బట్టి మందులు క్యారీ చేయాల్సి ఉంటుంది.విదేశాలకు వెళ్లాల్సిన అవసరం ఉన్నవారు... అక్కడ ఉండే ఆరోగ్య పరిస్థితులను బట్టి తీసుకోవాల్సిన ముందస్తు టీకా మందులు (వ్యాక్సిన్స్) తీసుకోవాలి. ఉదాహరణకు ఆఫ్రికా దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఎల్లో ఫీవర్ వ్యాధి ఎక్కువగా ఉంటుంది. ఆ దేశాలకు ప్రయాణం చేసేవారు ముందుగానే అక్కడి స్థానిక పరిస్థితులను బట్టి ఆయా వ్యాక్సిన్లు తీసుకున్న తర్వాతే ప్రయాణం మొదలుపెట్టాలి.
గర్భవతులు తాము వాడాల్సిన మందులూ, అలాగే తీసుకోవాల్సిన అన్ని రకాల వ్యాక్సిన్లను తీసుకొని ఉండాలి.
పిల్లలకు వారికి ఉన్న ఆరోగ్య సమస్యలను బట్టి వారు తీసుకోవాల్సిన మందుల్ని రెడీగా ఉంచుకోవాలి.
ఆయా దేశాలే కాదు... కొన్ని సందర్భాల్లో తాము ప్రయాణం చేసే విమాన సంస్థలు సైతం కొన్ని ఆంక్షలు పెడుతుంటాయి. ‘‘ఫిట్ టు ఫ్లై’’ నిబంధనలుగా పేర్కొనే ఈ నిబంధనల గురించి ముందుగానే తెలుసుకోవాలి. దీంతో తమ ప్రయాణంలో రాబోయే సమస్యలను తెలుసుకుని, నివారించుకోవడం తేలికవుతుంది.
తాము బస చేయబోయే చోట కొందరు పాస్ట్ ట్రావెల్ హిస్టరీ’ అడిగి తీసుకుంటూ ఉంటారు. అంటే... గతంలో ఏయే ప్రాంతాలు / దేశాలు తిరిగివచ్చారో అడిగి తెలుసుకుంటుంటారు. తమ పాస్ట్ ట్రావెల్ హిస్టరీ గురించి ఎవరికి వారు ముందుగానే సమీక్షించుకుని, ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవడం మంచిది.
అయితే ప్రజలందరి సంక్షేమం కోసం తమ ట్రావెల్ హిస్టరీని పారదర్శకంగా సమర్పించడం ప్రయాణికులకూ మేలు. ఒక్కోసారి ఏదైనా సమాచారాన్ని దాచిపెట్టడం... వారికే ఇబ్బందులు తెచ్చేందుకు అవకాశమిస్తుంది.
ఇవే గాకుండా... తాము వెళ్లబోయే ప్రదేశంలో ఉండే వాతావరణానికి అనువుగా దుస్తులు, అక్కడ ఎదురవ్వబోయే సమస్యలకు అనువుగా ఏర్పాట్లు చేసుకుని వెళ్లడం మంచిది.
ఇటీవల పిల్లలకూ, పెద్దలకు దాదాపుగా అందరికీ కళ్లజోళ్లు ఉంటున్నాయి. ఉన్న కళ్లజోడుకి తోడుగా మరొకటి అదనంగా తీసుకెళ్లడం మేలు. ఎందుకంటే జర్నీలో కళ్లజోడు పోయినా లేదా విరిగిపోయినా అప్పటికప్పుడు మరొకటి సమకూర్చుకోవడం ప్రయాణ సమయంలో కష్టమవుతుంది. మరొకటి అదనంగా (స్పేర్‌గా) పెట్టుకోవడం చాలావరకు ఉపకరిస్తుంది.
ఈ కొద్దిపాటి జాగ్రత్తలతో ప్రయాణంలో వచ్చే చాలా ఆరోగ్య సమస్యల్ని తేలిగ్గానే అధిగమించవచ్చు. అందుకే కొన్ని ముందుజాగ్రత్తలు తీసుకున్న తర్వాతనే ప్రయాణం మొదలుపెట్టడం చాలావరకు మేలు చేస్తుందని గుర్తుంచుకోండి. ∙
Comments
Please login to add a commentAdd a comment