welness
-
ట్రా'వెల్నెస్' టిప్స్..!
నిన్నమొన్ననే జరిగిన క్రిస్మస్ సెలవుల కోసమని కొందరు, జనవరి మొదటిరోజు తమకు ఇష్టమైన వారిని కలవడం కోసం లేదా రాబోయే సంక్రాంతికి ఇంకొందరు ప్రయాణాలు చేస్తూనే ఉంటారు. కారణమేదైనా రకరకాల అవసరాల కోసం ఎప్పటికప్పుడు ఎవరో ఒకరు ప్రయాణాలు చేయాల్సిన ఆవశ్యకత ఉండనే ఉంటుంది. ప్రయాణాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలిపే కథనమిది. అన్నిటికంటే ముందుగా ప్రయాణం చేయబోయే ముందర తాము రెగ్యులర్‌గా సంప్రదించే జనరల్ ఫిజీషియన్‌ను తొలుత తప్పనిసరిగా కలవాలి. తాము వెళ్తున్న ప్రదేశం గురించి తెలపాలి. అక్కడ ఉండే వాతావరణానికి అనువుగా తాము తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకొని... ఆ మేరకు జాగ్రత్తలు తీసుకోవాలి. తమకు ఏవైనా ఆరోగ్య సమస్యలుంటే డాక్టర్‌కు చెప్పి, ఆ నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటో తెలుసుకోవాలి. ఆ మేరకు డాక్టర్లు ప్రిస్క్రయిబ్ చేసిన ప్రకారం... తమకు అవసరమైన మందులను ముందుగానే రెడీగా పెట్టుకోవాలి. ఉదాహరణకు హై–బీపీ, డయాబెటిస్, హై–కొలెస్ట్రాల్ వంటి సమస్యలు ఉన్నవారు తాము ప్రయాణం చేసే కాలానికి అవసరమైనన్ని మందులను రెడీ చేసుకొని పెట్టుకోవాలి. సరిగ్గా తాము అనుకున్న వ్యవధికి అవసరమైనన్నే కాకుండా... వీలైతే కొద్దిగా ఎక్కువ మందులే తీసుకెళ్లడం మంచిది. ఉదాహరణకు ఆస్తమా బాధితులు ఎటాక్ వచ్చిన వెంటనే తాము తక్షణం వాడాల్సిన (ఎస్ఓఎస్) మందుల్ని వెంట ఉంచుకోవాలి. అలాగే వారు తమతోపాటు క్యారీ చేయాల్సిన ఇన్హేలర్స్, ప్రివెంటివ్ ఇన్హేలర్స్ను (వీలైతే ఒకటి రెండు ఎక్కువగానే) తీసుకెళ్లాలి. ఇది ఉదాహరణ మాత్రమే. ప్రయాణికులు తమ ఆరోగ్య సమస్యను బట్టి మందులు క్యారీ చేయాల్సి ఉంటుంది. విదేశాలకు వెళ్లాల్సిన అవసరం ఉన్నవారు... అక్కడ ఉండే ఆరోగ్య పరిస్థితులను బట్టి తీసుకోవాల్సిన ముందస్తు టీకా మందులు (వ్యాక్సిన్స్) తీసుకోవాలి. ఉదాహరణకు ఆఫ్రికా దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఎల్లో ఫీవర్ వ్యాధి ఎక్కువగా ఉంటుంది. ఆ దేశాలకు ప్రయాణం చేసేవారు ముందుగానే అక్కడి స్థానిక పరిస్థితులను బట్టి ఆయా వ్యాక్సిన్లు తీసుకున్న తర్వాతే ప్రయాణం మొదలుపెట్టాలి. గర్భవతులు తాము వాడాల్సిన మందులూ, అలాగే తీసుకోవాల్సిన అన్ని రకాల వ్యాక్సిన్లను తీసుకొని ఉండాలి. పిల్లలకు వారికి ఉన్న ఆరోగ్య సమస్యలను బట్టి వారు తీసుకోవాల్సిన మందుల్ని రెడీగా ఉంచుకోవాలి. ఆయా దేశాలే కాదు... కొన్ని సందర్భాల్లో తాము ప్రయాణం చేసే విమాన సంస్థలు సైతం కొన్ని ఆంక్షలు పెడుతుంటాయి. ‘‘ఫిట్ టు ఫ్లై’’ నిబంధనలుగా పేర్కొనే ఈ నిబంధనల గురించి ముందుగానే తెలుసుకోవాలి. దీంతో తమ ప్రయాణంలో రాబోయే సమస్యలను తెలుసుకుని, నివారించుకోవడం తేలికవుతుంది. తాము బస చేయబోయే చోట కొందరు పాస్ట్ ట్రావెల్ హిస్టరీ’ అడిగి తీసుకుంటూ ఉంటారు. అంటే... గతంలో ఏయే ప్రాంతాలు / దేశాలు తిరిగివచ్చారో అడిగి తెలుసుకుంటుంటారు. తమ పాస్ట్ ట్రావెల్ హిస్టరీ గురించి ఎవరికి వారు ముందుగానే సమీక్షించుకుని, ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవడం మంచిది. అయితే ప్రజలందరి సంక్షేమం కోసం తమ ట్రావెల్ హిస్టరీని పారదర్శకంగా సమర్పించడం ప్రయాణికులకూ మేలు. ఒక్కోసారి ఏదైనా సమాచారాన్ని దాచిపెట్టడం... వారికే ఇబ్బందులు తెచ్చేందుకు అవకాశమిస్తుంది. ఇవే గాకుండా... తాము వెళ్లబోయే ప్రదేశంలో ఉండే వాతావరణానికి అనువుగా దుస్తులు, అక్కడ ఎదురవ్వబోయే సమస్యలకు అనువుగా ఏర్పాట్లు చేసుకుని వెళ్లడం మంచిది. ఇటీవల పిల్లలకూ, పెద్దలకు దాదాపుగా అందరికీ కళ్లజోళ్లు ఉంటున్నాయి. ఉన్న కళ్లజోడుకి తోడుగా మరొకటి అదనంగా తీసుకెళ్లడం మేలు. ఎందుకంటే జర్నీలో కళ్లజోడు పోయినా లేదా విరిగిపోయినా అప్పటికప్పుడు మరొకటి సమకూర్చుకోవడం ప్రయాణ సమయంలో కష్టమవుతుంది. మరొకటి అదనంగా (స్పేర్‌గా) పెట్టుకోవడం చాలావరకు ఉపకరిస్తుంది. ఈ కొద్దిపాటి జాగ్రత్తలతో ప్రయాణంలో వచ్చే చాలా ఆరోగ్య సమస్యల్ని తేలిగ్గానే అధిగమించవచ్చు. అందుకే కొన్ని ముందుజాగ్రత్తలు తీసుకున్న తర్వాతనే ప్రయాణం మొదలుపెట్టడం చాలావరకు మేలు చేస్తుందని గుర్తుంచుకోండి. ∙ -
'స్లీప్‌మాక్సింగ్': నిద్రను కూడా కొనుక్కునే దుస్థితా..?
ప్రస్తుత జీవన విధానంలో ఎంతమంది నిద్రలేమితో బాధపడుతున్నారో తెలిసిందే. ఒక్క క్షణం రెప్పవాలితే బాగుండును అన్నంతగా ఉంది పరిస్థితి. అందుకోసం మెడిసిన్స్ అని ఏవేవో చిట్కాలని పాటించేస్తున్నారు కూడా. కేవలం చక్కటి జీవనశైలితో శరీర ధర్మం దానంతట అదిగా సర్దుబాటు అయ్యేలా చేసుకోవాల్సిందేనని నిపుణులు కూడా చెబుతున్నారు. ప్రస్తుతం దీన్ని కూడా క్యాష్ చేసుకునేలా కొన్ని కార్పొరేట్ కంపెనీలు చూస్తుండటం బాధకరం. ఏకంగా సాంకేతికతో కూడిన సాధనాలు, ప్రత్యేక పరుపులు వీటితో మంచి నిద్ర గ్యారంటీ అంటూ ప్రజలను ఊదరగొట్టేస్తున్నాయి కొన్ని కార్పొరేట్ కంపెనీలు. మరోవైపు ప్రజలు నిద్ర వస్తే చాలు అన్నట్లు వాటిని కొనితెచ్చేసుకోవాలనే ఆరాటంలో ఉన్నారు. అలా వచ్చిందే ఈ "స్లీప్‌మాక్సింగ్" వెల్నెస్ ట్రెండ్..!. అసలు ఏంటిది.? దీని వల్ల నిజంగా మంచి నిద్ర పడుతుందా..?నిద్ర కోసం సాగించిన అన్వేషణ కాస్త "స్లీప్‌మాక్సింగ్"కి దారితీసిందని చెప్పొచ్చు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. నిద్రలేమితో బాధపడేవారంతా సోషల్‌మీడియాలో గ్రూప్‌గా మారి ఒకరి అనుభవానలు ఒకరూ షేర్ చేసుకుంటున్నప్పుడూ వచ్చిందే ఈ "స్లీప్ మాక్సింగ్". ఒక ఔత్సాహిక సోషల్ మీడియా వినియోగదారు చెప్పడంతో ఇది రకరకాల చర్చలకు తెరలేపింది. 'స్లీప్‌మాక్సింగ్' అంటే..నిద్ర కోసం ఉపయోగించే ఒక విధమైన సాధనాలు లేదా ఉత్పత్తులుగా చెప్పొచ్చు. ఇయర్‌ప్లగ్‌లు, నాసికా డైలేటర్లు, మెగ్నీషియం ఫుట్ స్ప్రే, మౌత్ టేప్, చిన్ స్ట్రాప్స్ ట్రాకర్లతో మంచి నిద్రను పొందేలా మార్గం సుగమం చేసుకునే విధానమే స్లీప్‌మాక్సింగ్. దీని గురించి సోషల్ మీడియా వినియోగదారు డెరెక్ ఆంటోసిక్ చెప్పుకొచ్చారు. తన 20 ఏళ్ల జీవితంలోని అనారోగ్యకరమైన అలవాట్లు నిద్రలేమికి దారితీశాయని, దాన్ని అధిగమించేందుకు సాగిన అన్వేషణలో ఈ స్లీప్‌మాక్సింగ్ తనకు ఉపయోగపడిందంటూ వివరించాడు. ఈ సాధానాలతో మంచి నిద్రపట్టిందా లేదా అని ట్రాకర్‌తో చెక్ చేసుకునేవాడినని చెబుతున్నాడు అంతేగాదు ఆ సాధానాలు తనకు గాఢనిద్రను అందించాయని చెప్పాడు. దీన్ని క్యాష్ చేసుకునేలా కొన్ని కంపెనీలు స్మార్ట్ స్లీప్ సొల్యూషన్ అంటూ సాంకేతికతో కూడిన సాధనాలను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. ముఖ్యంగా ఏఐ హెడ్‌బ్యాండ్ వంటవి గాఢనిద్రను ప్రేరేపించేలా నిశబ్ద వాతావరణాన్ని సృష్టించేందుకు మెదడు తరంగాలను ఉపయోగిస్తుందట. అలాగే మెదడు మెలుకువగా ఉండేలా చేసే కార్యకలాపాలను లక్ష్యంగా రూపొందిచామని ఊదరగొడుతున్నాయి కంపెనీలు. అంతేగాదు మంచినిద్రను తెచ్చిపెట్టే పరుపులు కూడా వచ్చేశాయి. అలాగే ఉష్ణోగ్రతను సర్దుబాటు చేసే సాధనాలు, గురక తగ్గించే పరికరాలు వంటి వాటితో నిద్రను ప్రజలు కొనుక్కునే దుస్థితికి తీసుకొచ్చేయటం బాధకరం. అయితే నెటిజన్లు మాత్రం ఇవన్నీ మంచి నిద్రను అందించే సాధానలే అయిన..అవేమి సహజమైన నిద్రను అందివ్వలేవని తేల్చి చెబుతున్నారు. చక్కటి శారీరక శ్రమ, మంచి ఆహారపు అలవాట్లతోనే దాన్ని పొందగలమని నమ్మకంగా చెబుతుండటం విశేషం. ఆ గాడ్జెట్స్‌పై ఆధారపడితే క్రమేణ నాణ్యమైన నిద్రను కోల్పోతామని ఆందోళన వ్యక్తం చేస్తూ..పోస్టులు పెట్టారు. (చదవండి: 'సూసైడ్ పాడ్': జస్ట్ బటన్ నొక్కితే చాలు.!) -
హమ్మయ్య సొమ్ములు దక్కాయి
‘సహజ ’ ఆస్పత్రిలో ‘ వెల్నెస్ సెంటర్ ’ ప్రతిపాదన రద్దు వడ్డీతో కలిపి రూ.31.15 లక్షలు దేవస్థానానికి తిరిగి చెల్లింపు అన్నవరం : దేవస్థానంలోని సహజ ఆస్పత్రిలో ఆధునిక పరికరాలతో యోగా, నేచురోపతి, కేరళ తరహా ఆయర్వేద వైద్యాన్ని అందించే‘ వెల్నెస్ సెంటర్ ’ ఏర్పాటు చేస్తామని గతేడాది ఏప్రిల్‌లో రూ.30 లక్షలు వసూలు చేసిన బెంగుళూర్లోని ‘స్వామి వివేకానంద యోగా అనుసంధాన సంస్థ (డీమ్డ్ యూనివర్సిటీ) ఎట్టకేలకు వడ్డీతో తిరిగి దేవస్థానానికి చెల్లించింది. వాస్తవానికి గత ఏడాది జూన్ కల్లా ఈ సెంటర్ ఏర్పాటై భక్తులకు సేవలందించాల్సి ఉంది. ఇప్పటి వరకూ అలాంటి సెంటర్ ఏర్పాటు కాలేదు సరికదా, ఏర్పాటు చేసే ఉద్దేశం ఉన్నట్టు కూడా కనిపించలేదు. ఈ వెల్నెస్ సెంటర్ ఏర్పాటు కాకపోవడం, దేవస్థానం చెల్లించిన రూ.30 లక్షలు విషయమై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్న విషయమై గత ఆగష్టు లో ‘ సాక్షి ’దినపత్రికలో వార్త ప్రచురితమైంది. అధికారులలో స్పందన వచ్చి వెంటనే వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేయండి లేదా నిధులను వడ్డీతో సహ వెనక్కి చెల్లించాలని ఆ యూనివర్సిటీకి, దేవాదాయశాఖ ఉన్నతాధికారులకు లేఖలు రాశారు. దేవస్థానం చెల్లించిన రూ.30 లక్షలతో పాటు రూ.1.15 లక్షలు వడ్డీ కలిపి దేవస్థానానికి పంపించింది. ఈ విషయాన్ని ఈఓ నాగేశ్వరరావు శనివారం సాయంత్రం ‘సాక్షి’కి తెలిపారు. అన్నవరంతో పాటు రాష్ట్రంలోని ప్రముఖ దేవస్థానాలలో బెంగళూర్‌లోని ‘స్వామి వివేకానంద యోగా అనుసంధాన సంస్థ’ (డీమ్డ్ యూనివర్సిటీ)తో ‘వెల్నెస్ సెంటర్ ’ లు ఏర్పాటు చేయాలని దేవాదాయశాఖ గత ఏడాది ఫిబ్రవరిలో నిర్ణయించింది. తొలుత అన్నవరం దేవస్థానంలో సహజ ఆస్పత్రిలో దీనిని ఏర్పాటు చేయాలని భావించారు. ఆ యూనివర్సిటీ ప్రో ఛాన్సలర్‌గా వ్యవహరిస్తున్న కంభంపాటి సుబ్రహ్మణ్యం మరో ఇద్దరు ప్రతినిధులు అన్నవరం లోని సహజ ఆస్పత్రిని పరిశీలించారు. ‘వెల్నెస్ సెంటర్’ కు అనుగుణంగా మార్పులు చేస్తామని తెలిపారు. సెంటర్ ను 11 ఏళ్లపాటు నిర్వహించేందుకు విడతల వారీగా దేవస్థానం రూ.80 లక్షలు చెల్లించేలా గత ఏప్రిల్‌లో దేవస్థానానికి, ఆ యూనివర్సిటీకి ఒప్పందం కుదిరింది. తొలి విడతగా రూ.30 లక్షలు ఆ యూనివర్సిటీ ప్రతినిధులకు అందించింది. ఆ తర్వాత ఆస్పత్రిని నెలరోజులు మూసివేసి ఆ భవనాన్ని వారికి అప్పగించారు. సహజ సిబ్బందికి బెంగళూరులోని ఆ యూనివర్సిటీలో మే నెలలో శిక్షణ కూడా ఇచ్చారు. ఆ తర్వాత సెంటర్ ఏర్పాటు ప్రక్రియ ముందుకెళ్లలేదు. దేవస్థానం చెల్లించిన రూ.30 లక్షల గురించి ఆందోళన నెలకొంది. దీనిపై గత ఏడాది ఆగస్టులో ‘సాక్షి’లో వార్త ప్రచురితం కావడంతో ఈఓ నాగేశ్వరరావు స్పందించి ఉన్నతాధికారులకు, యూనివర్సిటీ ప్రతినిధులకు లేఖ రాశారు. దీంతో ఎట్టకేలకు ఆ నిధులు తిరిగి వచ్చాయి. సహజ ఆస్పత్రిని అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తామని ఈఓ కె.నాగేశ్వర రావు ‘సాక్షి’కి వివరించారు. దీనిపై త్వరలోనే ఆ సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు.