హమ్మయ్య సొమ్ములు దక్కాయి
Published Sat, Feb 11 2017 11:54 PM | Last Updated on Tue, Sep 5 2017 3:28 AM
‘సహజ ’ ఆస్పత్రిలో ‘ వెల్‌నెస్ సెంటర్ ’ ప్రతిపాదన రద్దు
వడ్డీతో కలిపి రూ.31.15 లక్షలు దేవస్థానానికి తిరిగి చెల్లింపు
అన్నవరం : దేవస్థానంలోని సహజ ఆస్పత్రిలో ఆధునిక పరికరాలతో యోగా, నేచురోపతి, కేరళ తరహా ఆయర్వేద వైద్యాన్ని అందించే‘ వెల్‌నెస్ సెంటర్ ’ ఏర్పాటు చేస్తామని గతేడాది ఏప్రిల్‌లో రూ.30 లక్షలు వసూలు చేసిన బెంగుళూర్‌లోని ‘స్వామి వివేకానంద యోగా అనుసంధాన సంస్థ (డీమ్డ్ యూనివర్సిటీ) ఎట్టకేలకు వడ్డీతో తిరిగి దేవస్థానానికి చెల్లించింది. వాస్తవానికి గత ఏడాది జూన్ కల్లా ఈ సెంటర్ ఏర్పాటై భక్తులకు సేవలందించాల్సి ఉంది. ఇప్పటి వరకూ అలాంటి సెంటర్ ఏర్పాటు కాలేదు సరికదా, ఏర్పాటు చేసే ఉద్దేశం ఉన్నట్టు కూడా కనిపించలేదు. ఈ వెల్‌నెస్ సెంటర్ ఏర్పాటు కాకపోవడం, దేవస్థానం చెల్లించిన రూ.30 లక్షలు విషయమై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్న విషయమై గత ఆగష్టు లో ‘ సాక్షి ’దినపత్రికలో వార్త ప్రచురితమైంది. అధికారులలో స్పందన వచ్చి వెంటనే వెల్‌నెస్ సెంటర్ ఏర్పాటు చేయండి లేదా నిధులను వడ్డీతో సహ వెనక్కి చెల్లించాలని ఆ యూనివర్సిటీకి, దేవాదాయశాఖ ఉన్నతాధికారులకు లేఖలు రాశారు. దేవస్థానం చెల్లించిన రూ.30 లక్షలతో పాటు రూ.1.15 లక్షలు వడ్డీ కలిపి దేవస్థానానికి పంపించింది. ఈ విషయాన్ని ఈఓ నాగేశ్వరరావు శనివారం సాయంత్రం ‘సాక్షి’కి తెలిపారు.
అన్నవరంతో పాటు రాష్ట్రంలోని ప్రముఖ దేవస్థానాలలో బెంగళూర్‌లోని ‘స్వామి వివేకానంద యోగా అనుసంధాన సంస్థ’ (డీమ్డ్ యూనివర్సిటీ)తో ‘వెల్‌నెస్ సెంటర్ ’ లు ఏర్పాటు చేయాలని దేవాదాయశాఖ గత ఏడాది ఫిబ్రవరిలో నిర్ణయించింది. తొలుత అన్నవరం దేవస్థానంలో సహజ ఆస్పత్రిలో దీనిని ఏర్పాటు చేయాలని భావించారు.
ఆ యూనివర్సిటీ ప్రో ఛాన్సలర్‌గా వ్యవహరిస్తున్న కంభంపాటి సుబ్రహ్మణ్యం మరో ఇద్దరు ప్రతినిధులు అన్నవరం లోని సహజ ఆస్పత్రిని పరిశీలించారు. ‘వెల్‌నెస్ సెంటర్’ కు అనుగుణంగా మార్పులు చేస్తామని తెలిపారు. సెంటర్ ను 11 ఏళ్లపాటు నిర్వహించేందుకు విడతల వారీగా దేవస్థానం రూ.80 లక్షలు చెల్లించేలా గత ఏప్రిల్‌లో దేవస్థానానికి, ఆ యూనివర్సిటీకి ఒప్పందం కుదిరింది. తొలి విడతగా రూ.30 లక్షలు ఆ యూనివర్సిటీ ప్రతినిధులకు అందించింది. ఆ తర్వాత ఆస్పత్రిని నెలరోజులు మూసివేసి ఆ భవనాన్ని వారికి అప్పగించారు. సహజ సిబ్బందికి బెంగళూరులోని ఆ యూనివర్సిటీలో మే నెలలో శిక్షణ కూడా ఇచ్చారు. ఆ తర్వాత సెంటర్ ఏర్పాటు ప్రక్రియ ముందుకెళ్లలేదు. దేవస్థానం చెల్లించిన రూ.30 లక్షల గురించి ఆందోళన నెలకొంది. దీనిపై గత ఏడాది ఆగస్టులో ‘సాక్షి’లో వార్త ప్రచురితం కావడంతో ఈఓ నాగేశ్వరరావు స్పందించి ఉన్నతాధికారులకు, యూనివర్సిటీ ప్రతినిధులకు లేఖ రాశారు. దీంతో ఎట్టకేలకు ఆ నిధులు తిరిగి వచ్చాయి. సహజ ఆస్పత్రిని అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తామని ఈఓ కె.నాగేశ్వర రావు ‘సాక్షి’కి వివరించారు. దీనిపై త్వరలోనే ఆ సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు.
Advertisement