పెళ్లిళ్ల పేరయ్యల కాలం దాదాపు కనుమరుగైపోయింది. ఇపుడంతా మ్యాట్రీ మోనీ వెబ్‌సైట్ల హవానే నడుస్తోంది. ప్రాథమికంగా అన్ని వివరాలను ఆన్‌లైన్‌లోనే తెలుసుకుని అపుడు రంగంలోకి దిగుతున్న పరిస్థితినిమనం చూస్తున్నాం. అమ్మాయిల తల్లిదండ్రులైనా, అబ్బాయిల తల్లిదండ్రులైనా చాలావరకు ‘మ్యాట్రీ మోనీ’ పై ఆధారపడుతున్నారు. ఇక్కడే కేటుగాళ్లు మోసాలకు తెరతీస్తున్నారు. పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.. పదండి!
మోసాలకు కాదేదీ అనర్హం అన్నట్టు.. ప్రతీ విషయాన్ని తమ కనుగుణంగా మలుచు కుంటున్నారు కేడీగాళ్లు. ఆఖరికి మ్యాట్రీమోనీ సైట్లను కూడా వదలడం లేదు. మ్యాట్రిమోని సైట్ల కేంద్రంగా పెరిగిపోతున్న మోసాలు అంటూ దీనికి సంబంధించి ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఒక వీడియోను షేర్ చేశారు. మ్యాట్రి 'మనీ' మోసాలతో తస్మాత్ జాగ్రత్త! అంటూ ఒక పోస్ట్ పెట్టారు. మ్యాట్రిమోనీ వెబ్‌సైట్లలో పరిచయమైన యువతి, యువకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించిన సజ్జనార్ ఇలాంటి మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. వీడియో కాల్స్ చేయమన్నా, న్యూడ్ ఫోటోలు అడిగిన కచ్చితంగా అనుమానించాల్సి ఉందనీ, ఒకటి పది సార్లు ఆలోచించాలని తెలిపారు. అలాగే మోసానికి గురైతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా 1930 నంబరుకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సజ్జనార్ ట్వీట్ చేశారు.
ఈ వీడియోలో ఒక యువతి తన స్నేహితురాలి అనుభవాన్ని గురించి వివరించారు. ఈ వివరాల ప్రకారం మ్యాట్రిమోని సైట్లలో అందమైన యువతీయువతుల ఫొటోలతో నకిలీ ప్రొఫైల్స్ క్రియేట్ చేస్తారు స్కాం రాయుళ్లు. ఆ తరువాత పెళ్లి పేరుతో మాయమాటలు చెబుతారు. మభ్యపెట్టి మెల్లిగా వీడియో కాల్స్ చేస్తారు. ఆ తరువాత ఈ వీడియో సాయంతో న్యూడ్ వీడియోలను తయారు చేస్తారు. ఆపై ఈ వీడియోలు చూపించి బెదిరింపులకు పాల్పడతారు. అడిగిన సొమ్ము ముట్టచెప్పక పోతే..న్యూడ్ వీడియోలను బయట పెడతామంటూ బెదిరిస్తారు. దీంతో ఈ వ్యవహారం బయటకి వస్తే పరువు పోతుందని భయంతో వణికిపోతారు బాధితులు. అడిగినంత ముట్జచెప్పి కష్టాల్లో పడుతున్నారు. అంతేకాదు పోలీసులకు ఫిర్యాదు చేస్తే మరిన్ని సమస్యలు తప్పవనే భయంతో ఫిర్యాదులకు జంకుతున్నారు.
మ్యాట్రి 'మనీ' మోసాలతో తస్మాత్ జాగ్రత్త!!
మ్యాట్రిమోని సైట్లలో అందమైన యువతీయువతుల ఫొటోలతో నకిలీ ప్రొఫైల్స్ క్రియేట్ చేస్తున్న కేటుగాళ్ళు.
పెళ్లి పేరుతో మాయమాటలు చెప్పి న్యూడ్ వీడియో కాల్స్.
న్యూడ్ వీడియోలతో బ్లాక్ మెయిలింగ్.. అడిగిన డబ్బు ఇవ్వాలని బెదిరింపులు.
మ్యాట్రిమోని… pic.twitter.com/wS48rAVmTp— V.C. Sajjanar, IPS (@SajjanarVC) January 13, 2025
ఇలాంటి స్కాంలపై అప్రమత్తంగా ఉండాలి. అలాగే ఇలాంటి బెదిరింపులకు భయపడ కూడదు. సంబంధిత పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి. లేదంటే సైబర్ క్రైం విభాగాన్ని గానీ వెంటనే సంప్రదించాలి. ఇలా చేయడం వల్ల మరింత బాధితులు సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా కాపాడిన వారమవుతాం. అలాకాకుండా పరువు పోతుందని భయపడితే, కేటుగాళ్లు పన్నిన ఉచ్చులోకి మరింత లోతుగా చిక్కుకుంటామనే సంగతి గుర్తుంచు కోవాలి.
Comments
Please login to add a commentAdd a comment