శృంగవరం అడవుల్లో ఆశ్రమ జీవితం గడిపేవాడు ముని శతానందుడు. ఉదయాన్నే లేచి దైనందిన కార్యక్రమాలు పూర్తి చేసుకుని, తపస్సు చేసుకునేవాడు. ఆ ఆశ్రమం చుట్టూ పూల మొక్కలు, పండ్ల చెట్లు, పొదలు దట్టంగా ఉండేవి. ఆ ప్రశాంత వాతావరణానికి అలవాటు పడిన జంతువులు, పక్షులు అక్కడ సేదతీరడానికి ఇష్టపడేవి.
ముని కూడా వాటిపట్ల దయతో ప్రవర్తించేవాడు. అవెప్పుడైనా జబ్బు చేస్తే, గాయపడితే వనమూలికలు, ఆకు పసర్లతో వైద్యం చేసేవాడు. అలా మునికి, వాటికి మధ్య స్నేహం కుదిరింది. ముని ధ్యానంలో మునిగిపోతే తియ్యటి పండ్లు, దుంపలు, పుట్ట తేనెను తెచ్చి ముని ముందు పెట్టేవి. ఆశ్రమ ప్రాంగణంలో ఆ జంతువులు, పక్షులు జాతి వైరం మరచి కలసిమెలసి ఉండేవి.
ఒక వర్షాకాలం.. ఉదయాన్నే నదికి వెళ్లిన ముని తిరిగి వస్తూండగా.. జారి గోతిలో పడిపోయాడు. ఎంతప్రయత్నించినా పైకి లేవలేకపోయాడు. బాధతో మూలుగుతూ చాలాసేపు గోతిలోనే ఉండిపోయాడు. స్నానానికి వెళ్లిన ముని ఇంకా ఆశ్రమానికి తిరిగిరాలేదని ఒక చిలుక గమనించింది. ఎగురుకుంటూ నది వైపు వెళ్లింది. గోతిలో మునిని చూసింది. ఆయన ముందు వాలింది. ఆయన చెప్పగా ప్రమాదం గురించి తెలుసుకుంది. వెంటనే ఆశ్రమానికి వెళ్లి అక్కడున్న జంతువులన్నిటికీ చెప్పింది.
వెంటనే ఏనుగు, ఎలుగుబంటి, గుర్రం, మేక, కోతి పరిగెడుతూ ముని ఉన్న గోతిని చేరాయి. ‘భయపడకండి మునివర్యా.. మిమ్మల్ని బయటకు తీస్తాము’ అని మునికి భరోసానిచ్చాయి. గోతి లోపలకి వెళ్ళడానికి దారి చేసింది ఏనుగు. తన తొండంతో మునిని లేపి గుర్రం మీద కూర్చోబెట్టింది. అలా ఆ జంతువులన్నీ కలసి మునిని ఆశ్రమానికి చేర్చాయి. వనంలోని మూలికలు, ఆకులను సేకరించి మునికి వైద్యం చేశాయి. చిలుక వెళ్లి తియ్యటి పండ్లను, కుందేలు వెళ్లి దుంపలను తెచ్చి మునికి ఆహారం అందించాయి.
అలా అవన్నీ.. మునికి సేవలు అందించసాగాయి. నెల గడిచేసరికి ముని పూర్తిగా కోలుకున్నాడు. అవి తనకు చేసిన సేవకు ముని కళ్లు ఆనందంతో చిప్పిల్లాయి. ‘నా బంధువులైనా మీ అంత శ్రద్ధగా నన్ను చూసేవారు కాదు. మీ మేలు మరువలేను’ అన్నాడు శతానందుడు వాటితో. ‘ ఇందులో మా గొప్పదనమేమీ లేదు మునివర్యా..! మీ తపస్సు ప్రభావం వల్లనేమో మేమంతా జాతి వైరాన్ని మరచిపోయి ఒక్కటయ్యాం. మీ ఆశ్రమ ప్రాంగంణంలో.. మీ సాంగత్యంలో హాయిగా బతుకుతున్నాం. మీరు మాకెన్నోసార్లు వైద్యం చేసి మా ప్రాణాల్ని కాపాడారు.
కష్టంలో ఉన్న ప్రాణిని ఆదుకోవాలనే లక్షణాన్ని మీ నుంచే అలవర్చుకున్నాం. మీకు సేవలందించాం. మీరు త్వరగా కోలుకోవాలని కోరుకున్నాం. ఆ భగవంతుడు మా మొర ఆలకించాడు. మీరు కోలుకున్నారు. ఇప్పుడే కాదు ఎప్పుడూ మిమ్మల్ని మా కంటికి రెప్పలా కాచుకుంటాం మునివర్యా..’ అన్నది ఏనుగు. ‘అవునవును’ అంటూ మిగిలినవన్నీ గొంతుకలిపాయి. ఆప్యాయంగా వాటిని తడిమాడు శతానందుడు. – నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Comments
Please login to add a commentAdd a comment