helping nature
-
ఇటు న్యాయం! అటు సాయం!!
సాక్షి, సిటీబ్యూరో: నిరుపేద కుటుంబం నుంచి వచ్చారు.. ఆయనకు చదువు విలువ తెలుసు.. చదువుకుంటే జీవితం ఎంత అందంగా ఉంటుందో.. ఎంత గౌరవం ఉంటుందో తెలియజేసే నిలువెత్తు నిదర్శనం. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థుల కష్టాలు స్వయంగా అనుభవించారు. అందుకే తనకు చేతనైనంత సాయం చేయాలని నిర్ణయించుకున్నారు. ఏటా విద్యార్థులకు అవసరమైన నోటు పుస్తకాలు, జామెట్రీ బాక్సులు, స్కూల్ బ్యాగ్స్, వాటర్ బాటిల్స్ అందిస్తూ సమాజ సేవకు నడుం బిగించారు. చేతనైనంత సాయం చేస్తే ప్రకృతి కూడా మనకు సాయపడుతుందని చెబుతారు న్యాయవాది సంగిశెట్టి బాబు. ఆయన గురించిన మరిన్ని విషయాలు..ఇబ్రహీంపట్నం సమీపంలోని రాయ్‌పూర్‌లో ఓ నిరుపేద కుటుంబంలో యాదమ్మ, శంకరయ్య దంపతులకు జన్మించారు సంగిశెట్టి బాబు. చిన్నప్పటి నుంచి కడుపేదరికం అనుభవించారు. అయితే తమ జీవితాలను చదువు మాత్రమే మారుస్తుందన్న మాటను తు.చ. తప్పకుండా పాటించారు. అందుకే ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కాలేజీల్లో విద్యాభ్యాసం కొనసాగించారు. అనంతరం ఎల్ఎల్బీ పూర్తి చేశారు. ఎల్ఎల్ఎంలో గోల్డ్ మెడల్ సాధించారు. లా ప్రాక్టీస్ చేసుకుంటూనే పీహెచ్డీ కూడా పూర్తి చేశారు. చిన్నప్పుడు తాను పడ్డ కష్టాలు ప్రభుత్వ పాఠశాలల్లోని పిల్లలు పడొద్దనే తలంపుతో తన వంతు సాయంగా ముందడుగు వేస్తున్నారు.ఒక్క రూపాయి లేనిస్థితి నుంచి..తన తల్లిదండ్రుల పేరుతో 2016లో యాదశంకర మెమోరియల్ ఫౌండేషన్ పేరుతో ఓ ట్రస్ట్ ఏర్పాటు చేశారు. అయితే ఆ సమయంలో తన చేతిలో ఒక్క రూపాయి కూడా లేదట. కానీ సంకల్ప బలం తోడైతే ఏదైనా సాధించవచ్చని నమ్మే బాబుకు.. విద్యా సామగ్రి పిల్లలకు అందజేసే ముందురోజు కేసులకు సంబంధించిన డబ్బులు వచ్చాయట. అందుకే తాను నమ్మిన సిద్ధాంతంతోనే ముందుకు వెళ్తున్నాన్నంటారు బాబు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో..హైదరాబాద్ చుట్టుపక్కల చాలామంది ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే ఆదిలాబాద్ వంటి జిల్లాల్లోని మారుమూల ప్రాంతాల్లోని పిల్లలు చదువుకోవడమే కష్టం అవుతుందన్న విషయం గుర్తు చేసుకున్నారు. అంతే ఏటా ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లోని పలు మండలాల్లోని పిల్లలకు సామగ్రి అందజేస్తున్నారు. మౌలిక సదుపాయాలు లేక ఎవరూ చదువు మధ్యలో ఆపేయొద్దనేదే తన ఉద్దేశమని బాబు అంటున్నారు. భవిష్యత్తులో పిల్లల కోసం ఎంత కష్టమైనా తాను ముందుంటానని చెబుతున్నారు. బాబు నేపథ్యం స్ఫూర్తిదాయకం అయితే.. ఆయన సేవాగుణం ఆదర్శప్రాయం అనడంలో అతిశయోక్తి లేదు.ఇవి చదవండి: సాయపు చేతులు..! -
కదిలిన కావ్యం! వారాంతాల్లో పేదలకు అండగా..
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సాఫ్ట్వేర్ కంపెనీలో మంచి ఉద్యోగం.. ఆకర్షణీయమైన వేతనం.. ఆర్థికంగా అన్ని విధాలా స్థిరపడిన కుటుంబం.. ఇలాంటి సమయంలో యువత ఏం ఆలోచిస్తుంది.. మహా అయితే చర్మ సౌందర్యం.. బ్రాండెడ్ దుస్తులు, కార్లు, సెలవు రోజుల్లో రిలాక్స్ కోసంకుటుంబ సభ్యులు, స్నేహితులతో ప్రత్యేకంగా వీకెండ్ ప్లాన్స్ చేసుకుంటారు. దానికితోడు విలాసవంతమైన జీవితం కోరుకోవడం సహజం. అయితే హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి కావ్య మాత్రం పేద పిల్లలను చదివిస్తూ, ఆకలితో ఉన్నవారికి పట్టెడు అన్నం పెట్టి ఆకలి తీరుస్తూ, నాణ్యమైన దుస్తులు అందిస్తున్నారు. వారం రోజులు పనిదినాల్లో ఉద్యోగ బాధ్యతలతో బిజీగా ఉండే ఆమె సెలవు రోజుల్లో సేవా కార్యక్రమాలపై దృష్టిసారిస్తున్నారు. – సాక్షి, సిటీబ్యూరోఆమె ఆలోచనలకు కుటుంబ సభ్యులు ఆమోదం తెలుపుతుండగా, సహచర ఉద్యోగులు సైతం సహకరిస్తున్నారు. 2019లో ప్రముఖ సంస్థలో ఆమె సాఫ్ట్వేర్ సంస్థలో చేరారు. కరోనా సమయంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూసి 200లకుపైగా కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అక్కడి నుంచి సేవా కార్యక్రమాలు మొదలయ్యాయి. ఇదే క్రమంలో 2020లో చారిటీ విజిట్స్ యు ఆల్వేజ్ (చార్వ్య) పేరిట స్వచ్ఛంద సంస్థ స్థాపించారు. సెలవు దినాల్లో కార్యక్రమాలు నడిపిస్తున్నారు.మురికివాడలే లక్ష్యంగా.. నగర పరిధిలోని మురికి వాడలు, అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు, వలస కారి్మకులు ఉండే ప్రాంతాలే లక్ష్యంగా ప్రణాళికలు తయారు చేసుకుంటున్నారు. ముందుగా ఎంపిక చేసుకున్న ప్రాంతాల్లో సుమారు ఎంత మంది జనం సాయం కోసం ఎదురుచూస్తున్నారు? వాళ్ల అవసరాలు తెలుసుకొని, అందుకు అనుగుణంగా సిద్ధమవుతున్నారు. ఆహారం, దుస్తులు, దుప్పట్లు, స్వెటర్లు, నిత్యావసర సరుకులు అందిస్తున్నారు. కుటుంబసభ్యులు, స్నేహితులు ఆర్థికంగా సహాయ సహకారాలు అందిస్తున్నారు.ఆ ఆనందం వెలకట్టలేనిది..ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టడం, దుస్తులు, ఇతర సరుకులు అందించడం సంతోషంగా ఉంది. ఆ ఆనందం వెలకట్టలేనిది. ఇతరులు మంచి జీవితాన్ని పొందడానికి నా వంతు సాయం అందిస్తున్నా. నాకున్న అవకా శాల్లో ఒక మార్గం ఎంచుకొని ముందుకెళ్తున్నా.. కుటుంబ సభ్యులు సరే నీ ఇష్టం అన్నారు. నా వేతనం మొత్తాన్నీ చారిటీకే వెచి్చస్తున్నాను. మరింత మందికి సాయం చేసే అవకాశం కలి్పంచాలని భగవంతుడిని ప్రారి్థస్తున్నా. – కావ్య, చార్వ్య, స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలు -
వయనాడ్ వారియర్స్: స్త్రీని కాబట్టి వెనక్కు తగ్గాలా?
ప్రమాదం జరిగినప్పుడు స్త్రీలను అక్కడకు వెళ్లనివ్వరు. చాలామంది స్త్రీలు తమ భర్త, కొడుకులను సహాయానికి పంపడానికి సంశయిస్తారు. కాని వయనాడ్ వరద బీభత్సం సంభవించినప్పుడు ఒక అంగన్వాడి టీచర్ రక్షణ దళాలతో సమానంగా రంగంలో దిగింది. సహాయక చర్యల్లో పాల్గొంది. ‘ఇంత దారుణ పరిస్థితిలో అందరూ ఉంటే స్త్రీని కాబట్టి నేను వెనక్కు తగ్గాలా?’ అని ప్రశ్నించిందామె.వయనాడ్‌లోని చిన్న పల్లె ముప్పైనాడ్. అక్కడ అంగన్వాడి టీచర్‌గా పని చేస్తోంది 36 ఏళ్ల విజయకుమారి. జూలై 30 తెల్లవారుజామున నాలుగు గంటలకు ఫోన్ కాల్ అందుకుంది. వాళ్ల పల్లె నుంచి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న చూరల్‌మలను వరద చుట్టుముట్టిందని అందరూ ప్రమాదంలో ఉన్నారని. ఆమె అంగన్వాడి టీచర్. ప్రమాదస్థలంలో ఆమెకు ఏ విధమైన విధులు లేవు ఒక ఉద్యోగిగా. ఒక పౌరురాలిగా ఎలాంటి నిర్బంధం లేదు సేవకు. కాని ఆమె ఆగలేక΄ోయింది. వెంటనే బయల్దేరడానికి ఇంటి నుంచి బయటకు వచ్చింది. బయట భారీ వర్షం. హోరు గాలి. కన్ను పొడుచుకున్నా కానరాని చీకటి. అయినా సరే తన టూ వీలర్ తీసి చూరల్మలకు బయలుదేరింది. తెల్లవారుజాము ఐదు అవుతుండగా అక్కడకు చేరుకుంది.కాని అక్కడ కనిపించిన దృశ్యం ఆమెను అవాక్కు చేసింది. తనకు బాగా పరిచయమైనప్రాంతం, జనావాసం ఇప్పుడు కేవలం బురదదిబ్బ. ఎవరు ఏమయ్యారో తెలియదు. సహాయ బృందాలు వచ్చి అప్పుడప్పుడే సహాయక చర్యలు మొదలెట్టాయి. విజయకుమారి ఏమీ ఆలోచించలేదు. వెంటనే రంగంలో దిగింది. వారికి తనను పరిచయం చేసుకుని అగ్నిమాపక బృందం వారి షూస్, ఇనుపటోపి పెట్టుకుని రంగంలో దిగింది. ఆ తర్వాత ఆమె చేసినదంతా ఎవరూ చేయలేనంత సేవ. ‘నా ఎదురుగా మహా విపత్తు.ప్రాణంపోయిన వారు ఎందరో. ఇలాంటి సందర్భంలో స్రీగా వెనక్కు తగ్గాలా? అనిపించింది. కాని మనిషిగా ముందుకే వెళ్లాలని నిశ్చయించుకున్నాను. సహాయక చర్యల్లో పాల్గొన్నాను. తెల్లవారుజాము 5 నుంచి 8 లోపు ఎన్నో మృతదేహాలను వెలికి తీసి రవాణా చేయడంలో సాయ పడ్డాను’ అందామె.పనికి వచ్చిన కరాటే..విజయకుమారికిపోలీసు కావాలని చిన్నప్పటి నుంచి కోరిక.పోలీసు కావాలని కరాటే నేర్చుకొని బ్రౌన్ బెల్ట్ వరకూ వెళ్లింది. అంతేకాదు పరీక్షలు రాసిపోలీస్గా సెలెక్ట్ అయ్యింది కూడా. కాని వాళ్ల నాన్నకు ఆమె ఆ ఉద్యోగం చేయడం ఇష్టం లేదు. అపాయింట్మెంట్ లెటర్ చింపేశాడు. ఆమె అంగన్వాడి టీచర్‌గా మిగలాల్సి వచ్చింది. పోలీస్ కావాలని నేను తీసుకున్న కరాటే శిక్షణ, చేసిన ఎక్సర్సైజులు నాకు ఈ సమయంలో తోడు వచ్చాయి. రక్షణ దళాలతో సమానంగా నేను కష్టపడ్డాను. మనిషికి మనిషి సాయం చేయాల్సిన సమయం ఇది. ముఖ్యంగా ఈ సమయంలో ఎందరో స్త్రీలు దుఃఖంతో స్పృహ త΄్పారు. సహాయక బృందాల్లో అందరూ మగవారే ఉంటారు. వారు ఓదార్చలేరు. కాని నేను స్త్రీని కావడం వల్ల వారిని దగ్గరకు తీసుకొని ఓదార్చగలిగాను. ఇలాంటి సందర్భాల్లో స్త్రీలు ఉండాలి స్త్రీల కోసం’ అంటుంది విజయకుమారి. ఆమె సేవలను అందరూ మెచ్చుకుంటున్నారు. -
ఒకరోజు వర్షాకాలం ఉదయాన్నే.. నదికి వెళ్లిన ముని..
శృంగవరం అడవుల్లో ఆశ్రమ జీవితం గడిపేవాడు ముని శతానందుడు. ఉదయాన్నే లేచి దైనందిన కార్యక్రమాలు పూర్తి చేసుకుని, తపస్సు చేసుకునేవాడు. ఆ ఆశ్రమం చుట్టూ పూల మొక్కలు, పండ్ల చెట్లు, పొదలు దట్టంగా ఉండేవి. ఆ ప్రశాంత వాతావరణానికి అలవాటు పడిన జంతువులు, పక్షులు అక్కడ సేదతీరడానికి ఇష్టపడేవి.ముని కూడా వాటిపట్ల దయతో ప్రవర్తించేవాడు. అవెప్పుడైనా జబ్బు చేస్తే, గాయపడితే వనమూలికలు, ఆకు పసర్లతో వైద్యం చేసేవాడు. అలా మునికి, వాటికి మధ్య స్నేహం కుదిరింది. ముని ధ్యానంలో మునిగిపోతే తియ్యటి పండ్లు, దుంపలు, పుట్ట తేనెను తెచ్చి ముని ముందు పెట్టేవి. ఆశ్రమ ప్రాంగణంలో ఆ జంతువులు, పక్షులు జాతి వైరం మరచి కలసిమెలసి ఉండేవి.ఒక వర్షాకాలం.. ఉదయాన్నే నదికి వెళ్లిన ముని తిరిగి వస్తూండగా.. జారి గోతిలో పడిపోయాడు. ఎంతప్రయత్నించినా పైకి లేవలేకపోయాడు. బాధతో మూలుగుతూ చాలాసేపు గోతిలోనే ఉండిపోయాడు. స్నానానికి వెళ్లిన ముని ఇంకా ఆశ్రమానికి తిరిగిరాలేదని ఒక చిలుక గమనించింది. ఎగురుకుంటూ నది వైపు వెళ్లింది. గోతిలో మునిని చూసింది. ఆయన ముందు వాలింది. ఆయన చెప్పగా ప్రమాదం గురించి తెలుసుకుంది. వెంటనే ఆశ్రమానికి వెళ్లి అక్కడున్న జంతువులన్నిటికీ చెప్పింది.వెంటనే ఏనుగు, ఎలుగుబంటి, గుర్రం, మేక, కోతి పరిగెడుతూ ముని ఉన్న గోతిని చేరాయి. ‘భయపడకండి మునివర్యా.. మిమ్మల్ని బయటకు తీస్తాము’ అని మునికి భరోసానిచ్చాయి. గోతి లోపలకి వెళ్ళడానికి దారి చేసింది ఏనుగు. తన తొండంతో మునిని లేపి గుర్రం మీద కూర్చోబెట్టింది. అలా ఆ జంతువులన్నీ కలసి మునిని ఆశ్రమానికి చేర్చాయి. వనంలోని మూలికలు, ఆకులను సేకరించి మునికి వైద్యం చేశాయి. చిలుక వెళ్లి తియ్యటి పండ్లను, కుందేలు వెళ్లి దుంపలను తెచ్చి మునికి ఆహారం అందించాయి.అలా అవన్నీ.. మునికి సేవలు అందించసాగాయి. నెల గడిచేసరికి ముని పూర్తిగా కోలుకున్నాడు. అవి తనకు చేసిన సేవకు ముని కళ్లు ఆనందంతో చిప్పిల్లాయి. ‘నా బంధువులైనా మీ అంత శ్రద్ధగా నన్ను చూసేవారు కాదు. మీ మేలు మరువలేను’ అన్నాడు శతానందుడు వాటితో. ‘ ఇందులో మా గొప్పదనమేమీ లేదు మునివర్యా..! మీ తపస్సు ప్రభావం వల్లనేమో మేమంతా జాతి వైరాన్ని మరచిపోయి ఒక్కటయ్యాం. మీ ఆశ్రమ ప్రాంగంణంలో.. మీ సాంగత్యంలో హాయిగా బతుకుతున్నాం. మీరు మాకెన్నోసార్లు వైద్యం చేసి మా ప్రాణాల్ని కాపాడారు.కష్టంలో ఉన్న ప్రాణిని ఆదుకోవాలనే లక్షణాన్ని మీ నుంచే అలవర్చుకున్నాం. మీకు సేవలందించాం. మీరు త్వరగా కోలుకోవాలని కోరుకున్నాం. ఆ భగవంతుడు మా మొర ఆలకించాడు. మీరు కోలుకున్నారు. ఇప్పుడే కాదు ఎప్పుడూ మిమ్మల్ని మా కంటికి రెప్పలా కాచుకుంటాం మునివర్యా..’ అన్నది ఏనుగు. ‘అవునవును’ అంటూ మిగిలినవన్నీ గొంతుకలిపాయి. ఆప్యాయంగా వాటిని తడిమాడు శతానందుడు. – నారంశెట్టి ఉమామహేశ్వరరావు -
సీఐ ఔదార్యం.. పోలీసుల చేయూత..
వరంగల్: కొడకండ్ల మండలంలోని రామన్నగూడెం గ్రామానికి చెందిన కోక సోమయ్య ఇల్లు భారీ వర్షాలకు కూలిపోగా.. అతడికి పోలీసులు చేయూత అందించారు. సీఐ విశ్వేశ్వర్ ఆధ్వర్యంలో సోమయ్యకు కొడకండ్ల, పాలకుర్తి ఎస్సైలు శ్రవణ్, తాళ్ల శ్రీకాంత్, రమేష్‌నాయక్ శుక్రవారం రూ.5 వేలు విలువైన నగదు, బియ్యం, సామగ్రి సాయం అందించారు. కార్యక్రమంలో సర్పంచ్ లింగయ్య తదితరులు పాల్గొన్నారు. -
గురువాణి – 3: ఆ.. నలుగురి కోసం కూడా...
వ్యక్తి ఒక్కడుగా చేయవలసిన త్యాగం ఉంటుంది. ఒక్కడుగా పదిమందికి చేయవలసిన ఉపకారం ఉంటుంది. పదిమందీ కలిసి వ్యవస్థకు చేయవలసిన ఉపకారం ఉంటుంది. తను ఉంటున్న ఇంటిలోని బావిలో మంచినీటి ఊట ఉంది. చుట్టుపక్కల ఎవరి బావిలోనూ లేదు. తాను పట్టుకోవడంతోపాటూ ఇరుగుపొరుగుకూ మంచినీటిని పట్టుకోవడానికి అనుమతించగలగాలి. ఒక ధనవంతుడున్నాడు. ఊరిలో మంచి నీటి ఎద్దడి ఉంది. పదిమందికి పనికొచ్చేలో అందరికీ అందుబాటులో ఒక బావి, ఒక చెరువు తన తాహతుకు తగ్గట్టు తవ్వించగలగాలి. ఒక గుడి కట్టించగలగాలి. గుడి తానొక్కడే కట్టించినది కావచ్చు. కానీ దేవుడి బట్టలు ఉతకడానికి ఒక వ్యక్తి కావాలి. పల్లకి పట్టుకోవడానికి పదిమంది కావాలి. మంగళవాయిద్యాలు మోగించడానికి ఓ నలుగురు కావాలి. వేదం వచ్చినాయన వేదం చదువుతాడు. నాట్యం వచ్చినామె నాట్యం చేస్తుంది. పాటపాడగలిగినవాడు మంచి కీర్తనలు పాడతాడు. గుడిని శుభ్రపరిచేవాళ్ళు శుభ్రపరచాలి. కాగడా పట్టుకోగలిగిన వాడు అది పట్టుకుంటాడు. ఎవరికి ఏది చేయగలిగిన శక్తి ఉంటే గుడి ద్వారా సమాజానికి చేస్తారు. పదిమంది కలిసి ద్రవ్యం కానుకగా ఇస్తారు. భగవంతుడికి నివేదన చేసిన ప్రసాదాన్ని అరమరికలు లేకుండా అందరికీ పెట్టి పంపిస్తారు. అందరూ కలిసి అందరికీ ఉపయోగపడడం అంటే ఇదే. ఇది నేర్పడానికే మనకు దేవాలయ వ్యవస్థ వచ్చింది. అందరూ కలిసి విడివిడిగా ఒక వ్యవస్థ ద్వారా అందరికీ సేవ చేస్తున్నారు. నువ్వు పట్టుకుపోయేదేమీ లేదు. ఇక్కడ నువ్వు ఏది చేసావో అది పుణ్యంగా మారుతోంది. నిజానికి నువ్వే అభ్యున్నతిని పొందుతున్నట్టు. నాకు సంగీతం వచ్చు. నేనెంతో కష్టపడి నేర్చుకున్నా. ప్రతిఫలం లేకుండా నేనిది అందరికీ ఎందుకు నేర్పాలి... అని నేను ఆలోచించాననుకోండి. విద్య ఏమయిపోతుంది ? చిన్నగుంటలో నిలిచిన నీళ్ళు కొద్దిరోజులకు ఆవిరయిపోయి ఎండిపోయినట్లు అది ఎవరికీ పనికి రాదు. కానీ నిస్వార్థంగా సంతోషంగా నలుగురికీ పంచిపెట్టేదేదో అది పుణ్యంగా మారిపోతుంది. పదిమందికి అన్నం పెట్టవచ్చు. పేదవారికోసం ఓ కళ్యాణ మంటపం కట్టి ఉచితంగానో తక్కువ డబ్బుకో దానిని ఇవ్వవచ్చు. ఇక్కడ ఉండి శరీరం వదిలిన తరువాత నీ శరీరం ఇక్కడే ఉండిపోతుంది. కానీ ఒకరికి పెట్టిందేదో అది పుణ్యంగా మారి నీతో వస్తుంది. నువ్వు అనుభవించక, ఒకరికి పెట్టక, నువ్వు సాధించేముంది? ‘‘లక్షాధికారైన లవణమన్నమెగాని మెరుగు బంగారంబు మింగబోడు...’’ ఎంత డబ్బుంటే మాత్రం ఆకలేసినప్పుడు బంగారంతో పొట్టనింపుకోలేవు గదా... అందరిలాగే ఉప్పు, పప్పుతోనే నింపుకోవాలి. అందుకే స్వార్థం మానుకొని నలుగురిని గురించి కూడా ఆలోచిస్తూ ఉండాలి. మీరు సంపాదించిన దానిలో శాస్త్రం అంగీకరించిన మేర అంత దాచుకోండి. ఎంత అనుభవించాలో అంత అనుభవించండి. ఉండీ దరిద్రంగా బతకమని ఏ శాస్త్రమూ చెప్పలేదు. జీవుడికి పునర్జన్మ ఉందని జ్ఞాపకం పెట్టుకొని పదిమందిని ఆదుకోండి. లేకపోతే జన్మకు అర్థం లేదు. వేమనగారు చెబుతున్నది కూడా అదే... ‘‘ధనము కూడబెట్టి దానంబు చేయక/తాను దినక లెస్స దాచుకొనగ/ తేనెటీగ గూర్చి తెరువరికియ్యదా/ విశ్వదాభిరామ వినుర వేమ.... ’’ దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వర రావు పంతులుగారు అమృతాంజన్ వ్యాపారం పెట్టి... చాలా సంపాదించారు. అంతా తానే ఉంచేసుకోలేదు. కుటుంబం కోసమే దాచిపోలేదు. ఎన్నెన్ని దానధర్మాలు చేసారో, స్వాతంత్య్ర సంగ్రామం కోసం ఎంతెంత ఖర్చు చేసారో, ఎంతెంత మంది పేదవారికి ఉపాధి కల్పించారో తెలిస్తే ఆశ్చర్యపోతాం. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
ఆమె వివరాలు చెప్పండి.. నా వంతు సాయం చేస్తా: కేటీఆర్
తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్.. సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటారు. ఎవరైనా బాధితులు.. సాయం కోసం సోషల్ మీడియాలో కేటీఆర్‌ను సాయం అడిగితే వెంటనే స్పందించి.. వారికి తన వంతు సాయం అందిస్తుంటారు. తాజాగా ఓ వీడియో చూసి చలించిపోయిన కేటీఆర్.. బాలిక వివరాలను చెప్పాలని ఆమెకు సాయం అందిస్తానని ట్విట్టర్ వేదికగా కామెంట్స్ చేశారు. వివరాల ప్రకారం.. బీహార్‌లోని సివాన్ జిల్లాకు చెందిన ప్రియాన్షు కుమారి ఒకే కాలుతో రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న పాఠశాలకు వెళ్లి చదువుకుటోంది. తన బాల్యం నుంచి ఇలాగే వెళ్లాల్సి వస్తోందని ప్రియాన్షు ఆవేదన వ్యక్తంచేసింది. ప్రభుత్వం తనకు కృతిమ కాలు అందించాలని వేడుకుంది. తనకు డాక్టర్ కావాలని ఉందంటూ చెప్పుకొచ్చింది. దీనికి సంబంధించిన వీడియోను ఏఎన్ఐ వార్తా సంస్థ ట్విటర్లో పోస్ట్ చేసింది. ఈ వీడియోను చూసిన కేటీఆర్.. చలించిపోయి సాయం అందించేందుకు ముందుకు వచ్చారు. ట్విట్టర్ వేదికగా స్పందింస్తూ.. ఆ చిన్నారి వివరాలను పంపాలని కోరారు. తన వంతుగా ఆమెకు సాయం చేస్తానని హామీ ఇచ్చారు. If someone at @ANI can me the girl’s contact details, will be my pleasure to help (in my personal capacity) the young one achieve her dreams https://t.co/5gBoFAsIv0 — KTR (@KTRTRS) July 1, 2022 ఇది కూడా చదవండి: TSRTC: తిరుమల వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్ -
పిల్లల కథ: తన వంతు సాయం
గుర్ల అనే గ్రామంలో నివసించే శశిధరుడికి బాగా డబ్బుంది. పండే పొలాలు కూడా చాలా ఉన్నాయి. ఐతే ఎవరైనా అవసరం పడి చేయి చాస్తే మాత్రం ఇవ్వడానికి ముందుకొచ్చేవాడు కాదు. ఈ ప్రవర్తన భార్య సుగుణకి నచ్చేది కాదు. ‘మీ మిత్రుడు చరితాత్ముడిని చూసి సిగ్గు తెచ్చుకోండి. ఆయన గుణం ఎంత మంచిది! ఎందరికో ఉత్తి పుణ్యాన దానాలు చేస్తూంటాడు. తను చేసిన దానాలను కూడా ఎవరికీ చాటద్దంటాడు. తన వ్యాపారంలో వచ్చే లాభాలన్నీ దానాలకే ఖర్చు పెడతారు. గుప్త దానమే గొప్పదంటాడు’ అని భార్య చెప్పాక శశిధరుడిలో ఒక వింత ఆలోచన పుట్టుకొచ్చింది. వెంటనే చరితాత్ముడిని కలవడానికెళ్ళాడు. ఆ సమయంలో ఎవరో పొరుగూరి రైతులు తమకు పంట నష్టం వచ్చిందని చెప్పి ఆదుకోమంటున్నారు చరితాత్ముడిని. ‘నేను మిమ్మల్ని ఆదుకున్న సంగతి బైటకు పొక్కనీయవద్దు. ఆ షరతు మీదే మీకు సాయపడగలను’ అని చెప్పాడు చరితాత్ముడు రైతులతో. దానికి వాళ్లు అంగీకరించి చరితాత్ముడి దగ్గర ధన సహాయం తీసుకుని వెళ్లిపోయారు. అప్పుడు శశిధరుడి రాకను గమనించి ‘మిత్రమా! చాలాకాలం తరువాత ఇలా దర్శనమిచ్చావేంటి?’ అంటూ మిత్రుడిని ఆహ్వానించాడు చరితాత్ముడు. ‘నేనొక విషయం విన్నాను. ఇప్పుడు స్వయంగా చూశాను. ఎన్ని దానాలు చేసినప్పటికీ పైకి చెప్పవద్దని అంటావెందుకో? నీకు పేరు రావాలని ఉండదా? ’ సందేహం వెలిబుచ్చాడు శశిధరుడు. ‘నా దృష్టిలో గుప్తదానమే మహాదానం. అది అవతలి వారిని అవసరంలో ఆదుకోవడానికే తప్ప మన గొప్ప చెప్పుకోడానికి కాదని నా ఉద్దేశం’ నిరాడంబరంగా చెప్పాడు చరితాత్ముడు. ‘నీ గుణం గొప్పదే కావచ్చు కాని ఇన్ని దానాలు చేస్తున్నప్పటికీ ఎవరికీ ఆ విలువ తెలియకపోవడం చూసి చింతిస్తున్నాను. అందువలన నువ్వు నాకొక సాయం చేయాలి’ అడిగాడు శశిధరుడు. ఏమిటో చెప్పమన్నట్లు చూశాడు చరితాత్ముడు. ‘ నువ్వు చేస్తున్న దానాలకు నీ పేరెలాగూ వద్దంటున్నావు. నీకు అభ్యంతరం లేకుంటే.. ఇకనుండీ నువ్వు ఏ దానం చేసినా అది నాదిగా చెప్పుకుంటాను. వాళ్లంతా నేనే దానం చేస్తున్నట్లుగా చెప్పుకుని నన్ను కీర్తిస్తారు. నా గురించి అందరూ గొప్పగా అనుకోవడం నాకు ఎంతో ఇష్టం’ అంటూ తన మనసులో కోరికను బైటపెట్టాడు శశిధరుడు. దానికి చరితాత్ముడు ‘నాకు కీర్తి కాంక్ష లేనప్పుడు అది నీకు దక్కితే నాకేమీ నష్టం లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా దానం చేస్తున్నది నువ్వేగాని నేనన్నది బైటపడకూడదు. దానికి కూడా నువ్వు ఒప్పుకోవాలి’ అని స్పష్టం చేశాడు. అంగీకరించాడు శశిధరుడు. ఆరోజు మొదలు చరితాత్ముడు తన దగ్గరకొచ్చిన వారికి ఏ దానమిచ్చినా సరే అది శశిధరుడిదనే చెప్పేవాడు. అలాగే వాళ్ళు కూడా బైట చెప్పడం మొదలెట్టారు. ఈ విషయం ఊరూవాడా పాకింది. ఇంతకాలం ఏనాడూ ఎవరికీ దానాలు చేయడం చూడని శశిధరుడిలో మార్పు రావడం వింత విషయంగా తోచింది అందరికీ. ఇలా ఉండగా కొంతకాలానికి చరితాత్ముడికి జబ్బు చేసి మంచాన పడ్డాడు. ఆ పరిస్థితిలో దానం కోసం ఎవరైనా వచ్చినప్పటికీ అడగడానికి సంకోచించేవారు. ఐతే చరితాత్ముడి భార్య సుమతి ‘మావారి పరిస్థితి బాగులేదన్నది మీకు తెలుసు. శశిధరుడు దానాలు చేస్తున్న సంగతి మా వారు ఇటీవల చెప్పడం నాకు తెలుసు. అందువలన ఎవరికి ఏ అవసరం వచ్చినా ఆయన దగ్గరకు వెళ్ళండి. తప్పకుండా సహాయపడతాడు’ అని పంపించడం మొదలెట్టింది. ఆ విషయం తెలుసుకున్న వాళ్లంతా తిన్నగా శశిధరుడి దగ్గరకు పోయి ‘ఇంతదాకా మీరు చేస్తున్న దానాల గురించి వింటూనే ఉన్నాం. మీరు తప్పకుండా సాయం చేయాలి’ అంటూ చేయిచాచసాగారు. గతుక్కుమన్నాడు శశిధరుడు. ఇంతవరకూ తను చేసిన దానధర్మాలు చరితాత్ముడివేనని చెప్పలేక, తను సహాయపడతానని మాటివ్వలేక గిలగిలలాడిపోయాడు. సరిగ్గా అదే సమయంలో ఊళ్ళోకి వరదలొచ్చి కొందరి ఇళ్ళు కొట్టుకుపోయాయి. అప్పుడు కొందరు ఊరిపెద్దలు శశిధరుడి దగ్గరకొచ్చి ‘ఇళ్ళు కోల్పోయిన కొందరికి ఇళ్లను కట్టించడానికి అందరినీ సాయమడుగుతున్నాం. మీరెలాగూ దానకర్ణులుగా పేరుబడ్డారు. మీ వాటా ఘనంగా ఉంటుందని ఆశిస్తున్నాం’ అన్నారు. ఇంతకాలం అయాచితంగా తనకు పేరొచ్చింది. ఇప్పుడు తన ఆస్తిలోంచి తీసివ్వడానికి మనసొప్పటంలేదు శశిధరుడికి. భర్త వాలకం కనిపెట్టిన సుగుణ ‘ఒకరి డబ్బుతో చేసిన దానాలను మీవిగా చెప్పుకుని మురిసిపోయారు. తీరా ఇప్పుడు నిజంగా మీరు చేయాల్సి వచ్చేసరికి వెనకడుగేస్తున్నారు. ఇది ఎంత మాత్రం న్యాయం కాదు. బాధల్లో ఉన్నవారికి తోడుగా నిలవడం మానవత్వమని పించుకుంటుంది. దయచేసి మీలో మార్పు తెచ్చుకోండి’ అని సున్నితంగా మందలించింది. ఇంతదాకా వచ్చి ఇప్పుడు కుదరదు అంటే అయాచితంగా తనకు వచ్చిన మంచిపేరు పోతుంది. దీన్ని నిలబెట్టుకోవడమే ధర్మమనిపించింది. మరో ఆలోచనకి తావివ్వకుండా వరదల్లో నష్టపోయిన వారిని ఆదుకోడానికి తన వంతు సాయంగా భారీగానే ముట్టచెప్పాడు శశిధరుడు. భర్తలో మార్పు చూసిన భార్య సుగుణ ఎంతగానో సంతోషించింది. (క్లిక్: జాతరలో కోతిబావ.. ఏం చేశాడంటే!) -
చేయూతలో మహా‘రాణి’
పుట్టినిల్లు, మెట్టినిల్లు రెండూ రాజవంశ కుటుంబాలే. సమాజంలో హంగూ ఆర్బాటాలతో ఎంతో వైభవంగా మహారాణిలా జీవించాల్సిన రాధికారాజే గైక్వాడ్ నిరాడంబరంగా జీవిస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. తన సాధారణ జీవనశైలికి తన తండ్రే స్ఫూర్తి అని గర్వంగా చెబుతున్నారామె. గుజరాత్ రాష్ట్రంలోని వాంకనేర్ రాయల్ కుటుంబంలో పుట్టిన∙రాధికా రాజే .. కొన్నాళ్లు అక్కడే పెరిగినప్పటికీ కుటుంబం ఢిల్లీకి మకాం మార్చడంతో తన సొంత ప్యాలెస్‌కు దూరమయ్యారు. ఢిల్లీలో స్కూలు విద్యనభ్యసించిన రాధిక సాధారణ విద్యార్థినిలా ఆర్టీసీ బస్సునే స్కూలుకు వెళ్లేవారు. తోటి విద్యార్థులతో కలిసి మెలిసి ఉండేవారు. వేసవికాలం సెలవుల్లో వాంకనేర్‌కు వెళ్లేవారు. అక్కడి స్థానికులంతా తనను మహారాణిని చూసినట్లు చూడడం రాధికకు కొత్తగా అనిపించేది. డిగ్రీ పూర్తయ్యాక.. ఇరవై ఏళ్ళ వయసులో ఆమె ఓ పత్రికలో జర్నలిస్టుగా చేరారు. ఒక పక్క పత్రికకు కంటెంట్‌ను అందిస్తూనే మరోక్క పోస్టుగ్రాడ్యుయేషన్‌ను పూర్తి చేసారు. వీరి కుటుంబంలో ఒక మహిళ ఉద్యోగం చేయడం ఇదే తొలిసారి. 21 ఏళ్ళకే పెళ్లిచేసే కుటుంబంలో పుట్టి కూడా ఉన్నత చదువులు చదివి ఉద్యోగం చేయడం విశేషం. బరోడా మహారాణి.. ఒకపక్క రాధిక తన చదువు పూర్తిచేసి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉండగానే తల్లిదండ్రులు ఆమెకోసం వరుణ్ణి వెతకడం ప్రారంభించారు. ఎంతోమందిని చూశాక బరోడా యువరాజు సమర్జిత్ సిన్హ్ గైక్వాడ్ రాధికకు నచ్చడంతో ఆయన్ని వివాహం చేసుకున్నారు. పెళ్లి అయ్యాక కూడా తన చదువుని కొనసాగిస్తానంటే ఆయన అందుకు సమ్మతించడమేగాక చదువుకునేందుకు ప్రోత్సహించారు కూడా. వివాహం తరవాత బరోడాలోని లక్ష్మీ విలాస్ ప్యాలెస్ రాధికకు స్థిర నివాసంగా మారింది. రాజా రవివర్మ పెయింటింగ్స్ చూసి... బరోడా ప్యాలెస్ గోడలపై రాజా రవివర్మ పెయింటింగ్స్ చూసిన రాధిక.. పాతకాలం నాటి కళాఖండాలు, నేత పద్ధతులు, చేతివృత్తులు ఎంత అద్భుతంగా ఉన్నాయో అనుకుని వీటిని ఇప్పుడు కూడా ప్రోత్సహించాలని నిర్ణయించుకున్నారు. ఇలా స్థానికులకు కూడా ఆర్థికంగా తోడ్పడవచ్చన్న ఉద్దేశ్యంతో తన అత్తగారితో కలిసి నేత పద్ధతులు, చేతివృత్తులను ప్రోత్సహించడం మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే ముంబైలో వీరి తొలి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయగా ఉత్పత్తులన్నీ అమ్ముడయ్యాయి. లాక్డౌన్ సమయంలోను రాధిక చేతివృత్తుల కార్మికులకు అండగా నిలబడ్డారు. దీనికోసం వారు చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో పర్యటించి అక్కడి వారి పరిస్థితులను సోషల్ మీడియాలో పోస్టు చేసి దాతల ద్వారా అందిన సహాయ సహకారాలను వారికి అందించారు. అలా దాదాపు ఏడు వందల మంది కుటుంబాలను ఆదుకున్నారు. నాన్న దగ్గరే తొలిపాఠం నేర్చుకున్నాను.. ‘‘నేను సంప్రదాయ రాజరికపు హద్దులు దాటి బయటకు వచ్చాను. రాజరిక కట్టుబాట్లు దాటి మానాన్న గారు మహారాజ్ కుమార్ డాక్టర్ రంజిత్ సింగ్‌జి నాకన్నా ముందు బయటకు వచ్చారు. 1984 లోనే ఆయన ఐఏఎస్ అధికారిగా బాధ్యతలు చేపట్టారు. భోపాల్ గ్యాస్ విషాదం జరిగినప్పుడు నాన్న కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో ఆయన ్రçపజల ప్రాణాలు కాపాడేందుకు ఎటువంటి భయం లేకుండా పోరాడారు. అప్పుడు నాకు ఆరేళ్ళు. ఆ రోజు రాత్రి నాన్నగారి నుంచి నేను తొలిపాఠం నేర్చుకున్నాను. సమస్య వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలి, సేవచేయడంలో ఉన్న ఆనందం ఏంటో ఆ రోజు అర్థమయ్యింది. అప్పటినుంచి ఒక రాజకుటుంబానికి చెందిన అమ్మాయిగా కాక సాధారణ జీవితం గడిపేందుకు ప్రయత్నించాను. ఈ విషయంలో అమ్మకూడా ప్రోత్సహించేవారు. అందుకే నా ఇద్దరు కూతుర్లకు ఎటువంటి కట్టుబాట్లు పెట్టడం లేదు. వాళ్లకు నచ్చిన విధంగా చేయండని ప్రోత్సహిస్తున్నాను’’ అని రాధికరాజే చెప్పారు. నాన్నతో రాధికారాజే గైక్వాడ్ -
లాక్డౌన్: అమ్మలా.. ఆకలి తీరుస్తున్నాడు
సాక్షి, వనపర్తి: కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. దీంతో కోవిడ్ బాధితులతో పాటు సహాయకులకు భోజనం అందక పస్తులుండాల్సి వస్తోంది. ఇలాంటి సమయంలో రెండు పూటలా భోజనంతో పాటు బాధితులకు ఉచితంగా మందులు పంపిణీ చేస్తూ అండగా మేమున్నామంటూ జిల్లాకేంద్రానికి చెందిన పలువురు భరోసా కల్పిస్తున్నారు. అమ్మలా ఆకలి తీరుస్తున్నారు. నవోదయ ఓల్డేజ్ హోం ఆధ్వర్యంలో పలువురు యువకులు కరోనా బాధితులతో పాటు ఆస్పత్రికి వచ్చే రోగులు, యాచకులకు రోజు అన్నం ప్యాకెట్లతో పాటు గుడ్డు, అరటిపండు అందిస్తున్నారు. 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న బాధితులకు సైతం ప్రత్యేక వాహనంలో వెళ్లి పంపిణీ చేస్తున్నారు. సెల్‌నంబర్ 9052507793కు కాల్ చేసి బాధితుల వివరాలు తెలియజేస్తే అందించేందుకు సిద్ధంగా ఉన్నామని నిర్వాహకుడు రాము తెలిపారు. జిల్లాకేంద్రానికి చెందిన జర్నలిస్టు రహీం 12 రోజులుగా రాత్రిళ్లు రోడ్లపై ఉండే యాచకుల కడుపు నింపుతున్నారు. ఆయన సేవలను గుర్తించిన డీఎస్పీ కిరణ్‌కుమార్ తనవంతుగా రూ.7 వేల సాయం అందజేశారు. ఈ సేవా కార్యక్రమంలో రహీం స్నేహితులు కూడా తమవంతు సాయం అందిస్తున్నారు. ఆహార ప్యాకెట్లను సిద్ధం చేస్తున్న నవోదయ ఓల్టేజ్ హోం నిర్వాహకులు జనరల్ ఆస్పత్రిలో కోవిడ్ బాధితులకు భోజనాలు బ్రహ్మంగారికాలనీ మిత్రబృందం వారు స్వయంగా వంట చేసి ఆహార ప్యాకెట్లను జిల్లా ఆస్పత్రిలోని కోవిడ్ బాధితులు, రోగులకు మధ్యాహ్నం సమయంలో అందజేస్తూ ఆకలి తీరుస్తున్నారు. కాలనీ యువకుల సహకారంతో వారం రోజులుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని.. ప్రతి ఆదివారం మాంసాహారం అందించనున్నట్లు కౌన్సిలర్ బ్రహ్మం తెలిపారు. రోజూ 200 మందికి భోజనం పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. గతేడాది లాక్డౌన్ సమయంలోనూ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించి పలువురికి ఆదర్శంగా నిలిచారు. -
సాయం చేయడంలో ఉన్న ఆనందం
మా చిన్నమ్మాయి తన వృద్ధ తల్లిదండ్రులను చూడటానికి రోజూ సాయంత్రం వస్తుంటుంది. ఒకరోజు తనతో ఒకమ్మాయిని వెంటబెట్టుకొ చ్చింది. తన ‘మెంటీ’ (మెంటర్ పర్యవేక్షించేది మెంటీ) అని పరిచయం చేసింది. ఈ పదం నిఘంటువులో ఉందో లేదో నాకు తెలియదు. నీనా చెప్పేదే మంటే ఆ అమ్మాయికి తానో మార్గదర్శిలా ఉంటున్నా నని. నా పెద్దకూతురు ఆనా కూడా ఇంకో అమ్మాయిని ఇలా చూసుకుంటోంది. ఈ ఇద్దరు ‘మెంటీలు’ తమ హైస్కూలు పూర్తి చేసుకుంటున్నారు. తమ స్పోకెన్ ఇంగ్లిష్‌ను మెరుగు పరుచుకుంటున్నారు. ఈ అమ్మాయిలను నా కూతుళ్లు కలవడం ఎలా తటస్థించింది? ఢిల్లీ నుంచి ముంబయి వెళ్తున్న విమానంలో ఒక మహిళ నీనాకు తారసపడింది. కలిగిన కుటుంబాల వాళ్లు ఇట్లా ఇళ్లల్లో పనిచేసుకునే కుటుం బాల ఆడపిల్లలను మెరుగుపరిచే ప్రాజెక్టు ఒకటి నడుస్తోందట. అధునాతన మహిళలతో గనక ఆ పేద ఆడ పిల్లల సంపర్కం జరిగితే వాళ్లు కనీసం జీవితంలో ఊహించను కూడా లేని ఉద్యోగాల్లోకి ప్రవేశించగలిగే ఆత్మవిశ్వాసం వారికి కలుగుతుంది. ఇలాంటి ఆడపిల్లల తండ్రులు కార్లు నడుపుతుంటే, తల్లులేమో ఇళ్లల్లో పని చేస్తున్నారు. ఆనా మార్గదర్శనం చేస్తున్న ముస్లిం అమ్మాయి జూనియర్ కాలేజీలో చదువుతోంది. నీనా చూసుకుంటున్న అమ్మాయి ముంబయిలో ఉంటున్న కొంకణ్ ప్రాంతీయురాలు. ఈ అమ్మాయిలను ఇట్లా కలిసేలా చేసిన సంస్థ ఢిల్లీలో సుమారు మూడు దశాబ్దాలుగా పనిచేస్తోంది. దాని పేరు ఉదయన్ కేర్. 2016 నుంచీ దాని కార్యకలాపాలు ముంబయికి విస్తరించాయి. ఆ సంస్థ మార్గదర్శనంలో ఒకమ్మాయి బ్రిటన్‌లో సైన్సులో పీహెచ్డీ చేసింది. కిరణ్ మోదీ 27 ఏళ్ల కింద ఉదయన్ కేర్ ప్రారంభించారు. దీనికి దేశవ్యాప్తంగా ఇరవైకి పైగా కేంద్రాలున్నాయి. పదివేలమంది అమ్మాయిల జీవితాల్లో ఉదయన్ మార్పు తేగలిగింది. ఇలాంటి అంకితభావాన్నే నేను శాంతా క్రూజ్‌లో చూశాను. అక్కడ మాజీ ఎంపీ విఠల్ బాలకృష్ణ గాంధీ నెలకొల్పిన యూఎస్వీ ఫార్మా కంపెనీ ఉంటుంది. దానికి ఇప్పుడు చైర్‌పర్సన్‌గా ఉన్న ఆయన మనవరాలు లీనా గాంధీ తివారీ వాళ్ల నానమ్మ సుశీలా గాంధీ పేరు మీదుగా ఈ దాతృత్వ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. కార్పొరోట్ సామాజిక బాధ్యత అనే నియ మాలు రాకపూర్వం నుంచే లీనా కంపెనీ చుట్టుపక్కల ఉండే పేదమ్మాయిలను విద్యావంతులుగా తీర్చిదిద్దడంలో మునిగివుంది. ఈమెను నేను మా ఐపీఎస్ బ్యాచ్‌మేట్ సోనమ్ వాళ్లింట్లో కలిశాను. ముందు డాన్సు క్లాసులు, తర్వాత డ్రామా క్లాసులు పెట్టగానే ఆ పిల్లలు ఆకర్షితులయ్యారట. నెమ్మదిగా వారికి స్పోకెన్ ఇంగ్లిష్, లెక్కలు చెప్పడం మొదలుపెట్టారు. వాళ్ల భర్త ప్రశాంత్ లెక్కలు చెబుతాడు. పాతవాళ్లు, కొత్తవాళ్లు అందరి పేర్లూ లీనాకు తెలుసు. నాకు తెలిసిన ఇంకో ముస్లిం మహిళ ముంతాజ్ బాట్లీవాలా తన సంపాదనలోంచి చాలా పెద్దమొత్తం పేద ముస్లిం ఆడపిల్లల కోసం ఖర్చుచేస్తోంది. ముంతాజ్, ఇంకా వాళ్ల చెల్లె షానీమ్ వాళ్ల వారసత్వపు ఇంటిని అనాథాశ్రమంగా మార్చారు. సుమారు యాభై మంది అందులో ఉండి చదువుకుంటున్నారు. ముంతాజ్ యోగా గురువు బీకేఎస్ అయ్యంగార్ శిష్యురాలు. ఆయన ఉన్నరోజుల్లో ప్రతి సంవత్సరం అక్కడికి వచ్చేవారు. ఆశ్రమం సాయంత్రం క్లాసుల్లో యోగా తప్పనిసరి. చూడాలేగానీ ముంబయిలో ఇతరులను పట్టించుకోవడానికి సిద్ధంగా ఉండే మనుషులను వెతకడం పెద్ద కష్టమేమీ కాదు. అయితే ఇట్లా కలిగిన ఇళ్లల్లోని మహిళలు పేద అమ్మాయిలు జీవితంలో పైకిరావ డంలో సాయపడితే, ఇలాంటి ధనికులే తమ ఇళ్లల్లో ఊడ్చుకోవడం, వండుకోవడం, ఉతుక్కోవడం లాంటి పనులు తమకు తామే చేసుకోవాల్సి వస్తుంది. పాశ్చాత్యులు ఇలాంటి పనులు స్వయంగా చేసుకుంటారు. మనం కూడా అమెరికన్లలాగా, యూరోపియన్లలాగా అలాంటి జీవితానికి సర్దుకుపోవడం నేర్చుకుందాం. కోవిడ్ లాక్డౌన్ కాలంలోనే ఈ దిశగా ఒక అడుగైతే పడింది. - జూలియో రీబేరో వ్యాసకర్త మాజీ పోలీసు ఉన్నతాధికారి, దౌత్యవేత్త, పద్మభూషణ్ పురస్కార గ్రహీత -
చెవిన ఇల్లు కడుతున్న మేస్త్రి
విప్లవ వీరుడు.. అల్లూరి. విప్లవ చిత్రాల కార్మికుడు.. ఆర్.నారాయణమూర్తి. మేస్త్రి బాబ్జీకి వీళ్లిద్దరూ ఆదర్శం. ఆ వీరుడి సమర శీలత.. ఈ కార్మికుడి సేవాభావం.. బాబ్జిని నడిపిస్తున్నాయి. చాలాదూరం నడిచాడు. ఇప్పుడు ‘చైతన్యరథం’ ఎక్కాడు. లాక్డౌన్ కష్టాలను తీరుస్తూ.. కరోనాతో కేర్‌ఫుల్‌గా.. సాటివారితో కనికరంగా ఉండమని చెబుతున్నాడు. లాక్‌డౌన్‌తో చాలామందికి ఉద్యోగాలకు, ఉపాధికి దూరమై ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏరోజుకారోజు జీవనాధారం వెదుక్కునే చిరుజీవులకైతే పనులే లేకుండా పోయాయి. ఎన్నో కుటుంబాలు పస్తులుంటున్నాయి. అలాంటి వారిని తనకు చేతనైనంతలో ఆదుకునేందుకు ముందుకొచ్చాడు తూర్పుగోదావరి జిల్లాలోని కోటనందూరు గ్రామానికి చెందిన తాపీ మేస్త్రీ లక్కాకుల బాబ్జీ. బాబ్జికి విప్లవ చిత్రాల నటుడు, నిర్మాత, దర్శకుడు ఆర్.నారాయణమూర్తి అంటే అభిమానం. ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ కరోనా కష్టకాలంలో నిరుపేదల ఆకలి తీర్చేందుకు కదిలాడు. ‘అల్లూరి సీతారామరాజు సేవా కమిటి’ పేరుతో ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి, లాక్డౌన్ ప్రారంభమైన నాటినుంచి తన మేస్త్రీ మిత్రులను కూడగట్టి వారిచ్చే ఆర్థిక తోడ్పాటుతో తూర్పు, విశాఖ జిల్లాల్లో విస్తరించి ఉన్న ఏజెన్సీ గ్రామాల్లోని ప్రజలకు నిత్యావసర సరకులు పంచిపెడుతున్నాడు. కోటనందూరు.. తూర్పు–విశాఖ జిల్లాలకు సరిహద్దు గ్రామం. లాక్డౌన్ బాధితులకు ఆహార సరుకులు పంపిణీని ప్రారంభిస్తున్న కోటనందూరు పోలీస్ అధికారులు ఏజెన్సీలో ఉన్నవారు తమ అవసరాల నిమిత్తం ఇక్కడికి వస్తుంటారు. లాక్డౌన్ సమయంలో కాలినడకన అలా వస్తున్న ఎంతోమంది బాటసారులు ఆకలితో బాధపడడం చూసిన బాబ్జి వారి కోసం కూడా ఆహార పంపిణీ చేపట్టాడు. అంతేకాదు, వైరస్ విస్తరించకుండా ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు ఇప్పుడు నగరాలు, గ్రామాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా అవగాహన కల్పించేందుకు కార్యోన్ముఖుడయ్యాడు. తన పాత ద్విచక్ర వాహనాన్ని చైతన్యరథంగా మార్చి మైక్ పట్టుకుని సామాజిక దూరం పాటించాలని చెబుతున్నాడు. పరిశుభ్రత పాటించడం ద్వారానే వైరస్‌ను నిరోధించగలం అని అవగాహన కల్పిస్తున్నాడు. ఇప్పటికి దాదాపు 200 గ్రామాలతో పాటు విశాఖపట్నం, కాకినాడ నగరాల్లో ప్రచారం చేశాడు. బాబ్జీ ఇలా అవగాహన కార్యక్రమాలు చేపట్టడం ఇదే మొదటిసారి కాదు. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు తూర్పుగోదావరి జిల్లాల్లోని కోటనందూరు, అల్లిపూడి గ్రామాల్లో ఆనాడు తిరిగారు. ఆ విషయాన్ని చెప్పేందుకు బాబ్జి గతంలో ఆయా గ్రామాల్లోని పాఠశాలల్లో సీతారామరాజు విగ్రహాలను ఏర్పాటు చేయించి ఆనాటి చరిత్రను నేటి విద్యార్థులకు తెలిసేలా చేశాడు. తనెంతో అభిమానించే ఆర్. నారాయణమూర్తి గత ఏడాది జరిగిన ఓ కార్యక్రమంలో తనను అభినందించడం బాబ్జిలోని సామాజిక సేవా భావనను మరింత పురికొల్పింది. – నానాజీ అంకంరెడ్డి, సాక్షి, హైదరాబాద్ ఇది నా బాధ్యత ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం ఎంతో శ్రమిస్తోంది. ప్రజలు కూడా ప్రతి ఒక్కరూ తోటివారికి సాయం చేస్తున్నారు. నా స్థాయిలో నేను చేయగలిగినంత సాయం అందిస్తున్నాను. ‘కుదిరితే సాయం చేయి గాని ఎవరికీ కీడు తలపెట్టకు’ అని నా గురువు ఆర్. నారాయణమూర్తి గారు చెప్పారు. ఆయన్ని ఆదర్శంగా తీసుకుని నా బాధ్యతను నేను నిర్వర్తిస్తున్నాను. – మేస్త్రీ బాబ్జీ -
ధోని సహాయం చేసే స్టయిలే వేరు: పంత్
న్యూఢిల్లీ: వర్ధమాన క్రీడాకారులకు సహాయం చేయడంలోనూ భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి ప్రత్యేక పద్ధతి ఉందని యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ అన్నాడు. సమస్య పరిష్కారానికి పలు విధానాలను సూచించే ధోని... చివరకు ఆ సమస్యను మనమే పరిష్కరించుకునేలా చేస్తాడని ఇన్స్టాగ్రామ్ లైవ్‌లో పాల్గొ న్న పంత్ చెప్పుకొచ్చాడు. మైదానంలోనూ, బయట ధోనినే తన మెంటార్ అని తెలిపాడు. ‘ధోని నా గురువు. ఆటలో లేదా వ్యక్తిగతంగా ఏ సమస్య వచ్చినా నేను మహీ భాయ్‌ని సంప్రదిస్తా. అప్పుడు ధోని నా సమస్యకు పూర్తి పరిష్కారం చెప్పకుండా దాన్నుంచి బయటపడే అన్ని మార్గాలను సూచిస్తాడు. ఎందుకంటే నేను పూర్తిగా ఎవరిపై ఆధారపడకూడదనేది అతని అభిమతం. క్రీజులో కూడా మహీ భాయ్ ఉంటే అంతా సవ్యంగా జరిగిపోతుంది. అతని భాగస్వామ్యం చాలా ఇష్టం. కానీ మేమిద్దరం కలిసి బ్యాటింగ్ చేయడం చాలా అరుదుగా జరుగుతుంది’ అని రిషభ్ చెప్పాడు. -
సామాన్యుల సహాయాలు
కోవిడ్ 19 దేశం మొత్తాన్ని లాక్డౌన్ చేసేసింది. ఉపాధి పోతోంది. తిండి గింజలు కరవవుతున్నాయి. ఈ గడ్డుకాలంలో నిరుపేదలను, వలస కూలీలను, మూగ జీవాలను ఆదుకునేందుకు ఎందరో సామాన్యులు శక్తికి మించిన సహాయంతో ముందుకు వస్తున్నారు. అలాంటి యోధుల్ని మనం అభినందించి తీరవలసిన సమయం కూడా ఇది. పంచడానికే పంటంతా! యదు ఎస్. బాబు (25) కేరళ రైతు. తన ఎకరన్నర పొలంలో పండుతున్న కూరగాయలను ఈ విపత్కాలంలో రోజువారీ కూలీలకు ఉచితంగా పంచిపెడుతున్నారు. ‘‘కష్టం వచ్చినప్పుడు మనిషిని మనిషే కదా అదుకోవాలి’’ అంటారు యదు బాబు. సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేస్తున్న ఈ యువకుడి దగ్గరికి రెట్టింపు ధరకు పంటను కొనేందుకు చాలామందే వస్తుంటారు. అయితే ఈసారి మాత్రం తన సాగునంతా అవసరంలో ఉన్నవారికి ఉచితంగా పంపిణీ చేయాలని బాబు నిర్ణయించుకున్నారు. ఇందుకు ఒక ఎన్జీవో సహకారం తీసుకున్నారు. బీన్స్, బీట్రూట్, ఆనప, వంకాయ వంటి కూరల్ని వారానికి వంద కిలోల దాకా పండిస్తున్నారు బాబు. అంబులెన్స్‌గా సొంత కారు ఉత్తరాఖండ్ దేవప్రయాగకు చెందిన 32 సంవత్సరాల గణేశ్ భట్ తన కారును అంబులెన్స్‌గా మార్చారు. ‘‘ప్రస్తుత పరిస్థితుల్లో 108 సర్వీసుపై ఒత్తిడి పెరగడంతో సమయానికి వారు స్పందించలేక గర్భిణులు, వయోవృద్ధులు, ఇతర ప్రాణాంతక అవసరాలలో ఉన్నవారు అవస్థలు పడుతున్నారు. అందువల్ల నా కారును అటువంటి వారి కోసం ఉపయోగిస్తున్నాను’’ అంటున్న గణేశ్ ఈ లాక్డౌన్లో ఇప్పటివరకు ఇరవై మందికి పైగా అత్యవసర స్థితిలో సాయం చేశారు. తొలిసారి ఈ ఏడాది మార్చి 21న నొప్పులు పడుతున్న ఒక గర్భిణినిని ఆసుపత్రికి చేర్చడంతో ఆయన సేవలు మొదలయ్యాయి. మూగ ప్రాణుల కోసం లాక్డౌన్ కారణంగా రెస్టారెంట్లు, ఆఫీసు క్యాంటీన్లు పూర్తిగా మూతబడటంతో మిగులు పదార్థాలు ఉండట్లేదు. ఆ కారణంగా జంతువులకు తిండి దొరకట్లేదు. వీధుల్లో కుక్కలు, ఆవులు, గేదెలు.. అన్నీ డొక్కలెండి ఉంటున్నాయి. వాటిని సంరక్షించటం కోసం నవీ ముంబైలో ఉంటున్న కరిష్మా ఛటర్జీ అనే గృహిణి ముందుకు వచ్చారు. ‘‘మనమంతా ముందుజాగ్రత్తగా సరుకులు తెచ్చుకుని ఇంట్లో పెట్టుకున్నాం. కాని జంతువులకు అది తెలియదు కదా..’ అంటున్న కరిష్మా ప్రతిరోజూ సుమారు పదిహేను కుక్కలు, పిల్లులకు ఆహారం అందిస్తున్నారు. ఆమె మాత్రమే కాదు. 21 సంవత్సరాల సగుణ్ భతీజ్వాలే (వెటర్నరీ డాక్టరుగా ఆఖరి సంవత్సరం చదువుతున్నారు) పక్షులకు, జంతువులకు, చెట్లకు సేవ చేస్తున్నారు. తన సన్నిహితులు, స్నేహితులు కూడా ఇందులో పాల్గొనేలా ప్రోత్సహిస్తున్నారు. – వైజయంతి పురాణపండ -
వైరల్ ఫోటో : ‘అమ్మ పరీక్షకెళ్లిందిగా నే ఆడించనా’
సాక్షి, హైదరాబాద్ : పోలీస్‌లనగానే దురుసుగా మాట్లాడుతూ.. జనాలను హడలేత్తిస్తుంటారనే అభిప్రాయం మనలో చాలా మందికి ఉంది. కానీ వారు అందరిలాంటి వారేనని, విధి నిర్వహణలో భాగంగా అలా ప్రవర్తిస్తుంటారనే విషయం మర్చిపోతుంటాము. ఖాకీల కరుణ హృదయానికి అద్దం పట్టే ఫోటో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. నిన్న తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ కానిస్టేబుల్ పరీక్ష జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మహబూబ్‌నగర్‌లో ఓ మహిళ తన నాలుగు నెలల చిన్నారితో కలిసి పరీక్షా కేంద్రం వద్దకు చేరుకుంది. అయితే పరీక్ష హాల్లోకి అభ్యర్థిని తప్ప ఎవరిని అనుమతించరు. దాంతో ఎగ్జామ్ రాసి వచ్చేంతవరకూ తన చిన్నారిని చూసుకోవడం కోసం తన బంధువుల అమ్మాయిని వెంట తీసుకొచ్చింది. పరీక్ష ప్రారంభం కావడంతో సదరు మహిళ తన చిన్నారిని వెంట వచ్చిన మనిషి దగ్గర వదిలి లోపలికి వెళ్లింది. కానీ తల్లి అలా వెళ్లిన క్షణం నుంచి ఆ పాప గుక్కపెట్టి ఏడవడం ప్రారంభించింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏడుపు ఆపడం లేదు. ఈ క్రమంలో పరీక్ష కేంద్ర వద్ద విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ ముజీబ్ ఉర్ రెహ్మన్ ఆ పాపను తన చేతుల్లోకి తీసుకుని సముదాయించడానికి ప్రయత్నించాడు. తాను పోలీస్ ఉద్యోగిననే గర్వం ఏమాత్రం లేకుండా చిన్నారిని ఆడిస్తున్న ముజీబ్ ‘ఫ్రెండ్లీ పోలీసింగ్’కు అసలైన ఉదాహరణగా నిలిచారు. చిన్నారిని ఆడిస్తున్న ముజీబ్ ఫోటోను రమా రాజేశ్వరి అనే ఐపీఎస్ అధికారి తన ట్విటర్లో షేర్ చేశారు. దాంతో పాటు #HumanFaceOfCops అనే హాష్ ట్యాగ్‌ను జత చేశారు. Head Constable Officer Mujeeb-ur-Rehman (of Moosapet PS) who was on duty for conducting SCTPC exam in Boys Junior College, Mahbubnagar trying to console a crying baby, whose mother was writing exam inside the hall. #HumanFaceOfCops#Empathy pic.twitter.com/QudRZbAADu — Rema Rajeshwari IPS (@rama_rajeswari) September 30, 2018 ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో నెటిజన్ల అభినందనలు అందుకుంటుంది. ముజీబ్ కూకట్పల్లి మూసాపేట పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. -
‘మతి’లేకున్నా.. మంచోడు..!
కూసుమంచి ఖమ్మం జిల్లా : ఇతడు ఇక్కడి వారందరికీ సుపరిచితుడు. అందరూ యాండో (పిచ్చోడు) అని పిలుస్తుంటారు. ఈ ఫొటో చూశారా...? ఇద్దరు వృద్ధుల చేతులు పట్టుకుని రోడ్డు దాటిస్తున్నాడు. అక్కడ ఇంకెంతోమంది ‘మంచి’మనుషులు ఉన్నారు. వారెవరూ ఇతడిలా సాయపడేందుకు ముందుకు రాలేదు. ఇప్పుడు చెప్పండి... ఇతడిని పిచ్చోడా...? పిచ్చోడిలా కనిపిస్తున్న మంచోడా...?! ఈ దృశ్యం ఖమ్మం–సూర్యాపేట రాష్ట్రీయ రహదారిలోని కూసుమంచి బస్టాండ్ సెంటర్లో కనిపించింది. ఈ రోడ్డు దాటాలంటే చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. ఇక వృద్ధుల సంగతి చెప్పనక్కరలేదు. అలాంటి రద్దీగా ఉండే రోడ్డుపై శనివారం ఇద్దరు వృద్ధులను రోడ్డు దాటించి మానవత్వాన్ని చాటుకున్నాడు. -
ఆడవాళ్లలోనే ఆ గుణం ఎక్కువట...
న్యూయార్క్ : ఇచ్చి పుచ్చుకోవడంలో ఎంతో ఆనందం ఉంటుందని ఎంతో మందికి అనుభవ పూర్వకంగా తెల్సిందే. అయితే ఈ ఇచ్చి పుచ్చుకోవడంలో మగవారికి, ఆడవారికి మధ్య ఏమైనా తేడా ఉంటుందా? ఈసందర్భంగా వారి మెదళ్లలో ఎలాంటి మార్పులు కలుగుతాయి? అన్న ప్రశ్నలక ఓ తాజా అధ్యయనం సమాధానాలు చెబుతోంది. డబ్బు రూపంలో ఒకరికి సహాయం చేయడంలో ఆడవాళ్లకు ఎక్కువ ఆనందం ఉంటుందట. ఆ సమయంలో వారి మెదళ్లలోని ఒక ప్రాంతం మరీ క్రియాశీలకంగా పనిచేస్తుందట. మగవాళ్లలో పరులకు డబ్బు ఇవ్వకుండా తమ వద్దనే దాచుకున్నప్పుడే ఎక్కువ ఆనందం కలుగుతుందట. అప్పుడు వారి మెదల్లో కూడా మహిళల్లాగానే ఒకో చోట క్రియాశీలక మార్పులు కలుగుతాయట. అంటే ఆడవాళ్లు ఇతరులకు సాయం చేసినప్పుడు వచ్చే ఆనందం ద్వారా వారి మెదడులో ఎక్కడైతే మార్పులు సంభవిస్తాయే మగవారు డబ్బును తమ వద్దనే ఉంచుకోవడం ద్వారా కలిగే ఆనందానికి కూడా వారి మెదళ్లలోకూడా అదే ప్రాంతంలో మార్పులు కలుగుతాయట. ఈ విషయాన్ని ఎంపిక చేసిన 56 మంది స్త్రీ, పురుషులపై ప్రయోగాత్మకంగా అధ్యయనం జరిపి తేల్చారు. వారిలో కొందరి మగవారిని, కొందరి ఆడవారిని మాత్రమే ఇతరులకు డబ్బులు ఇవ్వాల్సిందిగా సూచించి, మిగతా వారికి డబ్బులు తమ వద్దనే ఉంచుకోవాల్సిందిగా సూచించడం ద్వారా ఈ ప్రయోగం జరిపారు. ఈ సందర్భంగా వారి మెదళ్లలో కలిగే మార్పులను స్కానింగ్ ద్వారా నమోదు చేశారు. మగవాళ్లకన్నా, ఆడవాళ్లే ఇతరులకు సహాయం చేయడంలో ఆనందం పొందుతారని, వారిలోనే సామాజిక స్పహ ఎక్కువగా ఉంటుందన్న విసయం పదేళ్ల క్రితమే తెల్సిందని, అయితే ఈ సందర్భంగా పరస్పర విరుద్ధ ప్రవర్తనకు ఆడ, మగ ఇరువురిలోనూ మెదడులోని ఒకే ప్రాంతం స్పందిస్తుందన్న విషయం తాజా అధ్యయనంలో తేలిందని జూరిచ్ యూనివర్శిటీలో న్యూరోఎకనామిక్స్, సోషల్ న్యూరోసైన్స్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఫిలిప్పే టాబ్లర్, జార్జియా స్టేట్ యూనివర్శిటీలో న్యూరోసైన్స్ అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న అన్నే జీ మర్ఫీలు తెలిపారు. ఇచ్చిపుచ్చుకోవడంలో ఆడ,మగ ఆనందాన్ని ప్రభావితం చేస్తున్న మెదడు ప్రాంతానికి స్కిజోఫ్రేనియా లాంటి మానసిక జబ్బులను నయం చేసేందుకు ఇచ్చే మందులను ఇచ్చి కూడా అధ్యయనం జరిపామని, ఆశ్చర్యంగా ఆడవాళ్లలో ఇతరులకు ఇవ్వాలనే స్పృహ, మగవాళ్లలో తన వద్దనే ఉంచుకోవాలనే స్వార్ధ చింతన తగ్గిందని వారు చెప్పారు. ఎలుకల్లో కూడా సహజంగానే ఈ సేవా గుణం ఆడ ఎలుకల్లోనే ఎక్కువగా ఉంటుందని వారు తెలిపారు. ఆడ, మగ మెదళ్ల నిర్మాణాల్లో ఉన్న భేదాల కారణంగా వారిలో సహాయ, స్వార్థ చింతనలు కలగడం లేదని, ప్రవర్తనా రీత్యనే వారిలోగానీ, వారి మెదళ్లలోగానీ ఇలాంటి మార్పులు సంభవిస్తున్నాయని వారు తెలిపారు. ఎన్నో ఏళ్లుగా చారిత్రకంగా, సామాజిక వచ్చిన పరివర్తనే వారి ప్రవర్తనలో మార్పునకు కారణౖమై ఉంటుందని వారు అన్నారు. పిల్లలను కనడం, పోషించం లాంటి బాధ్యతల వల్ల ఆడవాళ్లలో సామాజిక సేవా గుణం వచ్చి ఉంటుందని వారు వివరించారు. వారు తమ అధ్యయన పూర్తి వివరాలను ‘నేచర్ హ్యూమన్ బిహేవియర్’ తాజా సంచికలో ప్రచురించారు. -
సామరస్యమే ఇస్లాం మూలసూత్రం
- కులమతాలకు అతీతంగా సాయపడే గుణం ఉండాలి - ముఫ్తి తల్లాసాహబ్ ఖాస్మి నక్ష్బందీ కర్నూలు(ఓల్డ్‌సిటీ): ముస్లింలు కుల, మతాలకు అతీతంగా సాయపడే గుణం కలిగి ఉండాలని ముంబయికి చెందిన ఇస్లామిక్ స్కాలర్, ముఫస్సిర్-ఎ-ఖురాన్ ముఫ్తి తల్హా సాహబ్ ఖాస్మి నక్ష్బందీ సూచించారు. జమైతుల్ ఉల్మా అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి స్థానిక ఇస్లామియా డిగ్రీ కళాశాల మైదానంలో ‘రాబోవు సమస్యలకు పవిత్ర ఖురాన్లో సూచించిన పరిష్కార మార్గాలు’ అనే అంశంపై ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక బహిరంగ సభలో నక్ష్బందీతో పాటు జమైతుల్ ఉల్మా రాష్ట్ర అధ్యక్షుడు హాఫిజ్ పీర్ షబ్బీర్ ప్రసంగించారు. అందరితో సఖ్యతగా ఉంటూ సామరస్యాన్ని కాపాడడమే ఇస్లాం మూల సూత్రమని తెలిపారు. పవిత్ర ఖురాన్‌లోనూ ఇవే అంశాలను సూచించారని, వాటిని మహమ్మద్ ప్రవక్త ఆచరించారన్నారు. ఏవైనా సామాజిక సమస్య వచ్చినప్పుడు కుల, మతాలకు అతీతంగా అందరి ఆమోదంతోనే పరిష్కరించాలన్నారు. పిల్లలకు చదువుతో పాటు నైతిక విలువలు కూడా నేర్పించాలని, అలాంటి చదువులనే ప్రోత్సహించాలని కోరారు. అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మౌలానా ఖాజీ అబ్దుల్‌మజీద్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి జిల్లావ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి ముస్లింలు తరలివచ్చారు. -
జోలి కట్టుకుని భిక్షాటన చేస్తాం: రామ్‌లక్ష్మణ్
వెయ్యి సినిమాలకు ఫైట్ మాస్టర్లుగా పనిచేశారు. ఐదు సినిమాల్లో హీరోలుగా నటించారు. ఐదు పర్యయాలు నంది అవార్డులు తీసుకున్నారు. అయినా వారిలో ఓ విధమైన నిరాశనే ఉండేది. అలాంటి దశలోనే వృద్ధులకు, అనాథ పిల్లలకు, నిస్సహాయయులకు చేయూతను అందిస్తే... అన్న ఆలోచన వారిలోని మానవత్వాన్ని తట్టిలేపింది. అంచలంచెలుగా సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ వచ్చారు. అక్కడ వారికి దొరికిన ఆనందం... ఆత్మ సంతృప్తి మరెక్కడా దొరకలేదు. దీంతో అపన్నులను ఆదుకోవడమే తమ జీవిత గమ్యంగా మార్చుకున్నారు. ఆ దిశగా అనంతపురానికి వచ్చి సేవా కార్యక్రమాలకు అవసరమైన నిధుల సేకరణలో నిమగ్నమయ్యారు. వారే ఫైట్ మాస్టర్లు రామ్, లక్ష్మణ్. సాక్షి ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను తెలుపుతూ వచ్చారు. అవి ఏమిటో చూద్దామా... సాక్షి : సినీ ఫీల్డ్ నుంచి ఇటువైపు రావాడానికి కారణం? రామ్‌లక్ష్మణ్ : ఇప్పటికే చాలామంది సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఎప్పటి నుంచో సేవా కార్యక్రమాలు చేపట్టి నిరుపేదలకు, నిస్సహాయకులకు చేయూతను అందించాలని మాలో మేమే కలలుకంటుండే వాళ్లం. ఆ కలలు సాకారం చేసుకునేందుకు చాల కష్టపడ్డాం. ప్రస్తుతం ఆచరణలో పెడుతున్నాం. సాక్షి : హీరో మహేష్‌బాబులా అనంతపురంలో ఏదైనా గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నారా? రామ్‌లక్ష్మణ్ : గ్రామాన్ని దత్తత తీసుకునేందుకు మహేష్‌బాబు వెనుక హీరో ‘సూపర్‌స్టార్’ కృష్ణ ఉన్నారు. మా వెనుక ఎవరూ లేరు. రామ్‌కు లక్ష్మణ్, లక్ష్మణ్‌కు రామ్ తప్పా. అనాథలకు చేయూతను అందించాలనే ధృడమైన సంకల్పం మాలో ఉంది. అదే ముందుకు నడిపిస్తోంది. సాక్షి : జిల్లాలో ఎలాంటి సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు? రామ్‌లక్ష్మణ్ : మా గురువు బిక్షుమయ్య ఆదేశాల మేరకు నార్పల మండలంలోని శ్రీసత్యసాయి అనాథ పిల్లల విద్యాలయానికి చేయూతను అందిస్తున్నాం. శిథిలావస్థలో ఉన్న ఈ విద్యాలయానికి ప్రస్తుతం మరమ్మతులు చేసే పనిలో నిమగ్నమయ్యాం. నాలుగు రోజులుగా అదేపనిలో ఉంటున్నాం. సాక్షి : మీకు వచ్చే రెమ్యూనిరేషన్‌తో సేవా కార్యక్రమాలు చేయడం కష్టమేమో? రామ్‌లక్ష్మణ్ : మాకు వచ్చే రెమ్యూనిరేషన్‌తో ఇప్పటికే కొన్ని సేవా కార్యక్రమాలు చేశాం. పేదలకు సహాయం చేయాలనే సంకల్పమే మమ్మల్ని నడిపిస్తోంది. వారి కోసం జోలి కట్టుకుని భిక్షాటన చేస్తాం. వచ్చే నెల అనంతపురంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టి, వచ్చిన సొమ్మును అనాథ ఆశ్రమాలకు అందించి ఆ పిల్లల బంగారు భవిష్యత్‌కు బాటలు వేస్తాం. సాక్షి : చివరిగా ప్రజలకు మీరు ఇచ్చే సందేశం... రామ్‌లక్ష్మణ్ : నేటి సమాజంలో మనుషులు ఎదిగే కొద్ది వారిలో అదే స్థాయిలో స్వార్థం పెరిగిపోతోంది. ఎంత సంపాదించినా వెనుక తీసుకెళ్లేది ఏముంది? మంచి చెడు తప్పా. ప్రతి ఒక్కరూ స్వార్థాన్ని విడనాడి ఆధ్యాత్మికతతో కూడిన సేవా భావం అలవర్చుకుని పేదలకు చేయూతను అందించేందుకు ముందుకు రావాలి. -
సన్మార్గం: జీవిత యజ్ఞంతో... జన్మ సార్థకం
మనం యజ్ఞం అనే పదాన్ని తరచు వింటుంటాం. అయితే అసలు యజ్ఞం అంటే ఏమిటి? ఎన్ని రకాలు, ఏ యజ్ఞాన్ని ఎలా చేయాలో తెలుసుకుందాం. కేవలం మంత్రాలు చదువుతూ అగ్నికి ఆహుతులు సమర్పించడమే యజ్ఞం అనుకుంటే పొరపాటే. ఒక నిర్ణీతమైన, నిర్దుష్టమైన, ఉన్నతమైన ఆశయాన్ని సాధించడం కోసం ఒక దృఢమైన, దివ్యమైన సంకల్పంతో శరీరాన్ని, మనస్సును, ఆత్మను పవిత్రంగా ఉంచుకుని దీక్షగా, ఏకోన్ముఖంగా జరిపించే కార్యక్రమమే యజ్ఞమని విజ్ఞులు చెబుతారు. అదేవిధంగా వేదవిహితమైన సంప్రదాయబద్ధమైన శుభకార్యాలన్నీ యజ్ఞాలేనని భగవద్గీత చెబుతోంది. వీటితోబాటు ఈ చరాచర సృష్టిపట్ల, భగవదత్తమైన జీవితాన్ని ప్రసాదించిన వారిపట్ల కృతజ్ఞతను ప్రకటించడమే యజ్ఞమని మరో నిర్వచనమూ ఉంది. కృతజ్ఞతాప్రకటన, నిస్వార్థ త్యాగం, నిస్వార్థ భావప్రకటనలు కూడా యజ్ఞమనే పదానికి అర్థాలుగా చెప్పబడుతున్నాయి. పండితులు యజ్ఞాలను ఐదువిధాలుగా విభజించారు. అవి దేవయజ్ఞం, పితృయజ్ఞం, రుషియజ్ఞం, మనుష్యయజ్ఞం, భూతయజ్ఞం అంటూ నామకరణం చేశారు. ఈ ఐదు యజ్ఞాలనూ ప్రతి ఒక్కరూ చేసి తీరాలని భారతీయ సంస్కృతి నొక్కి చెబుతోంది. యజ్ఞం చేయగా, పదిమందికి పంచి పెట్టగా మిగిలిన యజ్ఞశేషాన్ని మాత్రమే భుజించాలని పంచయజ్ఞ సిద్ధాంతం చెబుతోంది. యజ్ఞం చేయగా మిగిలిన ప్రసాదాన్ని అమృతం అంటారు. అలా కానిది విషతుల్యమే అవుతుంది. మొట్టమొదటిది దైవయజ్ఞం: ప్రకృతి శక్తుల్ని నిర్వహించే అద్భుతమైన చైతన్యాన్ని దైవం అనుకుంటే... ఆ విశ్వ నిర్వహణా శక్తినే దైవశక్తి అని, వాటికి కృతజ్ఞత ప్రకటించే విధానమే దైవయజ్ఞమనీ అంటారు. ప్రకృతిలోని పంచభూతాలను పంచదైవాలుగా గుర్తించి అటువంటి శక్తులన్నీ దేహంలో కూడా ఉన్నాయని పెద్దలు విశ్లేషించారు. వాటిని ఆరాధించే తత్వమే దైవయజ్ఞమనీ, మనకు లభించిన పాంచభౌతికమైన ఈ జన్మ దైవదత్తమైనది కనుక, ప్రాణశక్తిని మూలశక్తిగా ఆరాధించి, దైవశక్తిగా పూజించి, అహంకారాన్ని త్యజించమని దైవయజ్ఞ సిద్ధాంతం చెబుతుంది. రెండవది పితృయజ్ఞం: మాతృదేవోభవ, పితృదేవోభవ అంటూ ఇలపై వెలసిన ఇద్దరుదైవాలుగా జన్మనిచ్చిన కన్నతల్లిదండ్రులను గుర్తించమని ఈ యజ్ఞభావన చెబుతుంది. తల్లిదండ్రులపై ఆదరం ప్రకటించమని, ప్రేమాభిమానాలను ప్రదర్శించమని, వారిపట్ల కృతజ్ఞతాభావాన్ని ప్రకటించడమే విధ్యుక్తధర్మంగా భావించమని పితృయజ్ఞం ఆదేశిస్తుంది. ఈ యజ్ఞ నిర్వహణ వలన కుటుంబ వ్యవస్థ, తద్వారా చక్కటి సమాజ వ్యవస్థ సాధ్యపడుతుంది. మూడవది రుషియజ్ఞం: మనిషిని మనిషిగా తీర్దిదిద్ది, సంస్కార జ్ఞానాలను ప్రసాదించి, విజ్ఞానభిక్ష పెట్టిన మేధావులు మన రుషులు. మానవులు పశువులుగా జీవించకుండా తమ బోధనల ద్వారా ప్రవర్తనా నియమావళిని, వివాహ వ్యవస్థను, కుటుంబ వ్యవస్థను, సంస్కారవంతమైన నాగరిక జీవన శైలిని, సమాజాన్ని ఏర్పరచింది రుషులే. సనాతన సంప్రదాయాలకు రూపకల్పన చేసి, పథనిర్దేశం చూపి, దిశానిర్దేశం చేసిన మహానుభావులు మన రుషులు. వారిపట్ల కృతజ్ఞతను ప్రకటించడమే రుషి యజ్ఞం. మంచి గ్రంథపఠన చేయడం, మంచి అలవాట్లను అభ్యాసం చేసుకోవడం, జ్ఞానసముపార్జన చేయడం, అలా సముపార్జించిన జ్ఞానాన్ని పదిమందికీ పంచిపెట్టమని రుషి యజ్ఞం చెబుతుంది. నాలుగవది మనుష్య యజ్ఞం: సమాజంలో ఎందరి సహాయసహకారాలతోనో, సామరస్య భావనలతోనో మాత్రమే మన మనుగడ సాధ్యమవుతుంది. అందుకే మనుష్య యజ్ఞంలో భాగంగా మానవసేవ మాధవసేవ అయింది. అతిథి దేవుడయ్యాడు. అతిథిదేవోభవ అయింది. పక్కనున్న వారికి సాయమందించి, దానధర్మాలు చేయడం ద్వారా దరిద్ర నారాయణుల సేవద్వారా మాత్రమే ఈ మనుష్య యజ్ఞం సాధ్యమవుతుంది. ఐదవది...భూతయజ్ఞం: మనతోబాటు మన చుట్టూ బతుకుతున్న ఎన్నో ప్రాణులు మన జీవన విధానానికి ఆధారం కల్పిస్తున్నాయని, వాటి ఉనికిని గుర్తించి, వాటితోబాటు మనకున్న బంధాన్ని, అనుబంధాన్ని వ్యక్తీకరించడమే భూతయజ్ఞం అవుతుంది. వృక్షాలను పెంచి పోషిస్తూ, పచ్చని ప్రకృతిని, పర్యావరణాన్ని స్థాపించడంలోనూ, జంతువులకు కూడా ఆహారాన్ని సమకూర్చి, వాటికి రక్షణ కల్పిస్తూ ఆదుకునేందుకు, జీవన సమతుల్యాన్ని సాధించడంలో ఈ భూతయజ్ఞం సాయపడుతుంది. జీవితాన్నే ఒక పవిత్రమైన యజ్ఞమనుకుంటే... మన జీవిత కాలమంతా యజ్ఞసమయమే! అన్నయజ్ఞంతో ఆరంభించిన దైనందిన జీవితం ప్రకృతిలోనే పరమాత్మను దర్శించే దైవయజ్ఞాన్ని, మాతాపితరుల సేవ చేసే పితృయజ్ఞాన్ని, సనాతన సంస్కృతీ సంప్రదాయాలకు అనుగుణంగా జీవితాన్ని మలుచుకునే రుషి యజ్ఞాన్ని, తోటి మనుషులకు సహాయ సహకారాలనందిస్తూ, సానుభూతిని ప్రదర్శించే మనుష్య యజ్ఞాన్ని, ప్రకృతి సమతుల్యాన్ని సాధిస్తూ అహింసా సిద్ధాంతాన్ని పాటిస్తూ, మరెన్నో జీవులకు ఆశ్రయం, ఆధారం కల్పిస్తూ భూతయజ్ఞాన్ని నిర్వహించగలిగితే.... జన్మ సార్థకమైనట్లే! - సూర్యప్రసాదరావు పండితులు యజ్ఞాలను ఐదువిధాలుగా విభజించారు. అవి దేవయజ్ఞం, పితృయజ్ఞం, రుషియజ్ఞం, మనుష్యయజ్ఞం, భూతయజ్ఞం అంటూ నామకరణం చేశారు. ఈ ఐదు యజ్ఞాలనూ ప్రతి ఒక్కరూ చేసి తీరాలని భారతీయ సంస్కృతి నొక్కి చెబుతోంది. యజ్ఞం చేయగా, పదిమందికి పంచి పెట్టగా మిగిలిన యజ్ఞశేషాన్ని మాత్రమే భుజించాలని పంచయజ్ఞ సిద్ధాంతం చెబుతోంది. -
ఇడుపులపాయలో కుటుంబసభ్యులు, నేతల నివాళి
సాక్షి, కడప : దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి నాల్గవ వర్ధంతి కార్యక్రమాలు జిల్లాలో ఘనంగా జరిగాయి. వాడవాడలా సేవాకార్యక్రమాలను నిర్వహించారు. వైఎస్సార్ విగ్రహాలకు పాలాభిషేకాలు, అన్నదాన కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు, రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేయడంతోపాటు సాంసృ్కతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన అభివృద్ధి పనులను మననం చేసుకున్నారు. ఇడుపులపాయలో వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, కుమార్తె షర్మిల, అల్లుడు బ్రదర్ అనిల్‌కుమార్, వైవీ సుబ్బారెడ్డితోపాటు కుటుంబ సభ్యులు ఉదయాన్నే ఘాట్‌ను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేపట్టారు. ఈ సందర్భంగా వైఎస్ విజయమ్మ ఉద్వేగానికి గురై కంటతడి పెట్టారు. దీంతో కుమార్తె షర్మిల ఆమెను సముదాయించారు. అనంతరం షర్మల సమైక్య శంఖారావం యాత్రలో పాల్గొనేందుకు తిరుపతి వెళ్లారు. పులివెందులలోని చిన్న రంగాపురం, నల్లపురెడ్డిపల్లెలో వైఎస్సార్ విగ్రహాలకు పాలాభిషేకం అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఆస్పత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాల్లో వైఎస్ వివేకానందరెడ్డి, వైఎస్ అవినాష్‌రెడ్డి, వైఎస్ ప్రకాశ్‌రెడ్డి పాల్గొన్నారు. జమ్మలమడుగు పట్టణంలోని పాత బస్టాండులో వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి రోగులకు పండ్లు, బ్రెడ్లను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, తాతిరెడ్డి సూర్యనారాయణరెడ్డి, అల్లె ప్రభావతి, హనుమంతరెడ్డి ఈ కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఎర్రగుంట్లలో వైఎస్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మైలవరం మండలం దన్నవాడ గ్రామంలో వైఎస్సార్ విగ్రహానికి అల్లె చెన్నారెడ్డి పాలాభిషేకం చేశారు. ప్రొద్దుటూరులో వైఎస్సార్ వర్ధంతి సందర్బంగా భారీ ర్యాలీ నిర్వహించారు. బండెద్దుల ప్రదర్శన,చెక్కభజనలతోపాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారు. పుట్టపర్తి సర్కిల్లో వంటా వార్పు నిర్వహించారు. అన్వర్థియేటర్వద్ద ఉన్న వైఎస్సార్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. రాచమల్లు ప్రసాద్‌రెడ్డి నేతృత్వంలో ఈ కార్యక్రమం సాగింది. వైఎస్సార్ సీపీ నేతలు ఈవీ సుధాకర్‌రెడ్డి, నారాయణరెడ్డి, నాగేంద్రరెడ్డి పాల్గొన్నారు. బద్వేలు నియోజకవర్గంలోని పోరుమామిళ్లలో వైఎస్సార్ సీపీ కేంద్ర పాలక మండలి సభ్యుడు డీసీ గోవిందరెడ్డి నేతృత్వంలో భారీ ర్యాలీ నిర్వహించారు. బస్టాండు ప్రాంతంలో వంటా వార్పు నిర్వహించి అన్నదానం నిర్వహించారు. నియోజకవర్గంలోని వైఎస్సార్ విగ్రహాలకు పాలాభిషేకం చేశారు. ఈకార్యక్రమాల్లో మాజీ మున్సిపల్ చైర్మన్ మునెయ్య, వైస్ చైర్మన్ గురుమోహన్, వైఎస్సార్ సీపీ నేతలు విశ్వనాథరెడ్డి, ప్రభాకరరెడ్డి, కరెంటు రమణారెడ్డి, నాగార్జునరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాయచోటిలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి వైఎస్సార్‌చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బస్టాండులోని వైఎస్సార్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఆస్పత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నేతలు జాఫర్, జనార్ధన్‌రెడ్డి, అయ్యవారురెడ్డి పాల్గొన్నారు. కడప నగరంలోని వైఎస్సార్ సర్కిల్ వద్ద వైఎస్ విగ్రహానికి జిల్లాకన్వీనర్ కె.సురేష్‌బాబు, మాజీ మేయర్ పి.రవీంద్రనాథ్‌రెడ్డి, అంజాద్బాష పాలాభిషేకం చేశారు. అక్కడే వంటా వార్పు కార్యక్రమాన్ని చేపట్టి పేదలకు అన్నదానం చేశారు. అనాథ శరణాలయాలు, ఆస్పత్రుల్లో పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేసి అన్నదానంతోపాటు వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. కమలాపురంలో ఎన్సీ పుల్లారెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులకు అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని నియోజకవర్గ సమన్వయకర్తలు మాజీ మేయర్ రవీంద్రనాథ్‌రెడ్డి, దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి ప్రారంభించారు. పార్టీ జిల్లా కోశాదికారి సుధా కొండారెడ్డి నేతృత్వంలో రోగులకు పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. నేతలు ఉత్తమారెడ్డి, రాజుపాలెం సుబ్బారెడ్డి పాల్గొన్నారు. మైదుకూరులో మదీనా దస్తగిరి ఆధ్వర్యంలో రోగులకు, వికలాంగులకు పండ్లు పంపిణీ చేశారు. అన్నదానాన్ని ఏర్పాటు చేశారు. బ్రహ్మంగారిమఠంలో వైఎస్సార్ సీపీ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించి నాలుగు రోడ్ల కూడలిలో వంటా వార్పు చేపట్టారు. . సాంసృ్కతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాలలో నియోజకవర్గ సమన్వయకర్త ఎస్.రఘురామిరెడ్డి, కన్వీనర్ పెంచలయ్య, కొండారెడ్డి, వీరనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రైల్వేకోడూరులోని వైఎస్ అతిథి గృహంలో వైఎస్ చిత్రపటానికి ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, డీసీసీబీ మాజీ అద్యక్షుడు కొల్లం బ్రహ్మందనరెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ప్రజలకు అల్పాహారాన్ని ఏర్పాటు చేశారు. రాజంపేటలో వైఎస్సార్ విగ్రహానికి పాలాబిషేకం చేశారు. చొప్పావారిపల్లెలో వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి నివాళులర్పించారు. ఆకేపాడు పీహెచ్సీలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పోలా శ్రీనివాసులురెడ్డి, ఆకేపాటి మురళీరెడ్డి, చొప్పాయల్లారెడ్డి పాల్గొన్నారు.